14, సెప్టెంబర్ 2021, మంగళవారం

53. సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీః , మృడప్రియా

 

సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ ।
మాహేశ్వరీ, మహాదేవీ, మహా
లక్ష్మీః , మృడప్రియా ॥ 53 ॥

205. సర్వయంత్రాత్మికా

సగుణోపాసనకూ నిర్గుణోపాసనకూ మధ్యలో యంత్ర ఆరాధన వుంది. 

రూపమున్నది కనుక యంత్ర పూజ కూడా సగుణమే. కానీ స్థూల రూపము ఉండదు,

కనుక ఇది పూర్తిగా సగుణోపాసనా కాదు. మంత్రంలోని బీజాక్షరములను ఒక ప్రత్యేకమైన 

రేఖాకృతిలో ఇమిడ్చి దానిని పూజించటం ఉపాసనలో ఒక పధ్ధతి. 

మననము చేస్తూ ఉంటే రక్షించేది మంత్రము. మంత్రమును యంత్రములో ఇమిడ్చి 

ఉపచార సహితముగా పూజించుట ఆ మంత్రారాధనలో భాగము. 

మంత్రమే యంత్రము, యంత్రమే మంత్రము. అక్షరరూపం మంత్రం, రేఖారూపం యంత్రం. 

యంత్రమే ఆత్మగా ఉన్న లలితాదేవి యంత్రాత్మిక. ఆ శ్రీలలిత సర్వ మంత్ర స్వరూపిణి కనుక, 

ఆ శ్రీ లలితయే నిర్వివాదముగా సర్వ యంత్రాత్మిక. 

సర్వ యంత్రముల స్వరూపమే ఆత్మగా కల, ఆ సర్వయంత్రాత్మిక కు   వందనం. 

ఓం శ్రీ సర్వయంత్రాత్మికాయై నమః  


ఈ యంత్రంలో మధ్యలో అమ్మను దర్శించండి. అమ్మ స్పష్టంగా దర్శనమిస్తుంది. 

ఓం శ్రీమాత్రే నమః, ఓం సర్వయంత్రాత్మికాయై నమః, ఓం సర్వమంత్రస్వరూపిణ్యై నమః 



206. 
సర్వతంత్రరూపా

తంత్రము అంటే ఉపాయము, ఔషధము అనే అర్ధాలున్నాయి. తంత్రము కూడా శాస్త్రమే. 

మంత్రము, యంత్రము, తంత్రము మూడూ కలిపి ఉపాసన చేస్తే సిద్ధి తొందరగా 

కలుగుతుంది. అన్ని నదులూ సముద్రంలో చేరినట్టు, అన్ని మార్గములూ ఆ తల్లిని 

చేరటానికే చెప్పబడ్డాయి. మంత్రము బీజాక్షర రూపము, యంత్రము రేఖారూపము, తంత్రము 

ఉపాసనా రూపము. తంత్రమునకు నియమములు, నిష్ఠలు ఖచ్చితంగా ఉండాలి. 

అవి అన్నీ కూడా ఆ తంత్రములో భాగమే. పూజావిధానమే తంత్రము. 

తంత్రములన్నీ దేవి శరీర భాగములే అని కామికాగమము చెప్పింది. 

కనుక తంత్రమంటే, ఆ శ్రీదేవి శరీరమే. సర్వ తంత్రములనూ శరీరముగా కలిగివున్నది,
 
కనుక ఆ తల్లిని ఈ నామంలో సర్వతంత్రరూపా అని చెప్పుకుంటున్నాం.  

తంత్రములే శరీరాంగములుగా వున్న, ఆ సర్వతంత్రరూప కు వందనం. 

ఓం శ్రీ సర్వతంత్రరూపాయై నమః 

  

207. మనోన్మనీ 

మనోన్మనీ అంటే, భ్రూమధ్య స్థానముకు పైన, బ్రహ్మరంధ్రమునకు కింద కల స్థానము. 

మనస్సు చంచల. ఒకచోట నిలువదు. అందమైన వస్తువును కానీ, అందమైన విషయమును 

కానీ చూస్తే, మనసుకు ఆనందం కలుగుతుంది. మనసు ఉన్మీలనం చెందుతుంది. 

ఆ స్థితిలో శ్వాసలో ఉచ్ఛ్వాస నిశ్వాస లుండవు. కన్నులు ఉన్మీలన స్థితిలో ఉంటాయి. 

ఉపాసకుడు సచ్చిదానంద స్థితిలో ఉంటాడు. నిర్వికల్ప స్థితిలో ఉంటాడు. 

ఈ ముద్రనే యోగశాస్త్రంలో మనోన్మనీ ముద్ర అంటారు. గురు స్తోత్రంలో చెప్తారు, 

అజ్ఞానమనే చీకటిలో గుడ్డివాడి వలె వున్న శిష్యుడికి, గురువు సుజ్ఞానమనే కాటుకపుల్లతో, 

కళ్ళకు కాటుక అనే జ్ఞానాన్ని అద్దినప్పుడు, అంతః చక్షువులు విజ్ఞానం వైపుకు తెరవబడి, 

సగము తెరచిన ఆ కళ్ళతో, జ్ఞానానందాన్ని పొంది, తన్మయత్వములో ఉన్న స్థితి నోన్మనీ స్థితి. 

ఆ స్థితిలో స్పృహ ఉండదు, దృశ్యము ఉండదు, ద్రష్ట ఉండడు. అన్నీ లయమైపోయి, కేవలము 

ఆనందము ఉంటుంది. ఆ మనోన్మనీ స్థితిలో అమ్మ దర్శనం మహాయోగం, మహోత్కృష్టం.   

యోగులకు మాత్రమే దక్కే స్థితి, యోగంలో మాత్రమే దక్కే స్థితి. 

శంకరుడికి మనోన్మయుడు అనే నామం వుంది. శంకర పత్ని అయిన శాంకరికి మనోన్మనీ నామం 

వచ్చింది.

ఉపాసకులకు మనోన్మనీ స్థానంలో దర్శనమిచ్చే, ఆ మనోన్మని కి వందనం. 

ఓం శ్రీ మనోన్మన్యై నమః 


గురుస్తోత్ర శ్లోకం: 

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా,

చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవేనమః


208. మాహేశ్వరీ

ఓంకారం మూడు అక్షరముల సంయోగంతో ఏర్పడింది. ఆ అక్షరములు అ, ఉ, మ. ఈ మూడు 

అక్షరములకూ శబ్దమున్నది, నాదమున్నది. త్రిగుణాతీతుడైన మాహేశ్వరునిది నాలుగవ స్థితి. 

అదే నిర్గుణ స్థితి. ఈ నిర్గుణ స్థితిని ప్రతిబింబిస్తూ ఓంకారములో నాలుగవది ఏ శబ్దము, నాదము 

లేని మౌనము. దక్షిణామూర్తిగా శివుడు మౌనవ్యాఖ్యల తోనే శిష్యుల సంశయాలను దూరం

చేసేవాడు. ఆ నాలుగవ దైన మౌనమే మహేశ్వరుని తత్వము, అదే నిర్గుణము. 

లింగ పురాణంలో మాహేశ్వరుడు తమోగుణంతో వున్నప్పుడు కాలరుద్రునిగాను, రజోగుణంతో 

ఉన్నప్పుడు కనకాండజుని (బ్రహ్మ) గాను, సత్వగుణంతో వున్నప్పుడు శ్రీమహావిష్ణువుగాను, 

నిర్గుణముతో వున్నప్పుడు మాహేశ్వరుడిగాను ఉంటాడని చెప్పబడింది. 

గుణాతీతుడైన, నిర్గుణుడైన మాహేశ్వరుని పత్ని కనుక ఆ లక్షణాలన్నీ తాను కూడా పొందిన 

తల్లి మాహేశ్వరి. మాహేశ్వర మాహేశ్వరులిద్దరికీ పంచ సామ్యములూ వున్నవి కదా. 

గుణాతీత, నిర్గుణ, మాహేశ్వర పత్ని అయిన, ఆ మాహేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ మాహేశ్వర్యై నమః 


దక్షిణామూర్తి శ్లోకం:

చిత్రం వటతరోర్మూలే, వృద్ధ శిష్యా గురుర్యువా, 

గురోస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు ఛ్చిన్నసంశయాః 


209. మహాదేవీ

మహాదేవీ అంటే మహత్వము కల దేవి. ఈ మహాదేవికి సాటియైన మహత్వమైనది మరొకటి లేదు, 

రాదు. అట్టి మహోత్కృష్టమైన మహత్వము కలది శ్రీలలిత. అందుకే ఆమె మహాదేవి. 

ఆ మహాదేవి జ్యోతిశ్చక్రము గురించి పూర్తిగా  త్రిమూర్తులకైనా తెలియదు. 

ఆ శక్తి, మహత్వము పరిధి చెప్పలేనంత గొప్పవి. 

కొలువలేనంత మేరకు ఆ తల్లి శరీరము అన్ని వైపులకూ వ్యాపించి వున్నది.

ఇతరముల వలె ఈ మహాదేవి శరీరము కొలువలేనిది, ఆ శరీరము సూక్ష్మాతిసూక్ష్మము, 

సూక్ష్మతమము కూడా. అంత చిన్న కొలతను ఎలా తెలుసుకోవటం.  

ఆ జ్యోతిశ్చక్రము త్రిమూర్తులకైనా అంతుపట్టనిది. యోగులకు కూడా చక్షువులకు అందనిది. 

అణోరణీయాం, మహతోమహీయాం, అని ఆ తల్లిని వర్ణిస్తాం. 

అంటే అణువులన్నింటికన్నా అతి సూక్ష్మమైనది, బ్రహ్మాండములలో కెల్లా మిక్కిలి మహత్తైనది. 

అవసరమైనపుడు అతి సూక్ష్మంగా ఆర్తులకు అందుబాటులోకి రాగలదు. 

అంతే సునాయాసంగా అతి బ్రహ్మాండమైన ఆకారము సంతరించుకుని విశ్వవ్యాప్త అవగలదు. 

పద్మ పురాణంలో ఈ మహాదేవి గండకీ నదీ సాలగ్రామములో కూడా వున్నది అని చెప్పారు. 

మహా సూక్ష్మము, మహా బ్రహ్మాండము అయిన, ఆ మహాదేవి కి వందనం. 

ఓం శ్రీ మహాదేవ్యై నమః 


210. మహాలక్ష్మీః

కరవీరపురములో కొలువై వున్న తల్లి శ్రీమహాలక్ష్మి. శ్రీమహావిష్ణువు పత్ని. 

కొల్హాపురములో మహలుడనే రాక్షసుడిని సంహరించటం వలన ఆ తల్లికి మహాలస, 

మహాలక్ష్మి అనే పేర్లు వచ్చాయి.  

శివపురాణములో శివుని తొడపై కూర్చున్న మహేశ్వరి పేరు మహాలక్ష్మి అని చెప్పబడింది. 

లక్ష్మీ ప్రదమైన ఏ రూపమైనా మహాలక్ష్మియే. 

పార్వతీ దేవి రూపము కూడా లక్ష్మీప్రదమైనది. కనుక ఆ తల్లి మహాలక్ష్మి. 

అందువల్ల ఈ నామములో లక్ష్మీ, పార్వతీ ఇద్దరికీ అభేదము చెప్తున్నారు. 

ధౌమ్యుడు పదమూడు సంవత్సరముల వయసు కల కన్యను మహాలక్ష్మీ రూపం అని చెప్పాడు. 

పార్వతీ రూపములో మహాలక్ష్మి వలె, లక్ష్మీప్రదముగా  వెలుగొందుచున్న,

ఆ పార్వతీరూప మహాలక్ష్మి కి వందనం. 

ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః 


211. మృడప్రియా

సుఖింపచేయువాడు శంకరుడు. అందుకే శంకరునికి మృడుడు అనే పేరు వచ్చింది. 

శంకర ప్రియ కనుక ఆ శాంకరి మృడప్రియ అయినది. 

అమ్మవారికి, అయ్యవారికి సామ్యములున్నవని చెప్పుకున్నాం కదా. 

తన భక్తులకు సుఖముల నివ్వటంలో మృడప్రియ కూడా మృడుని వంటిదే. 

వీరిచ్చే సుఖము సత్వ గుణము నుంచి వచ్చిన సుఖము, కనుక నిజమైన హాయిని అందిస్తారు. 

సుఖము నిచ్చుటలో మృడునితో సమానమయిన, మృడపత్ని, ఆ మృడప్రియ కు వందనం. 

ఓం శ్రీ మృడప్రియాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి