భక్తిమత్కల్పలతికా, పశుపాశ విమోచనీ
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥
353. భక్తిమత్కల్పలతికా
కల్పలతిక అంటే కోరికలను తీర్చే లత. భక్తిమంతులంటే భక్తి కలవారు.
భక్తి కలవారికి కోరికలు తీర్చు కల్పలత వంటిది అని అర్ధం.
భక్తిమత్కల్పులు అంటే, భక్తి అల్పంగా వున్నవారు. అట్టివారు తమ కోరికలు తీరక,
అసంతృప్తితో, అసంపూర్ణతతో వేదన చెందుతూ వుంటారు.
లతిక అంటే సువాసనలను ఎగజిమ్ముతూ, తీగవలె విశాలముగా విస్తరించునది.
ఓం శ్రీ భక్తిమత్కల్పలతికాయై నమః
354. పశుపాశ విమోచనీ
పశు అంటే చక్కగా, పాశ అంటే పాచికలు వేయునది, అంటే శివునితో వినోదంగా జూదము
ఆడునది అని అర్ధం. వారి ఆ జూద క్రీడ వలననే ఈ సమస్త విశ్వమూ నడుస్తోంది.
పశుపతి యందు పాశము కలవారికి శివప్రాప్తిని కలుగచేయునది అని ఇంకో భావం.
శివభక్తులను కటాక్షించి శివ సాయుజ్యమును ఇచ్చే తల్లి, ఈ పశుపాశవిమోచనీ.
పశువు అంటే అజ్ఞాని. అజ్ఞానిని ఉద్ధరించి, ఆ అజ్ఞాన పాశములు ద్రుంచి జ్ఞానము నిచ్చే తల్లి.
పాశమనే ఆశల చేత బంధింపబడినది పశువు. ఇక్కడ పశువు అంటే, జీవుడు.
జీవుడు ఆశ అనే పాశము చేత బంధితుడయి ఎప్పుడూ అసంతృప్తితో ఉంటాడు.
ఆ పాశముల నుంచి, ఆ అసంతృప్తుల నుంచి విమోచనం చేస్తుంది,
కనుక అమ్మను ఈ నామంలో పశుపాశ విమోచనీ అంటున్నాం.
జీవుడు, ఈశ్వరుడు ఒక్కరే అనే జ్ఞానం కలిగించే శక్తి ఈ నామానికి వున్నది.
తానూ, ఈశ్వరుడు వేరు వేరు అనే భావముతో ఉపాసన చేసేవాడు పశుప్రాయుడు.
తనను నమ్మిన భక్తులకు పశుత్వమును తొలగించి, ఆశా పాశములను నరికి,
జీవుడు ఈశ్వరుడు ఒక్కటే అని బోధిస్తున్న, ఆ పశుపాశ విమోచని కి వందనం.
ఓం శ్రీ పశుపాశవిమోచిన్యై నమః
355. సంహృతాశేష పాషండా
పాషండులను శేషం లేకుండా సంహారము చేయునది అని ఈ నామ భావం.
పాషండులంటే, వేదమును ధిక్కరించువారు, వేదములలో చెప్పిన కర్మలను ఆచరించనివారు.
వేదధిక్కారము చేస్తూ, వేదములో చెప్పిన ధర్మకర్మలను ప్రశ్నిస్తూ వితండవాదం చేసేవారు
పాషండులు లేదా పాఖండులు. వీరికి జ్ఞానము, జ్ఞానబోధలు నచ్చవు.
సదాచారం నచ్చదు. పెద్దల బోధ నచ్చదు. వేదదూషణము చేస్తూ విశృంఖలతతో వుంటారు.
ఈ పాషండులను నిర్దయగా శేషము లేకుండా సంపూర్ణముగా సంహరించునది ఆ శ్రీమాత.
నాలుగు వేదములు, ఆరు వేదాంగములు, పద్ధెనిమిది పురాణములు, పద్ధెనిమిది
ఉపపురాణములు, ధర్మశాస్త్రములు కాక, బుద్ధి కల్పితములయిన ఇతర విద్యలన్నీ కూడా
ఈ పాషండులను మోహపెట్టటానికి గాను ఆ మహామాయచే కల్పించబడినవే.
ఆ మోహినీ మాయకు లొంగక, వేదవిహిత కర్మలు చేసేవారిని అమ్మ ఎల్లవేళలా రక్షిస్తుంది.
వేదములో చెప్పబడిన ధర్మములు పాటించని వారిని నిశ్శేషముగా సంహరించి,
ఉద్ధరించు, కరుణారససాగర, ఆ సంహృతాశేషపాషండ కు వందనం.
ఓం శ్రీ సంహృతాశేషపాషండాయై నమః
ఓం శ్రీ సదాచారప్రవర్తికాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి