వ్యాపినీ, వివిధాకారా, విద్యావిద్యా స్వరూపిణీ
మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥
400. వ్యాపినీ
ఓం శ్రీ వ్యాపిన్యై నమః
ఇది శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి వ్రాసిన శ్రీలలితావిజయం లోని
శ్రీలలితారహస్యసహస్రనామ స్తోత్రము నందు కల
నాలుగవ వంద నామాల వివరణ
401. వివిధాకారా
వివిధములైన ఆకారములలో వ్యక్తమయే స్వరూపము ఆ లలితాపరమేశ్వరిదే.
బ్రహ్మ నుంచి స్తంబుడి వరకు కల అన్ని రూపాలూ ఆ జగజ్జననివే.
చీమలోనూ, చేపలోనూ కూడా వ్యక్తమయే ఆకారము అమ్మదే.
సూర్యచంద్రులకూ, తారామండలానికీ ఆ ప్రభారూపాన్నిచ్చినది జగదీశ్వరియే.
అమ్మ రూపము కానిది ఏదీ ఈ సృష్టిలో లేదు. అన్నీ, అంతా ఆమె సృజించిన ఆకారాలే,
ఆ జగన్మాత అంశా రూపాలే. అన్ని నామాలలో, అన్ని రూపాలలో విలసిల్లుతూ,
అన్ని రూపాలూ తానే అయినది, సర్వ వ్యాపకత్వమున్న మాహేశ్వరి.
ప్రకృతి, వికృతి, కౌమారము అని సృష్టి మూడు రకములు. ఈ మూడు సృష్టులలోనూ వున్న
అన్ని ఆకారములనూ ధరించిన శక్తి కనుక, ఆ శ్రీ లలితకు వివిధాకారా అని నామం వచ్చింది.
అన్ని రూపములతో, నామములతో వ్యక్తమవుతున్న, ఆ వివిధాకారా కు వందనం.
ఓం శ్రీ వివిధాకారాయై నమః
402. విద్యావిద్యాస్వరూపిణీ
విద్య, అవిద్య స్వరూపాలు రెండూ కూడా ఆ లలితాదేవే అని ఈ నామం చెప్తోంది.
ఈశ ఉపనిషత్తులో విద్య, అవిద్యల గురించి చెప్పారు.
ఎవరైతే కేవలము కర్మలే చేస్తారో, వారు అవిద్యను ఆరాధించేవారు కనుక, అంధకారంలో
పడిపోతారు. ఎవరైతే కేవలము ఉపాసనే చేస్తారో, వారు ఇంకా గాఢాంధకారములో మునిగిపోతారు.
ఎవరైతే కర్మా, ఉపాసనా రెండూ చేస్తారో, కర్మల ద్వారా అవిద్యను, ఉపాసన ద్వారా విద్యనూ
పొంది, వారు అమరత్వాన్ని పొంది మృత్యువును జయిస్తారు, అని ఈశలో చెప్పారు.
జపమూ, తపమూ, ధ్యానమూ కూడా ఆ పరమాత్మ లక్ష్యంగా చేయకపోతే,
అవి అన్నీ కూడా అవిద్యగానే పరిగణింపబడతాయి.
కేవలము జ్ఞానస్వరూపము విద్య, కేవలము కర్మ స్వరూపము అవిద్య.
జ్ఞానము లేని ఉపాసన కానీ, ఉపాసన లేని జ్ఞానము కానీ ముక్తినివ్వదు.
అందుకే జ్ఞానమూ, ఉపాసనా రెండింటినీ ఆరాధించాలి. అదే విద్యావిద్యాస్వరూపము.
ఈ విద్యా, అవిద్యా స్వరూపమైన అమ్మను ఆరాధిస్తే దొరికేది ముక్తీ, మోక్షము.
విద్యగానూ, అవిద్యగానూ కూడా ప్రకటితమవుతున్న, ఆ విద్యావిద్యాస్వరూపిణి కి వందనం.
ఓం శ్రీ విద్యావిద్యాస్వరూపిణ్యై నమః
ఓం శ్రీ మహాకామేశనయనకుముదాహ్లాదకౌముద్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి