17, అక్టోబర్ 2021, ఆదివారం

86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ మూలప్రకృతిః, అవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ

 

ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ 
మూలప్రకృతిః, అవ్యక్తా, వ్యక్తావ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥

393. ప్రభావతీ 

ప్రభ అంటే కాంతి. ఆ కాంతి కిరణములే ఆవరణ దేవతలుగా కల దేవత ప్రభావతీ.  

ఈ ఆవరణ దేవతలంతా శ్రీ చక్ర ప్రథమావవరణంలో వున్న అణిమాది అష్టసిద్ధులే. 

ఆ సిద్ధులు అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశిత్వము, వశిత్వము, ప్రాకామ్యము, ప్రాప్తి. 

ఈ అష్ట సిద్ధులనే కిరణాలతో, అమ్మ సిద్ధి శక్తి స్వరూపిణిగా ప్రభలతో ప్రకాశిస్తోంది. 

ఈ కిరణాలన్నీ దేవీ స్వరూపాలే, ఆ కిరణాలకు, ఆ ప్రభలను ఇచ్చింది ఈ ప్రభావతీ శక్తి. 

సూర్యుని యందు, చంద్రుని యందు, అగ్ని యందు వుండే 

ప్రభలు, ప్రకాశం, కిరణములన్నీ ఆ శ్రీలలిత నుంచి  వచ్చినవే.  

సూర్య, చంద్ర, అగ్ని, గ్రహ, నక్షత్ర సమూహాన్నంతా ప్రభామయం చేసిన, 

 ప్రభావతి కి వందనం. 

ఓం శ్రీ ప్రభావత్యై నమః  


394. ప్రభారూపా  

అమ్మ ప్రభ అంటే ఆవరణమే. అదే అమ్మ చుట్టూ వున్న కాంతి వలయం, జ్యోతిశ్చక్రం. 

స్వయంగా అమ్మే జ్యోతి స్వరూపిణి. కనుకనే ఈ నామంలో అమ్మను ప్రభారూపా అని కీర్తిస్తున్నాం. 

కన్నులలో కంటి వెలుగు ఆ తల్లిదే. ప్రాణములో చైతన్యము ఆమెదే. ఆత్మలో జ్యోతి అమ్మే. 

తాను సంపూర్ణముగా జ్యోతిస్వరూపయై, అందరినీ ఆకర్షిస్తున్న శక్తి  శ్రీలలిత. 

ఈశ ఉపనిషత్తులో, సాధకులు అంత కన్ను చెదరే కాంతిని చూడలేక "కొంత కాంతిని 

ఉపసంహరించుకో, నిన్ను చేరనీ, నిన్ను చూడనీ" అని ప్రార్ధిస్తారని చెప్పారు . 

కోటి సూర్యుల తేజస్సుతో, కోటి చంద్రుల జ్యోత్స్నలతో వెలిగిపోయే, ఆ ప్రభారూప కు వందనం.  

ఓం శ్రీ ప్రభారూపాయై నమః  


395. ప్రసిద్ధా 

ప్రసిద్ధము అంటే సర్వత్రా తెలియబడుచున్నది అని అర్ధం. అమ్మ గురించి తెలియని వారెవరు. 

ఆ లలితా త్రిపుర సుందరి ప్రసిద్ధ. చైతన్య రూపంగా ఆ తల్లి ప్రసిద్ధ. వేదరూపముగా ప్రసిద్ధ. 

శుద్ధజ్ఞాన స్వరూపంగా ప్రసిద్ధ. తేజోమయ స్వరూపంగా ప్రసిద్ధ. శుద్ధవిద్యగా ప్రసిద్ధ. 

ఆదివిద్యగా ప్రసిద్ధ. శ్రీవిద్యగా ప్రసిద్ధ. అందరిలోనూ వుండే ఆత్మ చైతన్య స్వరూపురాలిగా ప్రసిద్ధ. 

ప్రతివారిలో వుండే "నేను" గా ప్రసిద్ధ. ఆ నేను అనే స్వరూపమే శ్రీ మాత.

ప్రతి జీవుడిలోనూ అహం రూపంలో తేజరిల్లే, ఆ ప్రసిద్ధ కు  వందనం. 

ఓం శ్రీ ప్రసిద్ధాయై నమః  


396. పరమేశ్వరీ 

పరమేశ్వరుని ఇల్లాలు పరమేశ్వరీ. పరతత్వానికి సంబంధించిన ఈశ్వరి పరమేశ్వరీ. 

పరమ అంటే శ్రేష్టము, ప్రధానము అనే అర్ధాలున్నాయి. ఈశ్వరీ అంటే రాజ్ఞి.

శ్రేష్టమైన శ్రీ మహారాజ్ఞి ఆ పరమేశ్వరీ. అందరిలోనూ ప్రధానమైనది పరమేశ్వరీ. 

ఉపాసకులకు పరాన్ని అనుగ్రహించేది పరమేశ్వరి. 

పరావాక్కు రూపంలో అందరిలోనూ అంతరంగా సంచరించేది పరమేశ్వరీ. 

శ్రేష్టమైన ఐశ్వర్యము కలది పరమేశ్వరీ. సాధకులకు శ్రేష్టమైన ఐశ్వర్యాన్నిచ్చేది పరమేశ్వరి. 

పరమ ఉత్కృష్టమైన శక్తి గా ప్రసిద్ధ అయిన, ఆ పరమేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ పరమేశ్వర్యై నమః 

  

397. మూలప్రకృతిః

పరమేశ్వరి ప్రకృతి. పరమేశ్వరుడు పురుషుడు. ఆ లలితాదేవి అన్ని ప్రకృతి స్వరూపాలకూ 

మూలప్రకృతి కనుక ఈ నామంలో మూలప్రకృతీ అని పిలుచుకుంటున్నాం. 

సృష్ట్యాది నుంచీ వున్నది కనుక, మూలప్రకృతి అనే నామం వచ్చింది. 

త్రిగుణములూ, పంచభూతములూ ఎనిమిదీ కలిసి అష్టప్రకృతులు. ఈ అష్ట ప్రకృతులనూ 

సృష్టించి, తాను స్వయంగా మూలప్రకృతియై, నవావరణములను ఏర్పరచింది ఆ రాజరాజేశ్వరి. 

పంచకృత్యాలనూ చేయించేది మూలప్రకృతి. 

ఈ ప్రపంచాన్ని పంచీకరణం చేసింది కూడా మూలప్రకృతి యైన ఆ లలితాదేవే. 

దేవీ భాగవతంలో, ప్రకృష్టమైనది కనుక మూలప్రకృతి అని నారాయణుడు నారదుడితో చెప్తాడు. 

అమ్మ తాను స్వయంగా మూలప్రకృతియై, తనను తాను దుర్గ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ అనే

అయిదు శక్తి రూపాలుగా విభజించుకున్నదని శ్రీ దేవీ భాగవతం చెప్తోంది. 

మొదటి రూపం శ్రీదుర్గ, గణేశజనని, శివప్రియ. 

రెండవ రూపం శుద్ధసత్వస్వరూపం, శ్రీమహాలక్ష్మి

మూడవ రూపం సర్వవిద్యాస్వరూపం, మహాసరస్వతి. 

నాలుగవ రూపం వేదజనని, బ్రహ్మప్రియ, సావిత్రి, గాయత్రి. 

ఐదవ రూపం పంచప్రాణస్వరూపిణి, రాసేశ్వరి, గోలోకవాసిని రాధ. 

అన్ని ప్రకృతులకూ ఆధారభూతమయిన, ఆ మూలప్రకృతి కి వందనం. 

ఓం శ్రీ మూలప్రకృత్యై నమః 


398. అవ్యక్తా 

అవ్యక్తము అంటే వ్యక్తము కానిది, కనిపించనిది. ఇంద్రియాలకు గోచరించనిది. 

మాయావరణంలో వుండే దేవత. మొట్టమొదటి మాయాస్ఫూర్తి రూపం. 

ఈ అవ్యక్తకు రూపములేదు, అంగములు లేవు. దేనికీ, ఎవరికీ తెలియబడదు. గుహ్యమైన శక్తి. 

ఆదీ, అంతమూ లేనిది. అంటే ఉత్పత్తీ, వినాశము ఏవీ ఈ అవ్యక్తకు లేవు. 

నృసింహపురాణంలో ఈ అవ్యక్తాన్ని బిందువు అని చెప్పారు. 

బిందువు అతి సూక్షమైనది, ఏవిధమైన గుర్తూ లేనిది. 

అవ్యక్తంగా విశ్వమంతా వ్యాప్తి చెందినది కనుక, విష్ణుస్వరూపము. 

అవధులు లేని తత్వమే అవ్యక్తా తత్వము. ఇదీ అని స్పష్టంగా తెలియని శక్తి అవ్యక్తా.  

దేనికీ తెలియబడని మాయా స్వరూప, ఆ అవ్యక్త కు వందనం. 

ఓం శ్రీ అవ్యక్తాయై నమః 


399. వ్యక్తావ్యక్తస్వరూపిణీ 

మహత్తత్వంగా వ్యక్తమయే స్వరూపమే వ్యక్తావ్యక్త స్వరూపిణి అయిన శ్రీదేవి.  

వ్యక్తావ్యక్త అంటే వ్యక్తమూ, అవ్యక్తమూ రెండూను. అమ్మవారు వ్యక్తము కూడా, అవ్యక్తము కూడా. 

ఏకకాలంలో మహత్తత్వముగా అవ్యక్తముగా ఉంటూ, అహంకారముగా వ్యక్తమయే స్వరూపము.  

కనుక, ఈ నామంలో ఆ త్రిపురసుందరీ శక్తి స్వరూపిణిని, వ్యక్తావ్యక్తస్వరూపిణీ అంటున్నాం. 

మత్స్యపురాణంలో అవ్యక్తమును అక్షరముగాను, వ్యక్తమును క్షరముగానూ చెప్పారు. 

అవ్యక్తమయినది స్థిరముగా నిలచి వుంటుంది, భూత భావములుగా వ్యక్తమయినది 

జారిపోయి, క్షరమవుతుంది అని చెప్పారు.  

బ్రహ్మవైవర్త పురాణంలో స్వయంభూలింగాలని వ్యక్తమనీ, బాణలింగాలని అవ్యక్తమనీ, 

శిలా లింగాలని వ్యక్తావ్యక్తమనీ చెప్పారు. వ్యక్తలింగాలు భుక్తి ప్రదం, అవ్యక్తలింగాలు ముక్తిప్రదం, 

వ్యక్తావ్యక్త లింగాలు భుక్తిముక్తిప్రదం అనీ చెప్పారు. బాణలింగమును పూజించే వారికి వృద్ధి తప్ప, 

నాశము లేదు అని చెప్పబడింది. పాపకర్మలచే బద్ధుడైన వాడికి అవ్యక్తము గాను, 

పాపకర్మలు లేని వాడికి వ్యక్తము గానూ, గోచరమయే, ఆ వ్యక్తావ్యక్తస్వరూపిణి కి వందనం. 

ఓం శ్రీ వ్యక్తావ్యక్తస్వరూపిణ్యై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి