
సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ ॥ 66 ॥
281. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః
ఓం శ్రీ ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళ్యై నమః
ఒక చిన్నపురాణ కథ:
ఒకసారి అమ్మవారు సరదాకి వెనుక నుంచి వచ్చి శివుని కన్నులు క్షణకాలం మూసిందట.
శివుడు చటుక్కున లేచి, 'ఎంత పని చేసావు పార్వతీ, నేను కన్నులు మూసుకుంటే,
ఈ జగత్తే నాశనమైపోతుంది. నీ వల్ల క్షణకాలం పాటు ఈ జగత్తంతా బాధకు లోనైంది.
నీకు శిక్ష తప్పదు. నన్ను వదిలి వెళ్ళిపో', అన్నాడు. అప్పుడు పార్వతి ఎంతో దుఃఖించి
శాపం తీరే మార్గం చెప్పమంటుంది. వెళ్లి తపసు చేయి, తిరిగి పుట్టు. నాకోసం చూడు.
అప్పుడు మళ్ళీ పెళ్లాడదాం అని చెప్తాడు శివుడు. అప్పుడు నేను నిన్ను ఎలా గుర్తు పట్టగలను,
అని పార్వతి దీనంగా అడుగుతుంది. శివుడు, 'అప్పుడు నీకు మూడు స్తనములు ఉంటాయి.
నన్ను చూసినప్పుడు నీ మూడవ స్తనము మాయమవుతుంది, అదే గుర్తు' అంటాడు.
అప్పుడు పార్వతి మీనాక్షిగా మూడు స్తనాలతో పుడుతుంది. శివుని గురించి తపస్సు చేస్తుంది.
సుందరేశ్వరుడు కనిపించాక మీనాక్షి మూడవ స్తనం అదృశ్యమవుతుంది. వారిరువురికీ విష్ణువు
ఒక అన్నగా పెళ్లి జరిపిస్తాడు. ఒక్కక్షణం ఆట కోసం శివుని కన్నులు మూసినందుకు పార్వతికి
అంత శిక్ష పడింది. ఆ ఆదిదంపతులు కనులు మూస్తే, అంతా విపత్తే. విలయమే.
282. సహస్రశీర్షవదనా
వేదంలోని పురుషసూక్తములో "సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్" అని వుంది.
సహస్రమంటే అనంతములని ఇక్కడ భావము. సహస్ర శీర్ష వదనా అంటే, అనంతములైన
శిరస్సులు, అనంతమైన ముఖములు కలదానా అని భావం. ఈ నామానికి స్త్రీ పురుష భేదం లేదు.
ఇది అనంతములైన శిరసులు, ముఖములు కల ఆ మహత్వత్వమైన శక్తిని కీర్తిస్తోంది.
సృష్టి అన్ని వైపులనూ అనంతమైన శిరసులు, ముఖములతో అవలోకనం చేస్తున్న,
ఆ సహస్రశీర్షవదన కు వందనం.
ఓం శ్రీ సహస్రశీర్షవదనాయై నమః
283. సహస్రాక్షీ
సహస్రాక్షీ అంటే అనంతమైన కన్నులు కలదానా అని భావం.
ఆ తల్లికి వెయ్యి కళ్ళు, కోటికళ్లు, అనంత సంఖ్యలో కళ్ళు ఉన్నవని భావం.
ఈ పదునాలుగు లోకాలను, భువనాలనూ చల్లగా చూడాలంటే అన్ని కళ్ళు కావద్దూ.
మరి అందరి పాపపుణ్యాలనూ గమనించి, లెక్కించి,
వారి వారికి తగిన కర్మఫలములను ఇవ్వాలి కదా.
అందరి పుణ్యకర్మలనీ, పాపకర్మలనీ గమనిస్తున్న, ఆ సహస్రాక్షి కి వందనం.
ఓం శ్రీ సహస్రాక్ష్యై నమః
ఓం శ్రీ సహస్రపదే నమః
ఒక్క మాట:
ఎక్కడైతే ఎక్కువమంది జనం గుమిగూడతారో అక్కడ అనంతములైన శిరసులు,
కళ్ళు, పాదాలు ఉంటాయి. ఆ మహా జన సందోహములో ఆ విరాణ్మూర్తి లలితాపరమేశ్వరి
శక్తి రూపంలో ఉంటుంది. సాధన ద్వారా, ఆ శక్తిరూపాన్ని దర్శించే ప్రయత్నం చేయాలి.
ఓం శ్రీ సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపదే నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి