10, అక్టోబర్ 2021, ఆదివారం

79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోపహా

 

తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా 
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోపహా ॥ 79 ॥

357. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా

ఆధ్యాత్మిక, ధిభౌతిక, ఆధిదైవికములను మూడింటినీ తాపత్రయములు అంటారు. 

ఈ మూడు తాపముల వలన సంతప్తులైన వారు, అంటే దహింపబడినవారు 

తాపత్రయాగ్నిసంతప్తులు. వారికి సమాహ్లాదనము కలిగించే చంద్రిక, వెన్నెల వంటిది అమ్మ 

అని ఈ నామంలో చెప్పుకుంటున్నాం. తాపము కలిగినప్పుడు వెన్నెలలో కూర్చుంటే, చల్లగా, 

హాయిగా ఉంటుంది. ఆ హాయిని కలిగించే వెన్నెల కురిపించే కరుణామూర్తి ఆ జగజ్జనని.   

సంసారమనే అగ్నిలో తాపత్రయములు సహజము. ఆ అగ్ని తాపమును పొందినవారు, 

తత్ శాంతి కోసం, అమ్మను ఆశ్రయిస్తే, చల్లని వెన్నెలలు కురిపించి ఆహ్లాదాన్ని కలుగచేస్తుంది.  

తాపత్రయముల నుంచి సంసారులకు, భక్తులకు , ఉపాసకులకు, ఉపశమనం కలిగిస్తూ, 

ఆహ్లాదంగా వెన్నెలలు వర్షిస్తున్న, ఆ తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక కు వందనం. 

ఓం శ్రీ తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికాయై నమః  


358. తరుణీ

తరుణీ అంటే, తారుణ్యము కలది. నిత్యమూ షోడశ వర్ష ప్రాయములో కనిపించునది. 

సదా నిత్య యవ్వనంలో ఉండునది తరుణీ. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీలలిత, దక్షిణామూర్తి 

ఎప్పుడూ యవ్వనంలో వున్నట్టే దర్శనం ఇస్తారు. 

ఎప్పుడూ షోడశ కళలతో, షోడశ వర్ష రూపంతో భక్తులను అనుగ్రహించే తల్లి తరుణీ. 

పదహారు సంవత్సరాల వయసు వచ్చేసరికి శరీరం సంపూర్ణంగా ఎదిగి, సుకుమారంగా, 

సమ్మోహనంగా ఉంటుంది. ఆ రూపము అత్యంత పవిత్రము, ఆకర్షణీయము. 

ఆ సమ్మోహన రూపానికే తాపసులు ఆకర్షించబడి, అమ్మ మోహములో నిరంతరమూ ఉండిపోతారు. 

ఎప్పుడూ పదహారు సంవత్సరాల వయసుతో, పదహారు కళలతో ప్రకాశిస్తూ, 

భక్తులను, ఉపాసకులను ఆకర్షిస్తున్న, ఆ తరుణి కి వందనం.  

ఓం శ్రీ తరుణ్యై నమః  


359. తాపసారాధ్యా 

తాపసుల చేత ఆరాధింపబడే దేవత అని ఈ నామానికి అర్ధం. 

తపస్వులు అందరూ ఆరాధించేది ఆ శ్రీలలితనే కదా. 

తాపత్రయములకు నిలయమైన సంసారములో అసలైన సారము ఆ శ్రీదేవి ఆరాధనమే. 

తపస్సు అంటే సర్వత్రా, ఆ శ్రీమాతను దర్శించి ఆరాధించగలగటం. 

సంసార సారమైన ఆరాధనమే తపస్సుగా చేయువారిని, ఉద్ధరించే తల్లి తాపసారాధ్యా. 

తాపసులకు, తాపత్రయములో మునిగివున్న సంసారులకు 

ఆరాధనీయురాలైన, ఆ తాపసారాధ్య కు వందనం. 

ఓం శ్రీ తాపసారాధ్యాయై నమః 

  

360. తనుమధ్యా 

తనువులో మధ్య భాగము నడుము. అమ్మవారి నడుము ఎంత సన్ననిదో, 

ముందు నామాల్లో చెప్పుకున్నాం. అటువంటి సన్నని నడుము కలది తనుమధ్యా.

అంత సన్నని నడుమున్న అమ్మవారు నిత్యమూ ఈ లోకాలనూ, లోకేశులనూ, 

లోకస్థులనూ తన గర్భంలో మోస్తూనే వుంది. ప్రసవిస్తూనే వుంది. 

కాంచీపురంలో వున్న దేవత పేరు తనుమధ్యా. బిల్వేశ్వరుని కాంత తనుమధ్యా. 

ఛందశ్శాస్త్రములో ఒక వృత్తము పేరు తనుమధ్యా. పద్యము ప్రతి పాదములోనూ 

త గణము, య గణము మాత్రమే వుండే ఛందోవృత్తము తనుమధ్యా వృత్తము. 

నిత్యప్రసూతిగా అందరినీ కటాక్షిస్తున్న, ఆ తనుమధ్య కు వందనం. 

ఓం శ్రీ తనుమధ్యాయై నమః 


361. తమోపహా

తమము అంటే, అంధకారము, అవిద్య, అజ్ఞానము. సత్వరజస్తమో గుణాలలో ఒకటి. 

ఆపహా అంటే పోగొట్టునది. తమస్సును పోగొట్టేది తమోపహా. 

తమోపహా అంటే, అంధకారము పోగొట్టి వెలుగు వైపుకు నడిపించు శక్తిస్వరూపము.  

అజ్ఞానమును ద్రుంచి జ్ఞానమును పెంచేది తమోపహా. 

జీవుడిని అవిద్య నుంచి దూరము చేసి శుద్ధవిద్యను అందించేది తమోపహా. 

అవిద్యోపాసన చేసేవారు అంధకారాన్ని పొందుతారు అని ఈశ ఉపనిషత్తులో చెప్పారు. 

అవిద్యోపాసన చేసేవారు, వేదప్రకారము నిందనీయులని బ్రహ్మాండ పురాణం కూడా చెప్పింది  

అవిద్య అజ్ఞానమును, అంధకారమును ఇస్తుంది, కనుక, తన భక్తులను కరుణించి,

వారికి  విద్య అనే జ్ఞానమిచ్చి, వారిని జ్యోతిర్మయము చేస్తున్నది తమోపహా. 

జ్ఞానము, విద్య ద్వారా తన భక్తులలో తమస్సును పోగొట్టే, ఆ తమోపహ కు వందనం. 

ఓం శ్రీ తమోపహాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి