26, అక్టోబర్ 2021, మంగళవారం

95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ

 

తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ 
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥

452. తేజోవతీ

తేజోవతీ అంటే గొప్ప తేజస్సు కలది అని అర్ధం. లలితాపరమేశ్వరీ దేవి తేజస్సు చాలా గొప్పది. 

సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ ముగ్గురూ గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ వుంటారు. 

లలితాపరమేశ్వరి నుంచి తీసుకున్న తేజస్సుతో, పగటి పూట సూర్యుడు తన తేజో కిరణాలతో 

ప్రపంచానికి కాంతులను ఇస్తే, చంద్రుడు రాత్రి పూట కాంతులు వెదజల్లుతాడు. 

ఈ రెండూ కాని సంధ్యాసమయాల్లో అగ్ని ద్వారా అమ్మవారి తేజస్సు ప్రకాశిస్తుంది. 

అమ్మ మాత్రం ఎల్లవేళలా తన తేజస్సుని ప్రసరిస్తూనే ఉంటుంది. 

శ్రీచక్రం లోని ప్రతి కోణమూ, ప్రతి కొనా, ఒక్కో తేజో కిరణానికి ఉద్గమస్థానం. 

ఇంత తేజస్సు కలిగిన అమ్మను ఈ నామంలో తేజోవతీ అంటున్నాం. 

సూర్య, చంద్ర, 
గ్నుల ద్వారా తన తేజస్సుతో మనలను పోషిస్తున్న, ఆ తేజోవతి కి వందనం. 

ఓం శ్రీ తేజోవత్యై నమః  


453. త్రినయనా 

త్రినయనా అంటే మూడు కన్నులు కల తల్లి అని అర్ధం, ఫాలనేత్రం కూడా కల పరమేశ్వరి. 

ఈ మూడు కన్నులూ మూడు కాలాలకూ ప్రతీక. సౌందర్యలహరిలో ఆదిశంకరుడు, " అమ్మా, నీ 

కుడికంటి కాంతితో పగలు, ఎడమకంటి కాంతితో రాత్రి, ఈ రెండింటికీ మధ్యనున్న మెరుపు వంటి 

సంధ్యాకాలాన్ని నీ మూడవ కన్ను ఆవిష్కరిస్తున్నాయి" అంటాడు.

సూర్యాత్మకమైన పింగళానాడి కుడికంటికి, చంద్రాత్మకమైన ఇడానాడి ఎడమకంటికి ప్రతీకలైతే.   

మధ్యనున్న మూడవదైన ఫాలనేత్రం సుషుమ్నానాడి మార్గాన్ని సూచిస్తుంది. 

ఆజ్ఞ వద్ద, ఇడా పింగళా నాడులు సుషుమ్నతో కలిసి, సహస్రారం వైపుకి సాగుతాయి. 

త్రికాలములు, త్రినేత్రములు, త్రినాడులు, త్రిమూర్తులు, త్రిమాతలు, 

త్రిగుణములు, త్రిలోకములు ఇవి అన్నీ అమ్మ సృష్టే. 

అంతా త్య్రంబకమే. అందుకే అమ్మను త్రయీమయీ అంటాం. 

ఆ పరమాత్మను చేరటానికి మార్గాలు కూడా మూడని భగవద్గీత చెప్తుంది. అవే కర్మ, భక్తి, జ్ఞానము. 

పరమశివుడు కూడా అన్నపూర్ణేశ్వరిని భిక్షను అడుగుతూ, ఆ బిక్ష 'జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం' అని 

అంటాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలనే మూడు సాధనాలతో ఉపాసిస్తే, అమ్మను చేరవచ్చు. 

తన మూడు కన్నులతో మూడు కాలాలను సృష్టిస్తూ, ఉపాసకులకు సుషుమ్నా మార్గాన్ని

సూచించే మూడవకన్నుతో ప్రకాశిస్తున్న,  ఆ త్రినయన కు వందనం.  

ఓం శ్రీ త్రినయనాయై నమః  


454. లోలాక్షీకామరూపిణీ  

లోలాక్షులకు అమ్మవారు కామరూపిణి అని ఈ నామార్దం. లోలాక్షులంటే స్త్రీలు. 

అమ్మ ఆడవారి కళ్ళకు కూడా మన్మథుని వలె కనిపిస్తుంది అని ఈ నామం చెప్తోంది. 

స్త్రీలు కూడా మోహపడే సుందర రూపం మహా త్రిపుర సుందరిది. అమ్మ యోగేశ్వరేశ్వరి. 

అంధకాసుర వధ సమయంలో వరాహమూర్తి అష్ట మాతృకలను సృషించాడు. 

కామగుణంతో యోగేశ్వరీదేవి, క్రోధగుణంతో మాహేశ్వరీదేవి, లోభగుణంతో వైష్ణవీదేవి, 

మదగుణంతో బ్రాహ్మణీదేవి, మోహగుణంతో కౌమారీదేవి, మాత్సర్యగుణంతో ఐంద్రీదేవి, 

కౄరత్వంతో యమదండధరాదేవి, అసూయతో వారాహీదేవి ఆవిర్భవించారు. 

ఈ అష్ట మాతృకలు ఆ యుద్ధంలో అంధకాసురుని రక్తం త్రాగి, ఆ రాక్షసుడిని వధించటానికి 

వరాహమూర్తికి తోడుగా నిలిచారు. ఈ వివరం అంతా వరాహ పురాణంలో చెప్పబడింది. 

ఆ కారణం చేత కామరూపిణీ అంటే యోగేశ్వరి. యోగేశ్వరీ స్వరూపముతో స్త్రీలకు కూడా 

మన్మధుని వలె అగుపడే, ఆ లోలాక్షీకామరూపిణి కి వందనం. 

ఓం శ్రీ లోలాక్షీకామరూపిణ్యై నమః  


455. మాలినీ  

మాలినీ అంటే మాలలు కలది. అమ్మ మంత్రములన్నీ మాలామంత్రములే. 

మంత్రములే మాలలుగా కలిగిన దేవత అని అర్ధం. మాలిని అనేది ఒక ఛందో వృత్త విశేషము.  

ఏడు సంవత్సరముల బాలికను మాలినీ అంటారు. మందాకినీ స్వరూపురాలు. 

అమ్మ మాలిని అనే చెలికత్తెను కలిగి ఉంది అని మరో అర్ధం. 

వామన పురాణంలో ఒక చిన్న కథ వుంది. 

శివ పార్వతుల వివాహ సమయంలో, సప్తపదిలో పార్వతి చెలికత్తె మాలిని, శివుడి పాదాన్ని 

పట్టుకుని, "ఈ సప్తపది సందర్భంగా మా సఖికి ఏమి కానుక ఇస్తావు" అని అడుగుతుంది. 

అప్పుడు శివుడు తన గోత్రాన్ని పత్నికి ఇస్తానని అంటాడు. 

అందుకే ఈనాటికీ వివాహసమయంలో, సప్తపది ఘట్టం అయిన తరువాతే 

వధువు గోత్రం మారి, వరుని గోత్రాన్ని పొందుతుంది. 

అమ్మ మంత్రాలన్నీ మాలా రూపంలో ఉంటాయి. ఖడ్గమాల కూడా మాలా మంత్రమే. 

స్తోత్రాలలో మంత్రములన్నీ, లేదా నామములన్నీ ఒకదానితో మరియొకటి అనుసంధానింపబడి 

ఉంటాయి. మాతృకా వర్ణములు అని పిలువబడే, అకారాది క్షకారాంత, యాభైఒక్క అక్షరములతో 

కూర్చిన మాలలే మంత్రములు. అందుకే ఈ మంత్రాలను మాలామంత్రములంటాం. 

ఈ మంత్రమాలలను కలిగిన లలితా త్రిపురసుందరిని ఈ నామంలో మాలినీ అంటున్నాం. 

యాభై ఒక్క అక్షరములతో ఏర్పడిన మంత్రములనే మాలలుగా ధరించే, ఆ మాలిని కి వందనం. 

ఓం శ్రీ మాలిన్యై నమః 

 

456. హంసినీ

హంసినీ అంటే హంస స్వరూపము కలది. హంసలు, పరమహంసలు అని పిలువబడే యోగుల 

సమూహానికి అధీశ్వరి. హంస అంటే ఆత్మ, పరమ హంస అంటే పరమాత్మ. 

హంస ఏ విధంగా పాలు, నీరుని విడదీస్తుందో, ఈ హంసలైన యోగులు ఆత్మ, అనాత్మలను 

ఆ విధంగా వేరు చేసి చూడగలరు. అందుకే వీరిని హంసలు, పరమహంసలు అన్నారు. 

రామకృష్ణ పరమహంస, పరమహంస యోగానంద అట్టి యోగులు. 

ఊపిరి రూపంలో అన్ని ప్రాణులలో ఉండేది ఈ హంసయే. ఈ హంస జపాన్నే అజపాజపం 

అంటారు. హకారము ఉఛ్ఛ్వాస, సకారము నిశ్వాస. శ్వాస మీద ధ్యాసతో, సోహం జపం చెయ్యాలి. 

ఈ హంసకు శివశక్తులు రెండు కాళ్ళు, ఓంకారము శిరస్సు అని హంసోపనిషత్తులో  చెప్పబడింది. 

"హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహీ, తన్నో హంసః ప్రచోదయాత్" అనేది 

హంస గాయత్రీ మంత్రం. దీనినే అజపాగాయత్రి అని కూడా అంటారు. 

ఆత్మజ్ఞాన సంపన్నులైన హంసలచే ధ్యానింపబడే, ఆ హంసిని కి వందనం. 

ఓం శ్రీ హంసిన్యై నమః 


457. మాతా

అందరినీ సృష్టించింది కనుక మాత అనే నామం వచ్చింది. లక్ష్మీ బీజ స్వరూపురాలు. 

చైతన్యమునకూ, జడమునకూ కూడా తల్లి. అన్ని మంత్రములలో అక్షర స్వరూపమే మాత. 

మాతృకా వర్ణముల స్వరూపము కనుక, ఆ పరమేశ్వరి మాతృకయైనది అని స్కాందపురాణంలో 

వున్నది. సకల సృష్టినీ తన గర్భం నుంచే సృజించి, ప్రళయకాలంలో తిరిగి తన లోనికే 

లయించుకుంటున్న తల్లి. ప్రళయకాలానంతరము తిరిగి సకల భువనాలనూ ప్రసవించు తల్లి. 

ఆదిశంకరుడు ఈ తల్లిని భువన ప్రసూత్యై, నిత్యప్రసూత్యై, జగత్సూత్యై అన్నాడు. ప్రసూతి 

అంటే పురుడు. మ్మ ద్వారా సృష్టింపబడని పదార్దమేదీ ఈ పధ్నాలుగు భవనాలలో లేదు. 

అన్నింటికీ, అందరికీ ఆ పరమేశ్వరియే కన్నతల్లి. అందుకే ఆ లలిత అందరికీ మాత

లోకాలోకాలన్నింటినీ కన్నతల్లి, జగజ్జనని, ఆ మాత కు వందనం. 

ఓం శ్రీ మాత్రే నమః 


458. మలయాచలవాసినీ 

మలయపర్వతాలలో నివసించే దేవి మలయాచలవాసినీ. 

శ్రీగంధపు చెట్లు పెరిగే పర్వతం మలయపర్వతం. గంధపు చెట్ల మధ్య వెలసిన దేవి అని అర్ధం. 

భారతదేశం లోని దక్షిణభాగంలో వున్న మళయాళ దేశమే ఈ మలయపర్వతాల స్థానం. 

పచ్చని ఈ మలయ పర్వతాలలో అమ్మ భగవతీ అనే రూపంలో పూజలందుకుంటోంది. 

కేరళదేశంలో ఎన్నో పురాతన భగవతీ ఆలయాలున్నాయి. 

వాటిలో చెంగన్నూర్ భగవతీ ఆలయంలో ఒక ప్రత్యేకత వుంది. అక్కడ కొలువైన భగవతీ 

అమ్మవారికి ఋతుక్రమం వస్తుంది. ఆ రోజుల్లో ఆలయాన్ని మూసి అమ్మవారిని వేరే గదికి 

తరలిస్తారు. నాలుగవ రోజు పంపానదికి విగ్రహాన్ని తీసుకువెళ్లి, స్నానం చేయించిన తరువాత 

తిరిగి గర్భగృహం లోకి తీసుకువస్తారు. ఈ తంతు అంతా పెద్ద ఉత్సవం లాగా చేస్తారు. 

ఈ కార్యక్రమం ఈ నాటి వరకూ ఆ ఆలయంలో జరుగుతూనే వుంది. 

భగవతి మాయలు, మహిమలు సామాన్యులకు అర్ధం కావు. 

మలయాచలములో భగవతి రూపములో ప్రకటితమైన, ఆ మలయాచలవాసిని కి వందనం. 

ఓం శ్రీ మలయాచలవాసిన్యై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

25, అక్టోబర్ 2021, సోమవారం

94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టిః, మతిః, ధృతిః శాంతిః, స్వస్తిమతీ, కాంతిః, నందినీ, విఘ్ననాశినీ

 

కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టిః, మతిః, ధృతిః 
శాంతిః, స్వస్తిమతీ, కాం
తిః, నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥

442. కుమార గణనాథాంబా

కుమారస్వామికి, గణనాథునికీ తల్లి అని ఈ నామానికి అర్ధం. 

గణపతి గణాధిపతి, శివ పార్వతుల ఆశీస్సులు కలవాడు. కుమారస్వామికి  బ్రహ్మవిద్యా బోధను 

చేసినవాడు. కుమారస్వామి దేవసేనాధిపతి. శివవీర్యం నుంచి జన్మించిన అగ్నిస్వరూపము. 

మారుడు అంటే మన్మధుడు, కు మారుడు అంటే మన్మథవికారము. 

లలితాంబ ఈ ఇద్దరికీ తల్లి.  కు మారగణ నాథాంబా అంటే మారగణాలకు, 

అంటే వికారమైన మన్మథగణాలకు నాథులయినవారిని బంధించునది అని భావం.   

వరాహపురాణం ప్రకారము పురుషుడంటే విష్ణువు లేదా శివుడు. అవ్యక్తము శ్రీదేవి, ఉమాదేవి. 

ప్రకృతి పురుషుల సంగమం వలన జనించేది అహంకారము అని చెప్పారు. 

వరాహపురాణంలో కుమారుడు అంటే అహంకారము అని కూడా చెప్పబడింది. 

ఈ అహంకార గణములు ఆవహించిన వారిని బంధించునది పరమేశ్వరి అని అర్ధం. 

పరమశివుడు పురుషుడు, పరమేశ్వరి ప్రకృతి. వీరిద్దరి సంయోగము వలన జనించేది 

అహంకారము. ఆ అహంకార గణములను బంధించేది శ్రీలలిత. 

పుత్రుల, భక్తుల అహంకారమును బంధించునది శ్రీమాత అని ఈ నామార్ధం. 

కు-మార-గణముల నాథుడైన అహంకారమును బంధించిన, 

ఆ కుమార గణ నాథాంబ కు వందనం. 

ఓం శ్రీ కుమారగణనాథాంబాయై నమః  


443. తుష్టిః

తుష్టి అంటే సంతోషము, ఇక్కడ అమ్మవారిని సంతోష స్వరూపురాలు అని చెప్తున్నాం. 

"యా దేవీ సర్వ భూతేషు తుష్టి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః"

మార్కండేయ పురాణంలో దేవీ స్తుతిలో, సర్వభూతములలో తుష్టి రూపములో వున్న 

ఆ దేవికి నమస్కారము అని వున్నది. తుష్టి అనేది ఒక సిద్ధి, ఒక గుణము. 

మన అందరిలో సంతోషము రూపములో ఆ అమ్మ వున్నది అని తెలుసుకోవాలి. 

ఆనందముగా ఉండేవారి ముఖంలో వెలుగొందే తేజస్సు, వారిలో వుండే కళ ఆ జగజ్జనని, 

లలితాపరమేశ్వరిదే. అమ్మను ఉపాసించిన వారికి తుష్టి అనే సిద్ధిని అమ్మ ఇస్తుంది. 

తుష్టి లేకపోతే ఏ ఇతర సిద్ధీ కూడా తృప్తినివ్వదు. పద్మపురాణంలో వజ్రేశ్వరీ క్షేత్రంలో 

వున్న దేవి తుష్టి స్వరూపిణి అని చెప్పబడింది. 

సకల భూతములలో సంతోషము రూపములో వున్న, ఆ తుష్టి కి వందనం.  

ఓం శ్రీ తుష్ట్యై నమః  


444. పుష్టిః 

పుష్టి అంటే పోషణ, ఎదుగుదల. ఈ నామంలో అమ్మను మనకు పోషణ నిచ్చి, 

మన ఎదుగుదలకు కారణమైన శక్తిగా కీర్తిస్తున్నాం. తల్లే కదా పిల్లల పోషణ చూసేది. 

పిల్లల పోషణా భారం వహించే ప్రతి తల్లిలోనూ వుండి, పోషణ నందించేది ఆ జగన్మాతయే. 

మార్కండేయ పురాణంలో దేవీ స్తుతిలో, సర్వభూతములలో మాతృ రూపములో 

వున్న ఆ దేవికి నమస్కారము అని వున్నది. 

"యా దేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః"

కుపోషణ ఉంటే, అమ్మ అనుగ్రహం లేనట్లే. ప్రతిజీవి లోనూ వారి ఎదుగుదలకు కారణమైన తల్లి 

ఈ పుష్టీ దేవి. జ్ఞానసంబంధర్ కు స్తన్యము, జ్ఞానము ఇచ్చినది ఈ దేవే కదా. 

ఈ పుష్టీదేవిని ఉపాసించిన వారికి, ఆ అమ్మ కడుపూ నింపుతుంది, జ్ఞానాన్నిచ్చి బుద్ధినీ 

పెంచుతుంది. దేవదారు వనంలో వున్న దేవత పేరు పుష్టి. తుష్టి కలవారికి పుష్టి లభిస్తుంది. 

సకలజీవులకూ పోషణ నందించే ఆ జగన్మాత, ఆ పుష్టి కి వందనం. 

ఓం శ్రీ పుష్ట్యై నమః  


445. తిః 

మతి అంటే బుద్ధి. ఈ బుద్ధియే జీవులకు, ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలియచేస్తుంది. 

మతి అంటే ఆలోచన. మతి అంటే వివేచన. మతి అంటే ఎరుక. 

వాయుపురాణంలో "అన్నింటినీ భరించే పరమాత్మను అనేక భాగాలుగా విభజించునది మతి, 

పురుషుని భోగలాలసునిగా చేయునది మతి" అని చెప్పారు. 

సూతసంహితలో "వేదముల యందు ఆసక్తి కలది, మంగళప్రదమైనది, శుభ అనుభవములు 

ఇచ్చునది, చక్కని సుఖములు కలిగించునది, కేశవుడి చేత పూజలు అందుకునేది శివా" అని 

చెప్పబడింది. మార్కండేయ పురాణంలో దేవీ స్తుతిలో, సర్వభూతములలో బుద్ధి రూపములో 

వున్న ఆ దేవికి నమస్కారము అని వున్నది.

"యా దేవీ సర్వ భూతేషు బుద్ధి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః"

బుద్ధి రూపములో అందరిలోనూ వున్నది ఆ పార్వతీదేవియే. ఆ శ్రీదేవిని శ్రద్ధగా ఉపాసిస్తే 

మంచి బుద్ధి నిస్తుంది. తుష్టి, పుష్టి కలవారికి మతి అనే సిద్ధి కూడా లభిస్తుంది. 

సుమతులకు పోషణా, కుమతులకు శిక్షణా ఇచ్చే, ఆ మతి కి వందనం. 

ఓం శ్రీ మత్యై నమః 

  

446. ధృతిః

ధృతి అంటే ధైర్యము. ధృతి అంటే స్థిర ప్రజ్ఞ. ధృతి అంటే స్థిర జ్ఞానము. 

ఈ ప్రజ్ఞ వలననే జ్ఞానమును పొంద గలుగుతున్నాం. ఈ ప్రజ్ఞ వలననే వివేకము కలుగుతోంది. 

శ్రీదేవిని ధ్యానించినవారికి స్థిర ప్రజ్ఞను ఇస్తుంది. ధృతి వలన ధైర్యము, స్థైర్యము కలుగుతాయి. 

ప్రజ్ఞను చంచలం కాకుండా ధృతి నిరోధిస్తుంది. పిండారక క్షేత్రంలో ఉన్న దేవత పేరు ధృతి. 

"యా దేవీ సర్వ భూతేషు ధృతి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః"

ధృతి వలన ఇహపరాల్లో సుఖం లభిస్తుంది. ధృతి వున్నవాడు విజయుడౌతాడు. 

తుష్టి, పుష్టి, మతి పొందిన వారికి ధృతిని కూడా అమ్మ అనుగ్రహిస్తుంది. 

ఉపాసకులకు స్థిర ప్రజ్ఞ నిచ్చే, ఆ ధృతి కి వందనం. 

ఓం శ్రీ ధృత్యై నమః 


447. శాంతిః 

శాంతి అంటే శమము. షోడశ కళలలో ఒక కళకు శాంతికళ అని పేరు. 

బృహత్ పరాశర స్మృతిలో "నాసికకు పదిహేను అంగుళముల కింద, జీవుని శుద్ధి చేయు 

కళాస్థానము ఒకటి వ్యాపించి వున్నది, దానికి శాంతి కళ అని పేరు" అని చెప్పబడింది. 

కామ క్రోధ లోభ మోహ మద మత్సర గుణములకు భిన్నమైనది శాంతి. 

సత్వగుణ ప్రధానమైనది. తుష్టి, పుష్టి, మతి, ధృతి వున్న చోట శాంతి ఉంటుంది. 

"యా దేవీ సర్వ భూతేషు శాంతి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః"

మార్కండేయ పురాణంలో దేవీ స్తుతిలో, సర్వభూతములలో శాంతి రూపములో వున్న 

ఆ దేవికి నమస్కారము అని వున్నది. శాంతి అనేదే సర్వోత్తమ స్థితి అని శైవాగమములో చెప్పారు. 

మనసు కల్లోలముగా వున్నప్పుడు ఈ నామంతో శ్రీదేవిని ఉపాసించిన వారికి శాంతి కలుగుతుంది.  

ఉపాసకులకు శమము, శాంతమూ ఇచ్చే, ఆ శాంతి కి వందనం. 

ఓం శ్రీ శాంత్యై నమః 


448. స్వస్తిమతీ 

స్వస్తి మతీ అంటే చక్కగా తుష్టి, పుష్టి, మతి, ధృతి, శాంతి కలిగి, నాశము లేకుండా ఉన్నది 

అని అర్ధం. స్వస్తి అంటే సు అస్తి. చక్కగా, మంచిగా ఉండుట అని అర్ధం. 

ఆ విధంగా వున్నది స్వస్తిమతీ. చక్కని ఉనికి కలది అని భావం. 

ఏకాలంలో నైనా చక్కగా ఉండునది, నిత్య సత్య స్వరూపము అని అర్ధం.  

స్వస్తి అంటే క్షేమము, నిష్పాపము, మంగళము, పుణ్యము అనే అర్ధాలున్నాయి. 

స్వస్తి పదాన్ని ఆశీర్వాద వచనంగా వాడతాం. ఈ స్వస్తి స్థితిని పూజించటానికి స్వస్తికమనే 

చిహ్నాన్ని ఉపయోగిస్తాము. శుభకార్యాలలో స్వస్తిక గుర్తుని గీసి పూజించటం అనే సంప్రదాయం 

వున్నది. స్వస్తిని కలుగచేయునది స్వస్తిమతీ. అవినాశ స్వరూపము, మంగళస్వరూపము. 

తుష్టి, పుష్టి, మతి, ధృతి, శాంతి సిద్ధులను పొందిన వారికి, స్వస్తిని కూడా 

అనుగ్రహిస్తున్న,  ఆ స్వస్తిమతి కి వందనం. 

ఓం శ్రీ స్వస్తిమత్యై నమః 


449. కాంతిః 

కాంతి అంటే అందరి చేతా కోరబడునది. ఇచ్ఛాశక్తి స్వరూపురాలు. 

ప్రాణులలో జీవకళ రూపములో ప్రకాశించే తేజస్సే కాంతి. 

ఇచ్ఛాశక్తి రూపములో, అందరిలోనూ వెలుగొందుతున్న పరమేశ్వరియే కాంతి. 

"యా దేవీ సర్వ భూతేషు కాంతి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః"

మార్కండేయ పురాణంలో దేవీ స్తుతిలో, సర్వభూతములలో కాంతి రూపములో వున్న 

ఆ దేవికి నమస్కారము అని వున్నది.

తుష్టి, పుష్టి, మతి, ధృతి, శాంతి, స్వస్తి సిద్ధులు పొందిన వారికి కాంతి సిద్ధి కూడా లభిస్తుంది. 

జీవులందరిలో ప్రకృష్టంగా కనిపించే తేజోరూపములో వున్న కళ, ఆ కాంతి కి వందనం. 

ఓం శ్రీ కాంత్యై నమః


450. నందినీ 

నందినీ అంటే ఆనందం కలిగించునది. నందినీ గంగా స్వరూపురాలు. 

నందిని అంటే తనయ. యశోదా నందుల కుమార్తె యోగమాయ పేరు నందిని. 

వశిష్టాశ్రమంలో వున్న కామధేనువు సంతతి గోవత్సము పేరు నందినీ. 

ఆనంద కారణము బాహ్యమైన దైతే ఆ ఆనందము శాశ్వతము కాదు. 

అదే ఆనందము, కారణము లేకుండా లోపల నుంచి కలిగితే, ఆ ఆనందమునకు కారణం అమ్మ. 

నందినీ దేవత ఇచ్చే ఆనందము శాశ్వతము. ఇది ఇంద్రియ సంబంధమైనది కాదు. 

నందినీ ధేనువు ఇచ్చిన బలము, ధైర్యము వల్లనే వశిష్టుడు విశ్వామిత్రుడిని శాంతముగా 

గెలిచాడు. ఆనందముగా వున్నవారిని చూసి ఆనందించే వారిని అమ్మ అనుగ్రహిస్తుంది. 

ఆనందముగా వున్నవారిని చూసి అసూయ పడేవారికి అమ్మ ఆనందము ఇవ్వదు. 

శాంతముగా ఆనందమును ఆస్వాదించ కలిగే సిద్ధిని అనుగ్రహిస్తున్న, ఆ నందిని కి వందనం. 

ఓం శ్రీ నందిన్యై నమః


451. విఘ్ననాశినీ

విఘ్ననాశినీ అంటే విఘ్నములను నాశము చేయునది. విద్యా విఘ్నములను దూరం చేయునది. 

శ్రీమాత విఘ్నములను నివారించునది కనుక ఈ నామములో అమ్మను విఘ్ననాశినీ అంటున్నాం. 

జ్ఞానార్జనలో విఘ్నములు కలిగితే ఉపాసకుడు కావలసిన సిద్ధిని పొందడు. 

శుద్ధజ్ఞానము కొరకు ఉపాసిస్తున్నపుడు విఘ్నములు కలుగుతూ ఉంటే,  ఈ నామ జపం చేస్తే, 

ఆ విఘ్నములు తొలగిపోతాయి. శ్రీమాత విఘ్నములు కలిగించునది, తొలగించునదీ కూడా. 

ఈ సత్యమును గ్రహించిన ఉపాసకులు విఘ్నములను కూడా అమ్మదయ అని స్వీకరిస్తారు. 

ఆ విఘ్నము వారికి కష్టము అనిపించదు. ఆ విఘ్నముల వలన వారికి దుఃఖము కలుగదు. 

విఘ్నములను నియంత్రించే, ఆ విఘ్ననాశిని కి వందనం. 

ఓం శ్రీ విఘ్ననాశిన్యై నమః


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

24, అక్టోబర్ 2021, ఆదివారం

93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ కుళకుండాలయా, కౌళ మార్గ తత్పర సేవితా

 

కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ 
కుళకుండాలయా, కౌళ మార్గ తత్పర సేవితా ॥ 93 ॥

436. కుశలా

కుశలా అంటే నీటిని గ్రహించి తిరిగి నీటిని ఇచ్చేది అని ఒక అర్ధం.    

చంద్ర కాంతిని ధిక్కరించి ప్రకాశించేది అని ఇంకో అర్ధం.      

కుశలత అంటే నైపుణ్యం, నేర్పరితనం. శివునితో కలసి ఈ సృష్టిని తీర్చిదిద్దటంలో అమ్మ

నేర్పరి. మానవుని సృష్టించటంలో అమ్మ కౌశల్యము ఎంత పరిపూర్ణమైనదంటే, 

ప్రతి మానవుడినీ, సరియైన యోగసాధన చేస్తే, వాడిని శివుడంత వాణ్ని చేస్తుంది. 

కుశలుడంటే శివుడు అని కూడా అర్ధం. 

తన నేర్పరితనంతో జీవుడిని, శివుడిని చేయగల కుశల ఆ జగన్మాత. 

మానవుడే కాదు, సృష్టి లోని ప్రతి అంశమూ చక్కగా నిపుణత కలిగిన శిల్పి చెక్కిన శిల్పం వలె 

దోషరహితంగా ఏర్పరచింది ఆ జగన్మాత. 

దోషాలు వున్నాయి అంటే, అది తప్పకుండా ఆ జీవుడు చేసుకున్న కర్మ ఫలితమే. 

అది అనుభవించక తప్పదుకదా. 

ఘనమైన నైపుణ్యంతో సృష్టి కార్యమును శివునితో కలసి నిర్వర్తిస్తున్న, ఆ కుశల కు వందనం. 

ఓం శ్రీ కుశలాయై నమః  


437. కోమలాకారా

కోమలమైన ఆకారము కలది అని ఈ నామానికి అర్ధం. 

అమ్మ తనూలత ఎంత లావణ్యంగా ఉందో చెప్పుకున్నాం. 

అతి సన్ననైన నడుము ఆ  భారాన్నంతా ఎలా మోస్తోందో కదా అని ఆశ్చర్యపడ్డాం. 

అంత సన్నని నడుముతో తన గర్భంలో ఈ విశ్వాన్నంతా ఎలా భరిస్తోందా అని విభ్రమ చెందాం.  

అంత సన్నని సుకుమారమైన లత లాంటి తనువుతో నిత్య ప్రసూతియై ఈ భువనాలన్నింటినీ 

ఎలా, ఎప్పుడూ నూతనంగా ప్రసవిస్తోందో కదా అని అబ్బురపడుతూనే వున్నాం. 

ఎప్పటికప్పుడు అద్భుతాలను చేసే ఆ అమ్మను చూసి విస్మయం చెందుతూనే వున్నాం. 

సుకుమారమైన తనూలతతో, లావణ్యలతిక వలె శోభిల్లుతున్న, ఆ కోమలాకార కు వందనం.  

ఓం శ్రీ కోమలాకారాయై నమః  


438. కురుకుళ్లా  

కురుకుల్లా లేదా కురుకుళ్ళా అనే దేవీ స్వరూపురాలు అని ఈ నామానికి అర్ధం. 

మణిద్వీపంలో శ్రీపురం వున్నది.  అది ఎన్నో ప్రాకారాలతో శోభిల్లుతూ వున్నది.  

అక్కడ అహంకారము, చిత్తము అనే రెండు ప్రాకారాల మధ్య విమర్శ అనే ఓ దిగుడుబావి వున్నది.

ఆ బావిపై అధికారము వున్న దేవత పేరు కురుకుల్లా.  

లలితా స్తవ రత్నంలో కురుకుల్లా దేవి గురించి ఈ విధంగా వున్నది.

"కురుకుల్లా శరీరమంతా కుంకుమమును పూసుకుని ఉంటుంది, కులపర్వతాలకన్నా పెద్దవైన 

కుచములచే వంగిన నడుము కలది, కురువిందమణులపై కూర్చుని వున్నది" అని చెప్పారు. 

ఆ కురుకుల్లా దేవిని ధ్యానిస్తే, అహంకారానికి, చిత్తానికి మధ్యలో వున్న విమర్శను దాటుతాము. 

మనోవిజ్ఞానశాస్త్రములో కూడా చెప్పుకునేది ఇదే కదా. 

తంత్రరాజంలో కూడా ఈ కురుకుల్లా దేవి ప్రసక్తి వున్నది. ప్రాణనాడీ స్వరూపురాలు. 

తనను ఉపాసించే భక్తులను చిత్తాహంకారముల మధ్యలో గల, విమర్శలో పడి 

మునిగిపోకుండా రక్షించే, ఆ కురుకుళ్ల కు వందనం. 

ఓం శ్రీ కురుకుళ్లాయై నమః  


439. కులేశ్వరీ 

కులము అంటే సజాతీయత అని చెప్పుకున్నాం. కులేశ్వరీ అంటే ఆ సజాతీయులకు ఈశ్వరి. 

మాతృ మాన మేయములు అంటే కొలిచేవాడు, కొలత, కొలవబడేది. 

ఇవి సజాతీయములు, అంటే ఈ మూడూ ఒక కులము. ఒక సమూహము. 

కురుకుల్లా దేవి ఆ కులమునకు ఈశ్వరి. కనుక, ఆ దేవిని కులేశ్వరీ అంటున్నాం. 

సజాతీయతను బట్టీ కులములను ఏర్పరచి పాలించే, ఆ కులేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ కులేశ్వర్యై నమః 

  

440. కులకుండాలయా

 కులకుండలమందు నివసించునది అని ఈ నామానికి అర్ధం. 

కులకుండలం అంటే మూలాధారం వద్ద వున్న బిందు స్థానం అని చెప్పుకున్నాం. 

అదే కుండలినీ స్థానం. కుండలినీ శక్తి అక్కడ మూడున్నర చుట్లు చుట్టుకున్న పామువలె 

తల కప్పుకుని పడుకుని ఉంటుంది. కనుకనే ఆ బిందు స్థానాన్ని కులకుండలం అన్నాం. 

కులకుండలంలో ఉండేది కుండలినీ శక్తి. అదే శక్తి కూట స్థానం.  

కుండలినీ రూపంలో కులకుండలంలో నిద్రావస్థలో వున్న, ఆ కులకుండాలయ కు వందనం. 

ఓం శ్రీ కులకుండాలయాయై నమః 


441. కౌళ మార్గ తత్పర సేవితా 

కౌళము, కౌలము, కులము అన్నీ ప్రత్యామ్నాయ పదాలు. 

కుల మార్గము అంటే, వంశానుగతంగా వస్తున్న పద్ధతి, ఆచారము, సంప్రదాయము. 

వంశములో పెద్దలేర్పరచిన విధముగా, తత్పరతతో పూజాదికాలు చేసి సేవించే  

వారి పూజను ఇష్టపడునది అని ఈ నామానికి అర్ధం. 

ఇక్కడ వంశము అంటే, తాత తండ్రుల వంశం, లేదా గురు పరంపరగా ఏర్పడినది, 

లేదా కులము, వర్ణమును బట్టీ ఏర్పడిన సంప్రదాయం అని తెలుసుకోవాలి. 

సమయాచారము, మిశ్రాచారము, కౌలాచారము అని మూడు పద్ధతులు వున్నాయి. 

సమయాచారమంటే వైదికము, మిశ్రాచారమంటే వైదిక తాంత్రికముల మిశ్రమం. 

కౌలాచారమంటే తాంత్రికము. ఈ తంతులన్నీ కుల పెద్దలు నిర్దేశించి వుంచారు. 

వంశంలో, కులంలో, గోత్రంలో, పరంపరగా పాటించే కొన్ని నియమాలు, పద్ధతులు ఉంటాయి. 

పెద్దలు తమ అనుభవాల ద్వారా, కొన్ని ఉపాసనా విధానాలను ఏర్పరచి వుంటారు. 

ఆ పెద్దలను ధిక్కరించి చేసే ఉపాసనల కన్నా, పెద్దలు నియమించిన విధానంలో 

పూజించిన వారిపై ఆసక్తి కల తల్లి లలితా పరమేశ్వరి. 

తంత్ర శాస్త్రము లన్నింటిలో ఈ విషయము స్పష్టముగా చెప్పబడింది. 

అనుక్రమంగా వస్తున్న పూజలు, కైంకర్యాలు, నైవేద్యాలు పాటించేవారి 

సేవలను ప్రీతితో స్వీకరించునది అని భావార్ధం. 

పూజలు త్వరగా ఫలించాలంటే, కౌళమార్గాన్ని అనుసరించమని ఈ నామం సూచిస్తోంది. 

కులములో, వంశములో పెద్దలు చెప్పిన పద్దతిలో, తత్పరతతో, సేవించేవారి సేవలను

స్వీకరించే, ఆ కౌళ మార్గ తత్పర సేవిత కు వందనం. 

ఓం శ్రీ కౌళ మార్గ తత్పర సేవితాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

23, అక్టోబర్ 2021, శనివారం

92. మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా

 

మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః 
చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా ॥ 92 ॥

432. మదఘూర్ణిత రక్తాక్షీ

మదముచే గిరగిరా తిరుగుతున్న ఎర్రని కన్నులున్నదానా అని ఈ నామార్ధం. 

ఈ మదము దేని వలన వచ్చిందీ అంటే, ఆనందముతో సేవించిన మద్యము వలన వచ్చింది. 

కన్నులు ఎర్రబడ్డాయి, మత్తుతో తూగుతూ వున్నాయి ఆ కళ్ళు. 

సుధాపాన పారవశ్యంలో మత్తుగా తూగుతున్న, అమ్మ ఎదురుగా ఏ మధ్యందిన సూర్యుడో, 

ఏ అగ్నిభట్టారకుడో కదలుతున్నారేమో, వారి ఎర్రని వెలుగు అమ్మ కంట్లో ప్రతిఫలించి, 

ఆ కళ్ళు రక్త వర్ణంతో ఎర్రగా మెరుస్తున్నాయి. 

అందుకే ఈ నామంలో ఆ మదశాలినీని మదఘూర్ణిత రక్తాక్షీ అన్నారు. 

మదము వలన ఏర్పడిన మత్తుతో తూగుతున్న, రక్తము వలె ఎర్రబడ్డ కన్నులు కల, 

ఆ మదఘూర్ణిత రక్తాక్షి కి వందనం. 

ఓం శ్రీ మదఘూర్ణితరక్తాక్ష్యై నమః  


433. మదపాటల గండభూః

గణ్డభూ అంటే చెక్కిళ్ళు. అమ్మ చెక్కిళ్ళు దర్పణముల వలే స్నిగ్ధంగా, తరళంగా వుంటాయని 

తెలుసు కదా. పాటలము అంటే తెలుపుతో కూడిన ఎరుపు అని అర్ధం. 

అమ్మ చెక్కిళ్ళు ఎర్రగా ఉంటాయి. ఆ ఎరుపు మదము చే కలిగిన సంతోషము వలన ఏర్పడింది. 

పక్కనే తెల్లని శివుడు ఆసీనుడయి ఉండటంతో, కస్తూరి అద్దిన, ఆ అద్దాల్లాంటి చెక్కిళ్ళలో 

తెలుపు, ఎరుపు మిశ్రితమై గులాబీ రంగుకి మారాయి. 

పక్కనే శివుడున్న అపరిమిత ఆనందంలో అమ్మ చెక్కిళ్ళు ఎర్రబారి వున్నాయి. 

పాటలీ కుసుమపత్రాల వలె ఎర్రగా ప్రకాశిస్తున్న బుగ్గలు కల ఆ కామేశ్వరి మధుసేవనం చేత 

ఆనందముగా మత్తెక్కి వున్నది. పైగా ఆ కామేశ్వరి నిత్యయౌవనమూర్తి కదా, 

యవ్వనంలో ఉన్నవారి చెక్కిళ్ళు సహజంగానే గులాబీ రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి.   

గులాబీ వర్ణంలో మెరుస్తున్న చెక్కిళ్ళతో విరాజిల్లుతున్న, ఆ మదపాటల గండభు కు వందనం.  

ఓం శ్రీ మదపాటలగండభువే నమః  


434. చందన ద్రవ దిగ్ధాంగీ

తాపం కలిగినప్పుడు నివారణకు గంధం పూస్తాం. మధుపానం చేసిన కామేశ్వరికి తాపం కలిగింది. 

అప్పుడు ఆ తాప ఉపశమనం కోసం, దేహానికి గంధం రాయించుకున్నది. తాపం చల్లబడింది. 

ఉగ్ర నరసింహుడికి కూడా కోపం ఎక్కువ. ఆయనకూ ఆ కోపం చల్లబరచడానికి, చందనసేవ 

చేస్తూ వుంటారు. అన్నాచెల్లెళ్ల  కోపతాపాలను ఈ చందన లేపనం చల్లబరుస్తూ ఉంటుంది.  

గంధపు చెక్కని సాన మీద అరగదీస్తే, చందన ద్రవం వస్తుంది. 

ఆ చందన ద్రవానికి కుంకుమపువ్వు కలిపితే అది మరింత త్వరగా తాపాన్ని తగ్గిస్తుంది. 

ఆ ద్రవాన్ని అమ్మవారు అంగములంతా రాచుకుని, శాంతంగా వున్నది అని ఈ నామానికి అర్ధం. 

అమ్మవారిని అలుముకున్న ఆ చందనము, ఆ చందనవృక్షము ఎంత పుణ్యం చేసుకున్నాయో. 

శరీరమంతా చందనం పూతతో శోభిల్లుతున్న, ఆ చందన ద్రవ దిగ్ధాంగి కి వందనం. 

ఓం శ్రీ చందనద్రవదిగ్ధాంగ్యై నమః  


435. చాంపేయకుసుమప్రియా 

చాంపేయ కుసుమాలంటే సంపెంగలు. పచ్చని సంపెంగ పుష్పాలంటే ఆ పరమేశ్వరికి ప్రీతి. 

ఇష్టమైన బంగరు రంగు సంపెంగలు ధరించి, ఆనందముతో తృప్తిగా ఉంటుంది అమ్మ. 

మంచి సుగంధముతో, అందంగా వుండే ఆ చాంపేయకుసుమాలంటే పరమేశ్వరికి ఇష్టం. 

ఆ అమ్మను తృప్తి పరచాలంటే, పుష్పసేవ చేయాలి. ఆ పుష్పాలు మంచివై ఉండాలి. 

ఎండినవీ, వాడినవీ, నలిగినవీ కాకుండా, అప్పుడే విచ్చుకుని, పరిమళాలు వెదజల్లే పూలతో 

పూజ చేస్తే, అమ్మ సంతోషిస్తుంది. సమర్పణ హృదయంతో చక్కని పువ్వు ఒక్కటి పెట్టినా చాలు. 

వాడిన పూలు గంపెడైనా ఫలితాన్నివ్వవు. అమ్మకు పువ్వులంటే ఇష్టం. పువ్వుల్లో చంపకాలంటే 

ఇష్టం. చంపక కుసుమాలను ఇష్టపడే, ఆ చాంపేయకుసుమప్రియ కు వందనం. 

ఓం శ్రీ చాంపేయకుసుమప్రియాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

22, అక్టోబర్ 2021, శుక్రవారం

91. తత్త్వాసనా, తత్, త్వం, అయీ, పంచకోశాంతరస్థితా నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ

 

తత్త్వాసనా, తత్, త్వం, అయీ, పంచకోశాంతరస్థితా 
నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥

424. తత్త్వాసనా

మొత్తం ముప్ఫయి ఆరు తత్వములు కలిసి దేహం ఏర్పడింది. వ్యాసుడు, ఆదిశంకరుడు, 

కాళిదాసు, విద్యారణ్యుడు, భాస్కరరాయలు వరకూ అందరూ చెప్పినది ఇదే. 

పృధ్వీ తత్వము నుంచి, శివ తత్వము వరకూ కల ముప్ఫయి అయిదు తత్వములూ 

ముప్ఫయి ఆరవదైన ఈశ్వరతత్వములో చేరటమే అద్వైత వేదాంత ఉపాసనా మార్గము. 

ఆ తత్వములు మూలప్రకృతి---1, మహదహంకారాలు---2, తన్మాత్రలు---5, భూతములు---5, 

జ్ఞానేంద్రియములు---5, కర్మేంద్రియాలు---5, ప్రాణాలు---5, ఉపప్రాణాలు---5, మనస్సు---1,

జీవుడు---1, ఈశ్వరుడు---1, మొత్తం ముప్పదియారు. 

ఈ ముప్ఫయి ఆరు తత్వాలనే యోగపీఠంగా కలది మహేశ్వరి. ఆ తత్వాసనమే సహస్రారపీఠం. 

ఆ పీఠంపై ఈశ్వరునితో కూడి అధిరోహించి, మోక్షమునిచ్చేది లలితాంబ. 

తత్వములే ఆసనంగా చేసుకుని, ఆ తత్వాలను తనలో లయింపచేసుకుంటున్న, 

 తత్త్వాసన కు వందనం. 

ఓం శ్రీ తత్త్వాసనాయై నమః  


425. తత్ 

తత్ అంటే బుద్ధి ప్రేరణా శక్తి. తత్ అంటే భగవత్ తత్వము. తత్ అంటే స్వయముగా ఆ శ్రీలలిత. 

తత్ అంటే 'అది' అని అర్ధం. అది అంటే ఏది, అనే ప్రశ్న వస్తే, ఎవరేదనుకుంటే అదే. 

విష్ణుసహస్రనామ స్తోత్రంలో కూడా యత్ తత్ అనే చెప్పబడింది. అంటే ఈ తత్ అనేది 

స్త్రీ, పుం లింగాలు రెండింటికీ వర్తిస్తుంది. నపుంసకలింగానికి కూడా వర్తిస్తుంది.  

అన్నమయ్య కూడా "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవూ... " అంటాడు.  

తత్ అనేది అదే. అమ్మ అనుకుంటే అమ్మ, అయ్య అనుకుంటే అయ్య. 

అందుకే ఈ ఏకాక్షర పదాన్ని బుద్ధి ప్రేరణా శక్తి అంటున్నాం. బుద్ధి ఏమి చెప్పితే అది. 

శక్తి అనగానే, అమ్మ అనే అర్ధం ఏర్పడింది. 

కనుక తత్ అంటే అమ్మ. తత్ అంటే, శ్రీలలిత అని చెప్పుకుంటున్నాం. 

తస్మై నమః అని తలచుకునే, ఆ తత్ అనే తత్వమైన, ఆ తత్ కు వందనం.  

ఓం శ్రీ తస్మై నమః  


426. త్వం 

త్వం అంటే నీవు. ఈ 'నీవు' ఎవరూ, అంటే ఆ క్షణం ఎవరు ఎదురుగా ఉంటే వారు.  

అది చైతన్యమైనా, జడమైనా, అమ్మైనా, బొమ్మైనా. తత్ వలెనే, త్వం అనేది కూడా 

స్త్రీ, పుం లింగాలు రెండింటికీ వర్తిస్తుంది. నపుంసకలింగానికి కూడా వర్తిస్తుంది. 

ఎదుటి వారు, లేదా వస్తువు, ఏదైనా, దానిలో భగవత్ శక్తిని చూడమని ఈ నామం చెప్తోంది. 

త్యాగరాజు 'నీ దయ రాదా.... ', అన్నా, అన్నమయ్య 'నీవు దేవుడవు, నేనొక జీవుడ.... ' అన్నా, 

అన్నీ ఆ నువ్వు అనేది ఈ తత్వం గురించే. ఆ 'నువ్వు' తత్వం, ఎవరు ఎంత భావిస్తే, అంత. 

అన్నిచోట్లా, నువ్వు అనే రూపంలో ఎదురు పడే ఆ త్వం అనేదే భగవత్ తత్వం. 

ఎదురైన ప్రతి పదార్ధము లోనూ దర్శనమిచ్చే, ఆ త్వం కు వందనం. 

ఓం శ్రీ తుభ్యం నమః  


427. అయీ 

అయ అంటే అయ్య, అయీ అంటే అమ్మ. ఈ అయీ అందరికీ అమ్మ. జగన్మాత, శ్రీమాత. 

అందరిలోనూ అమ్మనూ, అయ్యనూ చూడగలగటమే ఈ అయీ నామార్ధం. 

ఈనాటికీ కొన్ని ప్రాంతాల్లో తల్లిని 'ఆయీ' అంటున్నారు. ఆయీ అన్నా, అయీ అన్నా, అమ్మే. 

ఆదిశంకరుడు స్తుతించిన, "అయి గిరి నందిని...." అంటూ మొదలయ్యే మహిషాసురమర్దిని 

స్తోత్రంలో, ఆ 'అయి' ఈ  శ్రీమాతే. అన్నింటా తల్లిని దర్శించమని చెప్పే తత్వమే అయీ. 

ఆ అయి విశ్వగర్భ, స్వర్ణగర్భ. మన సనాతన ధర్మంలో భోజనం చేస్తున్నప్పుడు, భోజనం 

పెట్టేటప్పుడు భార్య అయినా సరే, తల్లి వలె చూడాలని "భోజ్యేషు మాతా" అని చెప్పారు. 

మాతృభావన ఎంత గొప్పదో తెలియచెప్పే, ఆ అయీ కి వందనం. 

ఓం శ్రీ అయ్యై నమః 

  

428. పంచకోశాంతరస్థితా

తైత్తిరీయోపనిషత్తులో అయిదు అంతస్థులలో వుండే పంచకోశముల గురించి విశదంగా చెప్పారు. 

అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలనేవి దేహంలో వుండే 

అయిదు కోశాలు. జ్ఞానార్ణవంలో శ్రీవిద్య, పరంజ్యోతి, పరా, నిష్కళశాంభవి, అజపామాతృక అనేవి 

పంచకోశ దేవతలు అని చెప్పారు. ఈ అయిదుగురు దేవతలూ  శ్రీచక్రంలో వుంటారు.   

శ్రీచక్రంలో శ్రీవిద్య మధ్యలో వుండి, మిగిలిన నలుగురు దేవతలూ నాలుగువైపులా వుంటారు. 

అన్నమే పరబ్రహ్మ స్వరూపము అని అన్నమయ కోశస్థితి లోనూ, ప్రాణమే పరబ్రహ్మమని 

ప్రాణమయ  కోశస్థితి లోనూ, మనస్సే పరబ్రహ్మ స్వరూపము అని మనోమయ కోశస్థితి లోనూ,

విజ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము అని విజ్ఞానమయ కోశస్థితి లోనూ, అనిపిస్తూ ఉంటుంది. 

కానీ వీటి అన్నింటికన్నా ఉన్నతమైన స్థితి, ఆనందమే పరబ్రహ్మ స్వరూపము అని తెలిపే  

ఆనందమయ కోశస్థితి. అన్నమయ కోశంలో ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశంలో మనోమయ 

కోశం, మనోమయ కోశంలో విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశంలో ఆనందమయ కోశం ఇమిడి

వున్నాయి. ఈ విధంగా అంతరాంతరాలలో దాగి వున్న కోశం ఆనందమయ కోశం. 

బైట వున్న కోశాలు తృప్తి చెందితేనే, లోపల వున్న కోశాలు సంతృప్తి చెందుతాయి. 

అత్యున్నత స్థితి, ఆనందమయ కోశం తెరుచుకుని ఆనందం కలగటమే. మళ్ళీ ఆ ఆనందం 

లోనూ వివిధ దశలున్నాయి. వాటి గురించి తరువాత వచ్చే నామాలలో చెప్పుకుందాం. 

ఈ విధంగా పంచకోశాలూ ఒకదానిలో ఒకటి, లేదా ఒకదానిపై ఒకటిగా అమరివున్నాయి. 

ఈ అయిదు కోశాల మధ్యలో వున్న ఆ లలితాత్రిపురసుందరీదేవియే పంచకోశాంతరస్థితా. 

పంచ కోశాలలో వుండి, అన్నమూ, ప్రాణమూ, మనస్సు లను తృప్తి పరుస్తూ, 

విజ్ఞానము, ఆనందము ను కలుగచేసే, ఆ పంచకోశాంతరస్థిత కు వందనం. 

ఓం శ్రీ పంచకోశాంతరస్థితాయై నమః 


429. నిస్సీమమహిమా 

ఈ నామంలో అమ్మవారిని హద్దులు లేని మహిమ కలది అని చెప్పుకుంటున్నాం. 

అష్ట సిద్ధులూ అమ్మ ఆధీనంలోనే ఉంటాయి. ఆ సిద్ధుల లోనిదే మహిమా సిద్ధి. 

శ్రీచక్ర ప్రథమావరణ దేవతలలో ఒకటి ఈ మహిమాసిద్ధి. ఎల్లలు లేని, అవధులు తెలియబడని 

మహిమ ఆ పరమేశ్వరిది. చిన్న చిన్న వాటికే అందరూ, నా శక్తి ఇంత గొప్పది, నా బలం అంత 

గొప్పది, నా పేరు ప్రతిష్టల ముందు ఎవరూ దేనికీ నిలవలేరు అని చెప్పుకుంటూ వుంటారు. 

మరి ఇవన్నీ సృష్టించిన ఆ మహామహాశక్తి, లలితాపరమేశ్వరి శక్తి, బలం, మహిమ మరెంత పెద్దది. 

ఊహించటానికే సాధ్యం కాదు. అందుకే ఈ నామంలో ఆ తల్లిని నిస్సీమమహిమా అంటున్నాం. 

అవధులే లేని, పరిమితులే లేని, అనంతమైన, ఊహింప శక్యము కానంత పరిధిలో 

తన మహిమను చూపుతున్న, ఆ నిస్సీమమహిమ కు వందనం. 

ఓం శ్రీ నిఃసీమమహిమ్నే నమః 


430. నిత్యయౌవనా 

శ్రీలలిత, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దక్షిణామూర్తి వీరు ఎప్పుడూ యవ్వనం లోనే ఉన్నట్టు 

కనబడతారని చెప్పుకున్నాం. వీరు ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితిలోనూ యవ్వన రూపంలోనే 

దర్శనమిస్తారు. అమ్మ నిత్యాషోడశికారూపా కనుక, ఎప్పుడూ పదహారేళ్ళ ప్రాయంలోనే ఉంటుంది. 

త్రికాలములంటే, బాల్య, యవ్వన, వార్ధక్య దశలు. ఆ కాలాలను ఏర్పరిచింది ఈ షోడశి కనుక, 

అమ్మ ఈ త్రికాలములకూ అతీతము. అమ్మ యొక్క ఈ నిత్య యవ్వన రూపాన్ని చూసి 

ముగ్ధులవుతూ వుంటారు ఉపాసకులు, దేవతలు, త్రిమూర్తులు కూడా. 

అందరినీ ఆకర్షిస్తూ, సదా పదహారేళ్ళ బాలికా రూపంలో వుండే, ఆ నిత్యయౌవన కు వందనం. 

ఓం శ్రీ నిత్యయౌవనాయై నమః 


431. మదశాలినీ

మదము అంటే ఆనందము, శాలినీ అంటే ఇల్లాలు అనే అర్ధాలున్నాయి. 

ఆనందముతో శోభించే ఇల్లాలే మదశాలినీ. ఈ నామంలో ఆ కామేశ్వరుని ఇల్లాలు 

కామేశ్వరిని, మదశాలినీ అంటున్నాం. 

ఏ ఇంట ఇల్లాలు ఆనందముగా ఉంటుందో, ఆ ఇంట్లో ఆ రూపంలో లలితాపరమేశ్వరి 

నివసిస్తున్నట్టే. అందుకే "యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః", అని మనుస్మృతి

చెప్తుంది. ఇల్లాలిని ఆనందంగా ఉంచితే, ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి స్థిరముగా ఉంటుంది. 

ఈ నామంలో మదము అనేది అపరిమిత, అవధులు లేని ఆనందాన్ని సూచిస్తోంది. 

ప్రతి ఇంటా ఇల్లాలి రూపంలో, ఘనమైన పరమానందముతో తేజరిల్లే, ఆ మదశాలిని కి వందనం. 

ఓం శ్రీ మదశాలిన్యై నమః


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650