28, అక్టోబర్ 2021, గురువారం

97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోవస్థా వివర్జితా సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ

 

వజ్రేశ్వరీ, వామదేవీ, వయోవస్థా వివర్జితా 
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥

468. వజ్రేశ్వరీ 

షష్టీ తిథి నిత్యాదేవి పేరు మహావజ్రేశ్వరి. జాలంధర పీఠాధిష్టాన దేవత వజ్రేశ్వరి. 

మణిద్వీపములో వున్న శ్రీపురంలో అనేక రత్నమయ ప్రాకారాలున్నాయి. 

వాటిల్లో పదకొండవది వైడూర్యములచే నిర్మింపబడిన వైడూర్యమయ ప్రాకారము. 

పన్నెండవ ప్రాకారము పూర్తిగా వజ్రములతో నిర్మింపబడింది. వజ్రమయము. 

ఈ రెండు ప్రాకారముల మధ్యా వజ్ర అనే నది వుంది. ఈ వజ్రను దాటటం ఒక సిద్ధి. 

ఆంజనేయుడికి కల సిద్ధులలో వజ్రసిద్ధి కూడా ఒకటి. ఆతని దేహమే ఒక వజ్ర కవచం. 

అందుకే ఆంజనేయుడికి వజ్రాంగ బలీ,  బజరంగ బలీ అనే నామం వచ్చింది. 

ఆ వజ్రానదిలో రాజహంసలు తిరుగాడుతూ ఉంటాయి. వజ్రేశ్వరి ఆ వజ్రానదికి అధీశ్వరి. 

ఆ నది ఒడ్డునే వజ్రాభరణములను ధరించి వజ్రేశీ నామముతో వున్న దేవియే వజ్రేశ్వరి. 

ఈ దేవియే ఇంద్రునికి వజ్రాయుధము ఇచ్చింది అని బ్రహ్మాండపురాణంలో వున్నది. 

నేటికీ హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా వాలీలో వున్న దేవత పేరు వజ్రేశ్వరీ. 

యాభైఒక్క శక్తిపీఠాల్లో ఇదీ ఒకటి. అక్కడ సతీదేవి ఎడమ వక్షోజము పడినదని చెప్తారు. 

జలంధరుని సంహరించిన ప్రదేశము కనుక, ఈ ప్రాంతానికి జాలంధరపీఠము అని కూడా పేరు.  

జాలంధర పీఠాధి దేవత, వజ్రమయ ప్రాకారాధీశ్వరి, ఆ వజ్రేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ వజ్రేశ్వర్యై నమః  


469. వామదేవీ 

వామదేవుడని శివుడికి పేరు. ఆ వామదేవుడి పత్నిగా అమ్మవారికి వామదేవీ అనే నామం వచ్చింది. 

శివ పంచానన స్తోత్రంలో శివుడికి సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అనే 

అయిదు పేర్లు ఉన్నాయని చెప్పారు. వాటిలో వామదేవుడు జలతత్వంతో, ఉత్తరముఖంలో 

ఉంటూ స్థితి కార్యమును చేస్తూ ఉంటాడు. ఆ వామదేవుని పత్ని వామదేవీ. 

పరమశివుని వామ భాగంలో ప్రకాశించే దేవి వామదేవీ. వామదేవి అంటే అందమైనది అని అర్ధం.

వామదేవుడంటే అందరి చేతా నమస్కరింపదగినవాడు అని అర్ధం. 

కర్మఫలములను ఇచ్చునది వామదేవి. వామాచారంలో చేసే పూజలను స్వీకరించు దేవి. 

కాళికా పురాణంలో వామాచారపరులకు కూడా వామ శబ్దం వర్తిస్తుందని చెప్పారు. 

వామాచారము నందు ఆసక్తి కలవారు వాములు. 

దేవీపురాణంలో "విరుద్ధమైన దానిని, విపరీతమైన దానిని వామాచారము" అని చెప్పారు. 

వామాచారులచే పూజలందుకొని, వారికి సుఖములు ఇచ్చు, ఆ వామదేవి కి వందనం.  

ఓం శ్రీ వామదేవ్యై నమః  


470. వయోవస్థావివర్జితా

వయోవస్థలు అంటే బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య అవస్థలు. 

శ్రీ మాత సర్వకాల సర్వావస్థ లందు వుండు జగన్మాత కనుక, ఆ తల్లి సనాతని. 

శ్రీలలిత నిత్యాషోడశికారూపా, కనుక, ఎప్పుడూ పదహారేళ్ళ ప్రాయంలో వుంటుంది. 

శుద్ధ జ్ఞాన స్వరూపము కనుక, అమ్మ ఎప్పుడూ చైతన్య స్వరూపమే

ప్రళయకాలము లోనూ వుండు నిత్యముక్త కనుక, అమ్మ ప్రజ్ఞ ఎప్పుడూ తగ్గదు. 

ప్రజ్ఞతో ప్రకాశించు మహా చైతన్యము కనుక, ఆ తల్లి వయోవస్థావివర్జితా. 

సదా పదహారేళ్ళ ప్రాయముతో తేజరిల్లే, ఆ వయోవస్థావివర్జిత కు వందనం. 

ఓం శ్రీ వయోవస్థావివర్జితాయై నమః  


471. సిద్ధేశ్వరీ

సిద్ధులకు ఈశ్వరి కనుక, అమ్మవారిని సిద్ధేశ్వరీ అని ఈ నామంలో అంటున్నాం. 

గోరఖ్ నాథ్ అని పిలువబడే గోరక్షనాథుని వంటి సిద్ధులకు ఆరాధ్యదేవత, కనుక సిద్ధేశ్వరీ. 

గోసేవ చేసేవారిచే పూజింపబడే దేవత సిద్ధేశ్వరీ. మంత్ర సిద్ధిని కలిగించేది సిద్ధేశ్వరీ. 

కాశీలో సిద్ధేశ్వరీ అనే దేవత వున్నది. సిద్ధులకు అధీశ్వరి సిద్ధేశ్వరీ. 

శ్రీచక్ర ప్రథమావరణంలో వున్న అణిమాది అష్టసిద్ధులకు అధీశ్వరి ఈ మాతే. 

సరియైన నియమాలు పాటిస్తూ మంత్రమో, తంత్రమో చేస్తే, ఫలిస్తుంది కనుక సిద్ధి వస్తుంది.

సిద్ధి ముందు ఫలించినట్టు కనిపించినా, అవసరమైనప్పుడు పనికి రాక పోవడం కూడా 

కొందరి పట్ల జరుగుతుంది. కానీ యోగము లేకపోతే సిద్ధి పొందినప్పటికీ ఆ సిద్ధి ఉపయోగపడదు. 

అసురులకు, దుష్టులకు దొరికిన సిద్ధులన్నీ అటువంటివే. 

అబద్ధము చెప్పి విద్య పొందినందు వలన కర్ణుడు వంటి దానశీలికి కూడా మంత్రము 

సమయానికి పని చెయ్యలేదు. అర్జునునికి కూడా మంత్రాలన్నీ శ్రీకృష్ణుడు పక్కన 

ఉన్నంత వరకే పనిచేసాయి. మంత్రాలన్నీ నారాయణుడి అధీనం కదా. 

తమిళనాడులో వున్న కుర్తాలంలో సిద్ధేశ్వరీ పీఠం వుంది. ఆ పీఠాధీశ్వరి సిద్ధేశ్వరీ. 

సిద్ధులన్నీ సాధించిన, సిద్ధులకు మాత్రమే ఆ పీఠాన్ని అధిష్టించే అర్హత ఉంటుంది. 

సిద్ధుల చేత ఉపాసింపబడే దేవత, ఆ సిద్ధేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ సిద్ధేశ్వర్యై నమః 

  

472. సిద్ధవిద్యా

సిద్ధిని కలిగించే మంత్రరూపిణి. సిద్ధిని ఇచ్చే విద్యా స్వరూపిణి, శ్రీవిద్యా స్వరూపిణి, ఆ శ్రీ మాత. 

అందుకే ఈ నామంలో ఆ లలితాపరమేశ్వరిని సిద్ధవిద్యా అంటున్నాం. 

నిత్యా మంత్రాలన్నీ సిద్ధ మంత్రాలే. సిద్ధిని కలిగించు మంత్రాలకు సిద్ధవిద్యలని పేరు. 

పంచదశీ విద్య కూడా సిద్ధవిద్యయే. కనుక పంచదశీ మంత్రము కూడా సిద్ధమంత్రమే. 

ఏదైనా మంత్రం ఉపాసన చేయవచ్చునా లేదా అనేది సిద్దారి చక్ర శోధన చేసి తెలుసుకుంటారు.

ఫలితాన్ని బట్టీ వారికి ఆ మంత్రం మేలు చేస్తుందా, కీడు చేస్తుందా, తటస్థమా అని చెప్తారు.  

పంచదశీ మంత్రం సిద్ధవిద్య కనుక, ఆ మంత్రం తీసుకునే ముందు సిద్దారి చక్ర శోధన 

చేయవలసిన అవసరం లేదు. కానీ ఏమంత్రమైనా తప్పనిసరిగా గురుముఖతః తీసుకోవాలి. 

అప్పుడే అది మంత్రమౌతుంది. లేకపోతే కొన్ని అక్షరముల సముదాయమౌతుంది. 

మంత్ర దీక్ష తీసుకుని ఉపాసన చేయాలనుకునే ఉత్సాహపరులు ఈ విషయం గ్రహించాలి.  

నేడు చాలామంది రహస్యమైన లలితా సహస్రనామ పారాయణము చేస్తున్నారంటే, 

వారు పూర్వ జన్మలలో ఆ దీక్ష పొంది ఉంటారని అర్ధం చేసుకోవాలి. 

సిద్ధిని ఇచ్చే విద్యాధిదేవత అయిన, ఆ సిద్ధవిద్య కు వందనం. 

ఓం శ్రీ సిద్ధవిద్యాయై నమః 


473. సిద్ధమాతా 

సిద్ధులకు తల్లి. తల్లి వలె సిద్ధులను సంరక్షించునది అని అర్ధం. 

మంత్ర సిద్ధి పొందిన వారిని, కాపాడే మంత్రాధిదేవత శ్రీ లలిత. 

పుట్టుక నుంచే సిద్ధులైన వారు బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనత్సుజాత,

సనత్కుమారులు. వీరు బాల్యము నుండియే సిద్ధులు. కనుక వయోవస్థావివర్జితులు. 

నిత్యమూ బాలుర వలెనే వుంటారు. ఆనంద స్వరూపులు. బ్రహ్మానందాన్ని పొందిన సిద్ధులు.  

వీరే వైకుంఠ ద్వార పాలకులైన జయవిజయులకు జన్మలెత్తమని  శాపం పెట్టింది. 

సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా అనే ఈ మూడు నామాలలో ఆ లలితాపరమేశ్వరిని 

అష్టసిద్ధులకే కాక అన్ని సిద్ధులకూ ఈశ్వరి, సిద్ధవిద్య లన్నింటికీ అధిదేవత, 

ఉపాసన చేసే సిద్ధులందరికీ మాత అని కీర్తిస్తున్నాం. 

సిద్ధి పొందినవారికి, సిద్ధిని పొందగోరి ఉపాసన చేసేవారికీ  కూడా ఉపాస్యదేవత అయిన,

ఆ సిద్ధమాత కు వందనం. 

ఓం శ్రీ సిద్ధమాత్రే నమః 


474. యశస్వినీ 

యశస్సు అంటే కీర్తి. లలితాదేవిని ఈ నామంలో గొప్ప కీర్తి కలది అని ప్రస్తుతిస్తున్నాం. 

వేదములో భగవన్నామమే గొప్ప యశస్సు అని చెప్పారు. నామాన్ని చెప్పటమే కీర్తి అయితే, 

ఆ తల్లి యశస్వినీ కదా. మూర్ఖుడైన కాళిదాసుకు అమ్మ నామం చెప్పటం వలననే కదా, 

విద్యా సిద్ధి కలిగి, భోజుని ఆస్థానంలో స్థానం పొంది, నవరత్నాలలో ఒకడై, గొప్ప యశస్సు

సంపాదించాడు. కాళిదాసు అయ్యాడు.  

తెనాలి నుంచి వచ్చిన రామకృష్ణుడు, ఆ అమ్మ కృప వలననే కదా, ఆంధ్ర భోజుడని

పిలువబడే, శ్రీ కృష్ణ దేవరాయల వంటి గొప్ప రాజు వద్ద ఆశ్రయం పొంది,

అష్ట దిగ్గజాలలో ఒకడై, భువనవిజయంలో గొప్ప పేరు పొందాడు. 

ఆ సిద్ధేశ్వరి కరుణిస్తే, ఆ శుద్ధవిద్య సిద్ధిస్తే, ఆ సిద్ధమాత ఆశీర్వదిస్తే, యశస్వి అవటం తథ్యం. 

తనను ఉపాసించే వారికి కీర్తి ప్రతిష్టలు ప్రసాదిస్తున్న, ఆ యశస్విని కి వందనం. 

ఓం శ్రీ యశస్విన్యై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి