24, అక్టోబర్ 2021, ఆదివారం

93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ కుళకుండాలయా, కౌళ మార్గ తత్పర సేవితా

 

కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ 
కుళకుండాలయా, కౌళ మార్గ తత్పర సేవితా ॥ 93 ॥

436. కుశలా

కుశలా అంటే నీటిని గ్రహించి తిరిగి నీటిని ఇచ్చేది అని ఒక అర్ధం.    

చంద్ర కాంతిని ధిక్కరించి ప్రకాశించేది అని ఇంకో అర్ధం.      

కుశలత అంటే నైపుణ్యం, నేర్పరితనం. శివునితో కలసి ఈ సృష్టిని తీర్చిదిద్దటంలో అమ్మ

నేర్పరి. మానవుని సృష్టించటంలో అమ్మ కౌశల్యము ఎంత పరిపూర్ణమైనదంటే, 

ప్రతి మానవుడినీ, సరియైన యోగసాధన చేస్తే, వాడిని శివుడంత వాణ్ని చేస్తుంది. 

కుశలుడంటే శివుడు అని కూడా అర్ధం. 

తన నేర్పరితనంతో జీవుడిని, శివుడిని చేయగల కుశల ఆ జగన్మాత. 

మానవుడే కాదు, సృష్టి లోని ప్రతి అంశమూ చక్కగా నిపుణత కలిగిన శిల్పి చెక్కిన శిల్పం వలె 

దోషరహితంగా ఏర్పరచింది ఆ జగన్మాత. 

దోషాలు వున్నాయి అంటే, అది తప్పకుండా ఆ జీవుడు చేసుకున్న కర్మ ఫలితమే. 

అది అనుభవించక తప్పదుకదా. 

ఘనమైన నైపుణ్యంతో సృష్టి కార్యమును శివునితో కలసి నిర్వర్తిస్తున్న, ఆ కుశల కు వందనం. 

ఓం శ్రీ కుశలాయై నమః  


437. కోమలాకారా

కోమలమైన ఆకారము కలది అని ఈ నామానికి అర్ధం. 

అమ్మ తనూలత ఎంత లావణ్యంగా ఉందో చెప్పుకున్నాం. 

అతి సన్ననైన నడుము ఆ  భారాన్నంతా ఎలా మోస్తోందో కదా అని ఆశ్చర్యపడ్డాం. 

అంత సన్నని నడుముతో తన గర్భంలో ఈ విశ్వాన్నంతా ఎలా భరిస్తోందా అని విభ్రమ చెందాం.  

అంత సన్నని సుకుమారమైన లత లాంటి తనువుతో నిత్య ప్రసూతియై ఈ భువనాలన్నింటినీ 

ఎలా, ఎప్పుడూ నూతనంగా ప్రసవిస్తోందో కదా అని అబ్బురపడుతూనే వున్నాం. 

ఎప్పటికప్పుడు అద్భుతాలను చేసే ఆ అమ్మను చూసి విస్మయం చెందుతూనే వున్నాం. 

సుకుమారమైన తనూలతతో, లావణ్యలతిక వలె శోభిల్లుతున్న, ఆ కోమలాకార కు వందనం.  

ఓం శ్రీ కోమలాకారాయై నమః  


438. కురుకుళ్లా  

కురుకుల్లా లేదా కురుకుళ్ళా అనే దేవీ స్వరూపురాలు అని ఈ నామానికి అర్ధం. 

మణిద్వీపంలో శ్రీపురం వున్నది.  అది ఎన్నో ప్రాకారాలతో శోభిల్లుతూ వున్నది.  

అక్కడ అహంకారము, చిత్తము అనే రెండు ప్రాకారాల మధ్య విమర్శ అనే ఓ దిగుడుబావి వున్నది.

ఆ బావిపై అధికారము వున్న దేవత పేరు కురుకుల్లా.  

లలితా స్తవ రత్నంలో కురుకుల్లా దేవి గురించి ఈ విధంగా వున్నది.

"కురుకుల్లా శరీరమంతా కుంకుమమును పూసుకుని ఉంటుంది, కులపర్వతాలకన్నా పెద్దవైన 

కుచములచే వంగిన నడుము కలది, కురువిందమణులపై కూర్చుని వున్నది" అని చెప్పారు. 

ఆ కురుకుల్లా దేవిని ధ్యానిస్తే, అహంకారానికి, చిత్తానికి మధ్యలో వున్న విమర్శను దాటుతాము. 

మనోవిజ్ఞానశాస్త్రములో కూడా చెప్పుకునేది ఇదే కదా. 

తంత్రరాజంలో కూడా ఈ కురుకుల్లా దేవి ప్రసక్తి వున్నది. ప్రాణనాడీ స్వరూపురాలు. 

తనను ఉపాసించే భక్తులను చిత్తాహంకారముల మధ్యలో గల, విమర్శలో పడి 

మునిగిపోకుండా రక్షించే, ఆ కురుకుళ్ల కు వందనం. 

ఓం శ్రీ కురుకుళ్లాయై నమః  


439. కులేశ్వరీ 

కులము అంటే సజాతీయత అని చెప్పుకున్నాం. కులేశ్వరీ అంటే ఆ సజాతీయులకు ఈశ్వరి. 

మాతృ మాన మేయములు అంటే కొలిచేవాడు, కొలత, కొలవబడేది. 

ఇవి సజాతీయములు, అంటే ఈ మూడూ ఒక కులము. ఒక సమూహము. 

కురుకుల్లా దేవి ఆ కులమునకు ఈశ్వరి. కనుక, ఆ దేవిని కులేశ్వరీ అంటున్నాం. 

సజాతీయతను బట్టీ కులములను ఏర్పరచి పాలించే, ఆ కులేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ కులేశ్వర్యై నమః 

  

440. కులకుండాలయా

 కులకుండలమందు నివసించునది అని ఈ నామానికి అర్ధం. 

కులకుండలం అంటే మూలాధారం వద్ద వున్న బిందు స్థానం అని చెప్పుకున్నాం. 

అదే కుండలినీ స్థానం. కుండలినీ శక్తి అక్కడ మూడున్నర చుట్లు చుట్టుకున్న పామువలె 

తల కప్పుకుని పడుకుని ఉంటుంది. కనుకనే ఆ బిందు స్థానాన్ని కులకుండలం అన్నాం. 

కులకుండలంలో ఉండేది కుండలినీ శక్తి. అదే శక్తి కూట స్థానం.  

కుండలినీ రూపంలో కులకుండలంలో నిద్రావస్థలో వున్న, ఆ కులకుండాలయ కు వందనం. 

ఓం శ్రీ కులకుండాలయాయై నమః 


441. కౌళ మార్గ తత్పర సేవితా 

కౌళము, కౌలము, కులము అన్నీ ప్రత్యామ్నాయ పదాలు. 

కుల మార్గము అంటే, వంశానుగతంగా వస్తున్న పద్ధతి, ఆచారము, సంప్రదాయము. 

వంశములో పెద్దలేర్పరచిన విధముగా, తత్పరతతో పూజాదికాలు చేసి సేవించే  

వారి పూజను ఇష్టపడునది అని ఈ నామానికి అర్ధం. 

ఇక్కడ వంశము అంటే, తాత తండ్రుల వంశం, లేదా గురు పరంపరగా ఏర్పడినది, 

లేదా కులము, వర్ణమును బట్టీ ఏర్పడిన సంప్రదాయం అని తెలుసుకోవాలి. 

సమయాచారము, మిశ్రాచారము, కౌలాచారము అని మూడు పద్ధతులు వున్నాయి. 

సమయాచారమంటే వైదికము, మిశ్రాచారమంటే వైదిక తాంత్రికముల మిశ్రమం. 

కౌలాచారమంటే తాంత్రికము. ఈ తంతులన్నీ కుల పెద్దలు నిర్దేశించి వుంచారు. 

వంశంలో, కులంలో, గోత్రంలో, పరంపరగా పాటించే కొన్ని నియమాలు, పద్ధతులు ఉంటాయి. 

పెద్దలు తమ అనుభవాల ద్వారా, కొన్ని ఉపాసనా విధానాలను ఏర్పరచి వుంటారు. 

ఆ పెద్దలను ధిక్కరించి చేసే ఉపాసనల కన్నా, పెద్దలు నియమించిన విధానంలో 

పూజించిన వారిపై ఆసక్తి కల తల్లి లలితా పరమేశ్వరి. 

తంత్ర శాస్త్రము లన్నింటిలో ఈ విషయము స్పష్టముగా చెప్పబడింది. 

అనుక్రమంగా వస్తున్న పూజలు, కైంకర్యాలు, నైవేద్యాలు పాటించేవారి 

సేవలను ప్రీతితో స్వీకరించునది అని భావార్ధం. 

పూజలు త్వరగా ఫలించాలంటే, కౌళమార్గాన్ని అనుసరించమని ఈ నామం సూచిస్తోంది. 

కులములో, వంశములో పెద్దలు చెప్పిన పద్దతిలో, తత్పరతతో, సేవించేవారి సేవలను

స్వీకరించే, ఆ కౌళ మార్గ తత్పర సేవిత కు వందనం. 

ఓం శ్రీ కౌళ మార్గ తత్పర సేవితాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి