6, అక్టోబర్ 2021, బుధవారం

75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ

 

విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ 
విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥

334. విశ్వాధికా 

విశ్వము కన్నా అధికురాలు విశ్వాధికా. శివుడు అవ్యక్తుడు, శ్రీదేవి వ్యక్త స్వరూపము. 

వేదాలలో ఈ విశ్వాధిక తత్వం పురుషపరంగా చెప్పబడింది. శివునికి, శక్తికి అభేదము కనుక 

ఈ విశ్వాధిక తత్వము శ్రీలలితది. శివునితో కూడి ఈ సమస్త విశ్వాన్నీ సృష్టించిన శక్తి కనుక 

ఈ జగన్మాత ఆ విశ్వము కన్నా అధికురాలు. క్షితిశక్తి నుంచి శివశక్తి వరకూ సమస్త శక్తులూ 

ఈ జగన్మాత సృష్టే కనుక వీటన్నింటి కన్నా అధికురాలు ఈ విశ్వాధికా. 

విశ్వమునే సృజించి, విశ్వము కన్నా అధికురాలయిన, ఆ విశ్వాధిక కు వందనం. 

ఓం శ్రీ విశ్వాధికాయై నమః  


335. వేదవేద్యా 

వేదముల చేత తెలుసుకోగలిగినది కనుక ఈ మాతను వేదవేద్యా అంటున్నాం. 

అమ్మవారు నివసించే చింతామణీ గృహానికి నాలుగు ద్వారాలు. నాలుగు వేదములే ఆ ద్వారాలు. 

వేదములనే ఆ ద్వారముల నుండి వెళ్తే, ఈ విశ్వాధికతత్వాన్ని అర్ధం చేసుకోగలం. 

నాలుగు వేదములూ లలితపరమేశ్వరిని చేరుకోవడానికి నాలుగు మార్గములు. 

ఈ సత్యము తెలిసినవాడే వేదవిదుడు. ఈ జ్ఞానమును కలిగిన వాడే జ్ఞాని. 

వేదములు శుద్ధవిద్యలు. ఆ శుద్ధవిద్యలను రూపొందించినది ఆ శ్రీవిద్యా స్వరూపిణి  శ్రీదేవి.

ఋగ్వేదము తూర్పుదిక్కుకు, యజుర్వేదము దక్షిణ దిక్కుకు, సామవేదము ఉత్తర దిక్కుకు, 

అధర్వణ వేదము పశ్చిమ దిక్కుకూ ద్వారములు. 

ఋగ్వేద దేవతల ద్వారా శుద్ధ విద్య, యజుర్వేద దేవతల ద్వారా సౌభాగ్య విద్య, 

సామవేద దేవతల ద్వారా లోపాముద్రా విద్య, అధర్వణ వేద దేవతల ద్వారా 

తురీయాంబా విద్య తెలియబడుతున్నాయి.

ఆ లలితా స్వరూపమును తెలుసుకోవడానికి వేదములే సాధనములు. 

వేదముల ద్వారా తెలియబడుచున్న, ఆ వేదవేద్య కు వందనం.  

ఓం శ్రీ వేదవేద్యాయై నమః  


336. వింధ్యాచల నివాసినీ

వింధ్యపర్వతాల్లో నివసించే దేవత అని ఈ నామానికి అర్ధం.  

పద్మ పురాణం ప్రకారం, వింధ్యవాసినీదేవి, యశోదా నందుల పుత్రిక నందాదేవిగా జన్మించి, 

శ్రీకృష్ణుడికి బదులు తానే దేవకీ, వసుదేవుల పుత్రికగా భ్రమ కల్పించింది. 

యోగమాయయై ఆకాశమార్గాన నిలిచి, కంసుడికి బుద్ధి చెప్పింది. 

ఈ యోగమాయయే తిరిగి దేవకీ వసుదేవులకు సుభద్రగా జన్మించిందని విశ్వాసం. 

ఈ నాటికీ సుభద్రను మాయాశక్తి రూపంలో పూరీ అని పిలువబడే జగన్నాథపురిలో కొలుస్తారు. 

ఆ తరువాత వింధ్యాచలాన్ని చేరి దానిపై వింధ్యవాసినీ దేవిగా పూజలందుకుంటోంది. 

దేవతలను పీడిస్తున్న, శుంభనిశుంభులనే రాక్షస సోదరులను సంహరించింది.

ఆ యుద్ధంలోనే చండముండులనూ, ధూమ్రాక్ష, రక్తబీజులనూ కూడా సంహరించింది. 

వింధ్య పర్వతమును నివాసముగా చేసుకుని, దేవతలను రాక్షసుల నుంచి కాపాడుతున్న, 

శ్రీ కృష్ణ సోదరి, ఆ వింధ్యాచల నివాసిని కి  వందనం. 

ఓం శ్రీ వింధ్యాచలనివాసిన్యై నమః  


337. విధాత్రీ 

ధాత్రి అంటే, భూమి, ఉసిరిక అనే అర్ధాలున్నాయి. భూమిని పోషించునది విధాత్రీ. 

ధాతా అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మకు పత్నిగా కూడా వ్యక్తమవుతున్నది ఈ ధాత్రీదేవి. 

ధాత్రీదేవి రూపములో బ్రహ్మలో నుండి, సృష్టిని నడిపించేది విధాత్రి. 

ఆ బ్రహ్మను సృష్టించి వేదములను ఇచ్చిందీ ఈ శక్తే. కనుక విధాత్రీ అనే నామం వచ్చింది.

ధాత్రి అనగా ఉసిరిక పట్ల ప్రీతి కలది, కనుక విధాత్రీ అనే నామం ఏర్పడింది. 

విధాత్రి అంటే, జగములను పోషించునది, భరించునది అని భావం.  

దేవీ పురాణంలో సర్వ జగత్తులనూ పోషించు తల్లి కనుక విధాత్రీ నామం వచ్చిందని చెప్పారు. 

తల్లి వలె జగములను  పోషించున్న, ఆ విధాత్రి కి వందనం. 

ఓం శ్రీ విధాత్ర్యై నమః 

  

338. వేదజననీ 

వేదముల పుట్టుక ఆ శ్రీవిద్య వలననే జరిగింది. అందుకే ఆ శ్రీదేవి వేదజనని. 

విద్ అనే ధాతువు నుండి వచ్చిన పదాలు విద్య, వేదము. 

ఏ విద్య నేర్చితే, జ్ఞానము సంపూర్ణము అవుతుందో, ఆ విద్యే వేదము. 

ఏది తెలిసిన తరువాత, అన్నీ తెలియబడతాయో, ఆ విద్యే వేదము. 

ఆ వేదములకు అధిష్టాత్రి శుద్ధవిద్యా స్వరూపిణి, శుద్ధ చైతన్య మూర్తి అయిన లలితాదేవి. 

వేదములకు పుట్టినిల్లు కనుక ఆ లలితాంబికను వేదజననీ అంటున్నాం. 

కుండలినీ శక్తి నుంచే అక్షరములన్నీ పుట్టాయి. ఆ అక్షరముల తల్లి ఈ వేదజనని. 

వేదముల ద్వారా, విద్య రూపములో వ్యక్తమవుతున్న, ఆ వేదజనని కి వందనం. 

ఓం శ్రీ వేదజనన్యై నమః 


339. విష్ణుమాయా 

"యా దేవీ సర్వ భూతేషు విష్ణుమాయేతి శబ్దితా, నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః" 

సర్వ ప్రాణుల యందు విష్ణుమాయ అనే రూపములో వ్యాపిని అయిన, ఓ జగన్మాతా, నీకు 

నమస్కారం, అని మార్కండేయ పురాణంలో దేవీ స్తుతి చెప్తుంది. 

శ్రీ మాత స్వయంగా మహామాయ, యోగమాయ, జగన్మాయ, విష్ణుమాయ.

త్రిమూర్తులతో సహా అందరినీ మాయామోహితులని చేసి సృష్టి, స్థితి, లయ, తిరోధానం,

అనుగ్రహం అనే పంచకృత్యాలనూ ఇష్టంగా చేస్తున్న శక్తి జగన్మాయ. 

సర్వ జగత్తులలో వ్యక్తము, అవ్యక్తము అనే మాయావరణమును ఏర్పరచేది 

ఈ విష్ణుమాయాశక్తియే. అమ్మ మాయలో మునగని వారు లేరు. 

నారదుడు, గౌతముడు, వంటి ఋషులు కూడా ఈ మాయను దాటలేకపోయారు. 

ఆ మాయా స్వరూపమే విష్ణుమాయ. ఆ మాయే లేకపోతే జీవన గమనం ముందుకు జరుగదు. 

తన మాయలో అందరినీ మైమరపింపచేస్తున్న, ఆ విష్ణుమాయ కు వందనం. 

ఓం శ్రీ విష్ణుమాయాయై నమః 


340. విలాసినీ

విలాసినీ అంటే విక్షేపశక్తి కలది. అంటే, శక్తిని వెదజల్లగలిగే స్త్రీ. పీఠ దేవతలలో ఒక దేవతా శక్తి. 

ఈ శక్తే బ్రహ్మ రంధ్రానికి అడ్డుగా ఉంటుంది. బ్రహ్మ రంధ్రం వద్ద కోటానుకోట్ల రుద్రులుంటారు. 

ఆ రుద్రుల స్వరూపమే ఈ విలాసినీ శక్తి. 

ఈ పీఠశక్తి అనుగ్రహించి అడ్డు తీస్తే, అప్పుడు బ్రహ్మ రంధ్రం తెరుచుకుంటుంది. 

ముక్తులైన యోగులు, సిద్ధులు, ఋషులు ఈ తెరుచుకున్న బ్రహ్మ రంధ్రము ద్వారా 

ఊర్ధ్వానికి పయనించగలుగుతారు. 

ఈ కార్యక్రమమంతా ఆ విలాసినీ శక్తికి ఒక క్రీడ. విలాసిని అంటే క్రీడించునది, 

విలాసిని అంటే ఆటలను ఆస్వాదించునది అని కూడా అర్ధం. 

యోగులకూ, సిద్ధులకూ, ఋషులకూ, ఊర్ధ్వ గమనం అనుగ్రహిస్తున్న, ఆ విలాసిని కి వందనం. 

ఓం శ్రీ విలాసిన్యై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి