1, అక్టోబర్ 2021, శుక్రవారం

70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా

నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా 
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥

298. నారాయణీ

నారములు అంటే జలములు, జలముల నుంచి ఉద్భవించిన వారు కనుక నారాయణ, 

నారాయణీ ఇద్దరికీ ఆ   నామం వచ్చింది. ర అంటే నశించునది, న ర అంటే, నాశము లేనిది. 

నారాయణ, నారాయణి శబ్దాల నుంచే నర, నారీ శబ్దాలు వచ్చాయి. 

నారాయణ, నారాయణీల వలెనే నర, నారీ రూపాలు కూడా శాశ్వతమే. 

నర, అయన శబ్దాలు కలిసి నారాయణ శబ్దం వచ్చింది.

అయనమంటే త్రోవ, సూర్యనారాయణుడు వైపుకు గమించే త్రోవ. 

దక్షిణం నుంచి ఉత్తరానికి, ఉత్తరం నుంచి దక్షిణానికి కదిలే మార్గం. 

నరుని సంతానమే నారాయణులు. శబ్దరత్నాకరంలో నారాయణుడంటే విష్ణువు, 

సూర్యుడు, శివుడు, బ్రహ్మ, చంద్రుడు, అగ్ని అనే అర్ధాలున్నాయి.

అదే విధంగా నారాయణీ అంటే, పార్వతి, లక్ష్మి అనే అర్ధాలున్నాయి. 

విష్ణు సోదరి కనుక నారాయణీ అనే నామం వచ్చింది. శివపత్ని కనుక నారాయణీ అయింది. 

కూర్మపురాణము ప్రకారము పరమాత్ముడైన ఆ పరమశివుడే తనను తాను 

నారాయణ, నారాయణి అను రెండు భాగములుగా విభజించుకున్నాడు.  

జీవులకు ఆధారమైన నారముల నుంచి ప్రభవించిన, ఆ నారాయణి కి వందనం. 

ఓం శ్రీ నారాయణ్యై నమః  

 

299. నాదరూపా

నాదరూపముగా ప్రకటితమవుతున్న మహాశక్తినే నాదరూపా అంటున్నాం. 

నాదము ఈ సృష్టి అంతా ఎల్లెడలా నిండి వుంది. ప్రకృతి అంతా నాదమయం. 

రోదసి నిత్యమూ చేస్తున్న శబ్దము ఓంకారము అని శాస్త్రజ్ఞులు తెలుసుకుని ప్రకటించారు కూడా. 

అమ్మవారిని ఓంకార పంజర శుకీమ్ అని కీర్తిస్తాం. ఓంకారమనే నాదపంజరంలో 

ఆ కీరవాణి మన హృదయాలలోనే వుంది. వాయువు స్పర్శ లేకుండా పుట్టే ధ్వనిని 

అనాహతము అంటారు. ఆ శబ్దం హృదయపద్మం దగ్గర పుడుతుంది.

హృదయనాద రూపంలో ప్రతి జీవుడిలో కూడా ఆ అమ్మ ఉనికి తెలుస్తూనే ఉంటుంది.

శంకరుడికి కూడా తనువెల్లా నాదమే అని త్యాగరాజు కీర్తించాడు, 'నాద తనుమనిశం శంకరం'  అని. 

శ్రీకృష్ణుడు కూడా తన వేణునాదం ద్వారా ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకుని, గోపికా వల్లభుడయ్యాడు. 

నారదుడు, తుంబురుడు మొదలైన వారు, నాదోపాసన చేసి ఆ స్థాయిని అందుకున్నారు. 

అమ్మ నాదరూపిణి, అమ్మని "నాదబిందు కళాది నమో నమః" అని అరుణగిరినాథర్ కీర్తించాడు.

పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అని వాక్కు నాలుగు విధములు. 

ఈ నాలుగు కలిసి ఒక్కటిగా నాదమవుతున్నాయి. ప్రాణంలో వాయువు కదలుతున్నప్పుడు

వచ్చేవే ఈ నాదాలు. హంసోపనిషత్తు ప్రకారము నాదములు పది. 

అవి, చిణీ, చిణిచిణీ, ఘంటా, శంఖ, వీణా, తాళ, వేణు, భేరీ, మృదంగ, మేఘ నాదాలు. 

నాదస్థానము సూక్ష్మతమమైనది. దానిని అందుకోవటానికి ఉపాసన కావాలి. 

ఎవరు ఏ నాదంలో ఆ అమ్మ అనుభూతిని పొందుతారో ఆ నాదమే అమ్మ. 

నాదరూపంలో అందరీనీ తరింపచేస్తున్న, ఆ నాదరూప కు వందనం. 

ఓం శ్రీ నాదరూపాయై నమః  


300. నామరూప వివర్జితా

నామ రూపములు రెండిటినీ త్యజించినది ఆ అమ్మ, అని ఈ నామానికి అర్ధం. 

ఎవరి గురించైనా తలచుకోవాలంటే, మొదటిలో నామం, రూపం అవసరం. 

సాధన చేస్తూ ఉంటే, ఆ రెండూ అవసరం లేదు. తలిస్తే చాలు తలపున ప్రత్యక్షమయ్యే 

జనని ఆ జగన్మాత. మన అమ్మ పేరు చెప్తేనే అమ్మ మనకు గుర్తు వస్తుందా, అక్కర్లేదే. 

అమ్మ, నాన్న అని అనుకోంగానే వాళ్ళు మనసులో మెదలటం లేదూ. అమ్మని పేరుతో 

పిలుస్తున్నామా, రూపాన్ని చూసే అమ్మ అంటున్నామా, నిత్యం చూసేవారిని చూడటానికి 

నామరూపాలు అవసరం లేదు. ముఖం కేసి చూసి మాట్లాడినా కూడా, ధ్యాస ఆ ముఖం మీద 

ఉండదు కదా. అదే విధంగా ఆ జగన్మాత విషయంలో కూడా అంతే. కొన్నింటికి నామం వుండి 

రూపం ఉండదు, కొన్నింటికి రూపం వుండి నామం ఉండదు. అమ్మకు ఆ రెండూ లేవు.  

కేవలము ఉండుట మాత్రమే ఉన్నది. దేనికీ కట్టుబడని, ఆ నామరూప వివర్జిత కు వందనం. 

ఓం శ్రీ నామరూపవివర్జితాయై నమః  


ఇది శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి వ్రాసిన శ్రీలలితావిజయం లోని 

శ్రీలలితారహస్యసహస్రనామ స్తోత్రము నందు కల 

మూడవ వంద నామాల వివరణ


301. హ్రీంకారీ

హ్రీం అనేది ఆ తల్లి బీజాక్షరం. హ్రీః అంటే లజ్జ, సిగ్గు.

అమ్మని ఈ నామంలో హ్రీంకారీ అంటున్నామంటే, సిగ్గును కలుగచేస్తున్న తల్లి అని భావం. 

హకారం సృష్టి శక్తినీ, రకారం స్థితి శక్తినీ, ఈకారం లయ శక్తినీ సూచిస్తాయి. 

హ్రీం శబ్దములోనే హరి నామం కూడా వుంది. తద్వారా, హరి కూడా అమ్మే అని తెలుస్తోంది. 

హ్రీంకారము రూపాన్ని ఇస్తుంది, ఆ రూపానికి అందాన్నిస్తుంది, దానికి ప్రకాశాన్నిస్తుంది. 

హిరణ్యానికి ఆ కాంతులు, ఆ వర్ణాలు ఈ అమ్మ వలననే వచ్చాయి. హిరణ్మయి అంటేనే అమ్మ. 

సూర్యుడికి కూడా ఆ బంగరు కిరణాలు ఈ అమ్మ నుంచే వచ్చాయి. 

హిరణ్మయం అంటే అంతా అమ్మే అని చెప్పటం. 

శ్రీ సూక్తం కూడా 'హిరణ్యవర్ణాం హరిణీం' అనే ప్రారంభం అవుతుంది. 

సహజంగా ఉండాల్సిన సిగ్గు రూపంలో అందరిలోనూ ఉంటున్న, ఆ హ్రీంకారి కి వందనం. 

ఓం శ్రీ హ్రీంకార్యై నమః 

  

302. హ్రీమతీ 

హ్రీమతీ అంటే సిగ్గు కలది అని అర్ధం. 

బుద్ధితో ఏది సిగ్గు పడవలసిన విషయమో, ఏది ఆచరించదగ్గ విషయమో తెలుసుకోవాలి. 

ఆ విచక్షణా బుద్ధి మనది కాదు, మనలో వున్న ఆ హ్రీమతిది అని తెలిసిన నాడు బుద్ధిమంతుడు. 

ఈ బుద్ధిమంతుడికి యుక్తాయుక్త విచక్షణ ఉంటుంది. 

కూడని పనుల పట్ల నిరాసక్తి, చేయదగిన పనుల పట్ల ఆసక్తి ఉంటాయి. 

జీవులలో ఈ వివేకాన్నిచ్చే తల్లి హ్రీమతి. ఏమి చేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో వున్నప్పుడు 

నరుడైన అర్జునుడు కూడా నారాయణుడికి తన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే 

అంతః కరణములను అప్పచెప్పి, తాను మాత్రమూ శరీరమనే రథంలో కూర్చున్నాడు. 

ఈ నాలుగు గుర్రాల కళ్ళాలూ శ్రీకృష్ణుడికి అప్పచెప్పి, ఆ నారాయణుడు చెప్పినట్టుగా యుద్ధం 

చేసాడు. బుద్ధి మనది అనుకోకుండా వున్నంతకాలం నారాయణుడు నడిపిస్తాడు. 

అలా అని నిష్క్రియగా కూర్చోకూడదు. బుద్ధి చెప్పిన పని చేస్తూనే ఉండాలి. 

జీవులందరిలోనూ విచక్షణ రూపంలో బుద్ధిని ప్రచోదనం చేస్తున్న,  హ్రీమతి కి వందనం. 

ఓం శ్రీ హ్రీమత్యై నమః 


303. హృద్యా 

హృద్యా అంటే, హృదయంలో పుట్టినది. అందమైనది, రమణీయమైనది, ఆహ్లాదకరమైనది అని 

అర్ధం. ఈ అర్ధాలన్నీ అమ్మకు ఎంత బాగా అతికినట్టు సరిపోతాయో కదా. 

హృద్యా అంటే, మనసుని బంధించేది, వశము చేసుకునేది, మనస్సంతా నిండిపోయేది. 

అందమైన దృశ్యాలను కానీ, వస్తువులను కానీ, వ్యక్తులను కానీ చూసినప్పుడు 

హృదయమంతా నిండిపోయేది హృద్య. 

ఈ తల్లి వలననే జీవుడికి అటువంటివి చూసినప్పుడు మహదానందం కలుగుతూ ఉంటుంది. 

జీవుడి మనసుని ఆకట్టుకుని, తన దారిలో నడిపించేది ఈ హృద్య. 

ఈ తల్లి వశీకరణ శక్తికి  దేవతలూ, విరాగులైన ఋషులు, మునులు కూడా వశమవుతారు.

హృదయము లోనికి ప్రవేశించిన జీవుడు నెమ్మదిగా జ్ఞానము వైపుకు కదులుతాడు. 

హృదయములో కొలువైన, ఆ హృద్య కు వందనం. 

ఓం శ్రీ హృద్యాయై నమః 


304. హేయోపాదేయ వర్జితా

హేయము అంటే నిషిద్ధము, ఉపాదేయము అంటే విహితము. 

నిషిద్ధములు, విహితములు అంటే ఏమిటో ముందే తెలుసుకున్నాం. 

అమ్మకు ఈ రెండూ సమానమే కదా, కనుక ఆ తల్లి ఈ రెండింటినీ త్యజించింది, వదిలివేసింది. 

ఈ భేదము అజ్ఞానులకే కానీ, ఆ శుద్ధజ్ఞాన మూర్తికి కాదు కదా. 

జ్ఞాని ఫలమునూ, మలమునూ ఒకే దృష్టితో చూస్తాడు. 

అజ్ఞాని ఫలమును ప్రీతితో తిని, మలమును అసహ్యించుకుంటాడు. 

ఆ అమ్మకు జ్ఞానీ, అజ్ఞానీ ఇద్దరూ సంతానమే, అందుకు ఆ తేడాలు చూపదు. 

ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో, వారి కర్మానుసారం ఇచ్చేది ఆ తల్లి. 

ఇష్టము-అయిష్టము, హేయము-ఉపాదేయము, శుచి-అశుచి, అనే ద్వంద్వానికి 

అతీతమయిన శక్తి, ఈ హేయోపాదేయవర్జిత. 

అన్నీ, అందరూ నాకు సమానమే అని ఈ నామంలో అమ్మ చెప్తున్నది. 

నిషిద్ధము, విహితము అన్న భేదములు లేని,  ఆ హేయోపాదేయ వర్జిత కు వందనం. 

ఓం శ్రీ హేయోపాదేయవర్జితాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి