21, అక్టోబర్ 2021, గురువారం

90. చిచ్ఛక్తిః, చేతనారూపా, జడశక్తిః, జడాత్మికా గాయత్రీ, వ్యాహృతిః, సంధ్యా, ద్విజబృంద నిషేవితా

 

చిచ్ఛక్తిః , చేతనారూపా, జడశక్తిః, జడాత్మికా 
గాయత్రీ, వ్యాహృతిః, సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥

416. చిచ్ఛక్తిః 

చిత్ అంటే చైతన్యము. చిత్ శక్తి, చిచ్ఛక్తి అంటే మహా చైతన్య శక్తి. 

శక్తి రెండు రకాలు. ఒకటి చైతన్యపూరితమైనది, రెండవది జడమైనది. 

అమ్మవారిని ఈ నామంలో చైతన్య పూరితము అని చెప్పుకుంటున్నాం. 

ఆ చిచ్ఛక్తియే సామర్ధ్యము. చిచ్ఛక్తియే సర్వత్రా వుండే చైతన్యము. 

చైతన్యము, విద్య అంటే అజ్ఞానమును పోగొట్టే సామర్ధ్యము అని శ్వేతాశ్వతరోపనిషత్ చెప్పింది. 

సర్వభూతము లందూ శక్తి వున్నది. శక్తి ఉంటే శివము, శక్తి లేకపోతే శవము. 

చిత్ శక్తి అంటే ఔపమ్యశక్తి అని పాణిని స్మృతిలో చెప్పబడింది. 

సర్వప్రాణులలోనూ ఉపమా శక్తి  రూపములో వున్న, ఆ చిచ్ఛక్తి కి వందనం. 

ఓం శ్రీ చిచ్ఛక్త్యై నమః  


417. చేతనారూపా

ఈ నామానికి అమ్మవారు సర్వచైతన్య స్వరూపురాలు అని అర్ధం. 

"సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్" 

అని సర్వ గాయత్రీమంత్రం చెప్తోంది. సర్వ చైతన్య రూపాలకూ ఆద్యురాలు, ఆదివిద్య 

 శ్రీలలిత అని చెప్తూ, ఆ తల్లిని బుద్ధి ప్రచోదనం చేయమనే ప్రార్ధన ఇది. 

పరమేశ్వరుని నిర్మల చిచ్ఛక్తియే చైతన్యస్వరూపము. చేతనము యొక్క రూపమే శ్రీలలిత. 

జ్ఞానము, ఆదివిద్య, చైతన్యము రూపు దాల్చిన, ఆ చేతనారూప కు వందనం.  

ఓం శ్రీ చేతనారూపాయై నమః  


418. జడశక్తిః

శక్తి రెండు రూపాలుగా వున్నదని, ఒకటి చైతన్యమైతే, రెండవది జడమని చెప్పుకున్నాం. 

చైతన్యము కానిది జడమే. మాయా శక్తి చేత ఏర్పడిన వస్తు స్వరూపమే జడశక్తి. 

చైతన్యము చిచ్ఛక్తి అయితే, జడము జడశక్తి. వస్తువులు, ప్రాణులు అన్నీ శక్తి స్వరూపాలే. 

ప్రాణిలో వున్నది చైతన్య శక్తి అయితే, వస్తువులో వున్నది జడశక్తి. అన్నీ ఆ జగదీశ్వరి సృష్టే. 

దేహములో వున్న ప్రాణము చైతన్యమైతే, దేహములోని ధాతువులు జడము. 

పైకి సృష్టి అంతా బ్రహ్మ చేస్తున్నట్టు కనబడినా, బ్రహ్మకు ఆ శక్తి ఇచ్చింది అమ్మ కనుక, 

అసలైన సృష్టికర్త ఆ జగజ్జనని మాత్రమే. ఆ తల్లి సృష్టించిన ప్రతిదీ ఆ అమ్మ రూపమే. 

జడమును సృష్టించిన జగన్మాత జడశక్తి స్వరూపము. 

స్థూల పదార్ధము లందు జడముగా వున్న, ఆ జడశక్తి కి వందనం. 

ఓం శ్రీ జడశక్త్యై నమః  


419. జడాత్మికా

జడాత్మికా అంటే జడశక్తియే ఆత్మగా కలిగినది అని అర్ధం. 

దృశ్యము జరుగుతున్నంత సేపూ అది చైతన్యము. జరిగిపోయిన తరువాత అదే జడము. 

కంటికెదురుగా కనిపించిన ప్రతిదీ మాయా స్వరూపమే. 

చిత్తులో వున్నదీ ఆ లలితాపరమేశ్వరియే, జడములో వున్నదీ ఆ అమ్మే అని తెలిసి

అన్నింటినీ సమదృష్టితో చూడగల వాడే పండితుడు. పండిపోయినవాడు. 

'పండితాః సమదర్శనః' అని భగవద్గీతలో కర్మసన్న్యాసయోగంలో కూడా చెప్పారు. 

జడమూ, చైతన్యమూ రెండూ అమ్మ స్వరూపాలే అని గుర్తించగలగాలి. 

జడములలో శక్తి రూపములో వున్న, ఆ జడాత్మిక కు వందనం. 

ఓం శ్రీ జడాత్మికాయై నమః 

  420. గాయత్రీ

"న గాయత్ర్యామ్ పరం మంత్రం, న మాతుః పరదైవతం" అని ఆర్యోక్తి. 
అంటే, గాయత్రిని మించిన మంత్రమూ లేదు, తల్లిని మించిన దైవమూ లేదు. 

గాయత్రీ అంటే, మంత్రస్వరూపిణి, వేదమాత. విశ్వామిత్రుడు దర్శించిన వేదజనని.  

బ్రహ్మకు సరస్వతి, సావిత్రి, మరియు గాయత్రి అను ముగ్గురు భార్యలు వున్నారని 

గాయత్రీకల్పములో వున్నది. ఒకే శక్తి  ప్రాణాలు రక్షించేటప్పుడు గాయత్రిగా, 

తేజోరూపములో వున్నప్పుడు సావిత్రిగా, వాగ్రూపములో వున్నప్పుడు సరస్వతిగా ఉంటుంది. 

గాయత్రీ అనే ఒక గోపకన్యను తెచ్చి విష్ణువు బ్రహ్మకిచ్చి వివాహము చేసాడని పద్మపురాణంలో, 

పుష్కర ఖండంలో చెప్పారు. పుష్కరక్షేత్రములో కొండపై నేటికీ కొలువై వున్న దేవత గాయత్రి. 

"గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులు చెప్పారు.

గయలు అంటే ప్రాణములు. మననము చేస్తే, ప్రాణములను రక్షించేది గాయత్రీ మంత్రం. 

తన మంత్రమును గొంతెత్తి గానము చేస్తే, ప్రాణములను రక్షించునది అని కూడా అర్ధం. 

కూర్మపురాణంలో గాయత్రి అనేది ఒక ఛందస్సు స్వరూపం అని చెప్పారు.  

ఆ ఛందస్సులో స్వరయుక్తంగా గాయత్రీ మంత్రాన్ని గానం చెయ్యవచ్చు. 

సకలదేవతలకూ గాయత్రీ మంత్రాలున్నాయి. ఆ మంత్రాల ద్వారా ఆయా దేవతలు 

ఉపాసకులని అనుగ్రహిస్తూ వుంటారు. స్త్రీలు, ఉపనయనం కానివారు గాయత్రి చెప్పరాదని 

ఒక నియమం వున్నది. అటువంటి వారి కోసం ఋషులు సర్వగాయత్రి అనే మంత్రాన్ని ఇచ్చారు.

మననము చేసినా, గానము చేసినా, ప్రాణములను రక్షించే, ఆ గాయత్రి కి వందనం. 

ఓం శ్రీ గాయత్ర్యై నమః 

421. వ్యాహృతిః

అమ్మవారు ఉచ్చారణ రూపములో వుండు వ్యాహృతీ మంత్రస్వరూపురాలు అని అర్ధం. 

వ్యాహృతి అంటే ఉచ్చారణ. 

గాయత్రీ మంత్రానికి ముందు చెప్పే 'ఓం భూర్భువస్సువః' అనేది ఒక వ్యాహృతీ మంత్రం. 

బ్రహ్మచే మొట్టమొదట ఉచ్చరించబడిన ఈ వ్యాహృతి వలన గాయత్రీ మంత్రం 

మరింత శక్తివంతమైనది. వ్యాహృతులు పరబ్రహ్మకు అంగముల వంటివి. 

భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం, అనేవి సప్త వ్యాహృతులు. ఇవే ఊర్ధ్వలోకాలు. 

ఉచ్చారణ రూప పరమేశ్వరే వ్యాహృతి. ఉచ్చారణ స్వరూపురాలయిన, ఆ వ్యాహృతి కి వందనం. 

ఓం శ్రీ వ్యాహృత్యై నమః 


422. సంధ్యా

సంధ్యాకాలములో ఉపాసింపబడే దేవతామూర్తి సంధ్యా. 

కాళికా పురాణం ప్రకారం సంధ్యాదేవి బ్రహ్మ మానసపుత్రి. 

రేణుకా పురాణంలో సంధ్య నాడీత్రయ స్వరూపురాలు అని చెప్పబడింది. 

ఇడా నాడికి మహాకాళి అని, పింగళా నాడికి మహాలక్ష్మి అని, 

సుషుమ్నా నాడికి ఏకవీర అనీ పేరు. ఈ మూడు నాడుల స్వరూపమే సంధ్య. 

ఒక సంవత్సరము వయసు గల బాలికలను కూడా సంధ్య అంటారు. 

సూర్యుని చైతన్యమునకూ, ఈ సంధ్యకూ అభేదము. సంధ్య అంటే సంధి కాలము. 

సూర్యోదయమునకు, సూర్యాస్తమయమునకూ  ముందూ, తరువాత వున్న మధ్య కాలము సంధి. 

రెండు పక్షముల మధ్య వున్న కాలము సంధి. రెండు మాసముల మధ్యా, రెండు రాశుల మధ్యా, 

రెండు నక్షత్రాల మధ్యా వున్న కాలమును సంధ్యాకాలమంటారు. 

ఒక దినమును రెండు సంధ్యలు, మూడు సంధ్యలు, అయిదు సంధ్యలు అని 

విభజించి సంధ్యావందనం అనే ఉపాసన చేసే ఆచారం వుంది.   

అందువలన ఈ దేవతను సంధ్యాకాలమందు ఉపాసించటం జరుగుతోంది. 

సంధ్యా కాల ఉపాస్య దేవత అయిన, ఆ సంధ్య కు వందనం. 

ఓం శ్రీ సంధ్యాయై నమః 


423. ద్విజబృందనిషేవితా

ద్విజబృందములచే ఉపాసింపబడే దేవత అని ఈ నామానికి అర్ధం. 

ద్విజులంటే  రెండుసార్లు జన్మించినవారు. మాతృగర్భమందు జనించటం మొదటిజన్మ అయితే, 

తండ్రి నుంచి గాయత్రీ మంత్రం దీక్ష తీసుకుని, ఉపనయన సంస్కారము చేత కలిగినది రెండవ 

జన్మ. రెండుసార్లు జన్మించారు కనుక, వీరిని 'ద్వి జ' అన్నారు. 

ఉపనయనార్హులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ద్విజులంటారు. 

వీరే కాక అండజములు కూడా ద్విజులు. అవి అండముగా ఒకసారి, ప్రాణిగా మరోసారి పుడతాయి. 

ఈ పక్షులు, జలచరములు, సరీసృపాలన్నీ కూడా అమ్మను సేవిస్తూ ఉంటాయి. 

ఇవి అన్నీ ద్విజబృందములోని జీవులే. సంధ్యాకాలములో ద్విజులచే సేవింపబడే దేవత కనుక, 

అమ్మను ఈ నామంలో ద్విజబృందనిషేవితా అంటున్నాం. 

ఈ సంధ్యోపాసన చేసినవారికి బ్రహ్మవిద్యను అందుకునే అర్హత లభిస్తుంది. 

రేణుకాపురాణంలో సంధ్యోపాసన సర్వకాల సర్వావస్థల యందు చేయవచ్చునని చెప్పబడింది. 

ద్విజ బృందములచే సంధ్యాకాలములో సేవింపబడే, ఆ ద్విజబృందనిషేవిత కు వందనం. 

ఓం శ్రీ ద్విజబృందనిషేవితాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి