20, అక్టోబర్ 2021, బుధవారం

89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా

 

శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా 
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥

409. శివప్రియా

శివుని ప్రియురాలు శివప్రియా. శివునికి ఇష్టురాలు. శివుని ప్రేమించునది. 

శివ ప్రేమను పొందునది శివప్రియా. శివుడే శక్తి, శక్తే శివుడు అన్నాం కదా. 

తనను తానే ప్రేమించుకొనునది. ఆత్మను ప్రేమించునది అని అర్ధం. 

తనయొక్క శివరూపమును ప్రేమించేది శక్తి అయితే, తన యొక్క శక్తి రూపాన్ని ప్రేమించేవాడు 

శివుడు. శివుడు శక్తి అభేదం కనుక శివుడూ ఆమే, శివప్రియా ఆమే. 

శివ శక్తులిద్దరూ సమానులు. అర్ధనారీశ్వర స్వరూపం. 

శివునిచే ప్రేమించబడే, ఆ శివప్రియ కు వందనం. 

ఓం శ్రీ శివప్రియాయై నమః  


410. శివపరా   

శివుడిని పరా గా కలిగినది. శివుని పరమైనది. శివుని కంటే పరమైనది. 

శివునికి పరతత్వాన్ని బోధించునది శివపరా. ఉత్కృష్టమైన శివతత్వాన్ని పరతత్వంగా కలిగినది. 

శివుడు శక్తికి అధీనుడు. శివుడు తన పరమైనాడు కనుక శివపరా. 

ఈ ఇద్దరూ ఒకరికొకరు పర తత్వము. ఆ పరాన్ని గూర్చే ఇద్దరూ ఎప్పుడూ ధ్యానంలో ఉంటారు. 

ధ్యానంలో ఒకరికి ఒకరు పరతత్వాన్ని బోధించుకుంటూ వుంటారు. 

శక్తి లేనిదే శివుడు ఈ సృష్టి కార్యమును చెయ్యలేడని సౌందర్యలహరిలో ఆది శంకరుడు చెప్తాడు. 

శివునికి పరతత్వమైన, ఆ శివపరా కు వందనం.  

ఓం శ్రీ శివపరాయై నమః  


411.  శిష్టేష్టా

శిష్టులంటే ఇష్టము కలది శిష్టేష్టా. శిష్టులంటే, ధర్మపరాయణులు. 

వేదవిహిత కర్మలు ఆచరించే వారు. వేదాధ్యయన పరులను ఇష్టపడునది శిష్టేష్టా. 

శిష్టులకు రక్షణ, దుష్టులకు శిక్షణ ఇచ్చే జగదీశ్వరి ఈ శిష్టేష్టా. 

శిష్టాచారములను ఇష్టపడునది శిష్టేష్టా. ఆచారము నుంచి ధర్మము వచ్చింది, ఆ ధర్మమునకు  

ప్రభువు అచ్యుతుడు, చ్యుతి లేని, అనగా నాశము లేనివాడు అని బృహన్నారదీయంలో చెప్పారు. 

విష్ణుసహస్రనామస్తోత్రంలో కూడా చెప్తారు, "ఆచారప్రభవోధర్మో, ధర్మస్య ప్రభురచ్యుతః", అని. 

శిష్టా చారములను పాటించేవారిని అమ్మ ఇష్టపడుతుంది, అనుగ్రహిస్తుంది. 

విహిత కర్మలను ఈశ్వరపరంగా చేసే శిష్టులను ఇష్టపడే తల్లి శిష్టేష్టా. 

ధర్మ పరాయణులైన శిష్టులను ఇష్టపడే, ఆ శిష్టేష్ట కు వందనం. 

ఓం శ్రీ శిష్టేష్టాయై నమః  


412. శిష్టపూజితా

శిష్టుల చేత పూజింపడే తల్లి శిష్టపూజితా. వేదాలను ఉపాసించడమంటే, అమ్మను పూజించడమే. 

సదాచార సంపన్నులైన వారిచే పూజలందుకునే దేవత శిష్టపూజితా. 

శిష్టులంటే ఎవరో ముందు నామంలో చెప్పుకున్నాం. అట్టి సదాచార పరులని, 

ధర్మ పరాయణులని అమ్మ ఇష్ట పడుతుంది. వారు చేసే పూజలు ఇష్టంగా స్వీకరిస్తుంది. 

అనాచారపరులు, వేద శాస్త్ర ప్రకారము కర్మలు చేయని వారు చేసే పూజలు స్వీకరింపబడవు. 

అందుకే కొందరి పూజలు ఫలించినట్టూ, కొందరి పూజలు ఫలించనట్టూ కనబడుతుంది. 

పూజలు ఫలించలేదని భావించే వారు, ఎక్కడ ధర్మాన్ని తప్పారో గ్రహించుకుని, 

ఆ దోషాన్ని సరిదిద్దుకుని, ధర్మపథంలో మారిన వారిని కరుణిస్తుంది పరమేశ్వరి. 

శిష్టుల చేత పూజింపబడి, వారిని అనుగ్రహించే, ఆ శిష్టపూజిత కు వందనం. 

ఓం శ్రీ శిష్టపూజితాయై నమః 

  

413. అప్రమేయా

అప్రమేయా అంటే ఊహింపలేనంత శక్తీ, సామర్ధ్యము కలిగినది. 

ఏ విషయం లోనూ ఒక పరిమితికి లోబడనిది అప్రమేయా. తెలియబడని మహా స్వరూపము. 

ప్రమేయము అంటే, పరిమాణము. అప్రమేయా అంటే, పరిమాణము లేనిది. 

ఏ ప్రమాణముతోనూ కొలవలేంత పరిమాణమూ, శక్తీ కలది అప్రమేయా. 

అమ్మ సత్య స్వరూపము, జ్ఞానస్వరూపము, ఇవి రెండూ అనంతము. 

"సత్యజ్ఞానమనంతం బ్రహ్మ" అన్నారు కదా. ఈ బ్రహ్మ పదార్ధము అనంతము. 

ఎవరికీ అంతు చిక్కనిది. సృష్టి కన్నా గొప్పది, సృష్టికి పరమైన శక్తి కనుక, పరమేశ్వరి అప్రమేయా. 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు మాత్రమే తెలియబడినది అప్రమేయా.

నీటిలో పుట్టిన నారాయణి కనుక, అమ్మ జలరూపిణి. నీటిలో మాత్రము తెలియబడేది అప్రమేయా.

అనంతమై, అపరిమితమైన, ఆ అప్రమేయ కు వందనం. 

ఓం శ్రీ అప్రమేయాయై నమః 


414. స్వప్రకాశా 

స్వప్రకాశా అంటే స్వయంగా ప్రకాశించేది అని అర్ధం. స్వయం ప్రకాశము అంటే తనంతట తానే  

ప్రకాశము కలిగి దానిని వెదజల్లునది. స్వయంగా ప్రకాశించేది ఒక్క జ్యోతి స్వరూపమయిన ఆత్మే. 

ఆత్మే అన్నింటా జ్యోతి వలె వెలుగుతూ ఉంటుంది. ఆ ఆత్మ స్వరూపమే శ్రీదేవి. 

మొత్తం జగత్తులో అఖండ జ్యోతి వలె వెలిగేది ఒక్క ఆత్మ మాత్రమే. 

అందరికీ ప్రకాశము అందుతున్నది ఆత్మ నుంచే. సూర్యుడికి, చంద్రుడికి, అగ్నికి, తారలకు ఆ 

ప్రకాశానిచ్చేది జగన్మాత. ఆత్మ రూపములో అన్నింటా నిండి వున్నది చైతన్యము. 

ఈ సకల భువనాలన్నీ కేవలము చైతన్యం వలననే ఈ విధంగా నడుస్తూ వున్నాయి.  

ఆ చైతన్యానికి అసలైన మూలప్రకృతి లలితాపరమేశ్వరి. తాను స్వయంగా ప్రకాశము కలిగి, 

ఈ సృష్టి నంతా చైతన్యము రూపములో జ్యోతిర్మయం చేసేది ఆ జగజ్జననే. 

అజ్ఞానము, అవిద్య వలన మాయ కమ్మి, ఈ విషయమును తెలుసుకొన లేకపోయినా,

ఆ జ్యోతి మాత్రం శ్రీదేవిదే. 

తన ప్రకాశంతో అందరినీ నడిపిస్తున్న, ఆ స్వప్రకాశ కు వందనం. 

ఓం శ్రీ స్వప్రకాశాయై నమః 


415. మనోవాచామగోచరా

మనోవాచాం అగోచరా అని పద విభజన చేసుకోవాలి. మనస్సుకు, వాక్కుకు గోచరించనిది. 

అవాజ్ఞ్మానసగోచరమైనది శ్రీలలిత. వాక్కుకి, మనస్సుకి పట్టుబడనిది అని అర్ధం. 

అమ్మ తత్వము ఎవరికీ, దేనికీ అందనిది, అంతు పట్టనిది. 

తెలిసినవారు మరి తిరిగి ఎవరితోనూ ఆ అనుభవాన్ని పంచుకోలేనిది. 

ఆ జగదీశ్వరి అనుగ్రహము ఉంటే తప్ప ఏదీ తెలియబడనిది. 

శ్రీవిద్య ద్వారా మాత్రమే అర్ధమయేది.  ఇంద్రియాలకు అందనిది. 

అపరిపక్వమగు మనసుకు, వాక్కుకు అందనిది అని వేదం చెప్పింది. 

అమ్మ సృష్ట్యాది నుంచీ వున్నది. అందరూ ఆ తల్లి చేత, ఆ తరువాత సృష్టింపబడిన వారే. 

ముందర పుట్టినవారికి, తరువాత పుట్టినవారి గురించి తెలుస్తుంది కానీ, 

తరువాత పుట్టినవారికి, ముందు పుట్టినవారి గురించి పూర్తిగా తెలియదు కదా. 

అందుకే సృష్ట్యాది నుంచీ వున్న ఆ సనాతని గురించి ఎవరికీ పరిపూర్ణముగా తెలియదు. 

ఒక్కో ఉపాసకుడికి ఒక్కో పార్శ్వము తెలిసి, దానితోనే,  తన్మయత్వము పొంది  ఆనందిస్తాడు. 

ఎవరికి ఎంతవరకు గోచరమవాలో నిర్ణయించేది ఆ లలితా పరమేశ్వరియే. 

మనసుకు, వాక్కుకు అందని మహాశక్తి, ఆ మనోవాచామగోచర కు వందనం. 

ఓం శ్రీ మనోవాచామగోచరాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి