27, అక్టోబర్ 2021, బుధవారం

96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ

 

సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా 
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥

459. సుముఖీ 

సుముఖీ అంటే అందమైన చక్కని ముఖము కలది అని అర్ధం. 

సుముఖీ అంటే, ఆ ముఖం అందంగా ఉండాలి. తేజస్సుతో వెలగాలి. 

కోటి సూర్యుల వర్ఛస్సుతో ప్రభలు వెదజల్లాలి. మహారాజ్ఞి కనుక రాజసం భాసించాలి.  

జ్ఞాన ప్రకాశం ప్రస్ఫుటంగా కనపడాలి. ప్రసన్నంగా ఉండాలి. కారుణ్యంతో నిండాలి. 

ప్రజ్ఞతో మెరవాలి. ఆకర్షణీయంగా ఉండాలి. అమ్మ కనుక మాతృత్వం ప్రతిఫలించాలి. 

దైత్యదమనీ కనుక అసురులకు భయం కలిగించాలి. శిష్టులకు ధైర్యం కలిగించాలి. 

నుదురు అష్టమి చంద్రుడిలా ఉండాలి. కన్నులు మీనాల వలె ఉండాలి. 

కనుబొమ్మలు మన్మధ చాపంలా ఉండాలి. ఆ మధ్యలో కస్తూరీ తిలకం చక్కగా దిద్దబడి ఉండాలి. 

చెవులకున్న తాటంకాలు సూర్యచంద్రుల్లా ధగద్ధగాయమానంగా వెలిగిపోతూ ఉండాలి. 

కురులు సువాసనతో పరిమళించాలి. నాసిక సంపెంగ వలె సూటిగా ఉండాలి. 

చెక్కిళ్ళు దర్పణాలు వలె మెరుస్తూ ఉండాలి. పెదవులు దొండపండ్ల వలే ఎర్రగా ఉండాలి. 

శుద్ధ జ్ఞాన విద్యను అందించే ద్విజపంక్తి అమరి ఉండాలి. నములుతున్న 

కర్పూర తాంబూలపు సుగంధం గుబాళించాలి, భక్తులు ఆ తాంబూలపు ప్రసాదాన్ని కోరాలి. 

ఎవ్వరితో పోల్చలేని అపురూపమైన, అనుపమానమైన చుబుకం ఠీవిగా కనబడాలి. 

ఇన్ని లక్షణాలున్న లలితా త్రిపురసుందరి సుముఖీ అని కీర్తించబడుతోంది.  

ఇన్ని విశేషాలతో ప్రకాశించే  చక్కని ముఖం కలిగిన, ఆ సుముఖీ కి వందనం. 

ఓం శ్రీ సుముఖ్యై నమః  


460. నళినీ

నళినీ అంటే పద్మాల సమూహము, తామరకొలను. అమ్మ నిజంగా పద్మాల సమూహమే కదా. 

కన్నులు పద్మముల వంటివి. కమలాక్షి, నళినాక్షి, పద్మాక్షి, అంబుజాక్షి ఆ త్రిపురసుందరి. 

చేతులు కమలాల వంటివి. ఆ కరకమలాలతోనే కదా భక్తులకు వరములు, అభయము యిస్తోంది.

చరణములు కమలముల వంటివి. ఆ చరణ కమలాలను కదా ఉపాసకులు సదా ధ్యానిస్తున్నది. 

అసలు అమ్మ ముఖమే పద్మము. ఆ ముఖారవిందమును చూసి ముగ్ధులయ్యే కదా,  

ఆ దేవీ ముఖాన్నే నిరంతరం తలుస్తూ, భక్తబృందం సేవిస్తున్నది. 

ఆ లలితాదేవి ఒక పద్మముల రాశి వలె, అందరికీ ఆనందాన్నీ, అభయాన్నీ ఇస్తున్నది. 

అశ్వహృదయం, అక్షహృదయం తెలిసిన నల చక్రవర్తి చేత సేవింపబడినది, కనుక నలినీ. 

ముచ్చటైన తామరకొలను వంటి, ఆ నళిని కి వందనం.  

ఓం శ్రీ నళిన్యై నమః  


461. సుభ్రూః

సు అంటే చక్కని, భ్రూ అంటే కనుబొమ్మలు కలిగిన దేవత అని అర్ధం. 

అందమైన తీర్చిదిద్దిన కనుబొమ్మలు కలది శ్రీలలితాదేవి అని చెప్పుకుంటున్నాం. 

శంకరభగవత్పాదులు సౌందర్యలహరిలో ఈ కనుబొమ్మలను మన్మధుని ఇక్షుకోదండంతో 

పోల్చాడు. ముందే చెప్పుకున్నాం, అష్టమీ చంద్రుడు లాగా అమ్మవారి లలాటం ఉన్నదని.   

అమ్మవారి కనుబొమ్మలు మన్మధుని ఇంటి వాకిలి తోరణం వలె ఉన్నవని.  

ఆ భృకుటి పై కస్తూరీ తిలకం, అమ్మకు చిన్న దిష్టి చుక్క వలె భాసిస్తూ ఉన్నదని. 

ఆ కనుబొమ్మల కింద వున్న కళ్లు, మహాప్రవాహంలో అటు ఇటు చకచకా పారిపోయే చేపల్లా 

ఉన్నవని. ధ్యానమును భృకుటి కేంద్రముగా చేస్తే, మంచి ఫలితం ఉంటుంది. 

భృకుటిని చూస్తూనే జీవుడి ప్రజ్ఞ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. 

భృకుటిని ఎప్పటికప్పుడు గంధము, కుంకుమ, విభూతి వంటి వాటితో అలంకరించాలి. 

మన ఇంటి వాకిలి తోరణాన్ని ఎంత అందంగా అలంకరిస్తామో, భృకుటిని కూడా 

అంత చక్కగా అలంకరించాలి. భృకుటిపై వ్యక్తమయే జ్ఞానకాంతితో ఉపాసకుని స్థితి తెలుస్తుంది.  

అంతటి అందమైన అపురూపమైన కనుబొమ్మలు కల, ఆ సుభ్రూ కు వందనం. 

ఓం శ్రీ సుభ్రువే నమః  


462. శోభనా

శోభనా అంటే అందమైనది. శోభాయమానంగా ఉండునది, కాంతితో శోభస్కరంగా ఉండునది. 

లలితాపరమేశ్వరి సహజ సిద్ధమైన సౌందర్యముతో మనోజ్ఞంగా ప్రకాశిస్తూ ఉంటుంది. 

సుఖములు, సౌకర్యములు, సంపదలు, సేవకులు, సంతానము, సౌందర్యము, స్నేహితులతో 

సుసంపన్నంగా ఉండేవారి శోభ బహు గొప్పది. ఎన్ని వున్నా అసలైన శోభ సంతృప్తే.

వైభవమును కలిగివుండటం శోభ. భోగాన్ని అనుభవించటం కూడా శోభే. 

శ్రీదేవిని శోభనా రూపంలో, శోభనా నామంతో పూజిస్తే సకల శుభాలూ, శోభలూ ఒనగూడుతాయి. 

మహిషాసురుని వధించటం కోసం దేవతలందరూ ఒకచోట చేరి, ఆ పరమేశ్వరికి తమందరి

తేజస్సూ, శక్తీ, ఆయుధాలూ సమర్పించారు. ఆ సకలదేవతాశక్తికి శోభన అని పేరు.  

సకల దేవతా తేజస్సుతో వెలిగిపోతున్న, ఆర్యాణి, మహిషాసురమర్ధిని, ఆ శోభన కు వందనం. 

ఓం శ్రీ శోభనాయై నమః 

  

463. సురనాయికా

సురనాయికా అంటే దేవతలకు నాయకత్వము వహించేది అని అర్ధం. 

సురాపానం చేసిన వారు సురులు. వారు అమృతం తాగినందు వలన అమరులు. 

వారిపై అసురులు దాడి చేసినపుడు, దేవతా సంరక్షణార్థం తాను నాయికయై, నడుం బిగించి 

అసురులతో తలపడేది సురనాయికా అనబడే మహాశక్తి, లలితా పరమేశ్వరి. 

దేవతలను సృష్టించిన మహాదేవి సురనాయిక. అసురులను కూడా అమ్మే సృష్టించింది. 

అయినప్పటికీ దుష్టు పనులు చేసే అసురులను అడ్డుకొని, సురులను రక్షించునది కనుక. 

అమ్మవారికి సురనాయికా అనే నామం సార్ధకమైంది. 

ఎప్పుడు దేవతలకు కష్టం వచ్చినా, వారి పక్షాన నిలిచి, వారిని సంరక్షించే దుర్గాదేవి. 

శిష్టులైన దేవతల పక్షాన నాయికగా నిలిచి ధర్మ ప్రతిష్ఠాపన చేసే, ఆ సురనాయిక కు వందనం. 

ఓం శ్రీ సురనాయికాయై నమః 


464. కాలకంఠీ 

కలకంఠీ అని భావిస్తే, మధురమైన గళం గలది, అని అర్ధం. 

లలితాదేవి మధురమైన కంఠం విని, సరస్వతి సిగ్గుపడి తన కచ్ఛపీ వీణపై ముసుగు కప్పి,

గానం ఆపివేసింది అని ఆదిశంకరాచార్యుడు సౌందర్యలహరిలో చెప్తాడు. అమ్మవారు కలకంఠి. 

కాలకంఠీ అని భావిస్తే, నల్లని కంఠము కలది. కాలకంఠుడంటే హరుడు. ఆతని పత్ని కాలకంఠీ. 

లింగపురాణంలో దారుకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి పరమశివుడే  నల్లని 

కంఠము కల కాళికను, సృష్టించాడని వున్నది. ఆ దేవతే కాలకంఠీ. 

దేవీ పురాణంలో కాలంజర తీర్థంలో వున్న దేవతలు కాలకంఠుడు, కాలకంఠి అని చెప్పబడింది. 

విషము త్రాగిన కాలకంఠుని అర్ధ భాగమైన, ఆ కాలకంఠి కి వందనం. 

ఓం శ్రీ కాలకంఠ్యై నమః 


465. కాంతిమతీ 

కాంతిమతీ అంటే బృహత్ కాంతితో వెలుగొందునది అని అర్ధం. 

పరమేశ్వరి అంటే కాంతి కలిగినది, కాంతి పెంచునది, కాంతి పంచునది.  

కాంతి స్వరూపిణి అయిన జగదాంబ చంద్రార్కవైశ్వానరతారకాగ్రహములకు కూడా కాంతిని

ఇస్తుంది. ప్రతి జీవిలోనూ వున్న కళాకాంతీ ఆ జగజ్జననివే. 

చంద్రునికి కళలున్నాయని అనుకుంటున్నాం కానీ, ఆ కళలు భూమి వరకే పరిమితం. 

అసలు చంద్రునికి కళలే లేవు. భూమి, సూర్యుడు, చంద్రుడు పరస్పరంగా వున్న కోణాలను 

అనుసరించి చంద్రకళలు మారుతూ ఉంటాయి. అందుకే గ్రహణాలూ వస్తాయి. 

అమ్మ ఎప్పుడు ఎవరికి ఎంత కాంతిని ఇవ్వాలో చూచుకొని, అంత కాంతిని అందిస్తూ ఉంటుంది.

'చంద్రమా మనసో జాతః' అంటాం. మనస్సుని బట్టే, ముఖంలో కళ. 

అందుకే వాటిని కళాకళలు అంటాం. కాంతిని బట్టీ కళ. ఆ కళా, కాంతి అమ్మ ప్రసాదం. 

సృష్టి అంతటికీ ఏకైక కాంతి జనకమైన, ఆ కాంతిమతి కి వందనం. 

ఓం శ్రీ కాంతిమత్యై నమః 


466.  క్షోభిణీ 

క్షోభిణీ అంటే సంచలనము, వ్యాకులము, కదలిక, కలత కలిగించేది అని అర్ధం. 

సృష్టి చేయాలనే క్షోభ కలిగి అమ్మ తన నుంచి అనేకానేక దేవీ స్వరూపాలను సృష్టి చేసింది. 

విష్ణు పురాణంలో హరి, ప్రకృతి, పురుషుల యందు ప్రవేశించి వారికి క్షోభ, కదలికను కలిగించి 

సృష్టికార్యమునకు ఉద్యుక్తులను చేసాడని చెప్పారు. 

వరాహపురాణంలో, "వైష్ణవి మనసు క్షోభించి, కలత పడి, చాలాకాలం తపస్సులో  

ఉండిపోయింది. అప్పుడు ఆ క్షోభ నుంచి ఎందరో సుందరమైన, చక్కని లక్షణములు 

కల దేవతా స్త్రీలు ఉద్భవించారు" అని వుంది. 

సతీ వియోగం వల్ల కలిగిన క్షోభ, కలతతో పరమశివుడు హిమాలయాలను చేరి తపస్సు 

మొదలుపెట్టాడు. పార్వతికి క్షోభ, దుఃఖం కలిగి, తపస్సులో వున్న శివుడికి క్షోభ, సంచలనం 

కలిగించి, పరిణయమాడింది. వారిద్దరికీ కలిగిన క్షోభ, కదలిక వలన ఈ సమస్త సృష్టీ 

ప్రాణం పోసుకుంది. లోకాలోకాలు, స్థావర జంగమాలూ ఏర్పడ్డాయి. 

తనకు కలిగిన మనఃక్షోభ వలన, కామేశునితో కలసి సృష్టికార్యము చేపట్టిన, ఆ  క్షోభిణి కి వందనం. 

ఓం శ్రీ క్షోభిణ్యై నమః


467. సూక్ష్మరూపిణీ 

సూక్ష్మమైనది సూక్ష్మరూపిణీ. తెలియలేనంత, తెలియరానంత సూక్షమైనది ఆ పరమేశ్వరీ

తత్వము. ఆత్మ తత్వము పరమ సూక్ష్మమైనది అని శృతులలో కూడా చెప్పబడింది. 

ఆత్మ "అణువులలో అణువు, మహములలో మహము, జీవునిలో గోప్యము" అని కఠోపనిషత్ లో 

చెప్పారు. అదీ ఆత్మ తత్వం. అదే అమ్మ తత్వం. 

సీత వ్యక్తిత్వాన్ని గురించి చెప్తూ, "అణోరణీయాం, మహతో మహీయాం", అంటాడు వాల్మీకి. 

శ్రీదేవి సూక్షము అనే హోమ స్వరూపురాలు అని కూడా అర్ధం. మూలాధారం నందు వెలిగే 

అగ్నితో పన్నెండు విధములుగా చేసే హోమానికి సూక్ష్మము అని పేరు. 

అమ్మవారికి వున్న అనేక శరీరాలలో ఒకటి సూక్ష్మశరీరము అని కూడా చెప్పుకున్నాం. 

తేలికగా, ఏ ఉపాసకునికీ దొరకనంత, సూక్ష్మమైన రూపము కల, ఆ  సూక్ష్మరూపిణి కి వందనం. 

ఓం శ్రీ సూక్ష్మరూపిణ్యై నమః


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి