19, డిసెంబర్ 2021, ఆదివారం

149. వీరారాధ్యా, విరాడ్రూపా, విరజా, విశ్వతోముఖీ ప్రత్యగ్రూపా, పరాకాశా, ప్రాణదా, ప్రాణరూపిణీ

 

వీరారాధ్యా, విరాడ్రూపా, విరజా, విశ్వతోముఖీ 
ప్రత్యగ్రూపా, పరాకాశా, ప్రాణదా, ప్రాణరూపిణీ ॥ 149 ॥


777. వీరారాధ్యా

వీరులంటే శివ సాంప్రదాయమునకు చెందినవారు. వీరిని వీరశైవులని కూడా అంటారు. 

ఆ వీరులచే ఆరాధింపబడుతున్నది కనుక, ఈ నామంలో ఆ శివానీని  వీరారాధ్యా అంటున్నాం. 

శివ సూత్రములలో, 'జాగ్రత్, స్వప్న, సుషుప్తు లందు కూడా తురీయావస్థను పొందువారు

వీరేంద్రులు' అని వున్నది. ఇంద్రియములను నిగ్రహించు శక్తి కలవారు వీరేంద్రులు.  

ఈ విషయాన్ని మహావీరేంద్రవరదా నామంలో కూడా చెప్పుకున్నాం. 

నేను, నాది అనే అభిమానమును వీడిన వారిని వీరులని వేదం చెప్పింది.  

వేదములో బ్రహ్మహత్య, భ్రూణహత్య కన్నా వీరహత్య అతిపెద్ద పాపము అని చెప్పారు. 

అటువంటి వీరులచే పూజింపబడునది కనుక, అమ్మను ఈ నామంలో వీరారాధ్యా అంటున్నాం. 

నేను, నాది అనే దేహాభిమానము వీడిన వీరులచే పూజింపబడు, ఆ వీరారాధ్య కు వందనం. 

ఓం శ్రీ  వీరారాధ్యాయై నమః  


778. విరాడ్రూపా

విరాడ్రూపా అంటే పెద్ద రూపము కలది. విశ్వరూప స్వరూపము. విరాట్ పురుష స్వరూపిణి. 

సమస్త దేవతా స్వరూపము. విశ్వమంతా ఆవరించి వున్న తల్లి విశ్వరూపా. 

మహతీ అనే నామంలో, విశ్వరూపా అనే నామంలో కూడా ఆ పరమేశ్వరి విరాడ్రూపాన్ని గురించి 

చెప్పుకున్నాం. అమ్మకు పరిధులు, పరిమితులు లేవు. చెప్పలేనంత పెద్ద పరిమాణము కలది. 

శ్రీమద్భాగవతంలో కూడా వామనావతార ఘట్టంలో వామనుడు త్రివిక్రముడుగా మారితే, ఆ రూపం 

ఎలా దిగంతాలను దాటి ఎదిగిందో వ్యాసుడు వర్ణించాడు. పోతన కూడా సూర్యుడు మొదట్లో  

ఛత్రముగా కనిపించినా, చివరకు త్రివిక్రముడికి పాదపీఠం అయ్యాడని అంటాడు. 

విష్ణువుకు, శ్రీలలితకు అభేదము కనుక, ఆ ఉపమానాలన్నీ శ్రీలలితకూ వర్తిస్తాయి. 

బ్రహ్మాండములన్నీ ఆక్రమించి ఎదిగిన, ఆ విరాడ్రూప కు వందనం.  

ఓం శ్రీ విరాడ్రూపాయై నమః  


779.  విరజా 

విరజా అంటే పాపములు లేనిది, రజస్సును విడచినది, లోకములను విడచినది అని అర్ధము. 

బ్రహ్మాండపురాణంలో, "విరజాదేవి ఉత్కల దేశ మందున్న విరజా క్షేత్రాధిదేవత. బ్రహ్మ చేత 

ప్రతిష్టింపబడినది. ఎవరైతే, ఈ క్షేత్రంలో విరజాదేవీ దర్శనం చేస్తారో, వారు తన కులములో 

ఏడు తరముల వరకూ పవిత్రులని చేయుచున్నారు" అని వుంది. 

ఈ క్షేత్రం ప్రస్తుతం ఒడిస్సాలో, జాజ్ పూర్ అని పిలువబడుతోంది. అక్కడ బ్రహ్మ కూడా ఒక 

ఏకశిలా స్తంభంగా దర్శనమిస్తాడు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి. 

శంకరాచార్యుడు అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో 'ఓఢ్యాణే బిరజాదేవీ' అని చెప్పాడు. 

రజోగుణమును విడిచిన, ఆ  విరజ కు వందనం. 

ఓం శ్రీ  విరజసే నమః  


780. విశ్వతోముఖీ 

విశ్వమంతా ముఖములు కల దేవి విశ్వతోముఖీ. విశ్వమంతా వ్యాపించి వున్న ముఖము, 

నేత్రములు కలది. మొట్టమొదట వేదములో విరాట్ స్వరూపం గురించి చెప్పారు. 

"సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్" అని విరాట్పురుషుణ్ణి వర్ణిస్తుంది పురుషసూక్తం. 

అంతటా పాణి, పాదములు, కన్నులు, శిరస్సులు, ముఖములు కలవాడు పరమాత్మ అని 

వర్ణిస్తున్నాయి వేదములు. అంతటా వ్యాపించి వున్నవాడు కనుక, ఆ పరమాత్మను ఎవరు 

ఏవిధముగా ధ్యానిస్తే ఆవిధముగా దర్శనమిస్తాడు. 

యదార్ధముగా సగుణ రూపమునకు పాణి, పాదములు మొదలైనవి ఉంటాయి కానీ, నిర్గుణ 

రూపమైన పరమాత్మకు ఈ లక్షణములు ఏవీ వుండవు. 

అంతటా ముఖములున్న దేవిని విశ్వతోముఖీ అంటున్నాం. 

విశ్వమంతా ఆవరించి, తన సహస్ర ముఖములతో పర్యవేక్షిస్తున్న, ఆ విశ్వతోముఖి కి వందనం. 

ఓం శ్రీ విశ్వతోముఖ్యై  నమః 

  

781.  ప్రత్యగ్రూపా

ప్రత్యగాత్మ స్వరూపురాలు. పరమాత్మకు ఎదురుగా వున్న స్వరూపమే ప్రత్యగ్రూపా. 

ఇవి బింబ ప్రతిబింబాల వంటివి. బహిరింద్రియాలకు వ్యతిరేకముగా నడచునది ప్రత్యగ్రూపా. 

ప్రతికూలమైన గతి కలది ప్రత్యగ్రూపా. ఇంద్రియాలు విషయోన్ముఖం కావటం బాహ్యదృష్టి. 

అవే ఇంద్రియాలను నిగ్రహించి అంతఃదర్శనం చేస్తే అంతర్ముఖం, పరాన్ముఖం అవుతాయి. 

ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని అంతఃదర్శనం చేస్తే, ఆత్మసాక్షాత్కారమవుతుంది. 

ఆత్మస్వరూపమే పరమాత్మ, పరమేశ్వరి.  

అంతరాత్మకు అభిముఖంగా వున్న స్వరూపము కల, ఆ  ప్రత్యగ్రూప కు వందనం. 

ఓం శ్రీ  ప్రత్యగ్రూపాయై నమః 


782. పరాకాశా

పరాకాశమంటే ఉత్కృష్టమైన ఆకాశము అని అర్ధం. సప్తసముద్రముల కావల వున్నది పరాకాశము. 

బ్రహ్మాండాకాశ స్వరూపురాలు.  పరాకాశము నిర్గుణము కనుక పరబ్రహ్మ స్వరూపము. 

ఛాందోగ్యోపనిషత్తులో, ఆకాశమే అన్నిటికన్నా పెద్దది. అదే అన్నింటికీ ఆధారము, అని వుంది.

బ్రహ్మసూత్రములలో, పరాకాశమంటే పరబ్రహ్మమే అనీ, పంచభూతములలో ఒకటైన  

భూతాకాశము కాదనీ చెప్పారు. 

కూర్మపురాణంలో, "ఆ పరాశక్తియే ఆకాశరూపంలో వున్నది, సర్వ జగత్తులకూ కారణభూతురాలు, 

సర్వాత్మకురాలు, అనాది యగు మహేశ్వరశక్తియే ఆకాశనామం ధరించి ప్రకాశిస్తోంది", అని వుంది.

ఈ పరాకాశమే బ్రహ్మాండమందూ, పిండాండమందూ కూడా వున్నది. 

శిరస్సు నుంచి రెండు అంగుళాల పైన వున్న ఈ పరాకాశంలో పరబ్రహ్మ ప్రతిష్టితుడై వున్నాడు. 

ఆ పరాకాశములో శ్రీలలిత ఎప్పుడూ షోడశ వర్ష కన్య వలె ఉంటుంది. 

షోడశ నిత్యలలో ప్రతినిత్యా ఆ షోడశీ స్థానంలో ఒక్కొక్క సంవత్సరం ఉంటుంది. 

విశ్వనిఘంటువులో ఆక అంటే పాపము, దుఃఖము అనే అర్ధాలున్నాయి.

పరాకాశా అంటే ఉత్కృష్టమైన పాపమును, దుఃఖమును నశింపచేయునది అని అర్ధం. 

పరాకాశమంటే ఒక కష్టమైన వ్రతము అని కూడా అర్ధమున్నది. 

కష్టమైన వ్రతము ద్వారా పొందునది పరమేశ్వరి అని అర్ధం. 

సప్తసముద్రముల కావలనున్న, ఉత్కృష్టమైన, ఆకాశస్వరూపమైన, ఆ పరాకాశ కు వందనం. 

ఓం శ్రీ పరాకాశాయై నమః 

783. ప్రాణదా

ప్రాణదా అంటే ప్రాణమును ఇచ్చునది. లేదా ప్రాణములను స్వీకరించునది అని అర్ధం. 

పంచప్రాణాలైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులను ఇచ్చునది అని భావం. 

ఛాందోగ్యోపనిషత్తులో, "అన్ని ఇంద్రియాలకన్నా, మనసు కన్నా కూడా ప్రాణమే గొప్పది. ప్రాణము

 లేకపోతే, జీవికి ఉనికి లేదు. ఒక్క ప్రాణమే పంచేంద్రియాలకు ఆధారమవుతున్నది"అని వున్నది. 

కౌషీతక బ్రాహ్మణమందు, 'నేనే ప్రాణమును, నేనే ప్రజ్ఞను, నన్ను ఆయురమృతములుగా భావించి

ఉపాసించండి', అని వున్నది.  

కనుక ప్రాణమే ప్రజ్ఞ, ప్రాణమే ఆయుష్షు, ప్రాణమే అమృతము. 

జీవుని ఉనికికి సర్వాధారమైన ప్రాణమునిచ్చు, ఆ ప్రాణద కు వందనం. 

ఓం శ్రీ ప్రాణదాయై నమః 

784. ప్రాణరూపిణీ 

ప్రాణరూపిణీ అంటే, ప్రాణాత్మ స్వరూపము, పరబ్రహ్మ స్వరూపము. 

ప్రాణము అంటే పరమాత్మ, ఇంద్రియము, బ్రహ్మము అని వేదములోను, బృహదారణ్యకంలోను  

చెప్పారు. దేహములో ప్రాణాలు, ఉపప్రాణాలు అనే రెండు రకాల వాయువులు తిరుగుతూ 

ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానవాయువులు ప్రాణాలైతే, నాగ, కూర్మ, కృకుర, 

దేవదత్త, ధనంజయములు ఉపప్రాణాలు. ఇవి సంచరిస్తూ ఉండటం వల్లనే దేహములో 

ప్రాణమున్నది అంటున్నాం. ఎప్పుడైతే ఈ వాయువుల సంచారం ఆగిపోతుందో, 

దేహమునుంచి ప్రాణోత్క్రమణం జరుగుతుంది. 

ఈ దశ ప్రాణములూ ఆ శ్రీమాత స్వరూపమే. అందుకే అమ్మను ప్రాణరూపిణీ అంటున్నాం.  

దశవిధ వాయు రూపములలో జీవునిలో సంచరిస్తున్న, ఆ ప్రాణరూపిణి  కి వందనం. 

ఓం శ్రీ ప్రాణరూపిణ్యై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

      

18, డిసెంబర్ 2021, శనివారం

148. దురారాధ్యా, దురాదర్షా, పాటలీ కుసుమప్రియా మహతీ, మేరునిలయా, మందార కుసుమప్రియా

 

దురారాధ్యా, దురాదర్షా, పాటలీ కుసుమప్రియా 
మహతీ, మేరునిలయా, మందార కుసుమప్రియా ॥ 148 ॥


771. దురారాధ్యా

సులభముగా ఆరాధింప శక్యము కానిది. అమ్మ ఆరాధన అంత సులభసాధ్యము కాదు. 

ఇంద్రియ చపలురకు అమ్మ ఆరాధన చాలా కష్టము అని ఈ నామం చెప్తోంది. 

చంచలేంద్రియులకు పరమేశ్వరి ఆరాధన కష్టము అని సౌందర్యలహరిలో కూడా చెప్పారు. 

 చంచలాత్ముల చేత సులభముగా ఆరాధింపబడని, ఆ దురారాధ్య కు వందనం. 

ఓం శ్రీ  దురారాధ్యాయై నమః  


772. దురాధర్షా

శ్రీదేవి తీవ్రమైన తపము చేత మాత్రమే స్వాధీనమవుతుంది. 

సౌందర్యలహరిలో ఆదిశంకరుడు, "తరళకరణులకు, అంటే చపలచిత్తులకు ఆ పరమేశ్వరి 

పాదసేవా భాగ్యము దుర్లభము" అంటాడు. 

ఇంద్రియ నిగ్రహం లేనివారికి అమ్మ అనుగ్రహము దుర్లభము. 

అమ్మ అనుగ్రహించాలంటే మొదటగా ఇంద్రియనిగ్రహం సాధించాలి. 

ఇంద్రియనిగ్రహం లేనివారిని దూరంగా వుంచు, ఆ దురాధర్ష కు వందనం.  

ఓం శ్రీ దురాధర్షాయై నమః  


773.  పాటలీకుసుమప్రియా 

పాటలీ కుసుమాలంటే ఇష్టపడే తల్లి ఆ పాటలీకుసుమప్రియా. 

ఈ పాటలీ కుసుమాలుండే ప్రాంతమే పాటలీపుత్రము అని చెప్పుకున్నాం. 

పద్మపురాణంలో, "శంకరుడు బిల్వ వృక్షంలో ఉంటే, పార్వతి పాటల వృక్షంలో వుంటుంది" అని 

చెప్పారు. అందువలన, శంకరునికి బిల్వ పత్రం ఎంత ప్రీతికరమో, పార్వతికి పాటల పుష్పం 

అంత ప్రీతికరము అని స్పష్టమవుతోంది. పాటలీ వర్ణం అంటే లేత గులాబీ రంగు. 

విశుద్ధిచక్రపద్మములో కొలువై వున్న డాకినీశ్వరీ మాత తెలుపు, ఎరుపు కలసిన పాటలీ వర్ణములో 

ప్రకాశిస్తూ ఉంటుందని ముందే చెప్పుకున్నాం. ఆ పాటలీ కుసుమాలంటే అమ్మకు ఇష్టం. 

ఆ పూలతో పూజిస్తే శ్రీమాత సంతోషిస్తుంది. 

పాటలీ కుసుమాలను ఇష్టపడే, ఆ  పాటలీకుసుమప్రియ కు వందనం. 

ఓం శ్రీ  పాటలీకుసుమప్రియాయై నమః  


774. మహతీ 

మహత్తైనది మహతీ. అంటే అమ్మ గొప్పది. గొప్ప పరిమాణము కలది అని అర్ధం. 

నిరుక్తము ఒక వేదాంగము.దీని కర్త యాస్కుడు. నిరుక్తంలో అంతగా వాడుకలో లేని పదాలకు 

అర్ధాలు చెప్పారు. వేదశబ్దవివరణ నిఘంటువు, శాకపూర్ణి నిరుక్తము అనేవి కూడా వున్నాయి.  
 
శాకపూర్ణి నిరుక్తంలో మహతి అంటే, పరిమాణము నందు అన్నింటికన్నా గొప్పది అని 

చెప్పబడింది. మహతి అంటే మానాతీత, ఏ మానము చేతనూ కొలవబడనిది అని అర్ధం. 

నారదుని యొక్క మహతీ వీణ స్వరూపురాలు అని మరొక అర్ధం. 

మహత్తైన పరిమాణము కల, ఆ మహతీ కి వందనం. 

ఓం శ్రీ మహత్యై నమః 

  

775. మేరునిలయా

మేరునిలయా అంటే, మేరువును నివాసస్థానముగా చేసుకున్నది అని అర్ధం. 

మేరు పర్వతమే నివాసమైనది. మేరు మంత్రస్వరూపురాలు. 

మేరు యంత్రమే, మేరుప్రస్తారమే నివాసముగా కలది ఆ రాజరాజేశ్వరి.  

జ్ఞానార్ణవంలో తొమ్మిది అక్షరముల నవావరణ మంత్రమున్నది, దానికే మేరుమంత్రమని పేరు. 

దేవీ మంత్రములు, మహాత్రిపురసుందరీ మంత్రములన్నియూ ఈ మేరుమంత్రమునుంచే 

వచ్చాయని మంత్రశాస్త్రం చెప్తోంది. మంత్రములన్నీ మేరుమంత్రోద్ధారములే. 

ఆ మేరు మంత్రస్వరూపురాలు మేరునిలయా. 

తంత్రరాజంలో, ఇరవైఎనిమిదవ పటలములో, సాగరములు, ద్వీపములతో కూడిన భూమిని 

వర్ణిస్తూ, "మేరువు మధ్యలో శ్రీలలితాదేవి మహాకాంతితో వెలిగిపోతూ ఆసీనురాలయి ఉన్నది. 

ఆమె చుట్టూ సముద్రము నందు నిత్యాదేవతలు ఉన్నాయి, చిత్రానిత్య దానికి బయట వున్న 

పరమాకాశమందు వున్నది", అని చెప్పబడింది. ఈ విషయాలన్నీ గురుముఖతః తెలుసుకోవాలని 

కూడా చెప్పబడింది. శ్రీచక్రమునకు భూప్రస్తారము, కైలాసప్రస్తారము, మేరుప్రస్తారము అని 

మూడు రకాల ప్రస్తారాలు వున్నాయి. శ్రీచక్రాన్ని వశిని మొదలగు వాగ్దేవతాష్టకముతో 

అనుసంధానం చేస్తే, దాన్ని భూప్రస్తారమంటారు. మాతృకావర్ణములతో  అనుసంధానం 

చేస్తే, దాన్ని కైలాసప్రస్తారము అంటారు. షోడశనిత్యలతో  అనుసంధానం చేస్తే, 

దాన్ని మేరుప్రస్తారమంటారు. ఈ రకమైన భావనలన్నీ కొద్ది భేదాలతో, సనత్కుమార సంహిత, 

సనంద సంహిత, వశిష్ట సంహిత లందు చెప్పబడ్డాయి. 

మేరువులో నివసించునది మేరునిలయా.  

మేరువే నివాసముగా కల, ఆ మేరునిలయ కు వందనం. 

ఓం శ్రీ మేరునిలయాయై నమః 


776. మందారకుసుమప్రియా

మందార పుష్పాలంటే ప్రీతి కలది మందార కుసుమ ప్రియా. 

మందార పుష్పాలు ఎర్రగా ఉంటాయి. అమ్మకు ఎరుపు రంగు అంటే ప్రీతి, ఆమె రక్తవర్ణా కదా. 

మందారాలనే కొందరు జపాకుసుమాలని కూడా అంటారు. మందార వృక్షం దేవతా వృక్షం. 

దీన్నే కల్పవృక్షంగా కూడా భావిస్తారు. ఆ మందార పువ్వులంటే ఇష్టపడునది పరమేశ్వరి. 

సంస్కృతంలో శ్వేతార్కవృక్షాన్ని కూడా మందార వృక్షం అంటారు. శ్వేతార్కమంటే తెల్లజిల్లేడు. 

తెల్లజిల్లేడు పువ్వులనీ, మందార పువ్వులనీ ఇష్టపడునది అని ఈ నామానికి అర్ధం.

అయిదు దళాలున్న మందారాలు అమ్మకు ప్రీతి, మూడు దళాలున్న మారేడు అయ్యకు ప్రీతి.  

మందార పుష్పాలతో పూజిస్తే ప్రీతి చెందే, ఆ మందారకుసుమప్రియ కు వందనం. 

ఓం శ్రీ మందారకుసుమప్రియాయై నమః 





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

      

17, డిసెంబర్ 2021, శుక్రవారం

147. స్వర్గాపవర్గదా, శుద్ధా, జపాపుష్ప నిభాకృతిః ఓజోవతీ, ద్యుతిధరా, యజ్ఞరూపా, ప్రియవ్రతా

స్వర్గాపవర్గదా, శుద్ధా, జపాపుష్ప నిభాకృతిః 
ఓజోవతీ, ద్యుతిధరా, యజ్ఞరూపా, ప్రియవ్రతా ॥ 147 ॥


764. స్వర్గాపవర్గదా

స్వర్గమును, అపవర్గమును ఇచ్చునది స్వర్గాపవర్గదా అయిన జగదీశ్వరి.  

ఎడతెరిపి లేనిది, ఎప్పటికీ దుఃఖము కానిది, ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించనిది,  

కోరుకున్నది, అయిన గొప్ప సుఖాన్ని స్వర్గము అని వేదములో చెప్పారు. 

కనుక స్వర్గమంటే ఎప్పుడూ అనుభవించని, ఎప్పుడూ చూడని, ఎప్పటికీ తెగని, 

ఎప్పటికీ దుఃఖము కానిది. కానీ ఈ స్వర్గసుఖము నిత్యమూ, శాశ్వతము కాదు. 

చేసుకున్న పుణ్యఫలం ఎన్నాళ్ళు ఉంటే, అన్నాళ్లు మాత్రమే ఉంటుంది. 

కానీ మోక్షము అలా కాదు. ఎప్పటికీ ఉంటుంది. అది ప్రళయకాలం వరకూ కూడా ఉంటుంది. 

అది శాశ్వతము. అపవర్గము అంటే మోక్షము. 

సుఖమునూ, మోక్షమునూ రెండింటినీ ఇచ్చేది ఆ శ్రీదేవి. లలితాపరమేశ్వరిని ధ్యానించిన వారికి 

భోగమోక్షములు రెండూ లభిస్తాయని ముందే చెప్పుకున్నాం. 

తన భక్తులకు స్వర్గమునూ, మోక్షమునూ ఇచ్చు, ఆ స్వర్గాపవర్గద కు వందనం. 

ఓం శ్రీ  స్వర్గాపవర్గదాయై నమః  


765. శుద్ధా

శ్రీమాత కన్నా శుద్ధులెవరు. ముందు కూడా అమ్మను నిర్మలా, నిత్యశుద్ధా, నిష్కళంకా, విమలా అనే 

నామాల్లో కూడా ఈ విశేషాన్నే చెప్పుకున్నాం. శుద్ధజ్ఞానస్వరూపిణి, శుద్ధవిద్యాస్వరూపిణి అయిన,  

ఆ జగన్మాత ఎంత శుద్ధాత్మ స్వరూపమో చెప్పుకున్నాం. 

అవిద్య చేత మలినములు పొందనిది శ్రీమాత. 

అందుకే ఈ నామంలో ఆ జగజ్జననిని శుద్ధా అంటున్నాం. 

ఎటువంటి అవిద్యామలినములూ లేని, ఆ శుద్ధ కు వందనం.  

ఓం శ్రీ శుద్ధాయై నమః  


766.  జపాపుష్ప నిభాకృతిః 

జపాపుష్ప, నిభాకృతిః అంటే, జపాపుష్పము వలె ప్రకాశించు ఆకృతి కలది అని ఈ నామానికి 

అర్ధం. జపాపుష్పము ఎర్రని పుష్పం. ఎర్రని కాంతితో మెరిసిపోతున్న అరుణారుణ లలితాదేవి. 

ధ్యానశ్లోకంలో కూడా అమ్మను అరుణాం, కరుణాతరంగితాక్షీం అంటాం. 

అమ్మ ఎర్రని దేహకాంతితో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుందని ఈ నామానికి అర్ధం. 

మరొక విధంగా జప, పుష్ప, నిభ, ఆకృతి అని పదవిభజన చేసుకుంటే జపము, పుష్పము వలె 

ప్రకాశించు ఆకారము కలది అని అర్ధం వస్తుంది. 

ఏ జపమూ చెయ్యకపోయినా శ్వాసతో  చేసే జపాన్ని అజపాజపం అంటారు. 

ఈ విషయం కూడా ముందే చెప్పుకున్నాం. దక్షిణామూర్తి సంహితలో, "ఓ దేవీ, ఎటువంటి జపమూ 

చెయ్యకపోయినా, ఏది జపమవుతోందో ఆ జపాన్ని అజపా జపమంటారు. ఆ అజపాజపము 

సాధకుని సంసార పాశములను నరికేస్తుంది." అని వుంది. 

పుష్పము అంటే నిఘంటువులో కుబేరుని విమానం, పువ్వు, స్త్రీరజస్సు అనే అర్ధాలున్నాయి. 

ఎర్రని కాంతితో వెలిగిపోతున్న, ఆ  జపాపుష్ప నిభాకృతి కి వందనం. 

ఓం శ్రీ  జపాపుష్పనిభాకృతయే నమః  


767. ఓజోవతీ 

ఓజస్సు అంటే, తేజము, బలము, ఉత్సాహము, ధాతుపుష్టి, దీప్తి, వెలుగు అనే అర్ధాలున్నాయి. 

శరీరములోని ఎనిమిదవ ధాతువును ఓజస్సు అంటారు. 

చక్రాల గురించి చెప్పుకున్నప్పుడు మిగిలిన ఏడు ధాతువుల గురించీ చెప్పుకున్నాం. 

ఓజస్సనగా ఇంద్రియ సామర్ధ్యం. 

ఈ ఎనిమిది ధాతువులూ కలిగిన ఆ లలితాపరమేశ్వరీదేవిని ఈ నామంలో ఓజోవతీ అంటున్నాం. 

తేజోరాశి అయిన, ఆ ఓజోవతి కి వందనం. 

ఓం శ్రీ ఓజోవత్యై నమః 

  

768. ద్యుతిధరా

ద్యుతి అంటే కాంతి, తేజస్సు, ఎండ అని అర్ధాలు. కాంతిని ధరించునది కనుక ద్యుతిధరా.  

తేజస్సు కలిగినది కనుక ద్యుతిధరా. సూర్యుని ద్వారా ఆతపమును కలిగించునది కనుక 

ద్యుతిధరా. ఈ అర్ధాలన్నీ అమ్మకు సరిపోతాయి. 

అందుకే ఆ లలితాపరమేశ్వరీదేవిని ఈ నామంలో ద్యుతిధరా అంటున్నాం. 

సూర్యుని వలన ఆతపము, ఆతపము వలన ప్రకృతి పోషణా, జగత్పోషణా కూడా అమ్మ 

చేస్తున్నది. ద్యుతిని ధరించిన అమ్మ ద్యుతిధరా. 

తన కాంతులతో జగత్తులను ధరిస్తున్న, ఆ ద్యుతిధర కు వందనం. 

ఓం శ్రీ ద్యుతిధరాయై నమః 


769. యజ్ఞరూపా

ఈ నామంలో ఆ లలితాపరమేశ్వరీదేవిని యజ్ఞరూపా అంటున్నాం. 

వేదములో విష్ణువే యజ్ఞమని చెప్పబడినది. ఈ నారాయణికీ విష్ణువుకీ అభేదం కనుక అమ్మ 

కూడా విష్ణుస్వరూపురాలు. కనుక శ్రీలలితను ఈ నామంలో యజ్ఞరూపా అంటున్నాం. 

హరివంశం లోనూ, పద్మ పురాణంలోనూ ఈశ్వరుని గురించి ఈ విధంగా చెప్పారు. 

యజ్ఞ అంగములే, ఈశ్వరుని దేహ అంగములని చెప్తూ, వేదములే పాదములు, క్రతువే హస్తము, 

మహా తాపసులైన బ్రాహ్మణులే శిరస్సు, పశువే జానువు, హోమమే లింగము, వేదియే స్కంధము, 

దక్షిణే హృదయము, యజ్ఞయాగములే దేహాంగములు, గుహ్యోపనిషత్తు ఆసనము, అని ఇంకా 

ఎన్నో ఇతర అంగాల గురించి కూడా పోల్చి చెప్పారు. 

ఈశ్వరుడు యజ్ఞ రూపములో  మేరుశృంగము వలె ఉన్నతుడుగా భాసిస్తున్నాడు అని చెప్పారు.  

ముఖామ్నాయరహస్యములో, "ఇంద్రియద్వారములని జయించి, భక్తితో ఆత్మను సేవించడమే 

మహాయజ్ఞము", అని చెప్పబడింది. కనుక ఆత్మారాధనే యజ్ఞము. 

ముందు నామాల్లో కూడా అంతర్యాగ, బహిర్యాగములు ఆ పరమేశ్వరి స్వరూపమని చెప్పుకున్నాం.

యజ్ఞమే తన స్వరూపమైన, ఆ యజ్ఞరూప కు వందనం. 

ఓం శ్రీ యజ్ఞరూపాయై నమః 


770. ప్రియవ్రతా

ప్రియమైన వ్రతములు కలది, ఆ వ్రతములు ఆచరించువారి పట్ల మక్కువ చూపునది అని అర్ధం. 

అమ్మవారు సకలదేవతా స్వరూపురాలు కనుక, ఏ దేవత యొక్క వ్రతము చేసినా సంతోషిస్తుంది. 

వ్రతకథలన్నీ కూడా, ఆ జగత్పితరులైన పార్వతీ పరమేశ్వరుల సంవాదంలో నుంచే వచ్చాయి. 

ఆ పరమేశ్వరీ, పరమేశ్వరులు, లోక హితార్థం అనేక వ్రతములను గురించి చెప్పారు. 

తనకు ప్రియమైన  వ్రతములు చేసే వారి పట్ల అనుగ్రహమును చూపించునది అని భావం.  

ప్రియవ్రతుడనే రాజస్వరూపురాలు. ప్రియవ్రతుడు స్వాయంభువమనువు పుత్రుడు. 

బాల్యం నుంచి నారద మహర్షి శిష్యుడై పరబ్రహ్మను ఉపాసించినవాడు. 

ప్రియమైన వ్రతములు చేయువారిని ప్రియముగా చూచు, ఆ ప్రియవ్రత కు వందనం. 

ఓం శ్రీ  ప్రియవ్రతాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

      

16, డిసెంబర్ 2021, గురువారం

146. క్షరాక్షరాత్మికా, సర్వలోకేశీ, విశ్వధారిణీ త్రివర్గదాత్రీ, సుభగా, త్ర్యంబకా, త్రిగుణాత్మికా

 

క్షరాక్షరాత్మికా, సర్వలోకేశీ, విశ్వధారిణీ 
త్రివర్గదాత్రీ, సుభగా, త్ర్యంబకా, త్రిగుణాత్మికా ॥ 146 ॥

757. క్షరాక్షరాత్మికా

క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించనిది అని అర్ధం. 

ఈ నామంలో అమ్మను క్షరాక్షరాత్మికా అంటున్నాం. 

క్షరమునకూ, అక్షరమునకూ కూడా ఆత్మస్వరూపము ఆ విశ్వేశ్వరియే అని ఈ నామం చెప్తోంది . 

తాను స్వయంగా పరబ్రహ్మ స్వరూపము, నిత్యముక్తా స్వరూపము కనుక నాశము లేనిది. 

వరాహపురాణంలో, "ఆ విశ్వేశ్వరి ఏకాక్షర, అనేకాక్షర, అమితాక్షర అని ప్రసిద్ధి చెందింది", అని 

వుంది. ఆ విశ్వేశ్వరి లెక్కలేనన్ని అనియత సంఖ్యాక్షర స్వరూపిణి. 

విష్ణుభాగవతంలోనూ, మహాభారతంలోనూ, "అసత్, సత్ లకే, క్షర, అక్షర అనే నామాలున్నాయి", 

అని చెప్పారు. 

శ్రీమద్భగవద్గీతలోని, పురుషోత్తమప్రాప్తి యోగంలో, "ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షరమేవచ, 

క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ముచ్యతే" అనే శ్లోకంలో క్షర, అక్షరముల గురించి చెప్పారు.  

ఆ శ్లోక భావం, "ఈ లోకంలో ఇద్దరు పురుషులున్నారు. వారిలో ఒకడు సర్వభూతముల 

దేహములలో వున్న పురుషుడు. రెండవ పురుషుడు కూటస్థుడగు పరమాత్మ." 

ఆ పరమాత్మే క్షర రూపములో సమస్త భూతములలోనూ ఆత్మ స్వరూపముగా వున్నాడు.     

అక్షరమనగా కూటస్థుడు, ఆ కూటస్థుడే శ్రీమాత. అక్షరము కనుక కూటస్థునిగా నాశము పొందుట 

లేదు. క్షరమైన భూతములలో శ్రీమాత ఆత్మస్వరూపంగా వున్నది. 

సర్వభూతములలో క్షరముగా, కూటస్థునిలో అక్షరముగా వున్న, ఆ క్షరాక్షరాత్మిక కు వందనం. 

ఓం శ్రీ  క్షరాక్షరాత్మికాయై నమః  


758. సర్వలోకేశీ

సర్వలోకేశీ అంటే అన్ని లోకాలకూ ఈశ్వరి, అధిపతి, మహారాజ్ఞి అని అర్ధం. 

భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము ఇవి 

ఏడూ ఊర్ధ్వలోకాలు. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం 

అని నిత్యపూజలో చెప్పుకుంటూ ఉంటాం. అవే ఈ ఏడు ఊర్ధ్వలోకాలు. 

అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు ఏడూ అధోలోకాలు. 

ఈ మొత్తం పదునాలుగు లోకాలకీ, ఆ లోకేశ్వరే అధినాయకి. 

అందుకే ఈ నామంలో అమ్మను సర్వలోకేశీ అంటున్నాం. 

సర్వలోకాలకూ కారణభూతమయిన లోకేశ్వరి, ఆ సర్వలోకేశి కి వందనం.  

ఓం శ్రీ సర్వలోకేశ్యై నమః  


759.  విశ్వధారిణీ 

విశ్వమును ధరించినది కనుక ఈ నామం వచ్చింది. 

సమస్త విశ్వాన్నీ తన కడుపులో సృష్టించింది. 

ప్రళయకాలంలో తిరిగి ఈ సమస్త విశ్వాన్నీ తన లోనికే లయం చేసుకుంటోంది. 

సమస్త విశ్వానికీ తానే అవలీలగా సృష్టి, స్థితి, లయ నిర్వహిస్తున్నది. 

విశ్వరక్షణ భారమంతా ఆ విశ్వేశ్వరిదే. అందుకే అమ్మను ఈ నామంలో విశ్వధారిణీ అంటున్నాం. 

విశ్వ నిర్వహణ భారం వహించిన, ఆ  విశ్వధారిణి కి వందనం. 

ఓం శ్రీ  విశ్వధారిణ్యై నమః  


760. త్రివర్గదాత్రీ 

త్రివర్గములంటే ధర్మార్ధకామములు. ఈ మూడింటినీ ఇచ్చే శక్తి కనుక, 

అమ్మను త్రివర్గదాత్రీ అంటున్నాం. 

ధర్మమార్గంలోనే అర్ధాన్ని, కామాన్ని పొందాలి. అప్పుడే అవి ధర్మార్ధము, ధర్మకామము 

అవుతాయి. కామాన్ని, అంటే కోరికను, ఆ ధర్మార్జన తోనే తీర్చుకోవాలి. అప్పుడే అవి నిజమైన 

శక్తిని ఇస్తాయి. ఈ మూడు వర్గములనూ ఇచ్చేది కనుక అమ్మ త్రివర్గదాత్రీ. 

నాలుగవదైన మోక్షమును కలిపితే ఇవి చతుర్వర్గమవుతాయి.

మోక్షము అందరికీ అందదు. అది సులభసాధ్యము కాదు.  

భక్తులకు ధర్మార్ధకామములను త్రివర్గములనూ ఇచ్చు, ఆ త్రివర్గదాత్రి కి వందనం. 

ఓం శ్రీ త్రివర్గదాత్ర్యై నమః 

  

761. సుభగా

సుభగా అంటే సౌభాగ్యము కలది. ద్వాదశాదిత్యులలో భగుడనే సూర్యుని యొక్క శక్తి

స్వరూపురాలు అని అర్ధం. నిఘంటువులో భగము అనే పదానికి, శ్రీ, వీర్యము, ఇచ్ఛ, జ్ఞానము,

వైరాగ్యము, కీర్తి, మాహాత్మ్యము, ఐశ్వర్యము, యత్నము, ధర్మము, మోక్షము, యోని అనే 

అర్ధాలున్నాయి. ఈ అర్ధాలన్నీ అమ్మకు వర్తిస్తాయి కనుక, ఆ పరమేశ్వరి సుభగా అనబడుతోంది. 

భగుడనే ఆదిత్యునిలో నుండి సర్వకార్యములూ నిర్వహిస్తోంది ఈ సుభగా. 

ఆదిత్యుడు అమ్మవారి శక్తి తోనే సంచరిస్తాడని ముందే చెప్పుకున్నాం. 

ముల్లోకాలలోనూ చర, అచరము లందు సౌభాగ్యరూపంలో ఉండునది అని ఒక అర్ధం. 

పద్మపురాణంలో," సౌభాగ్యాష్టకాల స్వరూపము కనుక, ఈమె సుభగా", అని చెప్పారు. 

సౌభాగ్యాష్టకాలు అంటే, ఇక్షువు, పారిజాతవృక్షం, ధాన్యం, జీలకర్ర, గోక్షీరం, కుంకుమపువ్వు, 

కుసుమాలు, లవణం. ఇవి అన్నీ ఈ సుభగా స్వరూపాలే. 

ఐదు సంవత్సరాల బాలికను ధౌమ్యుడు సుభగా అన్నాడు. 

ముల్లోకాలకూ సౌభాగ్యకారకమైన, ఆ సుభగ కు వందనం. 

ఓం శ్రీ సుభగాయై నమః 


762.  త్ర్యంబకా

మూడు నేత్రములు కలది, సూర్యుడు, చంద్రుడు, అగ్ని మూడు నేత్రాలుగా కల దేవి త్ర్యంబకా.  
దేవీ పురాణంలో, "సోమసూర్యాగ్ని నేత్రములు కల దేవికి త్ర్యంబకా అనే పేరు వచ్చింది" అని 
మునులు చెప్పారని వున్నది. 

తన మూడునేత్రాలతో, బాహ్యదృష్టి, అంతర్దృష్టి, విశ్వదృష్టి కలిగి వున్నది. 

అందుకే శ్రీమాత భూత, వర్తమాన, భవిష్యత్కాల స్వరూపిణి.  

మాండూక్యోపనిషత్తులో కూడా, "భూత, భవిష్యత్, వర్తమానం సర్వం ఓంకారస్వరూపం. 

ఈ మూడింటికీ అతీతమయినది పరమేశ్వర స్వరూపం" అని చెప్పారు. 

త్రిపుటికి ఆధారభూతము కనుక, ఆ పరమేశ్వరిని  త్ర్యంబకా అంటున్నాం. 
త్రిమూర్తులకు, త్రిశక్తులకు, త్రిలోకాలకు అంబ కనుక త్ర్యంబకా అనే నామం వచ్చింది.  
త్రినేత్రాలతో భూత, భవిష్యత్ , వర్తమానాలను చూస్తున్న, ఆ  త్ర్యంబక కు వందనం. 

ఓం శ్రీ త్ర్యంబకాయై నమః 


763. త్రిగుణాత్మికా

సత్వ, రజో, తమో గుణములనే మూడు గుణములతో సామరస్యం కలిగినది. 

త్రిగుణాలతో సామ్యం కలిగినది కనుక ఈ నామం వచ్చింది. 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ త్రిగుణ ప్రధాన స్వరూపులు. వారి తల్లి కనుక ఆ త్రిపురాంబిక 

త్రిగుణాత్మికా అని పిలువబడుతోంది. 

త్రిగుణ ప్రధాన స్వరూపులైన మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ మాతల సమైక్యస్వరూపము 

కనుక త్రిగుణాత్మికా అని పిలువబడుతోంది. 

ఈ త్రిగుణముల స్వభావ లక్షణములను గురించి శ్రీమద్భగవద్గీతలో గుణత్రయవిభాగయోగంలో 

ఆ భగవానుడే స్వయంగా చెప్పాడు. 

త్రిగుణమయ స్వరూపమయిన, ఆ త్రిగుణాత్మిక కు వందనం. 

ఓం శ్రీ త్రిగుణాత్మికాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650