ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥
379. ఓడ్యాణపీఠనిలయా
ఓం శ్రీ ఓడ్యాణపీఠనిలయాయై నమః
380. బిందుమండల వాసినీ
ఈ నామంలో అమ్మవారిని బిందుమండలవాసినీ అంటున్నాం.
శ్రీచక్రం మేరు ప్రస్తారంలో అగ్రస్థానం లోనూ, భూప్రస్తారంలో మధ్య స్థానం లోనూ వున్నదే
బిందుస్థానం. అక్కడే అమ్మ సదా కొలువై వుంటుంది. సహస్రారకమలంలోని మధ్యబిందువు ఇదే.
దానికి కొద్దిగా పైన వున్న రంధ్రమే బ్రహ్మరంధ్రము.
ఈ బ్రహ్మ రంధ్రం బ్రహ్మనాళంతో కలుపబడి వుంటుంది.
ఆ బ్రహ్మ నాళంపైన బ్రహ్మరంధ్రము వద్ద వున్న కమలమే బ్రహ్మ స్థానం.
బ్రహ్మ ఆ కమలం పై కూర్చునే అమ్మ ఆనతి మేరకు సృష్టి చేస్తూ ఉంటాడు.
ఆజ్ఞ లో ఒక పద్మము, దాని మధ్యలో బిందువు, సహస్రారములో ఒక పద్మము,
దాని మధ్యలో బిందువు, బ్రహ్మరంధ్రములో ఒక పద్మము, దాని మధ్యలో బిందువు వున్నాయి.
ఈ మూడు బిందువులతో ఏర్పడినదే త్రికోణము. ఇదే సర్వసిద్ధిప్రద చక్రస్థానం.
ఆ త్రికోణం మధ్యలో వున్న బిందువే బిందుమండలం.
ఇదే చిట్టచివరి ఆవరణమయిన సర్వానందమయ చక్రస్థానం.
ఆ బిందుమండలం లో వసించే దేవి బిందుమండలవాసినీ.
ఈ చక్రాలు, పద్మాలు, బ్రహ్మరంధ్రాలు, త్రికోణాలు, బిందువులు అన్నీ మనలోనే వున్నాయి.
ఎవరిని వారు మేరుప్రస్తారంగా ఊహించుకోండి. మనకు కొద్దిగా పైన ఉండేదే బిందువు.
బిందు స్థానం ఒక తెల్లని కాంతి మండలము. ఆ మండలం కేంద్రబిందువే శ్రీరాజరాజేశ్వరి.
అక్కడ వున్న ఆ వెలుగే అమ్మ. పోతన గారు గజేంద్రమోక్షంలో
"లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికవ్వల
ఎవ్వెండేకాకృతిన్ వెలుగు నతని నే సేవింతున్" అన్నాడు. ఆ వెలిగేదే లలితాపరమేశ్వరి.
మనలోనే అన్నీ ఉంచుకుని ఎక్కడో వెతుకుతున్నాం. మీలోనే ఆ అమ్మను దర్శించండి.
తెలిసినవారికి అమ్మ హస్తామలకం. అరచేతిలో ఉసిరికాయ.
బిందుమండలంలో ఉంటూ సమస్త భువనాలనూ నడిపిస్తున్న,
ఆ బిందుమండల వాసిని కి వందనం.
ఓం శ్రీ బిందుమండలవాసిన్యై నమః
381. రహోయాగక్రమారాధ్యా
అంతర్యాగమునే రహోయాగమని అంటారు. రహ అంటే ఏకాంతము, రహస్యస్థలము.
బాహ్యంగా అందరికీ కనిపించేలా చేసే ప్రక్రియ బహిర్యాగమైతే, అంతరంలో రహస్యంగా చేసే
యాగమును రహోయాగము అంటారు. ఇది కేవలము మానసిక యాగము.
'అయమాత్మాబ్రహ్మ' అని మాండూక్యోపనిషత్తు లో చెప్పబడింది.
ఈ ఆత్మే బ్రహ్మము అని ఈ మహావాక్యము చెప్తోంది. ముందే చెప్పుకున్నాం.
మనమే అమ్మ అనీ, శరీరమే శ్రీచక్రమనీ.
బిందువు బ్రహ్మ రంధ్రము, మస్తకము త్రికోణము, అష్టకోణము లలాటము, అంతర్దశారము
భ్రూమధ్యము, బహిర్దశారము కంఠము, చతుర్దశారము హృదయము, అష్టదళము నాభి,
షోడశదళము కటి, భూపురము పాదాలుగా భావించండి.
మనలో నున్న అమ్మను దర్శించి పూజించటమే ఈ రహోయాగక్రమవిధానము.
ఈ విధానములో భక్తుడు, భగవంతుడు ఒక్కరే అనే విషయం మనసులో స్థిరపడాలి.
శ్రీమద్భాగవతంలో పోతన "తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ "
అంటాడు.
ఆ అమ్మను నమ్మితే ఆ దుర్గ మన మనస్సులలోనే ఉంటుంది. ఆ దుర్గను పూజించాలి.
ఎవడికైతే, ఈ సత్యం బోధపడుతుందో, వాడు జ్ఞాని. అప్పుడు జ్ఞానాగ్ని అనే చిదగ్ని జ్వలిస్తుంది.
ఆ చిదగ్నిలో మన పాపపుణ్యాలన్నింటినీ ఆహుతి చేస్తూ యాగం చేయాలి.
ఆ రహోయాగంలో పాపమూ, పుణ్యమూ కూడా పూర్తిగా దగ్ధమైపోవాలి. ఏదీ మిగలకూడదు.
అంటే, దేని యందునూ ఆసక్తి లేక, దేనినుంచీ ఏమీ ఆశించక, నిస్సంగుడై ఉండాలి.
ఏకాంతంగా భక్తి సాధన, దృఢవ్రతమే దీక్షగా ఈ రహోయాగక్రమాన్ని చేయాలి.
అట్టి ఆరాధన వలన మోక్షము లభిస్తుంది. కుండలినీ శక్తి లేచి, జీవుడిని చంద్రమండలం
వరకు తీసుకు వెళ్తుంది. అక్కడ సుధాధారాలు వర్షించి డెబ్బై రెండు వేల నాడులూ తడుస్తాయి.
అమృతత్వం లభిస్తుంది. ఈ రహోయాగం చేసే భక్తులను అమ్మ కటాక్షించి జీవుడిని
ఈశ్వరుడితో కలుపుతుంది. అదే జీవేశ్వర సంగమం. శివ పార్వతుల సంగమం. భక్తుల చేత
అంతర్యాగక్రమముతో ఆరాధించబడుతున్న, ఆ రహోయాగక్రమారాధ్య కు వందనం.
ఓం శ్రీ రహోయాగక్రమారాధ్యాయై నమః
ఓం శ్రీ రహస్తర్పణతర్పితాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
మీ వివరణ చాలా చాలా అద్భుతంగా ఉంది జీవుని యొక్క ఊర్ధ్వ గమన సాధనకు ఎంతో ఉపయోగపడుతుంది చాలా చాలా ధన్యవాదములు
రిప్లయితొలగించండి