13, సెప్టెంబర్ 2021, సోమవారం

52. సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ

 

సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా 
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ॥ 52 ॥

199. సర్వశక్తిమయీ

లలితాదేవి సర్వశక్తిమయి. అన్ని శక్తులూ ఆ దేవివే. సమస్త దేవతాశక్తులు, సమస్త రాక్షసశక్తులు, 

సమస్త ఆయుధ శక్తులూ, ఇంకా సృష్టిలో వున్న అన్ని శక్తుల రూపమూ లలితే. 

ఆ తల్లి తన నుంచే అన్నీ, అందరినీ సృష్టించింది. ఆమె కానిది ఎక్కడా ఏమీ లేనే లేదు. 

అందుకే ఈ నామం సర్వశక్తిమయి. ఆ లలితాదేవికి చక్కటి పేరు. 

షోడశ కళలూ ఆ తల్లివే, పంచదశీ మంత్రం రూపమూ ఆ దేవతదే, 

చతుర్దశ భువనాల సృష్టికర్త్రి ఆ అమ్మే, త్రయోదశి తిథి దేవత మన్మధునికి సంజీవని ఈ తల్లే. 

ద్వాదశాదిత్యుల శక్తీ ఆ తల్లిదే,  ఏకాదశ రుద్రులూ ఆ మహాశక్తే, 

దశ మహావిద్యలూ ఆ దేవతే, నవ దుర్గలూ ఆమే, 

అష్ట ప్రకృతులూ ఆ తల్లే, సప్త ఋషిమండలమూ ఆ తల్లి స్వరూపమే, 

షట్చక్రాలకు అధిష్టాత్రీ ఆమే, పంచబ్రహ్మలూ ఆ తల్లే, 

చతుర్విధ అంతః కరణములూ ఆమే. త్రికూటరూపిణీ ఆ అమ్మే,  

ద్వివిధాత్మలూ (జీవాత్మా, పరమాత్మా) ఆ తల్లే, ఏకైక నిత్యముక్త ఆ లలితాదేవియే,

ఇంతెందుకు, చతుష్షష్ఠి కోటి యోగినులూ ఆ లలితాదేవి అంశారూపాలే. 

అన్ని శక్తి రూపాలూ తానే అయిన, ఆ సర్వశక్తిమయి కి  వందనం. 

ఓం శ్రీ సర్వశక్తిమయ్యై నమః 


200సర్వమంగళా

సకల మంగళములు ఇచ్చు తల్లి కనుక ఆ తల్లి సర్వమంగళ. 

ఈప్సితార్ధములు (కోరిన కోరికలు) తీర్చే తల్లి ఈ సర్వమంగళ. అందరికీ క్షేమదాయిని.  

సకల శుభాలనూ కలిగించే తల్లి ఈ సర్వమంగళ. హితమును కలిగించునది ఈ సర్వమంగళ.

భక్తుల హృదయములలో మంగళకరంగా వుండే దేవత ఈ సర్వమంగళ. 

సమస్త శోభనములూ ఇచ్చే మంగళకారిణి ఈ సర్వమంగళ. కళ్యాణములు జరిపించునది. 

దురదృష్టమును తొలగించేది, అదృష్టమును కలిగించేది, ఈ సర్వమంగళ. 

మంగళకరములైన దీవెనలిస్తూ అందరినీ ఆశీర్వదిస్తున్న, ఆ సర్వమంగళ కు వందనం. 

ఓం శ్రీ సర్వమంగళాయై నమః  


ఇది శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి వ్రాసిన శ్రీలలితావిజయం లోని 

శ్రీలలితారహస్యసహస్రనామ స్తోత్రము నందు కల 

రెండవ వంద నామాల వివరణ సంపూర్ణం 

  

201. సద్గతిప్రదా  

 యోగ్యులకు ఉత్తమమైన స్థానమును అనుగ్రహించే రూపమే సద్గతిప్రద. 

త్రిమూర్తులకు, దేవేంద్రాదులకు ఆయా స్థితిని ఇచ్చినది ఈ తల్లే. 

మోక్షము, స్వర్గము మున్నగు సద్గతులను తన భక్తులకు వారి యోగ్యత, అర్హతను బట్టీ ఇస్తుంది.

బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించే దేవత. తన భక్తులైన నారదుడు, సనక సనందాదులకు, 

ఋషులకు, ఎవరికి తగిన ఉత్కృష్ట లోకములను వారికి ప్రసాదించిన తల్లి. 

పద్మ పురాణంలో, ఆ భవానీ మాతను, ఏ రూపంలో, ఏ ఉపచారంతో సేవిస్తే, ఏ యే గతులు, 

ఏ యే ఉన్నత లోకాలు ప్రాప్తిస్తాయో చెప్పారు. త్రికాలములందును ఆ అమ్మ పూజ చేసేవారికి 

గొప్ప స్థానాన్ని ఇచ్చి, సద్గతులు కలుగచేస్తున్న, ఆ సద్గతిప్రద కు వందనం. 

ఓం శ్రీ సద్గతిప్రదాయై నమః 


202. సర్వేశ్వరీ 

 శ్రీ లలితయే అందరికీ స్వామిని కనుక ఆ తల్లిని సర్వేశ్వరీ అంటున్నాం. 

సమస్తమునకూ, సర్వ లోకాలకూ ఆమె ఈశ్వరి. చతుర్దశ భువనాలకూ ఈశ్వరి కనుక సర్వేశ్వరి. 

సమస్త మంగళములూ, శుభములూ, చేకూర్చే తల్లి సర్వేశ్వరియే కదా. 

శక్తి ప్రదాత, ముక్తిప్రదాత, మోక్షప్రదాత ఈ సర్వేశ్వరే. 

సర్వమూ తానే అయిన ఈశ్వరి కనుక సర్వేశ్వరీ అంటున్నాం. 

ప్రాణికోటి నంతటినీ కాపాడే తల్లి సర్వేశ్వరి.  

ఈ చరాచర జగత్తు అంతా ఈ అమ్మ ఆధిపత్యములోనే ఉన్నది, కనుక ఈమె సర్వేశ్వరి. 

ఈ దేవి సర్వత్వానికి అవధులు, పరిమితులు లేవు. అట్టి లోకాధీశ్వరి, సర్వేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ సర్వేశ్వర్యై నమః    


203. సర్వమయీ

సర్వమూ తానే అయి వున్న తల్లి కనుక ఆమె సర్వమయీ అని పిలువబడుచున్నది. 

సకల జీవరాసులు అమ్మ చేతే సృష్టింపబడినవి. ప్రకృతి అంతా ఆ దేవీ స్వరూపమే.

పంచభూతములూ, త్రిగుణములూ ఆమే. సకలతత్వములకూ ఆధారభూతము ఆ శ్రీ లలితే. 

రెండువందల ఇరవై నాలుగు భువనాలకూ కలిపి భువనాధ్వ అని పేరు. 

ఇది పరమేశ్వరుని రోమ స్వరూపము. 

యాభైఆరు అక్షరములకూ కలిపి వర్ణాధ్వ ని పేరు. ఇది పరమేశ్వరుని చర్మ స్వరూపము. 

మూలవిద్య నుంచి పుట్టిన సప్తకోటి మహామంత్రములకు మంత్రాధ్వ అని పేరు.  

ఇది పరమేశ్వరుని రక్త స్వరూపము. 

ఈ మంత్రములలోని పాదములన్నింటికీ కలిపి పదాధ్వ అని పేరు. 

ఇది పరమేశ్వరుని మాంస స్వరూపము. 

పృధ్వీ తత్వము నుంచి శివతత్వము వరకూ వున్న పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియములు, 

పంచ జ్ఞానేంద్రియములు, పంచ ప్రాణములు, నాలుగు అంతఃకరణములు, మరియు ప్రకృతి, 

శివుడు కలిసి మొత్తం ఇరవై ఆరు తత్వాలకీ కలిపి తత్వాధ్వ అని పేరు. 

ఇది పరమేశ్వరుని శుక్ల, మజ్జ, అస్థి స్వరూపము. 

అమ్మ ఆ తత్వాధ్వ స్వరూపము, కనుక ఆ తల్లి సర్వమయీ అయినది. 

ఆ తత్వాధ్వ స్వరూపమయిన ఆ సర్వమయి కి వందనం. 

ఓం శ్రీ సర్వమయ్యై నమః 


204. సర్వమంత్ర స్వరూపిణీ

అన్ని మంత్రములూ అకారము నుంచి క్షకారము వరకూ కల అక్షరముల కూర్పు నుంచి

వచ్చినవే. సప్తకోటి మహా మంత్రములూ ఈ బీజాక్షరముల నుంచి ఏర్పడినవే. 

అమ్మ ఆ సప్త కోటి మహా మంత్ర స్వరూపిణి.  

అదే విధంగా మంత్రాలెన్ని వున్నా, ఆ మంత్రాలన్నీ ఆ లలితా పరమేశ్వరీ దేవివే.  

అన్ని మంత్రాలకూ అధిదేవత ఈ శ్రీమాతయే. అన్ని మంత్రాలకూ కారణమయిన వర్ణమాలకు 

శ్రీదేవియే అధిదేవత. ఆ విధంగా, మననము చేస్తున్న మంత్రమూ, ఆ అక్షరమూ, ఆ శబ్దమూ, 

ఆ రూపమూ అన్నీ ఆ శ్రీదేవియే. కనుక ఆ అమ్మను సర్వ మంత్ర స్వరూపిణీ అంటున్నాం. 

అన్ని మంత్రశక్తులూ, అన్ని మంత్రరూపములూ, అన్ని మంత్రాక్షరములూ తానే అయి,

భాసిల్లుతున్న ఆ సర్వమంత్ర స్వరూపిణి కి వందనం. 

ఓం శ్రీ సర్వమంత్రస్వరూపిణ్యై నమః  



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి