2, అక్టోబర్ 2021, శనివారం

71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా

 

రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా  
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥

305. రాజరాజార్చితా

రాజరాజార్చితా అంటే, రాజులకే రాజైన రాజరాజులచే అర్చింపబడునది అని భావం. 

రాజరాజు అంటే గ్రహములలో చంద్రుడు, దిక్పాలకులలో కుబేరుడు, 

మనువులలో వైవస్వతుడు, త్రిమూర్తులలో విష్ణువు, దేవతలలో ఇంద్రుడు.  

రాజరాజు అంటే చక్రవర్తి, రాజులకే రాజు. గ్రహములలో చంద్రుడికి  రాజు అనే పేరుంది. 

అటువంటి గ్రహములలో రాజుగా పిలువబడే చంద్రుని చేత 

ఉపాసించబడిన వేలుపు ఈ రాజరాజార్చిత. 

దిక్కులలో ఉత్తరం దిక్కు ఉత్తమమైనది, ఆ దిక్కుకు ప్రభువు కుబేరుడు. శ్రీవిద్యను ఉపాసించిన 

ప్రధములలో కుబేరుడు కూడా ఒకడు. దిక్కులలో ఉత్తమ దిక్కైన ఉత్తరదిక్కు అధిపతి 

కుబేరునిచే పూజింపబడుతున్న తల్లి ఈ రాజరాజార్చిత. 

సృష్టి ప్రారంభములో భగవతి చేత మనుష్యులకు ప్రభువుగా నియమింపబడిన వారు మనువులు. 

మనువు సంతతి కనుకనే, మనకందరికీ మానవులు అని పేరు. వీరు పధ్నాలుగు మంది. వారిలో 

వైవస్వతుడు అందరికీ ప్రభువు. ప్రస్తుతము వైవస్వతమన్వంతరం  జరుగుతోంది. వైవస్వతుడు

సదా ఆ అమ్మ కొలువులో వుండి ఆ రాజరాజార్చితను అర్చిస్తూ ఉంటాడు. 

ఈ భువనాలన్నింటికీ ప్రభువు విష్ణువు. విష్ణు అంశ లేనిదే ఎవరూ రాజు కాలేరు. ఎంత చిన్న 

ప్రభువైనా, వారిలో విష్ణువు ఉంటాడు. అందుకే "నా విష్ణుః పృథివీపతిః" అంటారు. ఆ ప్రభువుల 

రూపములో పరిపాలనము చేస్తున్నది ఆ మహావిష్ణువే. ఎవరు అధిపతిగా వున్నా, 

ఈ సత్యము తెలుసుకుని, రాజ్యము చేసేది నేను కాదు, నా లోని 

ఆ మహావిష్ణువు అంశ, అని గుర్తెరిగి పాలన చేయాలి.  

అటువంటి రాజులందరికీ ప్రభువైన విష్ణువు పూజించే దేవత ఈ రాజరాజార్చిత. 

దేవతల రాజు దేవేంద్రుడు. ఇంద్రునిచే ఉపాసించబడే దేవత ఈ రాజరాజార్చిత. 

ఈ రాజరాజులందరూ నిరంతరమూ అర్చిస్తున్న, ఆ రాజరాజార్చిత కు  వందనం. 

ఓం శ్రీ రాజరాజార్చితాయై నమః  


306. రాజ్ఞీ

రాజ్ఞీ అంటే మహారాణి, పట్టమహిషి, రాజేశ్వరుని పట్టపురాణి, రాజరాజేశ్వరి.

శివుడు, శక్తి ఇద్దరూ ఎప్పుడూ ఒకరినొకరు ధ్యానములో ఉపాసిస్తూనే వుంటారు. 

రాజరాజేశ్వరుడు ఈ రాజ్ఞీను ఉపాసిస్తే, ఆ రాజ్ఞి ఆ రాజరాజేశ్వరుడిని ఉపాసిస్తూ ఉంటుంది. 

ఈ ఇద్దరూ కలిస్తేనే శివశక్తి సమ్మేళనం. అప్పుడే జగత్కళ్యాణము జరుగుతుంది. 

రాజేశ్వరుని పట్టపురాణియై జగత్పరిపాలనము చేస్తున్న, ఆ రాజ్ఞి కి వందనం.  

ఓం శ్రీ రాజ్ఞై నమః  


307. రమ్యా

రమ్యమైనది అంటే, అందమైనది, సౌందర్యవతి అని అర్ధం. 

ఈ నామంలో ఆ రాజ్ఞిని రమ్యా అంటున్నాం. రమ్యము అంటే రమించునది అని కూడా అర్ధం. 

ఆ తల్లి సత్యములో, సత్వముతో నిత్యమూ రమిస్తూ ఉంటుంది. 

సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము అనే పంచ కృత్యాలను 

రమ్యంగా చేస్తూ ఉంటుంది. ఆ కృత్యాలలో నిత్యమూ రమిస్తూ ఉంటుంది.  

జీవులలో రమ్యమైన భావనలు కలగటానికి ఈ రమ్యే కారణము. 

తాను మనోహరంగా రమిస్తూ, జీవులని రమింపచేస్తున్న, ఆ రమ్య కు వందనం. 

ఓం శ్రీ రమ్యాయై నమః  


308. రాజీవలోచనా

రాజీవము అంటే పద్మము, హరిణము, పొడవు కన్నులున్న చేప, ఏనుగు, రాజసేవకుడు అనే 

అర్ధాలున్నాయి. ఆ రమ్యాదేవికి రాజీవముల వంటి కన్నులు వున్నాయి కనుక రాజీవలోచనా అనే 

పేరు వచ్చింది. అంటే, అమ్మవారి కన్నులు పద్మముల వలె ఉన్నాయని చెప్తోంది ఈ నామం. 

అమ్మ హరిణాక్షి, జింకపిల్ల వలె చురుకుగా చూస్తుందని ఈ నామానికి అర్ధం. 

అమ్మ కన్నులు మీనముల వలె పొడవుగా అందముగా తీర్చిదిద్దినట్టు ఉన్నాయని అర్ధం. 

ఏనుగు, కన్నులు ముఖమునకు అటూ ఇటూ వుండటం వల్ల, ఒకేచూపుతో చుట్టూ వున్న సంపూర్ణ 

దృశ్యం ఆకళింపు చేసుకుంటుంది. అమ్మ చూపు ఆ ఏనుగు చూపు వలె వున్నదని ఈ నామం 

చెబుతోంది. రాజును అనుసరించే రాజసేవకులను రాజీవములు అంటారు. అట్టి రాజీవములను 

ఎప్పుడూ కృపాదృష్టితో చూస్తోందని రాజీవలోచనా నామానికి మరో అర్ధం. 

చక్కటి తీర్చిదిద్దినట్టున్న సొగసును, కృపను, చురుకుచూపులను కల, 

ఆ రాజీవలోచన కు వందనం. 

ఓం శ్రీ రాజీవలోచనాయై నమః 

  

309. రంజనీ

 రంజనీ అంటే రంజింపచేయునది అని అర్ధం. రంజనము అంటే ఎర్రగా చేయటం. 

రంజనము అంటే సంతోష పెట్టటం, రంజనము అంటే అనురాగము చూపించటం. 

అమ్మ భక్తుల శ్రద్ద, భక్తి చూసి సంతోషపడుతూ ఉంటుంది, ఆ భక్తులను సంతోషపెడుతూ 

ఉంటుంది. పరమశివుని పట్ల అనురాగము కలిగివుంటుంది. స్ఫటికము వలె ప్రకాశిస్తున్న 

ఆ మహాదేవుణ్ణి, ఆలింగనం చేసుకుని తన అరుణ వర్ణం శివుడికి పులిమి ఎర్రగా చేస్తూ ఉంటుంది. 

స్ఫటికము పక్కన ఏ మందార పువ్వో, మంకెన పువ్వో పెడితే ఆ స్ఫటికము ఎర్రగా కనిపించినట్టు, 

శక్తి పక్కనే వున్న శివుడు రంజింపబడి ఎర్రగా కనిపిస్తాడు. 

రంజనముతో పరమశివునితో పాటు జీవులందరికీ సంతోషము కలిగిస్తున్న, ఆ రంజని కి వందనం. 

ఓం శ్రీ రంజన్యై నమః 


310. రమణీ

రమింపచేయునది రమణి. భక్తులతో కలిసి క్రీడించునది రమణి. 

రమణము అంటేనే శుభములు కలుగచేయటం, ఉల్లాసము అందించటం. 

ధర్మము నాచరించువారిపై ఈ రమణి కరుణా ప్రసారము ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. 

వ్యాసుడు భారతములో 'ఇతరులు ఏవిధంగా ప్రవర్తిస్తే, మనకు బాధ కలుగుతుందో, 

ఆ విధంగా మనము ఇతరుల పట్ల ప్రవర్తించకుండా ఉండటమే అసలైన ధర్మము' అని చెప్పాడు.

ఇతరులను హింసించుట, దుర్భాషలాడుట, కుత్సితము చూపుట, మత్సరము చూపుట, 

ఈర్ష్యా అసూయలు కలిగివుండుట అధర్మము. అటువంటి వారిని ఆ రమణి చేరదీయదు. 

వారి మనసంతా కల్మషము నిండిపోయి, దేనిపైనా ఆసక్తి చూపరు. 

నిత్యమూ అశాంతితో అసంతృప్తితో బాధపడుతూ వుంటారు. 

అట్టివారు ఈ రమణిని ఆర్తితో అర్చిస్తే, వారిని దయతో ఈ కశ్మలముల నుండి రమణత్వము 

వైపుకు అమ్మ తిప్పుతుంది. 

భక్తుల పట్ల దయతో వారితో క్రీడిస్తూ, ఉల్లాసము కలుగచేస్తూ, వారి కశ్మలములను తొలగిస్తున్న, 

ఆ రమణి కి వందనం. 

ఓం శ్రీ రమణ్యై నమః 


311. రస్యా

రస స్వరూపురాలు ఈ రస్యా. బ్రహ్మానంద స్వరూపురాలు. ఆనందమనే రసాన్ని యోగముగా

అనుగ్రహిస్తున్న తల్లి ఈ రస్య.  అమ్మతో అనుభవమే సత్యము, జ్ఞానము, నిత్యము.

ఆ అనుభవమే ఆనందరసం. ఆ సుఖానుభూతులు అనంతమైనవి, ఇంద్రియాతీతమైనవి. 

తైత్తిరీయంలో, "రసో వై సః", భగవంతుడే ఆనందము అని చెప్పారు. 

అమ్మే స్వయంగా రస స్వరూపురాలు. రమణీయమైన ఆనందాన్ని, సుఖానుభూతులను 

కలుగచేసే తల్లి. ఏ అనుభూతి పొందిన తరువాత ఎప్పటికీ నశించని ఆనందం కలుగుతుందో, 

అదే రసము. రసమంటే ఆస్వాదించునది. అదే ఇంద్రియములకు అతీతమైన ఆనందము. 

ఆనందం మనే రసాన్ని తాను ఆస్వాదిస్తూ, అందరికీ అందిస్తున్న, ఆ రస్య కు వందనం. 

ఓం శ్రీ రస్యాయై నమః 


312. రణత్కింకిణి మేఖలా

రణము అంటే వీణ వంటి తంత్రీ వాయిద్యము చేసే వీనుల కింపైన సన్నని ధ్వని. 

కింకిణి అంటే చిన్న గంటలు, చిరుగంటలు. మేఖల అంటే మొలనూలు, వడ్డాణము.  

రణత్కింకిణి మేఖల అంటే సన్నగా మధురమైన రవమును చేస్తున్న చిరుగంటలతో పేనిన, 

వడ్డాణము అని అర్ధం.  అమ్మవారు ధరించిన వడ్డాణము ఎలా ఉందో చెప్తూ, అది ధరించిన 

ఆ రమణిని  రణత్కింకిణి మేఖలా అంటున్నాం. ఈ రణత్కింకిణిమేఖల, చక్కగా నడుము 

చుట్టూ చిరుగజ్జెలు అల్లిన వడ్డాణము ధరించి కదులుతుంటే, ఆ గజ్జెలు హాయిగా, సమ్మోహనంగా 

నిక్వాణము చేస్తుంటే, ఆ నాదము విన్న భక్తులు పరమానంద భరితులౌతారు. 

ఆ మృదు మధుర ధ్వనికి  సమ్మోహితులై, ఆ తన్మయత్వం మరల మరల పొందడానికి,

ఆ తల్లి ధ్యానంలోనే వుంటారు. శక్తికూటమునకు ఆరంభము మొలనూలు. ఈ దేవిని ధ్యానిస్తే, 

జీవుడు చక్కటి క్రియాశక్తి పొంది యుక్తమైన కార్యములు చేయడానికి ఉత్సాహం చూపిస్తాడు.  

అమ్మ ఉపాసన సిద్ధిస్తున్నప్పుడు భక్తులకు చిరుగజ్జెల సవ్వడి, తుమ్మెదల ఝంకారనాదం 

వినిపిస్తూ ఉంటాయి. 

చక్కని మధుర ధ్వని చేస్తున్న మేఖలను ధరించి భక్తుల మనసులను రంజింపచేస్తూ, 

వారిని కార్యోన్ముఖులను చేస్తున్న, ఆ రణత్కింకిణి మేఖల కు వందనం. 

ఓం శ్రీ రణత్కింకిణి మేఖలాయై నమః 

 

------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి