విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥
346. విజయా
ఓం శ్రీ విజయాయై నమః
347. విమలా
విమల నిర్మలమైనది, అవిద్యా మలినములు లేనిది, శుద్ధవిద్యా స్వరూపము.
వాస్తుశాస్త్రములో గృహముల యొక్క అనేక నామములలో విమల అని ఒక గృహమునకు పేరు.
పద్మపురాణంలో పురుషోత్తమ తీర్థము వద్ద కొలువైన దేవత పేరు విమల అని చెప్పబడింది.
ఆ పురుషోత్తమ తీర్థమే నేటి పూరీ. ఈనాటికీ ఆ జగన్నాథపురిలో కొలువైన అమ్మవారి పేరు విమల.
అధర్మము, అజ్ఞానము, అవిద్య, అహంకారములను మలములు అంటారు.
శ్రీదేవికి ఈ మలములేవీ అంటవు కనుక ఆ తల్లి విమల.
మలినములు ఏవీ లేని, నిర్మలమైన, అమలమైన, ఆ విమల కు వందనం.
ఓం శ్రీ విమలాయై నమః
348. వంద్యా
నమస్కరింపదగినది వంద్యా. స్తుతింపతగినది, పూజింపదగినది, వందనీయురాలు వంద్య.
అమ్మకు నమస్కరింపని చేతులు వ్యర్ధము. అమ్మను సేవింపని కరములు కరములే కావు.
శుద్ధమైన మనసుతో, చేతులారా ఆ జగన్మాతకు నమస్కరిస్తే, పాపములన్నీ నశిస్తాయి.
అమ్మ అనుగ్రహం లభిస్తుంది. దేవేంద్రాదులకూ, ఋషులకూ కూడా ఈ తల్లి వందనీయురాలు.
త్రిమూర్తులు కూడా ఆ జగదంబికకు నిత్యమూ నమస్కరిస్తూ వుంటారు.
సిద్ధులూ, యోగులూ, ఉపాసకులూ ఈ మాతకు నిరంతరమూ ప్రణమిల్లుతూనే వుంటారు.
సమస్త లోకాలకూ వందనీయురాలైన, ఆ వంద్య కు వందనం.
ఓం శ్రీ వంద్యాయై నమః
ఓం శ్రీ వందారుజనవత్సలాయై నమః
350. వాగ్వాదినీ
వాక్కులను పలుకే దేవత వాగ్వాదినీ. ఏ వాక్కు పలకాలో ఆ వాక్కు ముందు మనసులో
ఊహలా పుడుతుంది. తరువాత ఆ ఊహను మనసులోనే అనుకుంటాం, అంటే దర్శిస్తాం.
ఆ తరువాత ఆ ఊహకు సరియైన పదం స్ఫురణకు వస్తుంది. ఆ తరువాత దానిని పలుకుతాం.
ఈ నాలుగు దశలకూ పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అని పేరు.
ఆ లలితాదేవి యొక్క వాగ్వాదినీ స్వరూపం ఈ నాలుగు స్థితులలోనూ ఉంటుంది.
మనసులో ఊహ పుట్టి, ఆ ఊహకు ఒక ఆకారం, ఒక పదం, ఒక శబ్దం ఏర్పడతాయి.
వాక్కుకు అధిదేవత వాగ్వాదినీ. పలుకులను పలికించునది ఈ దేవతే.
వాదములో ఉన్న తన భక్తులకు, ఎప్పుడు ఏ మాట పలకాలో, ఎలా పలకాలో,
ఆ వాక్పటిమను, వాక్సుద్ధిని, వాక్శక్తినీ అనుగ్రహించే శక్తే ఈ వాగ్వాదినీ.
పదాన్ని స్ఫురించడంలోనూ, పద ఉచ్ఛారణలోనూ, భక్తులకు తోడుగా వుండి,
వారికి లోనుండి నిర్దేశములిస్తున్న, ఆ వాగ్వాదిని కి వందనం.
ఓం శ్రీ వాగ్వాదిన్యై నమః
351. వామకేశీ
వామ అంటే అందమైన అని చెప్పుకున్నాం. శివుడికి వామకేశుడని పేరు.
వామకేశుడి పత్ని కనుక ఆ త్రిపురసుందరికి వామకేశీ అని పేరు. వామకేశమనే తంత్రం వున్నది.
ఆ తంత్రంలో చెప్పబడిన దేవత కనుక, జగదాంబకు వామకేశీ అనే పేరు వచ్చింది.
అమ్మవారు శివ వామాంకస్థ, కనుక శివుని ఎడమ భాగము శివాది.
అందుకే, అర్ధనారీశ్వరునికి, కుడివైపు జటాజూటము ఉంటే, ఎడమవైపు సువాసనా భరితమైన
కేశములు ఉంటాయి. వామకేశీ అంటే అందమైన కేశములు కలది లలితాపరమేశ్వరి అని అర్ధం.
అమ్మవారి కేశముల గురించి, పువ్వులకే పరిమళములు అద్దుతున్న, ఆ సుందర కేశపాశము
గురించి చెప్పుకున్నాం. పువ్వులకు పరిమళము, గౌరవము, ఈ వామకేశి వాటిని ధరించటం
వలననే వచ్చాయి. సుందరమైన, సుగంధమైన కేశములు కల, ఆ వామకేశి కి వందనం.
ఓం శ్రీ వామకేశ్యై నమః
352. వహ్నిమండల వాసినీ
సోమ, సూర్య, అగ్ని, మండలములు మూడింటినీ కలిపి వహ్నిమండలం అంటారు.
ఈ మూడు అగ్నులే త్రేతాగ్నులు అంటాం.
ఈ మూడు అగ్నుల యందూ వసిస్తున్నది కనుక, లలితాదేవిని వహ్నిమండలవాసిని అన్నారు.
త్రేతాగ్నులు త్రిగుణములకు సంకేతములు. అమ్మ త్రిగుణాలలో వున్నట్టే, త్రేతాగ్నులలోనూ
ఉంటుంది. కామేశ్వరి చేసే సృష్టి, స్థితి, లయ కార్యములన్నీ కూడా అగ్ని కార్యములే.
త్రేతాగ్నులైన సోమ మండలము, సూర్యమండలము, అగ్నిమండలము
మూలాధారము వద్దా, సహస్రారము వద్దా వున్నాయి. అక్కడ అగ్ని జ్వలిస్తేనే సాధన పూర్తి
అవుతుంది. త్రేతాగ్నులలోనూ వసిస్తున్న, ఆ వహ్నిమండల వాసిని కి వందనం.
ఓం శ్రీ వహ్నిమండలవాసిన్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
పురుషోత్తమ తీర్థము దగ్గర ఉన్నటువంటి అమ్మవారికి విమల అనే పేరు ఉన్నట్లు తెలియజేసినందుకు ధన్యవాదములు🙏🙏
రిప్లయితొలగించండి