26, అక్టోబర్ 2021, మంగళవారం

95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ

 

తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ 
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥

452. తేజోవతీ

తేజోవతీ అంటే గొప్ప తేజస్సు కలది అని అర్ధం. లలితాపరమేశ్వరీ దేవి తేజస్సు చాలా గొప్పది. 

సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ ముగ్గురూ గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ వుంటారు. 

లలితాపరమేశ్వరి నుంచి తీసుకున్న తేజస్సుతో, పగటి పూట సూర్యుడు తన తేజో కిరణాలతో 

ప్రపంచానికి కాంతులను ఇస్తే, చంద్రుడు రాత్రి పూట కాంతులు వెదజల్లుతాడు. 

ఈ రెండూ కాని సంధ్యాసమయాల్లో అగ్ని ద్వారా అమ్మవారి తేజస్సు ప్రకాశిస్తుంది. 

అమ్మ మాత్రం ఎల్లవేళలా తన తేజస్సుని ప్రసరిస్తూనే ఉంటుంది. 

శ్రీచక్రం లోని ప్రతి కోణమూ, ప్రతి కొనా, ఒక్కో తేజో కిరణానికి ఉద్గమస్థానం. 

ఇంత తేజస్సు కలిగిన అమ్మను ఈ నామంలో తేజోవతీ అంటున్నాం. 

సూర్య, చంద్ర, 
గ్నుల ద్వారా తన తేజస్సుతో మనలను పోషిస్తున్న, ఆ తేజోవతి కి వందనం. 

ఓం శ్రీ తేజోవత్యై నమః  


453. త్రినయనా 

త్రినయనా అంటే మూడు కన్నులు కల తల్లి అని అర్ధం, ఫాలనేత్రం కూడా కల పరమేశ్వరి. 

ఈ మూడు కన్నులూ మూడు కాలాలకూ ప్రతీక. సౌందర్యలహరిలో ఆదిశంకరుడు, " అమ్మా, నీ 

కుడికంటి కాంతితో పగలు, ఎడమకంటి కాంతితో రాత్రి, ఈ రెండింటికీ మధ్యనున్న మెరుపు వంటి 

సంధ్యాకాలాన్ని నీ మూడవ కన్ను ఆవిష్కరిస్తున్నాయి" అంటాడు.

సూర్యాత్మకమైన పింగళానాడి కుడికంటికి, చంద్రాత్మకమైన ఇడానాడి ఎడమకంటికి ప్రతీకలైతే.   

మధ్యనున్న మూడవదైన ఫాలనేత్రం సుషుమ్నానాడి మార్గాన్ని సూచిస్తుంది. 

ఆజ్ఞ వద్ద, ఇడా పింగళా నాడులు సుషుమ్నతో కలిసి, సహస్రారం వైపుకి సాగుతాయి. 

త్రికాలములు, త్రినేత్రములు, త్రినాడులు, త్రిమూర్తులు, త్రిమాతలు, 

త్రిగుణములు, త్రిలోకములు ఇవి అన్నీ అమ్మ సృష్టే. 

అంతా త్య్రంబకమే. అందుకే అమ్మను త్రయీమయీ అంటాం. 

ఆ పరమాత్మను చేరటానికి మార్గాలు కూడా మూడని భగవద్గీత చెప్తుంది. అవే కర్మ, భక్తి, జ్ఞానము. 

పరమశివుడు కూడా అన్నపూర్ణేశ్వరిని భిక్షను అడుగుతూ, ఆ బిక్ష 'జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం' అని 

అంటాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలనే మూడు సాధనాలతో ఉపాసిస్తే, అమ్మను చేరవచ్చు. 

తన మూడు కన్నులతో మూడు కాలాలను సృష్టిస్తూ, ఉపాసకులకు సుషుమ్నా మార్గాన్ని

సూచించే మూడవకన్నుతో ప్రకాశిస్తున్న,  ఆ త్రినయన కు వందనం.  

ఓం శ్రీ త్రినయనాయై నమః  


454. లోలాక్షీకామరూపిణీ  

లోలాక్షులకు అమ్మవారు కామరూపిణి అని ఈ నామార్దం. లోలాక్షులంటే స్త్రీలు. 

అమ్మ ఆడవారి కళ్ళకు కూడా మన్మథుని వలె కనిపిస్తుంది అని ఈ నామం చెప్తోంది. 

స్త్రీలు కూడా మోహపడే సుందర రూపం మహా త్రిపుర సుందరిది. అమ్మ యోగేశ్వరేశ్వరి. 

అంధకాసుర వధ సమయంలో వరాహమూర్తి అష్ట మాతృకలను సృషించాడు. 

కామగుణంతో యోగేశ్వరీదేవి, క్రోధగుణంతో మాహేశ్వరీదేవి, లోభగుణంతో వైష్ణవీదేవి, 

మదగుణంతో బ్రాహ్మణీదేవి, మోహగుణంతో కౌమారీదేవి, మాత్సర్యగుణంతో ఐంద్రీదేవి, 

కౄరత్వంతో యమదండధరాదేవి, అసూయతో వారాహీదేవి ఆవిర్భవించారు. 

ఈ అష్ట మాతృకలు ఆ యుద్ధంలో అంధకాసురుని రక్తం త్రాగి, ఆ రాక్షసుడిని వధించటానికి 

వరాహమూర్తికి తోడుగా నిలిచారు. ఈ వివరం అంతా వరాహ పురాణంలో చెప్పబడింది. 

ఆ కారణం చేత కామరూపిణీ అంటే యోగేశ్వరి. యోగేశ్వరీ స్వరూపముతో స్త్రీలకు కూడా 

మన్మధుని వలె అగుపడే, ఆ లోలాక్షీకామరూపిణి కి వందనం. 

ఓం శ్రీ లోలాక్షీకామరూపిణ్యై నమః  


455. మాలినీ  

మాలినీ అంటే మాలలు కలది. అమ్మ మంత్రములన్నీ మాలామంత్రములే. 

మంత్రములే మాలలుగా కలిగిన దేవత అని అర్ధం. మాలిని అనేది ఒక ఛందో వృత్త విశేషము.  

ఏడు సంవత్సరముల బాలికను మాలినీ అంటారు. మందాకినీ స్వరూపురాలు. 

అమ్మ మాలిని అనే చెలికత్తెను కలిగి ఉంది అని మరో అర్ధం. 

వామన పురాణంలో ఒక చిన్న కథ వుంది. 

శివ పార్వతుల వివాహ సమయంలో, సప్తపదిలో పార్వతి చెలికత్తె మాలిని, శివుడి పాదాన్ని 

పట్టుకుని, "ఈ సప్తపది సందర్భంగా మా సఖికి ఏమి కానుక ఇస్తావు" అని అడుగుతుంది. 

అప్పుడు శివుడు తన గోత్రాన్ని పత్నికి ఇస్తానని అంటాడు. 

అందుకే ఈనాటికీ వివాహసమయంలో, సప్తపది ఘట్టం అయిన తరువాతే 

వధువు గోత్రం మారి, వరుని గోత్రాన్ని పొందుతుంది. 

అమ్మ మంత్రాలన్నీ మాలా రూపంలో ఉంటాయి. ఖడ్గమాల కూడా మాలా మంత్రమే. 

స్తోత్రాలలో మంత్రములన్నీ, లేదా నామములన్నీ ఒకదానితో మరియొకటి అనుసంధానింపబడి 

ఉంటాయి. మాతృకా వర్ణములు అని పిలువబడే, అకారాది క్షకారాంత, యాభైఒక్క అక్షరములతో 

కూర్చిన మాలలే మంత్రములు. అందుకే ఈ మంత్రాలను మాలామంత్రములంటాం. 

ఈ మంత్రమాలలను కలిగిన లలితా త్రిపురసుందరిని ఈ నామంలో మాలినీ అంటున్నాం. 

యాభై ఒక్క అక్షరములతో ఏర్పడిన మంత్రములనే మాలలుగా ధరించే, ఆ మాలిని కి వందనం. 

ఓం శ్రీ మాలిన్యై నమః 

 

456. హంసినీ

హంసినీ అంటే హంస స్వరూపము కలది. హంసలు, పరమహంసలు అని పిలువబడే యోగుల 

సమూహానికి అధీశ్వరి. హంస అంటే ఆత్మ, పరమ హంస అంటే పరమాత్మ. 

హంస ఏ విధంగా పాలు, నీరుని విడదీస్తుందో, ఈ హంసలైన యోగులు ఆత్మ, అనాత్మలను 

ఆ విధంగా వేరు చేసి చూడగలరు. అందుకే వీరిని హంసలు, పరమహంసలు అన్నారు. 

రామకృష్ణ పరమహంస, పరమహంస యోగానంద అట్టి యోగులు. 

ఊపిరి రూపంలో అన్ని ప్రాణులలో ఉండేది ఈ హంసయే. ఈ హంస జపాన్నే అజపాజపం 

అంటారు. హకారము ఉఛ్ఛ్వాస, సకారము నిశ్వాస. శ్వాస మీద ధ్యాసతో, సోహం జపం చెయ్యాలి. 

ఈ హంసకు శివశక్తులు రెండు కాళ్ళు, ఓంకారము శిరస్సు అని హంసోపనిషత్తులో  చెప్పబడింది. 

"హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహీ, తన్నో హంసః ప్రచోదయాత్" అనేది 

హంస గాయత్రీ మంత్రం. దీనినే అజపాగాయత్రి అని కూడా అంటారు. 

ఆత్మజ్ఞాన సంపన్నులైన హంసలచే ధ్యానింపబడే, ఆ హంసిని కి వందనం. 

ఓం శ్రీ హంసిన్యై నమః 


457. మాతా

అందరినీ సృష్టించింది కనుక మాత అనే నామం వచ్చింది. లక్ష్మీ బీజ స్వరూపురాలు. 

చైతన్యమునకూ, జడమునకూ కూడా తల్లి. అన్ని మంత్రములలో అక్షర స్వరూపమే మాత. 

మాతృకా వర్ణముల స్వరూపము కనుక, ఆ పరమేశ్వరి మాతృకయైనది అని స్కాందపురాణంలో 

వున్నది. సకల సృష్టినీ తన గర్భం నుంచే సృజించి, ప్రళయకాలంలో తిరిగి తన లోనికే 

లయించుకుంటున్న తల్లి. ప్రళయకాలానంతరము తిరిగి సకల భువనాలనూ ప్రసవించు తల్లి. 

ఆదిశంకరుడు ఈ తల్లిని భువన ప్రసూత్యై, నిత్యప్రసూత్యై, జగత్సూత్యై అన్నాడు. ప్రసూతి 

అంటే పురుడు. మ్మ ద్వారా సృష్టింపబడని పదార్దమేదీ ఈ పధ్నాలుగు భవనాలలో లేదు. 

అన్నింటికీ, అందరికీ ఆ పరమేశ్వరియే కన్నతల్లి. అందుకే ఆ లలిత అందరికీ మాత

లోకాలోకాలన్నింటినీ కన్నతల్లి, జగజ్జనని, ఆ మాత కు వందనం. 

ఓం శ్రీ మాత్రే నమః 


458. మలయాచలవాసినీ 

మలయపర్వతాలలో నివసించే దేవి మలయాచలవాసినీ. 

శ్రీగంధపు చెట్లు పెరిగే పర్వతం మలయపర్వతం. గంధపు చెట్ల మధ్య వెలసిన దేవి అని అర్ధం. 

భారతదేశం లోని దక్షిణభాగంలో వున్న మళయాళ దేశమే ఈ మలయపర్వతాల స్థానం. 

పచ్చని ఈ మలయ పర్వతాలలో అమ్మ భగవతీ అనే రూపంలో పూజలందుకుంటోంది. 

కేరళదేశంలో ఎన్నో పురాతన భగవతీ ఆలయాలున్నాయి. 

వాటిలో చెంగన్నూర్ భగవతీ ఆలయంలో ఒక ప్రత్యేకత వుంది. అక్కడ కొలువైన భగవతీ 

అమ్మవారికి ఋతుక్రమం వస్తుంది. ఆ రోజుల్లో ఆలయాన్ని మూసి అమ్మవారిని వేరే గదికి 

తరలిస్తారు. నాలుగవ రోజు పంపానదికి విగ్రహాన్ని తీసుకువెళ్లి, స్నానం చేయించిన తరువాత 

తిరిగి గర్భగృహం లోకి తీసుకువస్తారు. ఈ తంతు అంతా పెద్ద ఉత్సవం లాగా చేస్తారు. 

ఈ కార్యక్రమం ఈ నాటి వరకూ ఆ ఆలయంలో జరుగుతూనే వుంది. 

భగవతి మాయలు, మహిమలు సామాన్యులకు అర్ధం కావు. 

మలయాచలములో భగవతి రూపములో ప్రకటితమైన, ఆ మలయాచలవాసిని కి వందనం. 

ఓం శ్రీ మలయాచలవాసిన్యై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి