దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా
సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా ॥ 51 ॥
193. దుష్టదూరా
దుష్టులకు ఆ లలితాపరమేశ్వరి చాలా దూరము. ఆమెను దుష్టులు ఎప్పటికీ చేరలేరు.ఓం శ్రీ దుష్టదూరాయై నమః
దయతో, దురాచార దోషాన్ని పోగొట్టే, ఆ దురాచార శమని కి వందనం.
ఓం శ్రీ దురాచారశమన్యై నమః
195. దోషవర్జితా
రాజరాజేశ్వరీదేవికి దోషములుండవు, దోషములంటవు. దోషములను వర్జించినది, అంటే,
త్యజించినది, వదిలివేసినది. కనుక ఆ తల్లి దోషవర్జితా అనే నామంతో పిలువబడుతోంది.
ప్రత్యేకముగా దేని పట్ల అయినా రాగము కానీ, ద్వేషము కానీ కలిగి ఉంటే కూడా అది దోషమే.
ఆ తల్లి రాగమథని కనుక, ఆ కాత్యాయనికి ఈ రాగద్వేషాలు రెండూ లేవు. కనుక ఆమె దోష వర్జిత.
జీవుడు తన దోషాలను పోగొట్టుకోవాలంటే, ఈ నామాన్ని జపించాలి.
ఆ దోషవర్జితాదేవి అప్పుడు ఆ దోషాలను తొలగించి జీవుడిని విముక్తుడిని చేస్తుంది.
జీవుల దోషాలను పరిహరించే, ఏ దోషములూ లేని ఆ దోషవర్జిత కు వందనం.
ఓం శ్రీ దోషవర్జితాయై నమః
196. సర్వజ్ఞా
అన్నీ తెలిసినది కనుక, సర్వజ్ఞా అనే నామం ఆ తల్లికి సార్ధకం అయింది.
అమ్మ సర్వసాక్షి, ఆ తల్లికి తెలియనిదేమీ లేదు. ఆ తల్లి నుంచి ఎవరూ ఏదీ దాచలేరు.
లలితాపరమేశ్వరి శుద్ధజ్ఞాన రూపిణి. తానే స్వయంగా జ్ఞాన భాండాగారమయిన,
ఆ తల్లికి తెలియని విషయమేమీ లేదు, ఉండదు. ఆమె సర్వజ్ఞ.
కాశ్మీరములో వున్న సర్వజ్ఞ పీఠానికి ఈ పరమేశ్వరే పీఠాధీశ్వరి. కనుక ఆమె సర్వజ్ఞ.
అందరి యందు, అన్నింటి యందు వున్న ప్రజ్ఞ ఆ తల్లి అంశమే కనుక ఆమె సర్వజ్ఞ.
ఆ తల్లి శుద్ధ చైతన్య స్వరూపిణి కనుక ఆమె సర్వజ్ఞ.
శుద్ధ ప్రజ్ఞకు అధిదేవత అయిన ఆ సర్వజ్ఞ కు వందనం.
ఓం శ్రీ సర్వజ్ఞాయై నమః
197. సాంద్రకరుణా
అమ్మ దయాస్వరూపిణి. సంపూర్ణ కరుణామూర్తి. సాంద్రమైన అంటే చిక్కని, ఘనమైన అని.
తల్లి కదా, పిల్లలకు కష్టం కలగకూడదని జాగ్రత్తలు చెపుతూ ఉంటుంది.
ఒక్కోసారి లాలిస్తుంది, ఒక్కోసారి మందలిస్తుంది, ఒక్కోసారి దండిస్తుంది.
ఆ మాహేశ్వరికి కరుణ ఎక్కువ, జీవుడికి కఠినత్వము ఎక్కువ ఉంటుంది.
హృదయములో అమ్మని నింపుకున్న భక్తులకు, హృదయములో కరుణ కూడా నిండిపోతుంది.
చక్కని, చిక్కని కరుణ కురిపించే ఆ తల్లికి జ్ఞానులు, అజ్ఞానులు, భక్తులు, అన్న భేదము లేదు.
కరుణాస్వరూపమే ఆ తల్లి. కరుణార్ద్రహృదయ అయిన ఆ సాంద్రకరుణ కు వందనం.
ఓం శ్రీ సాంద్రకరుణాయై నమః
198. సమానాధికవర్జితా
లలితాపరమేశ్వరికి సమానము ఎవరూ లేరు. అధికమైన వారూ ఎవరూ లేరు.
అందుకే ఆ తల్లి పేరు సమానాధికవర్జితా. ఆ తల్లియే అందరికన్నా, అన్నిటికన్నా అధికురాలు.
అంతకు మించిన ఉన్నతమైన స్థితీ ఎవరికీ లేదు, సమానమైన స్థితీ ఎవరికీ లేదు.
లలితాదేవి తానే సర్వమూ అయి, ఈ చరాచర సృష్టి నంతా తన కనుసన్నలలో నడిపిస్తున్నది.
వేదసాక్షిగా ఆ తల్లి తాను సర్వాధిక అయినా, అందరినీ సమానముగా చూస్తుంది.
తన పాలనలో అందరికీ వారి వారి యోగ్యతను బట్టీ ఫలితాన్ని ఇస్తున్న జ్ఞానమూర్తి శ్రీలలిత.
అసలైన శ్రీ మహారాజ్ఞి ఆ తల్లే. ఆమె ఎల్లప్పుడూ అందరికన్నా గొప్పది.
తనతో సములూ, తన కన్నా అధికులూ లేనటువంటి, ఆ సమానాధికవర్జిత కు వందనం.
ఓం శ్రీ సమానాధికవర్జితాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి