15, అక్టోబర్ 2021, శుక్రవారం

84. సద్యః ప్రసాదినీ, విశ్వసాక్షిణీ, సాక్షివర్జితా షడంగదేవతా యుక్తా, షాడ్గుణ్య పరిపూరితా

 

సద్యః ప్రసాదినీ, విశ్వసాక్షిణీ, సాక్షివర్జితా 
షడంగదేవతా యుక్తా, షాడ్గుణ్య పరిపూరితా ॥ 84 ॥

383. సద్యః ప్రసాదినీ 

సద్యః ప్రసాదినీ అంటే, అప్పటికప్పుడే ఫలితాన్నిచ్చే పరమేశ్వరి అని అర్ధం. 

ఆ శ్రీదేవికి చేసిన రహోయాగము, రహస్తర్పణము వెంటనే సద్యోఫలితాన్ని ఇస్తాయి. 

అందుకే ఈ నామంలో అమ్మను సద్యః ప్రసాదినీ అంటున్నాం. 

అంతర్యాగము కానీ, బహిర్యాగము కానీ, అమ్మను నమ్మి సమస్తమూ అర్పణ చేసిన వారిని 

ఆ శ్రీలలిత వెంటనే అనుగ్రహిస్తుంది. ఆ అనుగ్రహ ఫలితంగా కుండలిని లేచి సహస్రారాన్ని 

చేరుతుంది. సుధా వర్షంలో జీవుడు తడిసి ముద్దవుతాడు. జీవాత్మ పరమాత్మలో కలిసి 

బ్రహ్మానందం పొందుతాడు. అతడి లోని జ్యోతి నిరంతరం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ 

ఉంటుంది. అట్టి సాధకులకు అమ్మ సకల యోగాలూ, భోగాలూ, వైభవాలూ అనుగ్రహిస్తుంది. 

కానీ సాధకుడు ఈ స్థితికి చేరటానికి అమ్మ అనుగ్రహం తప్పక ఉండాలి. ఒక్క సాధన మాత్రమే 

జీవుడిని ఆ ఉన్నతస్థితికి తీసుకుపోలేదు, అని గ్రహించటం చాలా ముఖ్యం.  

ఉపాసనకు తృప్తి చెందిన వెంటనే ఫలితాన్నిస్తున్న, ఆ సద్యః ప్రసాదిని కి వందనం. 

ఓం శ్రీ సద్యః ప్రసాదిన్యై నమః  


384. విశ్వసాక్షిణీ  

విశ్వసాక్షిణీ అంటే, విశ్వమును సాక్షీభూతముగా చూచునది అని అర్ధం. 

అందరి లోపల, వెలుపల వుండి అన్నీ గమనించు ఆ శ్రీ లలిత విశ్వసాక్షిణీ. 

లోనుండి ఆత్మసాక్షి గానూ, వెలుపల వుండి సర్వసాక్షిగానూ వ్యవహరించే తల్లి విశ్వసాక్షిణీ. 

ఈ చరాచర జగత్తులో వున్న ఏ అంశమూ అమ్మకు తెలియకుండా జరుగదు. 

ఆరాధనను గమనించి సద్యోఫలితాన్నిచ్చే ఆ తల్లే, పాపపుణ్యాలను కూడా లెక్కిస్తోందని 

గ్రహించాలి. ఆ పరమేశ్వరి కృతజ్ఞ కనుక, ఫలితం ఇస్తూనే ఉంటుంది. 

కృతజ్ఞ అంటే చేసిన అన్ని కార్యముల జ్ఞానమూ కలిగినది. అందుకే అమ్మ విశ్వసాక్షిణీ. 

ఎవరు ఎంత సాధన, ఆరాధన చేసినా, అన్నీ గమనిస్తూ అర్హులకు ఆత్మజ్ఞానాన్నిచ్చే మహాసాక్షి. 

సమస్త విశ్వానికీ తానే సాక్షియై, భక్తులను గమనిస్తున్న, ఆ విశ్వసాక్షిణి కి వందనం.  

ఓం శ్రీ విశ్వసాక్షిణ్యై నమః  


385. సాక్షివర్జితా  

అందరినీ గమనించటానికి, అమ్మ సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలము, 

పంచభూతములనే తొమ్మిదిమందిని నియమించింది కదా. అందరి కర్మలనూ 

ఈ తొమ్మిదిమందీ గమనిస్తుంటే, వీరికన్నా పైనుండి వీరిని కూడా గమనించేది ఆ శ్రీలలిత. 

ఆ శ్రీలలితతో సమానమయినవారు కానీ, ఆమె కన్నా అధికులు కానీ ఎవరూ లేరు. 

ఆ శ్రీలలితకు సాక్షులు లేరు. ఆ తల్లి సాక్షులని వర్జించింది, అంటే త్యజించింది. 

అందువలన ఆ లలితాదేవిని సాక్షివర్జితా అంటున్నాం. 

తాను సర్వసాక్షి అయి, తనకెవరూ సాక్షిగా లేని, ఆ సాక్షివర్జిత కు వందనం. 

ఓం శ్రీ సాక్షివర్జితాయై నమః  


386. షడంగదేవతా యుక్తా

శ్రీదేవి షడంగ దేవతలతో కూడి వున్న పరదేవత అని ఈ నామార్దం. 

ఖడ్గమాలా స్తోత్రంలో ఈ షడంగదేవతల పేర్లు కనిపిస్తాయి. వీరే న్యాస దేవతలు. 

హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, ఈ ఆరుగురూ షడంగదేవతలు. 

ఈ  ఆరుగురూ అమ్మవారి అంగరక్షకులు. ఉపాసకులకు కూడా వీరే అంగరక్షకులు. 

అందుకే, ఉపాసకులు ఆయా అంగములను తాకుతూ అంగన్యాసము చేసి 

ఆ అంగమునకు మంత్ర రక్ష కల్పించి జపం మొదలుపెడతారు. 

పరమేశ్వర పరమేశ్వరులకు ఆరు లక్షణాలున్నాయి. అవే సర్వజ్ఞత, తృప్తి, అనాదిబోధ,

స్వతంత్రత, అలుప్తత, అనంతత. ఈ ఆరూ షడంగదేవతల లక్షణములు. 

వేదాంగములు ఆరు. అవి శిక్ష, కల్పము, జ్యోతిష్యము, నిరుక్తము, ఛందస్సు, వ్యాకరణము.

లలితాదేవి వేదజనని, వేదాంగములైన ఈ ఆరూ అమ్మకు అంగములు. 

అమ్మ ఎప్పుడూ ఈ ఆరుగురు దేవతలతో కూడి ఉంటుంది కనుక, ఆ తల్లి షడంగదేవతాయుక్తా. 

ఆరుగురు అంగరక్షకులైన పరివార దేవతలు కలిగిన, ఆ షడంగదేవతాయుక్త కు వందనం. 

ఓం శ్రీ షడంగదేవతాయుక్తాయై నమః 

  

387. షాడ్గుణ్య పరిపూరితా 

కామందకుడు తన అర్ధశాస్త్రములో రాజనీతిని గురించి చెప్తూ రాజుకు ఉండవలసిన 

ఆరు గుణాలను చెప్పాడు. అవి సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైదీభావము,

సమాశ్రయము. శ్రీదేవి ఈ ఆరు గుణములనూ కలిగి పరిపూర్ణమైనది. 

ఈ షడ్గుణములతోనే ఆ జగదీశ్వరి ఈ భువనాలనన్నింటినీ పరిపాలిస్తోంది.   

అన్ని పురాణములలో భగవంతునికి వుండే ఆరు లక్షణములను చెప్తారు.

అవి ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము. వీటికి భగమని పేరు. 

ఈ షడ్గుణములూ కలవాడు భగవంతుడు. ఈ ఆరు గుణములనూ కలది శ్రీలలిత. 

అందుకే భగమును కల ఆ తల్లిని భగవతీ అంటున్నాం. 

రాజుకూ, భగవంతుడికీ, ఉండవలసిన ఆరు గుణములతో పదునాలుగు భువనాలనూ 

పరిపాలిస్తూ, భక్తులను అనుగ్రహిస్తున్న, ఆ షాడ్గుణ్యపరిపూరిత కు వందనం. 

ఓం శ్రీ షాడ్గుణ్యపరిపూరితాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

2 కామెంట్‌లు: