22, అక్టోబర్ 2021, శుక్రవారం

91. తత్త్వాసనా, తత్, త్వం, అయీ, పంచకోశాంతరస్థితా నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ

 

తత్త్వాసనా, తత్, త్వం, అయీ, పంచకోశాంతరస్థితా 
నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥

424. తత్త్వాసనా

మొత్తం ముప్ఫయి ఆరు తత్వములు కలిసి దేహం ఏర్పడింది. వ్యాసుడు, ఆదిశంకరుడు, 

కాళిదాసు, విద్యారణ్యుడు, భాస్కరరాయలు వరకూ అందరూ చెప్పినది ఇదే. 

పృధ్వీ తత్వము నుంచి, శివ తత్వము వరకూ కల ముప్ఫయి అయిదు తత్వములూ 

ముప్ఫయి ఆరవదైన ఈశ్వరతత్వములో చేరటమే అద్వైత వేదాంత ఉపాసనా మార్గము. 

ఆ తత్వములు మూలప్రకృతి---1, మహదహంకారాలు---2, తన్మాత్రలు---5, భూతములు---5, 

జ్ఞానేంద్రియములు---5, కర్మేంద్రియాలు---5, ప్రాణాలు---5, ఉపప్రాణాలు---5, మనస్సు---1,

జీవుడు---1, ఈశ్వరుడు---1, మొత్తం ముప్పదియారు. 

ఈ ముప్ఫయి ఆరు తత్వాలనే యోగపీఠంగా కలది మహేశ్వరి. ఆ తత్వాసనమే సహస్రారపీఠం. 

ఆ పీఠంపై ఈశ్వరునితో కూడి అధిరోహించి, మోక్షమునిచ్చేది లలితాంబ. 

తత్వములే ఆసనంగా చేసుకుని, ఆ తత్వాలను తనలో లయింపచేసుకుంటున్న, 

 తత్త్వాసన కు వందనం. 

ఓం శ్రీ తత్త్వాసనాయై నమః  


425. తత్ 

తత్ అంటే బుద్ధి ప్రేరణా శక్తి. తత్ అంటే భగవత్ తత్వము. తత్ అంటే స్వయముగా ఆ శ్రీలలిత. 

తత్ అంటే 'అది' అని అర్ధం. అది అంటే ఏది, అనే ప్రశ్న వస్తే, ఎవరేదనుకుంటే అదే. 

విష్ణుసహస్రనామ స్తోత్రంలో కూడా యత్ తత్ అనే చెప్పబడింది. అంటే ఈ తత్ అనేది 

స్త్రీ, పుం లింగాలు రెండింటికీ వర్తిస్తుంది. నపుంసకలింగానికి కూడా వర్తిస్తుంది.  

అన్నమయ్య కూడా "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవూ... " అంటాడు.  

తత్ అనేది అదే. అమ్మ అనుకుంటే అమ్మ, అయ్య అనుకుంటే అయ్య. 

అందుకే ఈ ఏకాక్షర పదాన్ని బుద్ధి ప్రేరణా శక్తి అంటున్నాం. బుద్ధి ఏమి చెప్పితే అది. 

శక్తి అనగానే, అమ్మ అనే అర్ధం ఏర్పడింది. 

కనుక తత్ అంటే అమ్మ. తత్ అంటే, శ్రీలలిత అని చెప్పుకుంటున్నాం. 

తస్మై నమః అని తలచుకునే, ఆ తత్ అనే తత్వమైన, ఆ తత్ కు వందనం.  

ఓం శ్రీ తస్మై నమః  


426. త్వం 

త్వం అంటే నీవు. ఈ 'నీవు' ఎవరూ, అంటే ఆ క్షణం ఎవరు ఎదురుగా ఉంటే వారు.  

అది చైతన్యమైనా, జడమైనా, అమ్మైనా, బొమ్మైనా. తత్ వలెనే, త్వం అనేది కూడా 

స్త్రీ, పుం లింగాలు రెండింటికీ వర్తిస్తుంది. నపుంసకలింగానికి కూడా వర్తిస్తుంది. 

ఎదుటి వారు, లేదా వస్తువు, ఏదైనా, దానిలో భగవత్ శక్తిని చూడమని ఈ నామం చెప్తోంది. 

త్యాగరాజు 'నీ దయ రాదా.... ', అన్నా, అన్నమయ్య 'నీవు దేవుడవు, నేనొక జీవుడ.... ' అన్నా, 

అన్నీ ఆ నువ్వు అనేది ఈ తత్వం గురించే. ఆ 'నువ్వు' తత్వం, ఎవరు ఎంత భావిస్తే, అంత. 

అన్నిచోట్లా, నువ్వు అనే రూపంలో ఎదురు పడే ఆ త్వం అనేదే భగవత్ తత్వం. 

ఎదురైన ప్రతి పదార్ధము లోనూ దర్శనమిచ్చే, ఆ త్వం కు వందనం. 

ఓం శ్రీ తుభ్యం నమః  


427. అయీ 

అయ అంటే అయ్య, అయీ అంటే అమ్మ. ఈ అయీ అందరికీ అమ్మ. జగన్మాత, శ్రీమాత. 

అందరిలోనూ అమ్మనూ, అయ్యనూ చూడగలగటమే ఈ అయీ నామార్ధం. 

ఈనాటికీ కొన్ని ప్రాంతాల్లో తల్లిని 'ఆయీ' అంటున్నారు. ఆయీ అన్నా, అయీ అన్నా, అమ్మే. 

ఆదిశంకరుడు స్తుతించిన, "అయి గిరి నందిని...." అంటూ మొదలయ్యే మహిషాసురమర్దిని 

స్తోత్రంలో, ఆ 'అయి' ఈ  శ్రీమాతే. అన్నింటా తల్లిని దర్శించమని చెప్పే తత్వమే అయీ. 

ఆ అయి విశ్వగర్భ, స్వర్ణగర్భ. మన సనాతన ధర్మంలో భోజనం చేస్తున్నప్పుడు, భోజనం 

పెట్టేటప్పుడు భార్య అయినా సరే, తల్లి వలె చూడాలని "భోజ్యేషు మాతా" అని చెప్పారు. 

మాతృభావన ఎంత గొప్పదో తెలియచెప్పే, ఆ అయీ కి వందనం. 

ఓం శ్రీ అయ్యై నమః 

  

428. పంచకోశాంతరస్థితా

తైత్తిరీయోపనిషత్తులో అయిదు అంతస్థులలో వుండే పంచకోశముల గురించి విశదంగా చెప్పారు. 

అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలనేవి దేహంలో వుండే 

అయిదు కోశాలు. జ్ఞానార్ణవంలో శ్రీవిద్య, పరంజ్యోతి, పరా, నిష్కళశాంభవి, అజపామాతృక అనేవి 

పంచకోశ దేవతలు అని చెప్పారు. ఈ అయిదుగురు దేవతలూ  శ్రీచక్రంలో వుంటారు.   

శ్రీచక్రంలో శ్రీవిద్య మధ్యలో వుండి, మిగిలిన నలుగురు దేవతలూ నాలుగువైపులా వుంటారు. 

అన్నమే పరబ్రహ్మ స్వరూపము అని అన్నమయ కోశస్థితి లోనూ, ప్రాణమే పరబ్రహ్మమని 

ప్రాణమయ  కోశస్థితి లోనూ, మనస్సే పరబ్రహ్మ స్వరూపము అని మనోమయ కోశస్థితి లోనూ,

విజ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము అని విజ్ఞానమయ కోశస్థితి లోనూ, అనిపిస్తూ ఉంటుంది. 

కానీ వీటి అన్నింటికన్నా ఉన్నతమైన స్థితి, ఆనందమే పరబ్రహ్మ స్వరూపము అని తెలిపే  

ఆనందమయ కోశస్థితి. అన్నమయ కోశంలో ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశంలో మనోమయ 

కోశం, మనోమయ కోశంలో విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశంలో ఆనందమయ కోశం ఇమిడి

వున్నాయి. ఈ విధంగా అంతరాంతరాలలో దాగి వున్న కోశం ఆనందమయ కోశం. 

బైట వున్న కోశాలు తృప్తి చెందితేనే, లోపల వున్న కోశాలు సంతృప్తి చెందుతాయి. 

అత్యున్నత స్థితి, ఆనందమయ కోశం తెరుచుకుని ఆనందం కలగటమే. మళ్ళీ ఆ ఆనందం 

లోనూ వివిధ దశలున్నాయి. వాటి గురించి తరువాత వచ్చే నామాలలో చెప్పుకుందాం. 

ఈ విధంగా పంచకోశాలూ ఒకదానిలో ఒకటి, లేదా ఒకదానిపై ఒకటిగా అమరివున్నాయి. 

ఈ అయిదు కోశాల మధ్యలో వున్న ఆ లలితాత్రిపురసుందరీదేవియే పంచకోశాంతరస్థితా. 

పంచ కోశాలలో వుండి, అన్నమూ, ప్రాణమూ, మనస్సు లను తృప్తి పరుస్తూ, 

విజ్ఞానము, ఆనందము ను కలుగచేసే, ఆ పంచకోశాంతరస్థిత కు వందనం. 

ఓం శ్రీ పంచకోశాంతరస్థితాయై నమః 


429. నిస్సీమమహిమా 

ఈ నామంలో అమ్మవారిని హద్దులు లేని మహిమ కలది అని చెప్పుకుంటున్నాం. 

అష్ట సిద్ధులూ అమ్మ ఆధీనంలోనే ఉంటాయి. ఆ సిద్ధుల లోనిదే మహిమా సిద్ధి. 

శ్రీచక్ర ప్రథమావరణ దేవతలలో ఒకటి ఈ మహిమాసిద్ధి. ఎల్లలు లేని, అవధులు తెలియబడని 

మహిమ ఆ పరమేశ్వరిది. చిన్న చిన్న వాటికే అందరూ, నా శక్తి ఇంత గొప్పది, నా బలం అంత 

గొప్పది, నా పేరు ప్రతిష్టల ముందు ఎవరూ దేనికీ నిలవలేరు అని చెప్పుకుంటూ వుంటారు. 

మరి ఇవన్నీ సృష్టించిన ఆ మహామహాశక్తి, లలితాపరమేశ్వరి శక్తి, బలం, మహిమ మరెంత పెద్దది. 

ఊహించటానికే సాధ్యం కాదు. అందుకే ఈ నామంలో ఆ తల్లిని నిస్సీమమహిమా అంటున్నాం. 

అవధులే లేని, పరిమితులే లేని, అనంతమైన, ఊహింప శక్యము కానంత పరిధిలో 

తన మహిమను చూపుతున్న, ఆ నిస్సీమమహిమ కు వందనం. 

ఓం శ్రీ నిఃసీమమహిమ్నే నమః 


430. నిత్యయౌవనా 

శ్రీలలిత, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దక్షిణామూర్తి వీరు ఎప్పుడూ యవ్వనం లోనే ఉన్నట్టు 

కనబడతారని చెప్పుకున్నాం. వీరు ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితిలోనూ యవ్వన రూపంలోనే 

దర్శనమిస్తారు. అమ్మ నిత్యాషోడశికారూపా కనుక, ఎప్పుడూ పదహారేళ్ళ ప్రాయంలోనే ఉంటుంది. 

త్రికాలములంటే, బాల్య, యవ్వన, వార్ధక్య దశలు. ఆ కాలాలను ఏర్పరిచింది ఈ షోడశి కనుక, 

అమ్మ ఈ త్రికాలములకూ అతీతము. అమ్మ యొక్క ఈ నిత్య యవ్వన రూపాన్ని చూసి 

ముగ్ధులవుతూ వుంటారు ఉపాసకులు, దేవతలు, త్రిమూర్తులు కూడా. 

అందరినీ ఆకర్షిస్తూ, సదా పదహారేళ్ళ బాలికా రూపంలో వుండే, ఆ నిత్యయౌవన కు వందనం. 

ఓం శ్రీ నిత్యయౌవనాయై నమః 


431. మదశాలినీ

మదము అంటే ఆనందము, శాలినీ అంటే ఇల్లాలు అనే అర్ధాలున్నాయి. 

ఆనందముతో శోభించే ఇల్లాలే మదశాలినీ. ఈ నామంలో ఆ కామేశ్వరుని ఇల్లాలు 

కామేశ్వరిని, మదశాలినీ అంటున్నాం. 

ఏ ఇంట ఇల్లాలు ఆనందముగా ఉంటుందో, ఆ ఇంట్లో ఆ రూపంలో లలితాపరమేశ్వరి 

నివసిస్తున్నట్టే. అందుకే "యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః", అని మనుస్మృతి

చెప్తుంది. ఇల్లాలిని ఆనందంగా ఉంచితే, ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి స్థిరముగా ఉంటుంది. 

ఈ నామంలో మదము అనేది అపరిమిత, అవధులు లేని ఆనందాన్ని సూచిస్తోంది. 

ప్రతి ఇంటా ఇల్లాలి రూపంలో, ఘనమైన పరమానందముతో తేజరిల్లే, ఆ మదశాలిని కి వందనం. 

ఓం శ్రీ మదశాలిన్యై నమః


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి