23, అక్టోబర్ 2021, శనివారం

92. మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా

 

మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః 
చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా ॥ 92 ॥

432. మదఘూర్ణిత రక్తాక్షీ

మదముచే గిరగిరా తిరుగుతున్న ఎర్రని కన్నులున్నదానా అని ఈ నామార్ధం. 

ఈ మదము దేని వలన వచ్చిందీ అంటే, ఆనందముతో సేవించిన మద్యము వలన వచ్చింది. 

కన్నులు ఎర్రబడ్డాయి, మత్తుతో తూగుతూ వున్నాయి ఆ కళ్ళు. 

సుధాపాన పారవశ్యంలో మత్తుగా తూగుతున్న, అమ్మ ఎదురుగా ఏ మధ్యందిన సూర్యుడో, 

ఏ అగ్నిభట్టారకుడో కదలుతున్నారేమో, వారి ఎర్రని వెలుగు అమ్మ కంట్లో ప్రతిఫలించి, 

ఆ కళ్ళు రక్త వర్ణంతో ఎర్రగా మెరుస్తున్నాయి. 

అందుకే ఈ నామంలో ఆ మదశాలినీని మదఘూర్ణిత రక్తాక్షీ అన్నారు. 

మదము వలన ఏర్పడిన మత్తుతో తూగుతున్న, రక్తము వలె ఎర్రబడ్డ కన్నులు కల, 

ఆ మదఘూర్ణిత రక్తాక్షి కి వందనం. 

ఓం శ్రీ మదఘూర్ణితరక్తాక్ష్యై నమః  


433. మదపాటల గండభూః

గణ్డభూ అంటే చెక్కిళ్ళు. అమ్మ చెక్కిళ్ళు దర్పణముల వలే స్నిగ్ధంగా, తరళంగా వుంటాయని 

తెలుసు కదా. పాటలము అంటే తెలుపుతో కూడిన ఎరుపు అని అర్ధం. 

అమ్మ చెక్కిళ్ళు ఎర్రగా ఉంటాయి. ఆ ఎరుపు మదము చే కలిగిన సంతోషము వలన ఏర్పడింది. 

పక్కనే తెల్లని శివుడు ఆసీనుడయి ఉండటంతో, కస్తూరి అద్దిన, ఆ అద్దాల్లాంటి చెక్కిళ్ళలో 

తెలుపు, ఎరుపు మిశ్రితమై గులాబీ రంగుకి మారాయి. 

పక్కనే శివుడున్న అపరిమిత ఆనందంలో అమ్మ చెక్కిళ్ళు ఎర్రబారి వున్నాయి. 

పాటలీ కుసుమపత్రాల వలె ఎర్రగా ప్రకాశిస్తున్న బుగ్గలు కల ఆ కామేశ్వరి మధుసేవనం చేత 

ఆనందముగా మత్తెక్కి వున్నది. పైగా ఆ కామేశ్వరి నిత్యయౌవనమూర్తి కదా, 

యవ్వనంలో ఉన్నవారి చెక్కిళ్ళు సహజంగానే గులాబీ రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి.   

గులాబీ వర్ణంలో మెరుస్తున్న చెక్కిళ్ళతో విరాజిల్లుతున్న, ఆ మదపాటల గండభు కు వందనం.  

ఓం శ్రీ మదపాటలగండభువే నమః  


434. చందన ద్రవ దిగ్ధాంగీ

తాపం కలిగినప్పుడు నివారణకు గంధం పూస్తాం. మధుపానం చేసిన కామేశ్వరికి తాపం కలిగింది. 

అప్పుడు ఆ తాప ఉపశమనం కోసం, దేహానికి గంధం రాయించుకున్నది. తాపం చల్లబడింది. 

ఉగ్ర నరసింహుడికి కూడా కోపం ఎక్కువ. ఆయనకూ ఆ కోపం చల్లబరచడానికి, చందనసేవ 

చేస్తూ వుంటారు. అన్నాచెల్లెళ్ల  కోపతాపాలను ఈ చందన లేపనం చల్లబరుస్తూ ఉంటుంది.  

గంధపు చెక్కని సాన మీద అరగదీస్తే, చందన ద్రవం వస్తుంది. 

ఆ చందన ద్రవానికి కుంకుమపువ్వు కలిపితే అది మరింత త్వరగా తాపాన్ని తగ్గిస్తుంది. 

ఆ ద్రవాన్ని అమ్మవారు అంగములంతా రాచుకుని, శాంతంగా వున్నది అని ఈ నామానికి అర్ధం. 

అమ్మవారిని అలుముకున్న ఆ చందనము, ఆ చందనవృక్షము ఎంత పుణ్యం చేసుకున్నాయో. 

శరీరమంతా చందనం పూతతో శోభిల్లుతున్న, ఆ చందన ద్రవ దిగ్ధాంగి కి వందనం. 

ఓం శ్రీ చందనద్రవదిగ్ధాంగ్యై నమః  


435. చాంపేయకుసుమప్రియా 

చాంపేయ కుసుమాలంటే సంపెంగలు. పచ్చని సంపెంగ పుష్పాలంటే ఆ పరమేశ్వరికి ప్రీతి. 

ఇష్టమైన బంగరు రంగు సంపెంగలు ధరించి, ఆనందముతో తృప్తిగా ఉంటుంది అమ్మ. 

మంచి సుగంధముతో, అందంగా వుండే ఆ చాంపేయకుసుమాలంటే పరమేశ్వరికి ఇష్టం. 

ఆ అమ్మను తృప్తి పరచాలంటే, పుష్పసేవ చేయాలి. ఆ పుష్పాలు మంచివై ఉండాలి. 

ఎండినవీ, వాడినవీ, నలిగినవీ కాకుండా, అప్పుడే విచ్చుకుని, పరిమళాలు వెదజల్లే పూలతో 

పూజ చేస్తే, అమ్మ సంతోషిస్తుంది. సమర్పణ హృదయంతో చక్కని పువ్వు ఒక్కటి పెట్టినా చాలు. 

వాడిన పూలు గంపెడైనా ఫలితాన్నివ్వవు. అమ్మకు పువ్వులంటే ఇష్టం. పువ్వుల్లో చంపకాలంటే 

ఇష్టం. చంపక కుసుమాలను ఇష్టపడే, ఆ చాంపేయకుసుమప్రియ కు వందనం. 

ఓం శ్రీ చాంపేయకుసుమప్రియాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి