19, అక్టోబర్ 2021, మంగళవారం

88. భక్తహార్ద తమోభేద భానుమద్భానుసంతతిః శివదూతీ, శివారాధ్యా, శివమూర్తిః, శివంకరీ

 

భక్తహార్ద తమోభేద భానుమద్భానుసంతతిః 
శివదూతీ, శివారాధ్యా, శివమూర్తిః, శివంకరీ ॥ 88 ॥

404. భక్త హార్ద తమో భేద భానుమద్భాను సంతతిః  

భక్త హార్ద తమో భేద అంటే భక్తుల హృదయాల లోని తమస్సును భేదిస్తున్నది అమ్మవారు 

అని చెప్పడం. ఆ తమస్సనే అజ్ఞానపు చీకటిని చించడానికి, అమ్మ భానుమత్---భానుడి వలే, 

భాను సంతతి అయిన భాను కిరణముల వలె వున్నదని ఈ నామంలో చెప్తున్నారు.

సత్వరజస్తమో గుణాలలోని తమస్సు పూర్తిగా అంధకారమయం. 

ఆ చీకటిని పోగొట్టడానికి వెలుగు కావాలి. కొద్దిపాటి చీకటికి చిరుదివ్వె చాలు.   

కానీ అంతరాంతరాలలో పేరుకుపోయిన చీకటిని పోగొట్టాలంటే బృహత్ కాంతి కావాలి. 

ఆ బృహత్ కాంతే సూర్యుడి కిరణాలు. నిద్ర అనే మత్తు నుంచి లేపేది కూడా ఈ వెలుగే. 

తమస్సు కూడా అంతకు మించినదైతే, సూర్యుడు కూడా లేపలేడు. 

ఈ తామసీరూపానికి కుంభకర్ణుడు ఉదాహరణ. ఆ మత్తు నుంచి అతడిని లేపడానికి ఎంతో 

ప్రయత్నం కావాల్సి వచ్చింది. అన్నదమ్ములు ముగ్గురూ మూడు గుణాలకు ప్రతినిధులు. 

పరమేశ్వరి తన భక్తుల హృదయాలలో అలా పేరుకు పోయిన, కరుడు కట్టిన అజ్ఞానాంధకారం 

తొలగించడానికి భానుడి వలే భాను కిరణాలను ప్రయోగిస్తుంది. 

అజ్ఞానమనే చీకటిలో మగ్గుతున్న భక్తుల హృదయాలలో సూర్యుడి వలె వెలుగులు నింపే, 

ఆ భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి కి వందనం. 

ఓం శ్రీ భక్తాహార్దతమోభేదభానుమద్భానుసంతత్యై నమః  


405. శివదూతీ 

తనతో ఉండి, తనను సుఖపెట్టమని వర్తమానం పంపిన శుంభనిశుంభుల వద్దకు, 

తన దూతగా శివుడిని పంపింది. అందుకే ఆ మాహేశ్వరి పేరు శివదూతీ. 

శుంభనిశుంభులు అంబికాదేవి అందానికి మోహించి, తమతో వుండి, తమను సుఖపెట్టమని 

దూతలుగా చండ ముండులని, రక్తబీజ, ధూమ్రాక్షులనీ పంపిస్తారు. 

అమ్మ ఆ రాక్షసులను సంహరించి, ఆ తరువాత శివుడిని దూతగా పంపుతూ, 

తనను యుద్ధంలో ఓడిస్తే, వశమవుతానని రాయబారం పంపుతుంది. 

భార్యకు, భర్త ఈ రకమైన విశేషానికి దూతగా వెళ్లడం ఓ అద్భుతం. 

ఆ తరువాత యుద్ధంలో ఆ శుంభనిశుంభులు కూడా నిర్జింపబడతారు. 

పార్వతీ పరమేశ్వరులు ఆనందంగా కైలాసానికి తిరిగి వెళతారు. 

పద్మపురాణంలో పుష్కర క్షేత్రంలో శివదూతి అనే దేవత వుంది అని చెప్పారు. 

శివుడిని దూతగా పంపిన, శివుడిని దూతగా కలిగిన, ఆ శివదూతి కి వందనం.  

ఓం శ్రీ శివదూత్యై నమః  


406. శివారాధ్యా 

శివుని చేత ఆరాధించబడే శక్తి శివారాధ్యా. ఎవరైనా శక్తి ఆరాధన చెయ్యవలసినదే. 

లయం చెయ్యడానికి కూడా శక్తి కావాలి. లయకారుడైన శివుడికి శివానీ తోడుగా ఉంటుంది. 

శ్రీవిద్యను ఉపాసించిన ప్రధములలో శివుడు కూడా ఒకడు. అందువలన ఆమె శివారాధ్యా. 

బ్రహ్మాండ పురాణంలో శివుడు, ఆ శ్రీదేవిని ఉపాసించి, ధ్యాన యోగంలో సర్వసిద్ధులూ పొంది,

అర్ధ నారీశ్వరుడు అయ్యాడు అని చెప్పారు. 

శివునిచే ఆరాధింపబడే, ఆ శివారాధ్య కు  వందనం. 

ఓం శ్రీ శివారాధ్యాయై నమః  


407. శివమూర్తిః 

శివము అంటే మంగళకరం. మంగళములు చేకూర్చే రూపం శివమూర్తి రూపం. 

మంగళ ద్రవ్యాలు, మంగళ కార్యాలు ఇష్టపడేది శివమూర్తి.

శక్తి, శివులకు అభేదం. శివుడే శక్తి, శక్తే శివుడు. అందుకే అమ్మవారిని శివమూర్తీ అన్నారు. 

మంగళములు కలిగించేది శివమూర్తి స్వరూపం. మోక్షాన్ని కలిగించేది శివమూర్తీ. 

మాయా రుద్రుడు, ప్రతి ప్రాణిలోనూ గుప్తంగా ఉంటాడు, ఆత్మజ్ఞానం తెలిసినవాడికి,

ఈ సత్యం బోధ పడుతుంది. అజ్ఞానికి అవిద్య అడ్డం వచ్చి మాయ కమ్మేస్తుంది. 

మాయా రుద్రుని రూపంలో అందరిలో ఉండే శక్తి కనుక ఆమె శివమూర్తీ.  

శివరూపమే తానైన, ఆ శివమూర్తి కి వందనం. 

ఓం శ్రీ శివమూర్త్యై నమః 

  

408. శివంకరీ 

శివునిగా చేసేది శివంకరీ. శివంకరీ శక్తి , తన భక్తులకు జ్ఞానమును, మోక్షమును ఇచ్చి 

శివ సాయుజ్యమును కలుగచేస్తుంది. శివునితో సాయుజ్యమును పొందిన భక్తులు 

స్వయంగా శివునితో సహవాసము చేస్తూ శివస్వరూపంగా మారతారు.   

మంగళములను చేయునది శివంకరీ. బ్రహ్మ జ్ఞానాన్నిచ్చేది శివంకరీ. 

మోక్షాన్నిచ్చేది శివంకరీ. శివునితో తాదాత్మ్యాన్ని కలుగచేసేది శివంకరీ. 

తన భక్తులను శివునిగా మార్చే, ఆ శివంకరి కి వందనం. 

ఓం శ్రీ శివంకర్యై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి