కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టిః, మతిః, ధృతిః
శాంతిః, స్వస్తిమతీ, కాంతిః, నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥
442. కుమార గణనాథాంబా
ఓం శ్రీ కుమారగణనాథాంబాయై నమః
443. తుష్టిః
తుష్టి అంటే సంతోషము, ఇక్కడ అమ్మవారిని సంతోష స్వరూపురాలు అని చెప్తున్నాం.
"యా దేవీ సర్వ భూతేషు తుష్టి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః"
మార్కండేయ పురాణంలో దేవీ స్తుతిలో, సర్వభూతములలో తుష్టి రూపములో వున్న
ఆ దేవికి నమస్కారము అని వున్నది. తుష్టి అనేది ఒక సిద్ధి, ఒక గుణము.
మన అందరిలో సంతోషము రూపములో ఆ అమ్మ వున్నది అని తెలుసుకోవాలి.
ఆనందముగా ఉండేవారి ముఖంలో వెలుగొందే తేజస్సు, వారిలో వుండే కళ ఆ జగజ్జనని,
లలితాపరమేశ్వరిదే. అమ్మను ఉపాసించిన వారికి తుష్టి అనే సిద్ధిని అమ్మ ఇస్తుంది.
తుష్టి లేకపోతే ఏ ఇతర సిద్ధీ కూడా తృప్తినివ్వదు. పద్మపురాణంలో వజ్రేశ్వరీ క్షేత్రంలో
వున్న దేవి తుష్టి స్వరూపిణి అని చెప్పబడింది.
సకల భూతములలో సంతోషము రూపములో వున్న, ఆ తుష్టి కి వందనం.
ఓం శ్రీ తుష్ట్యై నమః
444. పుష్టిః
పుష్టి అంటే పోషణ, ఎదుగుదల. ఈ నామంలో అమ్మను మనకు పోషణ నిచ్చి,
మన ఎదుగుదలకు కారణమైన శక్తిగా కీర్తిస్తున్నాం. తల్లే కదా పిల్లల పోషణ చూసేది.
పిల్లల పోషణా భారం వహించే ప్రతి తల్లిలోనూ వుండి, పోషణ నందించేది ఆ జగన్మాతయే.
కుపోషణ ఉంటే, అమ్మ అనుగ్రహం లేనట్లే. ప్రతిజీవి లోనూ వారి ఎదుగుదలకు కారణమైన తల్లి
ఈ పుష్టీ దేవి. జ్ఞానసంబంధర్ కు స్తన్యము, జ్ఞానము ఇచ్చినది ఈ దేవే కదా.
ఈ పుష్టీదేవిని ఉపాసించిన వారికి, ఆ అమ్మ కడుపూ నింపుతుంది, జ్ఞానాన్నిచ్చి బుద్ధినీ
పెంచుతుంది. దేవదారు వనంలో వున్న దేవత పేరు పుష్టి. తుష్టి కలవారికి పుష్టి లభిస్తుంది.
సకలజీవులకూ పోషణ నందించే ఆ జగన్మాత, ఆ పుష్టి కి వందనం.
ఓం శ్రీ పుష్ట్యై నమః
ఓం శ్రీ మత్యై నమః
446. ధృతిః
ధృతి అంటే ధైర్యము. ధృతి అంటే స్థిర ప్రజ్ఞ. ధృతి అంటే స్థిర జ్ఞానము.
ఈ ప్రజ్ఞ వలననే జ్ఞానమును పొంద గలుగుతున్నాం. ఈ ప్రజ్ఞ వలననే వివేకము కలుగుతోంది.
శ్రీదేవిని ధ్యానించినవారికి స్థిర ప్రజ్ఞను ఇస్తుంది. ధృతి వలన ధైర్యము, స్థైర్యము కలుగుతాయి.
ప్రజ్ఞను చంచలం కాకుండా ధృతి నిరోధిస్తుంది. పిండారక క్షేత్రంలో ఉన్న దేవత పేరు ధృతి.
"యా దేవీ సర్వ భూతేషు ధృతి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః"
ధృతి వలన ఇహపరాల్లో సుఖం లభిస్తుంది. ధృతి వున్నవాడు విజయుడౌతాడు.
తుష్టి, పుష్టి, మతి పొందిన వారికి ధృతిని కూడా అమ్మ అనుగ్రహిస్తుంది.
ఓం శ్రీ ధృత్యై నమః
447. శాంతిః
శాంతి అంటే శమము. షోడశ కళలలో ఒక కళకు శాంతికళ అని పేరు.
బృహత్ పరాశర స్మృతిలో "నాసికకు పదిహేను అంగుళముల కింద, జీవుని శుద్ధి చేయు
కళాస్థానము ఒకటి వ్యాపించి వున్నది, దానికి శాంతి కళ అని పేరు" అని చెప్పబడింది.
కామ క్రోధ లోభ మోహ మద మత్సర గుణములకు భిన్నమైనది శాంతి.
సత్వగుణ ప్రధానమైనది. తుష్టి, పుష్టి, మతి, ధృతి వున్న చోట శాంతి ఉంటుంది.
"యా దేవీ సర్వ భూతేషు శాంతి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః"
మార్కండేయ పురాణంలో దేవీ స్తుతిలో, సర్వభూతములలో శాంతి రూపములో వున్న
ఆ దేవికి నమస్కారము అని వున్నది. శాంతి అనేదే సర్వోత్తమ స్థితి అని శైవాగమములో చెప్పారు.
మనసు కల్లోలముగా వున్నప్పుడు ఈ నామంతో శ్రీదేవిని ఉపాసించిన వారికి శాంతి కలుగుతుంది.
ఉపాసకులకు శమము, శాంతమూ ఇచ్చే, ఆ శాంతి కి వందనం.
ఓం శ్రీ శాంత్యై నమః
448. స్వస్తిమతీ
స్వస్తి మతీ అంటే చక్కగా తుష్టి, పుష్టి, మతి, ధృతి, శాంతి కలిగి, నాశము లేకుండా ఉన్నది
అని అర్ధం. స్వస్తి అంటే సు అస్తి. చక్కగా, మంచిగా ఉండుట అని అర్ధం.
ఆ విధంగా వున్నది స్వస్తిమతీ. చక్కని ఉనికి కలది అని భావం.
ఏకాలంలో నైనా చక్కగా ఉండునది, నిత్య సత్య స్వరూపము అని అర్ధం.
స్వస్తి అంటే క్షేమము, నిష్పాపము, మంగళము, పుణ్యము అనే అర్ధాలున్నాయి.
స్వస్తి పదాన్ని ఆశీర్వాద వచనంగా వాడతాం. ఈ స్వస్తి స్థితిని పూజించటానికి స్వస్తికమనే
చిహ్నాన్ని ఉపయోగిస్తాము. శుభకార్యాలలో స్వస్తిక గుర్తుని గీసి పూజించటం అనే సంప్రదాయం
వున్నది. స్వస్తిని కలుగచేయునది స్వస్తిమతీ. అవినాశ స్వరూపము, మంగళస్వరూపము.
తుష్టి, పుష్టి, మతి, ధృతి, శాంతి సిద్ధులను పొందిన వారికి, స్వస్తిని కూడా
అనుగ్రహిస్తున్న, ఆ స్వస్తిమతి కి వందనం.
ఓం శ్రీ స్వస్తిమత్యై నమః
449. కాంతిః
కాంతి అంటే అందరి చేతా కోరబడునది. ఇచ్ఛాశక్తి స్వరూపురాలు.
ప్రాణులలో జీవకళ రూపములో ప్రకాశించే తేజస్సే కాంతి.
ఇచ్ఛాశక్తి రూపములో, అందరిలోనూ వెలుగొందుతున్న పరమేశ్వరియే కాంతి.
"యా దేవీ సర్వ భూతేషు కాంతి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః"
మార్కండేయ పురాణంలో దేవీ స్తుతిలో, సర్వభూతములలో కాంతి రూపములో వున్న
ఆ దేవికి నమస్కారము అని వున్నది.
తుష్టి, పుష్టి, మతి, ధృతి, శాంతి, స్వస్తి సిద్ధులు పొందిన వారికి కాంతి సిద్ధి కూడా లభిస్తుంది.
జీవులందరిలో ప్రకృష్టంగా కనిపించే తేజోరూపములో వున్న కళ, ఆ కాంతి కి వందనం.
ఓం శ్రీ కాంత్యై నమః
450. నందినీ
ఓం శ్రీ నందిన్యై నమః
451. విఘ్ననాశినీ
విఘ్ననాశినీ అంటే విఘ్నములను నాశము చేయునది. విద్యా విఘ్నములను దూరం చేయునది.
శ్రీమాత విఘ్నములను నివారించునది కనుక ఈ నామములో అమ్మను విఘ్ననాశినీ అంటున్నాం.
జ్ఞానార్జనలో విఘ్నములు కలిగితే ఉపాసకుడు కావలసిన సిద్ధిని పొందడు.
శుద్ధజ్ఞానము కొరకు ఉపాసిస్తున్నపుడు విఘ్నములు కలుగుతూ ఉంటే, ఈ నామ జపం చేస్తే,
ఆ విఘ్నములు తొలగిపోతాయి. శ్రీమాత విఘ్నములు కలిగించునది, తొలగించునదీ కూడా.
ఈ సత్యమును గ్రహించిన ఉపాసకులు విఘ్నములను కూడా అమ్మదయ అని స్వీకరిస్తారు.
ఆ విఘ్నము వారికి కష్టము అనిపించదు. ఆ విఘ్నముల వలన వారికి దుఃఖము కలుగదు.
విఘ్నములను నియంత్రించే, ఆ విఘ్ననాశిని కి వందనం.
ఓం శ్రీ విఘ్ననాశిన్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి