పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥
366. పరా
పరా అంటే ఇహమునకు చెందనిది. మనమంతా సృష్టి ఈవలవైపు వుంటే, పరా సృష్టికి
ఆవల వైపు ఉంటుంది. పరబ్రహ్మ స్వరూపము. దీనినే పరాశక్తి, ఆదిశక్తి అంటాం.
ఈ పరమును అందుకోవటానికే అందరి ప్రయత్నమూ, తపస్సూ, ఉపాసనా.
వేదములలో కూడా ఈ పరాను గురించి స్త్రీ, పుం రూపము కానిది అని చెప్పారు.
అదే పూర్ణము అని చెప్పబడింది. దానిని తెలుసుకోవడం అంటే దానిలో కలిసిపోవడమే.
ఈ పరాను అందుకునే ప్రయత్నమే పారాయణ. మళ్ళీ మళ్ళీ చదవటమే పారాయణం.
శ్రద్ధగా, నిష్టగా, ఒక పద్ధతిలో మొత్తం పాఠాన్ని చదవటమే పారాయణం అనే ప్రక్రియ.
పరా అంటే శబ్దబ్రహ్మ స్వరూపురాలు. పరా అంటే వాక్కు. వాక్కుకు బీజ స్థితి పరా.
ప్రతి వాక్కుకూ అర్ధం ఉంటుంది. వాక్కు, అర్ధం విడివిడిగా వుండవు.
మహాకవి కాళిదాసు జగత్పితరులైన పార్వతీ పరమేశ్వరులతో వాగర్ధాలను పోలుస్తాడు.
ఆ రెండూ అంత విడదీయలేనివి. వాక్కుకు అర్ధము, అర్ధమునకు, అంటే భావమునకు వాక్కు
జతపడి ఉంటాయి. పరా అన్నది వాక్కును పలకడానికి, ఆ వాక్కుకు సంబంధించి, మనసున
జనించిన వూహామాత్ర రూపము. ఆ వాక్కు పలికే ముందు మనసు లోపల మెదలిన వాగ్రూపం.
పలుకవలసిన పదం మనఃఫలకంలో ముందే స్ఫురింపచేసే అంబికా శక్తే పరా.
ఆలోచనా రూపంలో వున్న వాక్కు పరా. ఏదో చెప్పాలి అనుకునే స్థితి పరాస్థితి.
పరమేశ్వరుని వలె పూర్తిగా అవ్యక్తము. మూలాధారం వద్ద ఉత్పన్నమైన వాక్కే పరా.
నిత్యాహృదయములో ఈ పరాశక్తినే కామరూప పీఠము అన్నారు.
ఆలోచనా రూపంలో వున్న శబ్దబ్రహ్మస్వరూపిణి, ఆ పరా కు వందనం.
ఓం శ్రీ పరాయై నమః
367. ప్రత్యక్చితీ రూపా
పరావాక్కు రూపమే ప్రత్యక్చితీ రూపం. వాక్కు అవ్యక్తంగా ఉండే రూపం.
చితీ అంటే చైతన్యస్వరూపం, ఆత్మ.
ప్రత్యక్చితీ అంటే ప్రత్యక్ చైతన్యస్వరూపురాలు, ప్రత్యగాత్మ.
చితీ, ప్రత్యక్చితీ, బింబ ప్రతిబింబాలు. ఆత్మా, అంతరాత్మా స్వరూపాలు
రెండూ చైతన్య స్వరూపాలే. రెండూ ఒకటే, కానీ వేరువేరుగా కనబడతాయి.
అంతర్ముఖంగా చరించేది ప్రత్యక్చితి. అవ్యకమైనది, స్వాత్మానుకూలమైనది.
అంతర్ముఖులై ఉపాసన చేసేవారికి మార్గదర్శనం చేసేది ఈ ప్రత్యక్చితీ శక్తి.
ఆత్మజ్ఞానస్వరూపిణి అయిన, ఆ ప్రత్యక్చితీ రూపా కు వందనం.
ఓం శ్రీ ప్రత్యక్చితీరూపాయై నమః
368. పశ్యంతీ
పశ్యంతీ అంటే చూచునది. పశ్యంతీ వాక్స్వరూపం. శబ్దబ్రహ్మ స్వరూపం.
పరా వాక్కు స్థితిని దాటిన తరువాత స్థానం పశ్యంతీ వాక్కు. పరా బీజమైతే, మొలక స్థితి పశ్యంతీ.
పలుకవలసిన వాక్కు రూపమే ఇది. దీనిని మనసులో చూస్తాము కనుక దీనిని పశ్యంతీ అన్నారు.
వాక్కు యొక్క ఇచ్ఛాశక్తి స్వరూపం. ఇది వాయురూపంలో వుండే వాక్కు.
దీనికి స్పష్టత ఉండదు. అయినప్పటికీ ఆ వాక్కు రూపాన్ని చూస్తాం కనుక పశ్యంతీ అన్నారు.
తమను తాము చూచుకునే ధ్యానస్థితినే పశ్యంతీ అంటున్నాం.
నిత్యాహృదయములో ఈ పశ్యంతీ శక్తినే పూర్ణగిరి పీఠము అన్నారు.
స్వాధిష్ఠానము వద్ద విజృభించిన వాగ్రూపమే పశ్యంతీ.
వాక్కు యొక్క ఇచ్ఛాశక్తి అయిన, ఆ పశ్యంతీ కి వందనం.
ఓం శ్రీ పశ్యంత్యై నమః
ఓం శ్రీ పరదేవతాయై నమః
370. మధ్యమా
మధ్యమా అంటే మధ్యలో వున్న రూపము అని అర్ధం.
ఈ మధ్యమా వాగ్రూపం పశ్యంతీ, వైఖరీ శబ్ద రూపాలకు మధ్యలో వుండే స్థితి.
అందుకే ఈ మధ్య స్థితిలో వున్న వాగ్రూప శ్రీదేవిని మధ్యమా అంటారు.
స్పష్టాస్పష్ట స్థితి. కొద్దిగా ఆకు తల ఎత్తిన మొలక స్థితి. వాక్కు యొక్క జ్ఞానశక్తి స్వరూపం.
ఇదీ అని తెలుస్తూ ఉంటుంది కానీ, పూర్తిగా తెలియబడదు.
ఎవరు దాన్ని ఎలా భావిస్తే అలా అర్ధమవుతూ ఉంటుంది.
అందుకే దృశ్యము ఒక్కటే అయినా, దృక్కును బట్టి అవగాహనా మారుతుంది.
అర్ధమూ మారుతుంది. అనాహతం వద్ద బుద్ధి రూపంలో వున్న వాగ్రూపమే మధ్యమా.
అటువంటి వ్యక్తావ్యక్త వాక్స్వరూపము మధ్యమా రూపములో వుండే వాగ్రూపదేవత రూపం.
నిత్యాహృదయములో ఈ మధ్యమా శక్తినే జాలంధరపీఠము అన్నారు.
వ్యక్తావ్యక్త వాగ్రూపిణి, ఆ మధ్యమా కు వందనం.
ఓం శ్రీ మధ్యమాయై నమః
371. వైఖరీరూపా
విస్పష్టంగా పలికే, వినబడే వాక్కే వైఖరీ రూపం. వాక్కు యొక్క క్రియాశక్తి స్వరూపం.
మాతృకా హృదయంలో హల్లులన్నీ శివ రూపాలనీ, అచ్చులన్నీ శక్తి రూపాలన్నీ వున్నది.
హల్లులు స్వతంత్రాలు కావు, అచ్చులు స్వతంత్రాలు. అచ్చులు జతపడిన తరువాతే పదం
స్పష్టమవుతుంది. అనాహతం వరకు నాదం రూపంలో వున్న వాక్కు, విశుద్ధికి చేరేసరికి
శక్తి జతకూడి సంపూర్ణమైన వాగ్రూపం ఏర్పడుతుంది. పదం పలుకబడుతుంది, వినబడుతుంది.
ఋగ్వేదంలో వాక్కు మూడు భాగాలు గుహలో ఉంటే, ఒక్క భాగమే ప్రకటించబడుతోంది అని
చెప్పారు. పూర్తిగా మొలకెత్తిన మొక్క రూపం వైఖరీ. అప్పటికి అది ఏ మొక్కో స్పష్టమైపోతుంది.
అందుకే ఈ వైఖరీ రూపాన్నే వాగీశ్వరీ రూపం అంటాం. ఈ వైఖరీ వాక్కు వలననే మానవుని
స్వభావం నిర్ణయింపబడుతుంది. వైఖరి మృదువుగా, మధురంగా ఉంటే ప్రియభాషణుడిగానూ,
క్రోధంగా, అశ్లీలంగా ఉంటే దుష్టుడిగానూ తెలియబడతారు.
మానవుడు తనను తాను ప్రకటించుకునే సాధనమే వైఖరీ వాగ్రూపం.
ఈ వైఖరీ వలననే మానవుని జీవన గమనం నిర్దేశించబడుతుంది.
నిత్యాహృదయములో ఈ వైఖరీ శక్తినే ఓడ్యాణ పీఠము అన్నారు.
పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అనే నాలుగురూపాలూ వాక్కునకు నాలుగు దశలు.
స్పష్టంగా మానవుని స్వభావం తెలిపే వాగీశ్వరి, ఆ వైఖరీరూప కు వందనం.
ఓం శ్రీ వైఖరీరూపాయై నమః
372. భక్తమానస హంసికా
భక్తుల మనస్సనే సరోవరంలో హాయిగా విహరించే హంసికా స్వరూపము శ్రీలలిత అని భావం.
మనసుని సరోవరంతో పోల్చారు ఈ నామంలో. త్రివిష్టపంలో గల కైలాసశిఖరం వద్ద
మానససరోవరం వుంది. శాంతంగా, నిశ్చలంగా, స్వచ్ఛంగా ఉంటుంది.
ఆ మానస సరోవరంలో హంసలు విహరిస్తూ ఉంటాయి.
అమ్మవారిని ఆ హంసలతోనూ, భక్తుల మనసులని ఆ మానససరోవరంతోనూ పోలుస్తున్నాం.
ఆ సరోవరంలో నీరు స్థిరంగా, నిశ్చలంగా ఉంటుంది. అలలు వుండవు.
అటువంటి నిశ్చలమైన మనస్సనే సరోవరంలో అమ్మవారు ఆడు హంస వలె తిరుగాడుతూ
ఉంటుంది. భక్తులంటే నిరంతరమూ అమ్మ ధ్యానములో మునిగినవారు.
అన్నింటా అమ్మను దర్శించేవారు. అటువంటి భక్తుల మనస్సుల్లో అజ్ఞాతంగా విహరిస్తోంది
శ్రీ లలితాపరాభట్టారిక. మనసు అమ్మ యందు స్థిరపడితే, మనసు నిశ్చలంగా, స్థిరంగా
ఉంటుంది. అప్పుడు ఆ స్థిర మనస్కుల మనసులో లలితాదేవి ఆడు హంస వలె విహరిస్తుంది.
పోతన రచించిన శ్రీమద్భాగవతంలో "నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ
చనునే తరంగిణులకు.." అంటాడు ప్రహ్లాదుడు.
తరంగాలుంటే హంసలు రావు, అమ్మ రాదు. మనసు నిశ్చలం కావాలి. అమ్మ యందు
స్థిరమైన బుద్ధితో ఉండేవారి మనసులో అమ్మ ఉంటుంది అని ఈ నామం స్పష్టం చేస్తోంది.
హంస పాలు, నీరుని వేరు పరుస్తుంది. అమ్మ పరా, అపరా గురించి తెలియచేస్తుంది.
నిశ్చలమైన భక్తుల మనస్సుల్లో విహరించే, ఆ భక్తమానసహంసిక కు వందనం.
ఓం శ్రీ భక్తమానసహంసికాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి