3, అక్టోబర్ 2021, ఆదివారం

72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా

 

రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా 
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥

313. రమా

రమ అంటే శ్రీ, లక్ష్మి, సంపద. ఐశ్వర్యము, కలిమి అన్నీనూ . 

రమయే సరస్వతి. రమ అంటే లక్ష్మీ స్వరూపురాలు, ఆనందము కలిగించునది అని అర్ధం.

సంపద అంటే ధన, ధాన్య, ధైర్య, వీర్య, విజయ, విద్యా మొదలైనవన్నీ. 

కలిమి అంటే కలిగి ఉండటం. విద్య, జ్ఞానము, యమ నియమాదులు వంటివి కలిగి ఉండటం.

కలిమి అంటే సుఖము, శాంతము, శుచి, యోగము, భోగము, ఆనందము కలిగి ఉండటం.  

ఇన్నింటిలో అసలైన కలిమి అమ్మ కృపాకటాక్షము కలిగి ఉండటం. అంతకు మించిన కలిమి 

ఈ జగత్తులోనే లేదు. ఆ కలిమి ఉంటే అన్నీ సిద్ధిస్తాయి. అపుడు ఆనందో బ్రహ్మ. 

ఇన్ని కలుములకు రాణి యైన, 
ఆ రమ కు వందనం. 

ఓం శ్రీ రమాయై నమః  


314. రాకేందువదనా

రాకా అంటే అన్ని కళలూ వున్న పౌర్ణమి చంద్రుడు. నిండు చంద్రుడు స్వచ్ఛమైన ప్రకాశంతో 

ఎలా వెలిగిపోతాడో, అమ్మ వదనము ఆ విధంగా నిగనిగలతో ప్రకాశిస్తున్నది. 

అందుకే ఈ నామంలో ఆ జగత్జ్యోతిని రాకేందువదనా అని పిలుచుకుని సంబరపడుతున్నాం. 

చంద్రుడంటేనే అందము, ఆహ్లాదం, ఆనందము. చంద్రునికి అవి ఇచ్చింది అమ్మే కదా. 

ఆ తల్లి చంద్రమండలమధ్యగా, అంటే చంద్రమండలం మధ్యలో ఉంటూ తన శక్తిని 

అన్నివైపులకూ ప్రసారం చేస్తోంది. చంద్రుడు తల్లి పోలిక పిల్లవాడన్నమాట. 

లలిత లోని లాలిత్యము, ఆహ్లాదం, సౌందర్యం, ఆకర్షణ, ప్రకాశము, పరిపూర్ణత్వము 

చంద్రునికి కూడా అబ్బాయి. కానీ అందరూ తేలికగా నిత్యమూ చూసేదీ, 

చూడగలిగేదీ చంద్రుణ్ణి కదా. అందుకని లలితను తలచినప్పుడు,

"ఓహో, ఈ తల్లి మనం నిత్యమూ చూసే చంద్రుని వలె వున్నది కదా", 

అని జీవుడు అనుకోవడం సహజం. పున్నమి చంద్రుని దర్శనమే అంత ఆహ్లాదాన్నిస్తుంటే,  

నిజముగా ఆ తల్లి దర్శనమే అయితే.......... ఆ పరమానందాన్ని యేమని వర్ణించగలం. 

నిండు చంద్రుని ముఖంతో ఆహ్లాదాన్నిస్తున్న, ఆ రాకేందువదన కు వందనం.  

ఓం శ్రీ రాకేందువదనాయై నమః  


315. రతిరూపా

అందగత్తెలలో ఎన్నదగినది రతి, మన్మథపత్ని. రతి వంటి అందమైన, 

సుకుమారమైన రూపము కలదానా అని అమ్మను ఈ నామంలో చెప్పుకుంటున్నాం. 

రతీ మన్మథులు సౌందర్య స్వరూపులు, ఆనంద రస స్వరూపులు. 

అమ్మ సౌందర్యవతి, లావణ్యవతి, ఆనందాన్ని ఇస్తుంది కనుక ఈ పోలికను చెప్పారు. 

రతి అంటే ప్రీతి, అనురాగం అని ముందే చెప్పుకున్నాం. 

ఆ కామేశ్వరికి కామేశ్వరుడి పట్ల ప్రీతి, అనురాగం. ఆ రూపు దాల్చిన అనురాగమూర్తే రతిరూపా. 

కామేశ్వర కామేశ్వరీ తత్వము వలన ఈ ఇద్దరూ ఒకటే, వేరు వేరు కాదు అని అర్ధం అవుతుంది. 

అదే అర్ధనారీశ్వరభావన. ఈ ఇద్దరినీ ఏకస్వరూపంలో దర్శనం చేస్తే ఆ తల్లి ఇష్టపడుతుంది. 

ఆ భావనమే రతిరూపా తత్వము. ఈశ్వరునితో కలిసి ఉండటం ఈశ్వరికి ప్రీతి.   

ఈశ్వరరతి వలన రూపు దాల్చిన రతీ రూపము కల, ఆ రతిరూప కు వందనం. 

ఓం శ్రీ రతిరూపాయై నమః  


316. రతిప్రియా 

రతి ప్రియా అంటే రతీదేవిని ఇష్టపడునది. సురతమును ఇష్టపడునది. 

అనురక్తిని ఇష్టపడునది, అనే భావం ఈ నామంలో వుంది. రతి అంటే కామేశ్వరికి ఇష్టం. 

ఈ సమస్త సృష్టీ అటువంటి దివ్యరతి వలన ఏర్పడినదే. 

అమ్మ పట్ల ఉపాసకులలో కలిగే అపరిమిత అనురాగమే, ఆ ఉపాసకులకు అమ్మ యొక్క 

రతిరూప దర్శనము కలిగిస్తుంది. దివ్యభక్తి వలన జనించే ఆ అవ్యాజానురాగమే 

అమ్మకు భక్తుల పట్ల ప్రీతినీ, అనుగ్రహాన్నీ కలుగచేస్తుంది. 

ఈశ్వరునితో సురతమును ప్రీతితో ఆనందిస్తున్న, ఆ రతిప్రియ కు వందనం. 

ఓం శ్రీ రతిప్రియాయై నమః 

  

317. రక్షాకరీ

రక్షాకరీ అనే నామంలో అమ్మను రక్షణను అనుగ్రహించే తల్లిగా కొలుస్తున్నాం. 

రక్ష అంటే, తాయెత్తు, మూలిక, విభూతి, శరణ్యము, ఆశ్రయము అని అర్ధం. 

తల్లి పిల్లకు క్షేమంగా ఉండాలనే ఆరాటంతో రక్షగా, తాయెత్తో, మూలికో కడుతుంది. 

ఆ జగన్మాత తానే స్వయంగా ఈ సర్వ జగత్తుకూ రక్షయై నిలచింది. 

రామనామాన్ని మించిన రక్ష ఏదీ. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అంటాం. 

తన రక్షణ కోరి వచ్చిన విభీషణుడిని చివరిదాకా కాపాడాడు శ్రీరాముడు. 

తన రక్షణలో వున్న పాండవులను అడుగడుగునా అపాయాల నుంచి సంరక్షించాడు శ్రీ కృష్ణుడు. 

ఆ నారాయణిని శరణు వేడితే శరణ్యము, ఆశ్రయము దొరుకుతాయి. 

అదే అందరికీ ఎల్లవేళలా సర్వ రక్షాకర మంత్రము. 

ఆ తల్లి నీడలో హాయిగా ఆదమరచి ఉండాలంటే, "అమ్మా, అన్నీ నీవే, అంతా నీవే, 

పాహిమాం, రక్షమాం" అని శరణు కోరితే, ఆ తల్లి రక్షను ఇస్తుంది. 

అన్నింటికన్నా అసలైన రక్షాకవచం పాపాయికి అమ్మ కడుపు. అంతకన్నా మరో రక్షితస్థలం ఏదీ. 

సకల జగత్తునూ కడుపులో పెట్టుకుని కాపాడుతున్నదీ జగజ్జనని.  

నుదుట విభూతిని రక్షగా పెట్టుకుంటాం. అది అన్ని ఇక్కట్ల నుంచీ కాపాడుతుందని నమ్మకం. 

ఆ విభూతిని శిరస్సున దాల్చినా, శిరస్సున దాల్చినట్టు భావించినా, అదే సర్వజగద్రక్ష.  

సకల జగత్తుకూ రక్షణనిస్తున్న, ఆ రక్షాకరి కి వందనం. 

ఓం శ్రీ రక్షాకర్యై నమః 


318. రాక్షసఘ్నీ

రాక్షసఘ్నీ అంటే రాక్షసులను సంహరించునది, దమించునది అని అర్ధం. 

రాక్షసులు తమోగుణం కలిగినవారు. తమస్సు అంటే అజ్ఞానం, తిమిరం, చీకటి. 

చీకటిలో అధర్మము రాజ్యమేలుతుంది. ధర్మగ్లాని జరుగుతుంది. 

సత్వగుణము కలవారు ఈ తమోగుణ ప్రధానులైన రాక్షసుల చేత వేధింపబడతారు. 

భగవద్గీతలో భగవానుడు స్పష్టంగా చెప్పాడు, ధర్మగ్లాని జరిగినప్పుడల్లా, 

నన్ను నేనే సృజించుకుని వస్తాను. అప్పుడు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేస్తాను, అని. 

నారాయణుడు, నారాయణి ఈ రాక్షస శక్తులను సంహరించడానికి అవతారాలు 

ఎత్తుతూనే వుంటారు. దుష్టాత్ములను శిక్షిస్తూనే వుంటారు. 

పదే పదే రాక్షస శక్తి వస్తూనే ఉంటుంది. నిర్జింపబడుతూనే ఉంటుంది. 

కొన్నాళ్ళు శాంతీ, ధర్మం ఉంటాయి, మళ్ళీ తిరిగి అధర్మం తల ఎత్తుతుంది. 

ఆ అధర్మం శృతి మించినప్పుడల్లా, అమ్మ ఏదో ఒక రూపంలో ఆ రాక్షసులను సంహరిస్తుంది. 

ధర్మగ్లాని జరుగకుండా అడ్డుకోవడానికి రాక్షసులను సంహరిస్తున్న, ఆ రాక్షసఘ్ని కి వందనం. 

ఓం శ్రీ రాక్షసఘ్న్యై నమః 


319. రామా

రామా అంటే రమించునది, స్త్రీ, గౌరీ అని అర్ధం. ప్రతి స్త్రీ ఈ రామా స్వరూపురాలే. 

సృష్టిలో స్త్రీలందరూ గౌరీ విభూతులే. ప్రతి స్త్రీనీ గౌరీదేవిగా భావించాలి. 

దేవతలు, సిద్ధులు, యోగులు, ఉపాసకులు, భక్తులు అందరూ ఈమె యందే రమిస్తూ వుంటారు, 

కనుక ఆ శ్రీదేవిని ఈ నామంలో రామా అంటున్నాం. 

"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర ఫలాః క్రియాః"

అని మనుస్మృతిలో చెప్పారు

బృహత్పరాశరస్మృతిలో ఈ విధంగా వుంది. "ఎక్కడ నారీమణులు గౌరవింపబడతారో, అక్కడ దేవతలు

క్రీడిస్తారు. వారు సంతోషించి వంశాభివృద్ధి చేస్తారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడరో, అక్కడ దేవతలు,

స్త్రీలు కోపిస్తారు, వంశనాశనము అవుతుంది. ఆ చోట ఎన్ని కర్మలు చేసినా ఎటువంటి శుభఫలితాలూ

రావు." స్త్రీని గౌరవించడం మన సంప్రదాయం. ప్రతి స్త్రీ రూపంలో వంశాభివృద్ధినీ, శుభాలనూ ఇస్తున్న,

ఆ  రామా కు వందనం. 

ఓం శ్రీ రామాయై నమః 


320. రమణలంపటా

రమణుడంటే పతి, మగడు. లంపటము అంటే విషయాసక్తి, విషయలోలత్వం. 

మగని యందు మాత్రమే ఆసక్తి, ప్రీతి, ఇష్టము కలది రమణలంపటా. 

రమణునితోనే క్రీడించేది రమణలంపట. రమణుడిపైనే ఆసక్తి గల స్త్రీ స్వరూపమే రమణలంపట. 

కామేశ్వరి రమణి, కామేశ్వరుడు రమణుడు. ఈ ఇద్దరి క్రీడే లంపటము. 

ఈ దేవిని ధ్యానించిన వారు అమ్మను తప్ప మరొక లంపటమును ఇష్టపడరు. 

వారి ఆసక్తి కేవలమూ ఆ లలితా పరమేశ్వరి పైనే లగ్నమవుతుంది.

రామా తత్వముతో రమణుడితో రమించి సకల సృష్టినీ నిర్వహిస్తున్న, 

ఆ రమణలంపట కు వందనం. 

ఓం శ్రీ రమణలంపటాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి