327. కళావతీ
ఓం శ్రీ కళావత్యై నమః
328. కలాలాపా
నిఘంటువులో కల అంటే అవ్యక్త మధుర స్వరము అనే అర్ధం వున్నది.
ఓం శ్రీ కలాలాపాయై నమః
329. కాంతా
కాంతిని వెదజల్లేది కాంతా. అందమైనది కాంతా, కమనీయమైన రూపము కలది కాంతా.
కృష్ణ పక్షము లోని ఏకాదశీ రాత్రి పేరు కాంత.
ముముక్షువులు కూడా మోహించే కమనీయ సుందర రూపం ఈ కాంతది.
వారు ఈ కాంత నుంచి కోరేదీ మోక్షమే, దొరికేదీ మోక్షమే.
తన జగన్మోహినీ రూపంతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రెండూ చేసే తల్లి ఈ కాంత.
శ్రీలలిత, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఇటువంటి జగన్మోహినీ స్వరూపులు.
ఈ జగన్మోహినీ రూపాన్ని సద్భుద్ధితో చూసి ధ్యానించిన వారికి, అమ్మ అనుగ్రహము కలుగుతుంది.
అదే జగన్మోహినీ రూపాన్ని దుర్బుద్ధితో చూస్తే, వారిని అమ్మ నిర్జిస్తుంది.
క అంటే బ్రహ్మ, అంత అంటే లోపల. కాంత అంటే బ్రహ్మ లోపల వున్న బ్రహ్మ పదార్ధం.
బ్రహ్మ లోపల తాను వుండి సమస్త సృష్టినీ కల్పించేది ఈ కాంతాతత్వమే.
అందమైన రూపముతో అందరినీ సమ్మోహితులను చేస్తున్న, ఆ కాంత కు వందనం.
ఓం శ్రీ కాంతాయై నమః
ఓం శ్రీ కాదంబరీప్రియాయై నమః
331. వరదా
వరదా అంటే వరములను ఇచ్చునది. కోరికలను తీర్చునది.
అమ్మవారి వరదహస్తం మెరకగా వుండి సులభంగా వరములు ఇస్తుంది.
దేవతలందరికీ వరదాభయ హస్తాలు వున్నా, అసలైన వరదాభయ హస్తాలు
ఆ లలితాపరమేశ్వరీదేవివే అని గ్రహించాలి. అందుకే ఈ వరదా అనే నామం వచ్చింది.
బ్రహ్మ, విష్ణువు, మహేంద్రుడు మొదలైన దేవతలకు కూడా వరములు ఇచ్చే తల్లి లలితాంబిక.
వరాహ పురాణంలో అమ్మవారిని నవమీ తిథి నాడు పూజిస్తే, ఆ దేవి సంతోషించి వరములు
ఇస్తుంది అని చెప్పారు. తొమ్మిది దినాలు అమ్మను భక్తి శ్రద్ధలతో అర్చిస్తే, అమ్మ అనుగ్రహం
తప్పక లభిస్తుంది. తొమ్మిది అహోరాత్రాలు సమాధిలో వున్న సిద్ధులకు ఆ లలితాదేవి
శాశ్వత ముక్తిని ఇస్తుంది అని వరాహపురాణం చెప్తోంది.
వరదహస్తముతో భక్తుల పట్ల ప్రీతితో వరములను ఇస్తున్న, ఆ వరదా కు వందనం.
ఓం శ్రీ వరదాయై నమః
332. వామనయనా
వామ అంటే నిఘంటువులో ఉత్తమమైన స్త్రీ, రమ్యమైనది, సవ్యమైనది,
అందమైన దృష్టి కల స్త్రీ అనే అర్ధాలున్నాయి. సవ్యము అంటే ఎడమవైపు అని అర్ధం.
అమ్మవారి నయనాలు సుందరమైనవి, సుందరమైన కన్ను ఆ తల్లిది.
వామాచారము అంటే ఇష్టమైన తల్లి. శివునికి వామభాగములో వుండే శక్తి.
అర్ధనారీశ్వరరూపంలో కుడికన్ను ఈశ్వరుడిది, ఎడమకన్ను ఈశ్వరిది.
శ్రుతులలో వామపదము అంటే కర్మఫలము అని చెప్పబడింది.
తన ఎడమకంటితో అందముగా చూస్తూ, కర్మఫలములు ఇస్తున్న, ఆ వామనయన కు వందనం.
ఓం శ్రీ వామనయనాయై నమః
333. వారుణీమదవిహ్వలా
వారుణి అంటే ఖర్జూరఫలము, పశ్చిమదిక్కు, మద్యానికి అధిదేవత అనే అర్ధాలున్నాయి.
ఘాటైన ఖర్జూర ఫల రసాన్ని ఆస్వాదిస్తూ, మత్తెక్కి తన్మయత్వములో వున్నది
వారుణీమదవిహ్వల. మిత్రావరుణులలో మిత్రుడు తూర్పు దిక్కుకు అధిపతి అయితే,
వరుణుడు పశ్చిమ దిక్కుకు అధిపతి. అర్ధనారీశ్వరులలో శివుడు మిత్రుడు, వరుణుడు శక్తి.
వారుణి, వరుణుడి శరీరమంతా రస రూపములో ప్రవాహించే శక్తి.
ఆ వారుణీ రస ప్రవాహము వలన వున్మతురాలై వున్న శక్తిస్వరూపిణి ఈ వారుణీమదవిహ్వల.
వారుణీ రసమును సేవించిన ఆనందంలో ఉన్మత్తురాలైనప్పటికీ, అప్రమత్తురాలై వుండే
కాంత ఈ వారుణీమదవిహ్వల. ఈనాటికీ జాతరలలో పూనకం వచ్చి,
అమ్మ ఆవహించినవారు ఈ వారుణీమదవిహ్వలా స్థితిలో ఉండటం చూడవచ్చు.
వారు పూర్తిగా మత్తుగా వుంటారు, అయినప్పటికీ, ఆ దేవత స్పృహలోనే ఉంటారు.
భక్తుల పట్ల అక్కర చూపిస్తూనే వుంటారు. వారుణీ రసాస్వాదన వలన ఉన్మత్తత, అప్రమత్తత
కలిగివున్న, ఆ వారుణీమదవిహ్వల కు వందనం.
ఓం శ్రీ వారుణీమదవిహ్వలాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి