16, అక్టోబర్ 2021, శనివారం

85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ నిత్యాషోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ

 

నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ 
నిత్యా షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥

388. నిత్యక్లిన్నా 

నిత్యక్లిన్నా అంటే సదా ఆర్ద్ర హృదయముతో వుండే జగదీశ్వరి అని భావం. 

అమ్మ తన పిల్లల పట్ల ఎప్పుడూ దయార్ద్ర హృదయంతో ఉంటుంది. ఎప్పుడూ అందరినీ

ఉద్దరించాలని చూస్తూ ఉంటుంది. ఎవరి భాగఫలం వారికి ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటుంది. 

దుష్టులను మంచిదారికి తీసుకురావడానికి వారిని హెచ్చరిస్తూనే ఉంటుంది. 

గరుడపురాణంలో భోగము, మోక్షములను ఇచ్చే తల్లి త్రిపుర అని చెప్పారు. 

తిథి నిత్యాదేవతలలో మూడవ దేవత నిత్యక్లిన్నా. 

దయార్ద్ర హృదయముతో ఉపాసకులకు భోగ మోక్షముల నిచ్చే, ఆ నిత్యక్లిన్న కు వందనం. 

ఓం శ్రీ నిత్యక్లిన్నాయై నమః  


389. నిరుపమా  

పోలిక లేనిది, ఉపమానము లేనిది నిరుపమా. ఈ జగజ్జనని వంటివారు మరెవ్వరూ లేరు. 

ఈ తల్లికి సమానమూ ఎవరు లేరు. సాటీ ఎవరూ లేరు. సరిసాటి ఎవరూ లేనిది నిరుపమా. 

ఈ తల్లి చూపే దయలో కానీ, ఇచ్చే జ్ఞానము, మోక్షములో కానీ మరెవ్వరితో సాటి లేనిది 

అని అర్ధం. పదునాలుగు భువనాలనూ పరిపాలించే శ్రీ మహారాజ్ఞికి మరొకరితో పోలిక 

ఎలా వుంటుందీ. త్రిమూర్తులను పర్యవేక్షిస్తూ, సరిసాటి లేని తన పరిపాలనతో 

ముజ్జగాలనూ నిర్వహిస్తున్నది ఆ జగజ్జనని శ్రీలలిత కాక మరి ఎవ్వరు. 

అనుపమ సౌందర్యము, అనుపమ కార్యనిర్వహణా సామర్ధ్యము గల, ఆ నిరుపమ కు వందనం.  

ఓం శ్రీ నిరుపమాయై నమః  


390. నిర్వాణసుఖదాయినీ 

వాణము, బాణము అంటే శరీరము అని అర్ధము. వ, బ లు ప్రత్యామ్నాయంగా వాడుతూనే

ఉంటాం. అవి అభేదము. వేదములో శరీరాన్ని బాణమని చెప్పారు. 

నేటికీ నీటిలో లింగస్వరూపాలుగా లభించే శిలలను బాణాలు అంటూ ఉంటాం. 

గీర్వాణము అంటే వాక్కే శరీరముగా కలది అని అర్ధం చెప్పారు. 

నిర్వాణము అంటే శరీరము లేనిది అని అర్ధం. శరీరం క్షరం, నశ్వరం.  

శరీర రహితమైనది అక్షరం, అనశ్వరం. నిర్వాణము అంటే శరీరము లేకపోవడం. 

అంటే దేహం పడిపోవడం. నిర్వాణంలో కూడా సుఖమును ఇచ్చేది నిర్వాణసుఖదాయినీ. 

శరీరంలో వున్నప్పుడు పొందే సుఖము స్వల్పం. శరీరం పడిపోయాక వచ్చే సుఖము శాశ్వతం.  

శరీర బంధనాన్ని దాటిన తరువాత పొందే సుఖానికి అవధులు లేవు. 

అనిరుద్ధుడు అంటే, ఎవరికీ లొంగనివాడు. ఆ అనిరుద్ధుడు కూడా బాణుడికి బద్ధుడయ్యాడు. 

అప్పుడు పరమాత్మ శ్రీకృష్ణుడే వచ్చి బాణుడిని సంహరించి అనిరుద్ధుడికి స్వేచ్ఛను ఇచ్చాడు. 

ఎవరికీ లొంగని జీవుడు శరీరానికి, బాణుడికి, బద్ధుడైతే స్వేచ్ఛను కోల్పోతాడు. 

అప్పుడు పరమాత్మను శరణు వేడితే, ఆ బాణుడి నుండి కాపాడి నిర్వాణసుఖాన్నిచ్చాడు. 

శరీరము చేత బంధింపబడినప్పుడు స్వేచ్ఛ ఉండదు. సుఖము కొంచెము. 

ఆ శరీరము నుండి బయటపడితే, విశ్వమంతా సంచరించే స్వేచ్ఛ, ముక్తి, సుఖము లభిస్తాయి. 

హద్దులు లేని సుఖమే మోక్షము. కూర్మపురాణంలో పార్వతీదేవి హిమవంతునితో చెప్తుంది, 

నన్ను భక్తితో, విశ్వాసముగా ఉపాసించినవారికి అఖండ సుఖాన్నిస్తాను, అని. 

ఆ అఖండ సుఖమే మోక్షము. అదే నిర్వాణ సుఖము. 

తనను విశ్వాసముతో నమ్మి, కొలిచే ఉపాసకులకు  మరణానంతరము కూడా 

అనంత సుఖాన్నిచ్చే, ఆ నిర్వాణసుఖదాయిని కి వందనం. 

ఓం శ్రీ నిర్వాణసుఖదాయిన్యై నమః  


391. నిత్యాషోడశికారూపా 

అమ్మవారు పదహారు నిత్యల రూపములో ప్రకాశించునది అని అర్ధం. 

షోడశీ మంత్ర స్వరూపురాలు ఆ శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి.

షోడశీ గ్రహయాగములచే సంతోషించునది అని ఈ నిత్యాషోడశికారూపా అనే నామానికి అర్ధాలు. 

పదహారు తిథులకూ పదహారు తిథి నిత్యా దేవతలున్నారు. 

శ్రీదేవీ ఖడ్గమాలాస్తోత్రంలో ఈ పదహారుగురి పేర్లూ చెప్పారు. వారు, కామేశ్వరి, భగమాలిని, 

నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, 

నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర, మహానిత్య.  ఈ పదహారుగురు దేవతల 

స్వరూపమే శ్రీ లలిత. వీరందరూ అమ్మవారికి అంగదేవతలు. 

చంద్రునిలో ప్రతిదినమూ ఒక కళతో,  పాడ్యమి తిథి దేవత అయిన కామేశ్వరి నుంచి, 

దినమున కొక కళ చొప్పున పెంచుకుంటూ, పౌర్ణమి తిథి దేవత చిత్ర వరకూ వృద్ధి చెందుతుంది. 

తరువాత దినమున కొక్క కళ చొప్పున తగ్గుతూ, అమావాస్య దేవత అయిన మహానిత్య స్థితికి 

వస్తుంది. ఉపాసకులకు, సాధకులకు అమావాస్య పరిపూర్ణమైన మహానిత్యా స్వరూపం. 

నిజంగా చూసే దృక్కు ఉంటే, అమావాస్య చంద్రునిలో పదహారు కళలూ కనిపిస్తాయి.  

అదే అమ్మవారి షోడశీ స్వరూపము. అందుకే అమ్మ నిత్యా షోడశికా రూపా.   

షోడశీ మంత్ర జపం అంటే అమ్మకు ఎంతో ప్రీతి. కోటి వాజపేయయాగములు చేసినా, 

కోటి షోడశీ యాగములు చేసినా ఎంత సంతోషిస్తుందో, ఒక్కసారి షోడశీ మంత్రం 

ఉచ్చరించినా, శ్రీదేవి అంతే సంతోషిస్తుంది, అని శక్తిరహస్యంలో చెప్పారు.   
 
నిత్యమూ తన  పదహారు కళలతో శోభిల్లుతున్న, ఆ నిత్యాషోడశికారూప కు వందనం. 

ఓం శ్రీ నిత్యాషోడశికారూపాయై నమః 

  

392. శ్రీకంఠార్ధశరీరిణీ 

 శ్రీ శబ్దానికున్న ఎన్నో అర్ధాలలో విషము అనే అర్ధం కూడా వున్నది. 

విషాన్ని కంఠంలో దాచినవాడు గరళకంఠుడు, పరమేశ్వరుడు. 

ఆ పరమేశ్వరునికి అర్ధ శరీరంగా వున్నది శ్రీలలిత, శ్రీ కంఠార్ధ శరీరిణీ.

బృహదారణ్యకోపనిషత్తులో, ముందుగా వున్నది పరమాత్మ ఒక్కటే, 

అదే తనని తాను అది రెండుగా విభజించుకున్నది. ఒక అర్ధభాగము నల్లగాను, 

రెండవ అర్ధ భాగము తెల్లగాను ఏర్పడింది అని వుంది. 

ఆ తెలుపే శివుడు, ఆ నలుపే కాళి. ఈ రెండూ కలిస్తేనే పరిపూర్ణం. 

శివుడు తెలుపయినప్పుడు కాళీ నలుపు. శివుడు నలుపైనప్పుడు గౌరీ తెలుపు. 

శుక్లపక్షంలో అమ్మ తెలుపు, అయ్య నలుపు, కృష్ణ పక్షంలో అమ్మ నలుపు, అయ్య తెలుపు.   

అష్టమి నాడు ఇద్దరూ చెరి సగం కనిపించి, అర్ధనారీశ్వర రూపంలో వుంటారు. 

అర్ధనారీశ్వరరూపంలో అందరినీ కటాక్షిస్తున్న, ఆ శ్రీకంఠార్ధశరీరిణి కి వందనం. 

ఓం శ్రీ శ్రీకంఠార్ధశరీరిణ్యై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి