11, అక్టోబర్ 2021, సోమవారం

80. చితిః, తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః

 

చితిః, తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ 
స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥

362. చితిః

చిత్ స్వరూపురాలు ఈ దేవత. చితి అంటే చైతన్య స్వరూపము, జ్ఞానము. 

జ్ఞానము శుద్ధ చైతన్య స్వరూపము కదా, కనుక ఈ చితి అజ్ఞానమునకు శత్రువు. 

చితి అజ్ఞానమును దహిస్తుంది. జ్ఞానాన్ని ప్రకాశింపచేస్తుంది. 

"చితి సర్వ స్వతంత్రమైనది, అన్ని లోకాల సిద్ధికీ కారణమైనది" అని శక్తిసూత్రములలో వున్నది.  

అట్టి చిత్స్వరూపురాలు, చైతన్యస్వరూపురాలు శ్రీదేవి. 

మనో, బుద్ధి, అహంకారాలను దాటి వెలిగే ప్రకాశమే చైతన్యము. 

జీవికను కోరుకునే వారికి జీవమైనది చితి అని యోగవాశిష్టములో చెప్పబడింది.  

చిత్స్వరూపముతో అవిద్యను నాశనము చేస్తున్న, ఆ చితి కి వందనం. 

ఓం శ్రీ చిత్యై నమః  


363. తత్పదలక్ష్యార్థా

తత్వమసి, తత్ త్వం అసి అనే వాక్యంలో తత్ అంటే బ్రహ్మము, పరబ్రహ్మము, శుద్ధబ్రహ్మము. 

తత్ పదము అంటే ఆ బ్రహ్మమును పొందు మార్గము, అదే పరమపదము.  

తన భక్తులు, ఉపాసకులు, ఆ బ్రహ్మను చేరు మార్గమే లక్ష్యార్థముగా కలది అని ఈ నామార్ధము. 

పరబ్రహ్మమును అందుకొనుట అంత సులభము కాదు, అయినప్పటికీ ఆ రాజరాజేశ్వరి, 

తన భక్తులకు ఆ లక్ష్యమును అందించవలెనని భక్తులను తన పథములో నడిపిస్తున్నది. 

తత్ త్వం అసి, అంటే నేనే నీవై వున్నాను అని అర్ధం. 

ఆ విధంగా జీవుడు ఈశ్వరుడు ఒకటే అను అద్వైత సిద్ధాంతము చెప్పబడింది. 

తన ఉపాసకులను ధర్మపథములో నడిపి, తత్ పదమును చేర్చటానికి ఆ జగన్మాత 

ఎన్నో ఉపాయాలను చేస్తూ ఉంటుంది. సామ దాన భేద దండోపాయాల ద్వారా, 

భక్తులను ఆ పరబ్రహ్మ పదం చేర్చటమే లక్ష్యంగా కల కరుణామూర్తి ఆ శ్రీ లలిత. 

భక్తులకు పరమపదము చేరే పథమును చూపిస్తున్న, ఆ తత్పదలక్ష్యార్థ కు వందనం.  

ఓం శ్రీ తత్పదలక్ష్యార్థాయై నమః  


364. చిదేక రసరూపిణీ 

చిత్ అనే చైతన్య రస స్వరూపిణి ఈ చిదేకరసరూపిణి. 

చిదానందమనే ఆనంద రస స్వరూపమే ఈ తల్లి అని భావం. 

రసమును అనుభవించి మాత్రమే తెలుసుకోగలము, ఈ చిత్ అనే చైతన్య రస స్వరూపాన్ని 

కూడా కేవలము అనుభవించి మాత్రమే ఆనందించగలం. 

'అమ్మ' అనే పదం ఇచ్చే అనుభూతిని, ఆ పదం తలచినపుడు, పలికినపుడు అనుభవిస్తుంటాం. 

అప్పుడు కలిగే ఆనందానుభూతే, రసము. దానిని ఆస్వాదించటమే రసాస్వాదన. 

గోపికలు శ్రీకృష్ణుడిని తలచినంత మాత్రానే రసానుభూతికి లోనవుతూ వుంటారు. 

శ్రీకృష్ణుని స్మరణం, దర్శనం, అతడితో రాసకేళిలో అద్వితీయ ఆనందానుభూతిని 

పొందుతూ వుంటారు గోపికలు. వారికి ఆ రసానుభూతిని కలిగించేది కాత్యాయని. 

అందుకే ఆ రసానుభూతిని తమకు ప్రసాదించమని గోపికలు కాత్యాయనీ వ్రతం చేస్తారు. 

చిత్ అనే రసానుభూతి స్వరూపమే తానైన, ఆ చిదేక రసరూపిణి కి వందనం. 

ఓం శ్రీ చిదేకరసరూపిణ్యై నమః  


365. స్వాత్మానంద లవీ భూత బ్రహ్మాద్యానంద సంతతిః 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ జగన్మాత సంతానము. వారి ఆనందంలోనే తన ఆనందమును 

పొందునది ఆ శ్రీమాత. ఏ తల్లికైనా పిల్లల ఆనందమే స్వీయానందం, స్వాత్మానందం. 

ఆ జగన్మాత, తన సంతతి అయిన త్రిమూర్తులు, వారికి నిర్దేశించిన సృష్టి స్థితి లయ కార్యములు 

నిర్వహించుచున్నప్పుడు, తాను కూడా ఆయా కార్యములలో, వారితో కూడి వున్ననూ, 

త్రిమూర్తుల ఆనందమును చూసి, పరమానందమును పొందుచున్నది అని ఈ నామార్ధం.  

ఈ సృష్టి స్థితి లయ కార్యములలో త్రిమూర్తులూ, శ్రీమాతా కూడా ఆనందమును  

అనుభవిస్తున్నారు. ఆనందము లవలేశమయినా, పరిపూర్ణమైనదైనా ఆనందమే. 

తన సంతతి యొక్క లవలేశమయిన ఆనందము కూడా, తన స్వాత్మానందముగా 

ఆనందిస్తున్న తల్లి ఈమె. అమ్మ ఆనందాన్ని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, 

విజ్ఞానమయ, ఆనందమయ అనే పంచకోశాల అంతస్థులలో ఏర్పరిచింది . 

ఒకదాని కన్నా మరొక ఆనందము ఉన్నతము. తైత్తిరీయోపనిషత్తులోని బ్రహ్మానందవల్లిలో,

ఆనందములో కల హెచ్చుతగ్గులను గురించి వివరంగా చెప్పారు. 

అన్నింటి లోనూ అతి స్వల్ప ఆనందము మానవానందం అయితే, 

అతి గొప్ప ఆనందము బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందాన్ని పొందటమే తత్పదలక్ష్యార్థం. 

ఏ ఆనందమయినా ఆనందమే, దాని హెచ్చుతగ్గులను బట్టీ, ఆ ఆనందం ఎంత సమయం

అనుభూతిలో ఉంటుందో తెలుస్తుంది. ఆనందమయ కోశం తెరుచుకున్నప్పుడు  

అకారణంగా ఆనందం కలుగుతుంది. అది అనుభవైకవేద్యము. 

తన సంతతి యొక్క లవలేశమైన ఆనందములు కూడా, తన ఆనందములుగా 

అనుభవిస్తున్న, ఆ స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి కి వందనం. 

ఓం శ్రీ స్వాత్మానంద లవీ భూత బ్రహ్మాద్యానంద సంతత్యై నమః 

  

------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి