మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59 ॥
238. మనువిద్యా
ఓం శ్రీ మనువిద్యాయై నమః
ఓం శ్రీ చంద్రవిద్యాయై నమః
240. చంద్రమండలమధ్యగా
చంద్రుడంటే శివ శక్తి సమ్మేళనమైనప్పుడు, ఆ చంద్రమండలమే శ్రీ చక్రము.
ఆ శ్రీచక్రమధ్యంలో బిందురూపిణివలె అమ్మ దీపించుచున్నది.
అందుకే ఈ నామంలో అమ్మను చంద్రమండలమధ్యగా అన్నారు.
సహస్రారము చేరిన తరువాత శివ శక్తి సమ్మేళనము జరిగి షోడశకళలూ ప్రకాశవంతమవుతాయి.
అపుడు ఆ మండలం మధ్యలో శ్రీలలిత జ్వాజ్వల్యమానంగా దర్శనమిస్తుంది.
ఈ సర్వ జగత్తూ చంద్రాగ్నులచే నిండి వున్నది కనుక దీనిని అగ్నిషోమాత్మకం అంటారు.
శివుడు స్వయముగా తాను అగ్ని యొక్క శిరోభాగములో ఉంటే,
అమ్మవారు చంద్రుని యొక్క శిరోభాగములో వున్నదని చెపుతాడు.
శివుడు, శక్తి ఇద్దరూ కలిసి ఈ అగ్నిసోమములుగా జగత్తంతా వ్యాపించి వున్నారు.
చంద్రునిలో షోడశకళలూ అమ్మ నుంచి సంక్రమించినవే.
చంద్రమండలమే తానై, ఆ మధ్యలో విరాజిల్లుతున్న, ఆ చంద్రమండలమధ్యగ కు వందనం.
ఓం శ్రీ చంద్రమండలమధ్యగాయై నమః
241. చారురూపా
చారు అంటే, సుందరము, రమణీయము, లావణ్యము అని అర్ధం.
ఈ నామంలో అమ్మవారు అందమైన రూపము కలది అని చెప్పుకుంటున్నాం.
మనోహరమైన రూపము కలది ఆ శ్రీలలిత. ఆ రూప లావణ్యానికి అవధులు లేవు, పోలిక లేదు.
అటువంటి సుందర కమనీయమైన రూపము ఆ లలితాపరమేశ్వరిది.
చంద్రునికి అందము, ఆకర్షణ లలితాదేవి నుంచి వచ్చినవే.
ఒకసారి ఆ రాజరాజేశ్వరి ఆకర్షణకు లోనైన వారు తిరిగిపోలేరు.
ఒకసారి శ్రీవిద్య లోని మాధుర్యాన్ని, రమణీయతను రుచి చూచిన వారు అమ్మను వదలరు.
అందమైన లావణ్యలతిక, ఆ చారురూప కు వందనం.
ఓం శ్రీ చారురూపాయై నమః
242. చారుహాసా
హాసము అంటే చిరునవ్వు, దరహాసము, మందహాసము అని అర్ధం.
అమ్మ నవ్వు చారుహాసమట. అంటే అమ్మ ముఖంలో కనిపించే ఆ నగవు ఎంత అందమైనదో,
ఎంత ఆకర్షణీయమైనదో వర్ణింపలేము. ఆ చారురూపది హర్షోల్లాస ముఖారవిందం.
అమ్మ తన భక్తులను ఎంత ప్రేమగా, దయగా, వాత్సల్యంగా చూస్తుందో, ఆ నగుమోము చూస్తేనే
తెలుస్తుంది. సమ్మోహనంగా వున్న ఆ చిరుమందహాసం చూసి మోహపడని ఉపాసకుడెవ్వడు.
అమ్మ మోహనాశినీ, లోభనాశినీ అంటూనే, భక్తుల మోహము, లోభము తన వైపుకు
ఆ చిరునవ్వుతో తిప్పుకుంటోంది. అమ్మ మాయకు అంతు లేదు. ఆ చిరునగవుకు కొలత లేదు.
సమ్మోహనకరమైన చిరునవ్వుతో భక్తులను అనురాగముతో చూస్తున్న, ఆ చారుహాస కు వందనం.
ఓం శ్రీ చారుహాసాయై నమః
243. చారుచంద్ర కళాధరా
చంద్రునికి వృద్ధి, క్షయము రెండూ వున్నాయి.
కానీ అష్టమి నాటి చంద్రుడు శుక్ల పక్షములోను, కృష్ణ పక్షంలోనూ ఒకే విధంగా ఉంటాడు.
అటువంటి వృద్ధీ, క్షయము లేని కళను చిద్రూపా అంటాము.
ఆ కళకే మరియొక పేరు సౌదామని. అమ్మవారు ఆ సౌదామనిని శిరస్సున ధరించి
చంద్రకళాధరి అయింది. సొగసైన చంద్రకళను శిరసున ధరించిన లావణ్యరాశి అయిన
అమ్మను చారుచంద్రకళాధరా అని ఈ నామంలో అంటున్నాం.
ఈ నామం రావడానికి మరొక కథ కూడా వుంది.
కాశీ రాజు అమ్మను వారణాసిలో వనదుర్గ రూపంలో అర్చించాడని చెప్పుకున్నాం కదా.
ఆ రాజుకు చంద్రకళ అని ఒక కూతురున్నది.
ఆమెకు సరియైన పతి దొరకక ఆ రాజూ, ఆ రాజకుమార్తె దుఃఖంలో వున్నారు.
అప్పుడు అమ్మవారు ఆ చంద్రకళను అనుగ్రహించి కలలో దర్శనమిచ్చింది.
నా భక్తుడైన సుదర్శనుడు నిన్ను కలుస్తాడు, అతనిని వివాహమాడు. అతడు పరమశివుని అంశతో
పుట్టాడు. అతనిని పెళ్లాడటానికి నేను నీలో ప్రవేశిస్తాను, అని చెప్పింది.
ఆవిధముగా చంద్రకళను ఉద్ధరించి ఆమెను ధరించింది కనుక, దుర్గాదేవికి ఈ నామం వచ్చింది.
లావణ్యముతో వెలుగుతున్న చంద్రకళను శిరస్సున ధరించిన,
ఆ చారుచంద్రకళాధర కు వందనం.
ఓం శ్రీ చారుచంద్రకళాధరాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి