25, నవంబర్ 2021, గురువారం

125. క్లీంకారీ, కేవలా, గుహ్యా, కైవల్య పదదాయినీ త్రిపురా, త్రిజగద్వంద్యా, త్రిమూర్తిః, త్రిదశేశ్వరీ

   

క్లీంకారీ, కేవలా, గుహ్యా, కైవల్య పదదాయినీ 
త్రిపురా, త్రిజగద్వంద్యా, త్రిమూర్తిః, త్రిదశేశ్వరీ ॥ 125 ॥

622. క్లీంకారీ

క్లీంకారం కామబీజం. కనుక ఈ నామంలో అమ్మవారిని కామబీజస్వరూపురాలు అని 

తెలుసుకుంటున్నాం. సర్వజగత్తులనూ వశము చేసుకునేది కామబీజం, వశీకరణబీజం. 

ఎటువంటి కామమైనా, ఆ కామము తీరితే ఆనందము కలుగుతుంది. అందరూ ఆ ఆనందము 

కోసమే ఎల్లప్పుడూ పరిశ్రమిస్తూ వుంటారు. ఆ పరిశ్రమ వలన కామము, అంటే కోరిక తీరి 

ఆనందము పొందుతారు. అమ్మను ధ్యానిస్తే, ఆ కామ్యములు తీరి ఆనందములు లభిస్తాయి. 

దేవీభాగవతంలో సుదర్శనుడు కేవలం "క్లీ" అని అనవరతం జపిస్తూ అమ్మ కృపను పొంది, 

పోగొట్టుకున్న రాజ్యం  సంపాదించుకోగలిగాడు. శివాంశను పొంది, కాశీరాజ పుత్రిక చంద్రకళను 

వివాహమాడాడు. అమ్మ కృప ఉంటే, తన భక్తులను శివుడంతటి వాళ్ళను చేస్తుందని

చెప్పుకున్నాం. క్లీం బీజం శక్తి అది. క్లీం అంటే శివకాముడు అనే అర్ధం కూడా వుంది. 

శివకాముని భార్య కనుక అమ్మ శివకామసుందరి. అందుకే అమ్మను క్లీంకారీ అంటున్నాం. 

కామబీజస్వరూపమై, అందరినీ వశీకరణముతో సమ్మోహితులను చేస్తున్న, ఆ క్లీంకారీ కి వందనం. 

ఓం శ్రీ క్లీంకార్యై నమః  

623. కేవలా

అమ్మ వంటివారు  ఎవరూ లేరు. అమ్మ సమానాధికవర్జితా. అమ్మ కేవలా, అంటే ఒంటరి. 

ధర్మాలనన్నీ ఏర్పరచేది ఆ శ్రీమాతే. కానీ ఆ తల్లికి ఆ ధర్మాలేవీ అంటవు. అన్ని ధర్మాలకూ 

అతీతురాలు, ఏ ధర్మానికీ కట్టుబడనిది. సంపూర్ణ జ్ఞానస్వరూపురాలు. ఈ విషయం శివసూత్రాలలో 

చెప్పబడింది. కనుక ఏ విధమైన ధర్మములూ లేని, అంటని, విముక్త ఆ లలితాపరమేశ్వరి. 

అందువలన అమ్మను ఈ నామంలో కేవలా అంటున్నాం. క్లీం అనే బీజాక్షరములో 'క్' 'ల్' 

అనే హల్లు శబ్దాలను తొలగిస్తే, మిగిలేది ఈం. ఈ ఈంకారమును కామకళ అంటారు. 

వేదములో 'కకార, లకారములు లేని కామబీజమును ఎవడు వింటాడో, అట్టివానికి సత్యలోకం 

లభిస్తుంది' అని చెప్పారు. క్లీం లో కకార, లకారములు లేనప్పుడు అది ఈం అవుతుంది. 

క్లీం జపము వలన ధర్మ, అర్ధ, కామములు సిద్ధిస్తే, ఈం జపము వలన మోక్షము సిద్ధిస్తుంది. 

ఏ ధర్మములూ లేని స్థితికి కేవలమని పేరు. అందుకే అమ్మకు కేవలా అనే నామం వచ్చింది. 

క్లీంకార జపంతో ధర్మార్ధకామాలను, ఈంకార జపముతో మోక్షాన్ని ఇచ్చే, ఆ కేవల కు వందనం.  

ఓం శ్రీ కేవలాయై నమః  

624. గుహ్యా

గుహ్యము అంటే అతి రహస్యము అని ఒక అర్ధం. గుహ్యా అంటే గుహలో వున్నది అని ఇంకొక 

అర్ధం. బుద్ధి అనే గుహలో ప్రవేశించినది కనుక అమ్మను గుహ్యా అన్నాం. 

శ్రీవిద్య గుహ్యమైన విద్య అని చెప్పుకున్నాం. అమ్మ శ్రీవిద్యా స్వరూపము కనుక, అమ్మ గుహ్యా. 

ధన ధాన్యాలయినా  ఇవ్వవచ్చు కానీ, శ్రీవిద్యను మాత్రం ఎవరికీ చెప్పకూడదు అని శాస్త్రవచనం. 

ఇవ్వకూడదు అంటే, అనర్హులకు ఇవ్వకూడదు అని భావం. 

అర్హులకు అందే విధంగా, అర్హులకు మాత్రమే అర్ధం అయ్యే విధంగా, అనర్హులకు అందనంత 

దూరం లోనూ ఉండేదే షోడశి. అందుకే అమ్మను ఈ నామంలో గుహ్యా అంటున్నాం. 

పంచకోశాల లోపల గుహ్యంగా వుండే శక్తి గుహ్యా. 

అతి రహస్యంగా హృదయకుహరమనే గుహలో దాగున్న, ఆ గుహ్య కు వందనం. 

ఓం శ్రీ గుహ్యాయై నమః  

625. కైవల్యపదదాయినీ 

కైవల్యము అంటే మోక్షము. కైవల్యమును ఇచ్చేది కనుక అమ్మను ఈ నామంలో 

కైవల్యపదదాయినీ అంటున్నాం. ఏ ధర్మములూ లేని స్థితిలో వున్న అమ్మ కేవలా. 

ఆ కేవల ఇచ్చునది కైవల్యము. అందుకే అమ్మ కైవల్యపదదాయినీ. 

సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలని నాలుగు రకాల ముక్తులు వున్నాయి. 
 
తైత్తిరీయంలో ఉపాసకుడు పొందే సాయుజ్య, సారూప్య, సాలోక్య ముక్తులను గురించి చెప్పారు. 

నాలుగవది అయిన సామీప్యముక్తి గురించి ముండకోపనిషత్ లో చెప్పారు. ఈ ముక్తులన్నీ

కర్మఫలంగా లభించినవి కనుక, ఆ కర్మఫలం అయిపోయిన  తరువాత, ఆ ముక్తస్థితి నశిస్తుంది. 

 తైత్తిరీయ ఉపనిషత్ లో, "ఉత్తరాయణంలో మరణించినవారు దేవతల అనుగ్రహం వలన  

సూర్యమండలాన్ని, దక్షిణాయనంలో మరణించినవారు పితృదేవతల అనుగ్రహం వలన 

చంద్రమండలాన్నీ పొందుతారు, జ్ఞాని మాత్రము ఈ సూర్యచంద్రుల మహిమల పరిమితులను 

తెలుసుకుని, బ్రహ్మలోకమును పొందుతాడు" అని వుంది. కైవల్యము అయిదవ ముక్తి. 

కైవల్యము అంటే, చైతన్య స్వరూపమైన చిచ్ఛక్తి, ఏమార్పూ లేకుండా ఉండటం. 

అదే మోక్షము. కైవల్యము తురీయాతీతము. కర్మలనన్నింటినీ త్యజించి కేవలమూ 

ఆ పరబ్రహ్మను ఉపాసించినవాడు మోక్షమును పొందుతాడు.

పరబ్రహ్మను ఉపాసించిన సాధకుడికి మోక్షమును ఇచ్చే, ఆ కైవల్యపదదాయిని కి వందనం. 

ఓం శ్రీ కైవల్యపదదాయిన్యై నమః   

626. త్రిపురా

త్రిపురములలోనూ వుండే అమ్మను ఈ నామంలో త్రిపురా అంటున్నాం.  

త్రిపురాలు కూడా అమ్మ  సృష్టించినవే. శరీరంలో ఎన్ని నాడులున్నా ముఖ్యనాడులు మూడు. 

అవే ఇడా, పింగళా, సుషుమ్నా నాడులు. ఈ మూడునాడులనూ త్రిపురాలంటారు. 

ఆ నాడులలో ఉంటుంది కనుక, అమ్మకు త్రిపుర అనే పేరు వచ్చింది. 

త్రిమూర్తుల కంటే సనాతనమైనది కనుక త్రిపుర. 

త్రిగుణములను సృష్టించింది కనుక త్రిపుర. పీఠత్రయములలో ఉండునది కనుక త్రిపుర. 

మనస్సు, బుద్ధి, చిత్తము లను కూడా త్రిపురాలంటారు. అందులో నివసించేది కనుక త్రిపుర. 

అగ్నిత్రయమైన గార్హపత్య, ఆవాహనీయ, దక్షిణాగ్నులలో ఉండునది కనుక త్రిపుర. 

త్రిశక్తులైన ఇచ్చా, జ్ఞాన, క్రియా శక్తుల రూపంలో ఉంటుంది కనుక త్రిపుర. 

అ, ఉ, మ అనే మూడు అక్షరములతోనూ ఉండు ఉమ కనుక త్రిపుర. 

జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలలోనూ ఉండునది కనుక త్రిపుర.  

త్రికూటాధీశ్వరి కనుక త్రిపుర. మూడు వేదములనూ చెప్పినది కనుక త్రిపుర. 

త్రికోణమును మండలత్రయముగా కలిగినది కనుక త్రిపుర. 

సృష్టిలో ఎక్కడెక్కడ త్రిపుటి ఉంటుందో, అక్కడక్కడ త్రయీమయిగా అమ్మ ఉంటుంది. 

పరమా శక్తి అయిన, ఆ త్రిపుర కు వందనం. 

ఓం శ్రీ త్రిపురాయై నమః 

627. త్రిజగద్వంద్యా

మూడు జగత్తులలోనూ శ్రీదేవి వందనీయురాలు కనుక త్రిజగద్వంద్యా అని పిలువబడుతోంది.

జగద్వంద్యులగు త్రిమాతలతోనూ, త్రిమూర్తులతోనూ పూజింపబడునది కనుక త్రిజగద్వంద్యా.   

స్వర్గ, మర్త్య, పాతాళములనే ముల్లోకాల లోనూ ఆరాధ్యదేవత. 

భూ, భువ, సువర్లోకాలలో వందనీయురాలు. దేవ, మానవ, దానవ లోకాలలో అందరి చేతా 

పూజలందుకుంటోంది కనుక అమ్మను త్రిజగద్వంద్యా అంటున్నాం. 

త్రిలోక ఆరాధ్యదేవత, ఆ త్రిజగద్వంద్య కు వందనం. 

ఓం శ్రీ త్రిజగద్వంద్యాయై నమః 

628. త్రిమూర్తిః

ఒక్క శ్రీమాతే సందర్భాన్ని బట్టీ, అవసరాన్ని బట్టీ,  వివిధ రూపాలు ధరిస్తూ ఉంటుంది. 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆ తల్లి రూపాలే. లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురూ ఆ తల్లి 

రూపాలే. సూర్య, చంద్ర, అగ్ని ముగ్గురూ ఆ తల్లి రూపాలే. 

ధౌమ్యుడు మూడు సంవత్సరముల బాలికను త్రిమూర్తీ అన్నాడు. 

రక్తవర్ణమైన ఎరుపు, శుక్లవర్ణమైన తెలుపు, ఈ రెండూ కలసిన మిశ్రవర్ణమైన నలుపు రంగులు కల 

మూడు మూర్తులూ అమ్మే. ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తి రూపాలు ధరిస్తుంది కనుక అమ్మ త్రిమూర్తీ. 

వరాహపురాణంలో ఒక గాథ వుంది. బ్రహ్మ శంకరుని చూస్తూ విష్ణువును స్మరించాడు. 

అప్పుడు విష్ణువు వారిద్దరి మధ్యలోకి వచ్చి నిలిచాడు. మువ్వురూ ఒకరినొకరు  సూక్ష్మదృష్టితో 

చూచుకొన్నారు. ఈ ముగ్గురి దృష్టీ కలసిన చోట దివ్య స్వరూపముతో ఒక కుమారి పుట్టింది. 

ఆ కుమారిని చూచి త్రిమూర్తులు, 'నీవెవరు, ఏ కార్యార్థమై వచ్చావు' అని 

అడిగారు. అప్పుడు నలుపు, తెలుపు, పసుపు వర్ణాలతో శోభిస్తున్న ఆ కుమారి, 'భగవదృష్టి వలన 

నేను జన్మించాను. నన్ను  మీరెరుగరా, నేను ఆత్మశక్తిని, పరమేశ్వరిని' అని సమాధానం ఇచ్చింది. 

అప్పుడు త్రిమూర్తులు, 'తల్లీ,  నీవు త్రిపుర అనే పేరుతో ఈ జగత్తులను పాలింపుము. మూడు 

వర్ణములతో మూడు స్వరూపములను పొందుము,  అని వరం ఇచ్చారు. అప్పుడు ఆ  కుమారి

బ్రాహ్మి, వైష్ణవి, రౌద్రి అనే నామాలతో మూడు మూర్తులుగా ప్రసిద్ధి చెందింది. 

దేవీ భాగవతంలో మాత్రం, శుక్లవర్ణముతో శాంభవి, రక్తవర్ణముతో శ్రీవిద్య, శ్యామలవర్ణముతో శ్యామా 

అనే నామాలతో త్రిమూర్తి అయింది అని వుంది. 

తన త్రిమూర్తి రూపంతో జగత్తులను పాలిస్తున్న, ఆ త్రిమూర్తి కి వందనం. 

ఓం శ్రీ త్రిమూర్త్యై నమః 

629. త్రిదశేశ్వరీ 

బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలలో ఎప్పుడూ మూడవదశలోనే వుండేవారు దేవతలు. 

వారికి ఈశ్వరి కనుక త్రిదశేశ్వరీ అనే నామం కలిగింది. 

జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలకు అధిపతి. అందువలన త్రిదశేశ్వరీ అన్నాం. 

ధర్ముడనే మనువుకు, విశ్వ అనే భార్య యందు కలిగిన పదముగ్గురు సంతానాన్ని విశ్వేదేవతలు

అంటారు. ఆ విశ్వేదేవతలకు ఈశ్వరి త్రిదశేశ్వరీ. సృష్టి, స్థితి, లయములనే మూడు దశలకూ 

ఈశ్వరి కనుక  త్రిదశేశ్వరీ. ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, ఇంద్రుడు, 

ప్రజాపతి ఈ ముప్పయి మూడు దేవతలకూ స్వామిని ఈ త్రిదశేశ్వరీ. 

ఈ త్రిపురా, త్రిజగద్వంద్యా, త్రిమూర్తిః, త్రిదశేశ్వరీ నామాల్లో అమ్మవారి యొక్క త్రయీమయీ 

తత్వాన్ని గురించి  చెప్పుకుంటున్నాం. 

మూడు దశలలోనూ, ముజ్జగాలనూ రక్షిస్తున్న, ఆ త్రిదశేశ్వరీ కి వందనం. 

ఓం శ్రీ త్రిదశేశ్వర్యై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

   

24, నవంబర్ 2021, బుధవారం

124. ఆదిశక్తిః, అమేయా, ఆత్మా, పరమా, పావనాకృతిః అనేకకోటి బ్రహ్మాండ జననీ, దివ్యవిగ్రహా

  

ఆదిశక్తిః, అమేయా, ఆత్మా, పరమా, పావనాకృతిః 
అనేకకోటి బ్రహ్మాండ జననీ, దివ్యవిగ్రహా ॥ 124 ॥

615. ఆదిశక్తిః

సమస్త జగత్తులనూ పుట్టించినది ఆదిపరాశక్తి అయిన ఆ శ్రీలలితాపరమేశ్వరి. 

జగత్తులను పుట్టించింది అంటే, ఆ తల్లి ఆ జగత్తుల కన్నా ముందు నుంచే ఉన్నది అన్న 

విషయం స్పష్టం అవుతోంది. అన్నింటి కన్నా మొట్టమొదట ఆవిర్భవించిన శక్తి కనుక, 

అమ్మ ఆదిపరాశక్తి  అయింది. అందుకే అమ్మవారిని ఈ నామంలో ఆదిశక్తీ అంటున్నాం. 

ఆ లలితాపరమేశ్వరి కారణమూ, కార్యమూ, కర్తా మూడూ కూడా తానే అయి సమస్త 

బ్రహ్మాండాలనీ అలవోకగా సృష్టించింది. సృష్టి, స్థితి, లయ అన్నీ తానే నిర్వహిస్తున్నది. 

తానే స్వయంగా ఇచ్ఛాశక్తిగా, జ్ఞానశక్తిగా, క్రియాశక్తిగా, మూలశక్తిగా అన్ని కార్యములూ 

నిర్వహిస్తున్న లలితాపరమేశ్వరీదేవియే ఏకైక ఆదిశక్తి. 

శక్తులన్నింటికీ మూలశక్తి అయిన, ఆ ఆదిశక్తి కి వందనం. 

ఓం శ్రీ ఆదిశక్త్యై నమః  

616. అమేయా

అమేయా అంటే కొలవలేనిది అని అర్ధం. అమ్మను కొలవగలమా, అమ్మ శక్తిని కొలవగలమా. 

కొలిచేందుకు ఏ పరిమాణమూ లేనిది కనుక, ఈ నామంలో ఆ తల్లిని అమేయా అంటున్నాం. 

మహాత్రిపురసుందరీ నామంలో కూడా మాతృ, మాన, మేయములు మూడూ కూడా ఆ

త్రిపురసుందరీదేవియే అని చెప్పుకున్నాం. లింగపురాణంలో "స్వర్గ, పాతాళాది లోకము లందు 

కల బ్రహ్మాండములన్నీ ఎనిమిది ఆవరణములనీ, తొమ్మిదవ ఆవరణ స్వయముగా ఆ ఉమాదేవి 

అనీ, మహేశ్వరుడే స్వయముగా మాత" అనీ చెప్పారు.   

మాతృ, మాన, మేయములు  తానే అయి, ఏ  కొలమానమునకూ అందని, ఆ అమేయ కు వందనం.  

ఓం శ్రీ అమేయాయై నమః  


617. ఆత్మా 

ఆత్మ అంటే జీవుడు. కనుక అమ్మ జీవస్వరూపురాలు. ఆత్మా, పరమాత్మా రెండూ ఆ జగజ్జననియే. 

ఆత్మ అంటే శరీరము, ఆత్మ అంటే బుద్ధి. ఆత్మ అంటే మనస్సు, ఆత్మ అంటే బ్రహ్మము.

సకల జీవుల శరీరముల లోనూ శ్రీలలిత వివిధ ధాతువుల రూపంలో ఉంటోంది. 

అమ్మ నుంచి వచ్చిన జీవులందరూ అమ్మ స్వరూపమే. శరీరములన్నీ శివుడైతే, వాటి ఆత్మ గౌరి. 

శరీరము లోని శక్తి ఆత్మ. కళ్ళల్లో చూచే శక్తి ఆత్మ. కాళ్లల్లో నడిచే శక్తి ఆత్మ. చెవుల్లో వినే శక్తి ఆత్మ. 

ఆత్మ లేని చోటు లేదు. ఆత్మ లేకపోతే జీవము లేదు. జీవమున్నంత వరకూ శరీరము శివము. 

జీవము లేనప్పుడు ఆ శరీరమే శవము. ఈ ఆత్మే పరబ్రహ్మము. ఈ ఆత్మే జ్ఞానస్వరూపము. 

దీనిని తెలుసుకొనుటయే పరమార్ధము. 

జీవులందరిలోనూ ఆత్మ తేజమై వెలుగుతున్న, ఆ ఆత్మ కు వందనం. 

ఓం శ్రీ ఆత్మనే నమః  


618. పరమా

పరమా అంటే పరమేశ్వరుని ఐశ్వర్య స్వరూపము. పరమా అంటే, పరమాత్మను గురించి 

చెప్పునది.  విష్ణుపురాణం ప్రకారం పరబ్రహ్మకు నాలుగు రూపాలున్నాయి. 

అవి పురుషుడు, వ్యక్తము, అవ్యక్తము, కాలము. వీటిలో ఏది శ్రేష్టమో అదే విష్ణుపదము, 

విష్ణుపథము. ఈ నాలుగింటి కన్నా వేరైనది, ఉత్కృష్టమైనది శ్రీమాత. 

దేహముతో పాటు ఏది నశించదో అదే పరమా. దీని గురించి వేదములో కూడా చెప్పబడింది. 

సమస్త విశ్వమూ, ప్రాణులూ గౌరీస్వరూపమే. పరా, పరమా అంటే శ్రీమాత. 

జ్ఞానులకు మాత్రమే అందే స్వరూపము పరమా తత్వం, పరమాత్మ తత్వం.  

"పిండంతే నిప్పటి యన్నట్టు" అంటాడు అన్నమయ్య.  పిండి ఎంత ముద్ద తీసుకుంటామో, 

అంతే నిప్పటి చేయగలము. పరమా గురించి ఎంత అర్ధమైతే అంతే, మిగిలినదంతా పరా. 

మనకు తెలిసిన దాని కన్నా పరమైనది పరా. ఆ జ్ఞానమే పరమా. 
 
పరబ్రహ్మ స్వరూపమైన, ఆ పరమా కు వందనం. 

ఓం శ్రీ పరమాయై నమః 

  

619. పావనాకృతిః

పవిత్రమైన స్వరూపము అని అర్ధము. పావనమైన ఆకారము కలది. నఖ, శిఖ పర్యంతమూ

పవిత్రమైన ఆకారము కలది కనుక అమ్మను ఈ నామంలో పావనాకృతీ అని చెప్పుకుంటున్నాం. 

ఆకృతి అంటే శరీరము, చరిత్ర, జ్ఞానము అనే అర్ధాలున్నాయి. శ్రీదేవిని ధ్యానిస్తే, ఆ తల్లి 

కరుణించి భక్తుల శరీరము, జ్ఞానము, చరిత్రను శుద్ధి చేస్తుంది, అని యాజ్ఞ్యవల్క్య స్మృతిలో  

వుంది. తపస్సు, విద్య  శరీరాన్ని శుద్ధి చేస్తే, జ్ఞానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. 

జీవుడే  ఈశ్వరుడని తెలుసుకున్నప్పుడు, అన్నింటికన్నా ఉత్కృష్టమైన శుద్ధి కలుగుతుంది. 

బ్రహ్మము వ్యక్తమై వ్యాప్తి చెందిన రూపమే పావనాకృతి అయిన శ్రీమాత. 

పరమున పరమశివుడితో తాదాత్మ్యము చెందిన పరమేశ్వరియే పరమా. 

తన భక్తులను జ్ఞానముతో పవిత్రము చేసే, ఆ పావనాకృతి కి వందనం. 

ఓం శ్రీ పావనాకృతయే నమః 


620. అనేకకోటిబ్రహ్మాండజననీ

బ్రహ్మాండములు అనేకం. ఆ బ్రహ్మాండాల కన్నింటికీ జనని శ్రీమాత. 

అండ, పిండ, బ్రహ్మాండము లన్నీ అమ్మ సృష్టే. 

ప్రతి బ్రహ్మాండములోనూ, లోకాలు, లోకేశులు, లోకస్థులు వున్నారు.

ప్రతి బ్రహ్మాండము లోనూ త్రిమూర్తులు, త్రిమాతలు, దేవేంద్రాది దేవతలు వున్నారు. 

పిపీలికాది సమస్త జీవులూ వున్నాయి. స్థావర జంగమాలన్నీ కూడా వున్నాయి. 

అన్ని బ్రహ్మాండాలూ అమ్మ చేత పంచీకరణం చేయబడే ఉంటాయి. 

స్థూల బ్రహ్మాండము నందు అభిమానము కలవాడు విరాట్ అయిన పురుషుడైతే, 

సూక్ష్మ బ్రహ్మాండము నందు అభిమానము కలవాడు స్వరాట్ అయిన బ్రహ్మము. 

ఈ రెండింటికీ కారణభూతమైన అవ్యాకృత శరీరము పట్ల అభిమానము కలవాడు సమ్రాట్. 

ఈ విశేషము వేదములో చెప్పబడింది. ఈ విరాట్, స్వరాట్, సమ్రాట్ ముగ్గురికీ జనని శ్రీమాత. 

రోదసిలో తేలియాడుతున్న ఎన్నో కోట్ల  బ్రహ్మాండాలలో మన  బ్రహ్మాండము కూడా ఒకటి. 

దానిలో వున్న పదునాలుగు లోకాల్లో, మన భూలోకము ఒకటి. ఆ భూలోకంలోని చరాచర 

రూపములలో మనం కూడా వున్నాం. మన పైన ఆరు లోకాలు, మన కింద ఏడు లోకాలూ 

వున్నాయి. కంటికి కనపడేది కొంచెమే, కనపడనిది ఎంతో.  

ఈ లోకాలోకాలనన్నీ సృష్టించింది ఆ పరమా, పావనాకృతి అయిన ఆదిశక్తి. 

ఇవి అన్నీ సృష్టి చేసినది, ఆ అనేక కోటి  బ్రహ్మాండజనని అయిన, ఆ జగజ్జనని.  

కోటానుకోట్ల  బ్రహ్మాండములను సృష్టించిన, ఆ అనేకకోటిబ్రహ్మాండజనని కి వందనం. 

ఓం శ్రీ అనేకకోటిబ్రహ్మాండజనన్యై నమః 


621. దివ్యవిగ్రహా

దివ్యము అంటే దివికి సంబంధించినది అని అర్ధము. దివ్యమైనది అంటే అంతరిక్షము నుంచి

వచ్చినది. దివ్యవిగ్రహా అంటే దివ్యమైన ఆకాశము నుంచి దిగి వచ్చిన అందమైన మూర్తి. 

దివ్యాకాశము నుండి ఆవిర్భవించిన రమణీయ సుందర విగ్రహం అమ్మది, అని ఈ నామంలో

చెప్పుకుంటున్నాం. అమ్మను మించిన దివ్యత్వము లేదు. అమ్మను మించిన రమణీయ రూపము 

లేదు. మేదినీ నిఘంటువులో విగ్రహము అంటే శరీరము, విభాగము, విస్తారము, యుద్ధము అనే 

అర్ధాలు చెప్పారు. మార్కండేయపురాణంలో చండిక ఆకాశంలో నిరాధారంగా నిలబడి రాక్షసులతో 

యుద్ధం చేసిందని చెప్పారు. దేవకార్యం కోసం దివి నుండి దిగి వచ్చిన దివ్య మంగళ 

విగ్రహం ఆ లలితాపరమేశ్వరి. అందుకే ఈ నామంలో ఆ తల్లిని దివ్యవిగ్రహా అంటున్నాం. 

దివి నుంచి దిగి వచ్చిన దివ్య సుందర స్వరూపమైన, ఆ దివ్యవిగ్రహ కు వందనం. 

ఓం శ్రీ దివ్యవిగ్రహాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

    

23, నవంబర్ 2021, మంగళవారం

123. కళాత్మికా, కళానాథా, కావ్యాలాప వినోదినీ సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా

  

కళాత్మికా, కళానాథా, కావ్యాలాప వినోదినీ 
సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా ॥ 123 ॥

611. కళాత్మికా

కళలే తన స్వరూపముగా కలిగిన మూర్తి కళాత్మికా. 
అగ్నికి సప్త జిహ్వలు కనుక అగ్ని కళలు ఏడు. ఆదిత్యునికి పన్నెండు, చంద్రునికి పదహారు కళలు.

నక్షత్రములు ఇరవై ఏడు, ప్రతి దానికీ నాలుగు పాదములు, మొత్తము నక్షత్రాల కళలు  నూట ఎనిమిది. 

జాగ్రత్, స్వప్న, సుషుప్త, తురీయ అవస్థలు నాలుగు. మళ్ళీ ప్రతి అవస్థకూ నాలుగు కళలు. 

ఈ కళలన్నీ కాక, విద్యలు అరవై నాలుగు, వీటినే చతుష్షష్టి కళలు అని కూడా అంటాము. 

ఈ విధముగా సృష్టిలో వున్న ప్రతి విషయానికీ కళలు వున్నాయి. ఆ కళలనన్నీ సృష్టించినది 

కళాత్మిక అయిన లలితాపరమేశ్వరి. ఈ సమస్తమైన కళలన్నీ ఆ లలితా పరమేశ్వరి స్వరూపాలే. కనుకనే ఈ నామంలో అమ్మను అనేకానేక కళలను సృష్టించిన కళానిధి కనుక, కళాత్మికా అంటున్నాం.

కళలనే ఆత్మగా, తన స్వరూపముగా కల, ఆ కళాత్మిక కు వందనం. 

ఓం శ్రీ కళాత్మికాయై నమః  


612. కళానాథా

అన్ని కళలూ అమ్మ నుంచే పుడుతున్నాయి. అన్ని కళలకూ అమ్మే ఆధారము, ఆధేయము. 
  
కనుక అన్ని కళలకూ ఆ పరమేశ్వరియే స్వామిని. కనుక ఈ నామంలో ఆ తల్లిని కళానాథా 

అంటున్నాం. శ్రీలలిత చంద్రస్వరూపురాలు, చంద్రమండలం నుంచే కళలన్నీ పుడుతున్నాయి.
 
కనుక అమ్మ చంద్రస్వరూపము, కళానాథ అని చెప్పబడింది. 

ప్రశ్న ఉపనిషత్ లోని ఆరవప్రశ్నలో " షోడశ కళలూ శరీరంలోనే వున్నాయి. ఒకసారి ఆ కళలు 

పురుషునిలో లీనం అయినప్పుడు, వాటికి నామరూపాలు నశిస్తాయి. ఈ విషయం గ్రహించినవాడు
 
కళా విముక్తుడై, అమృతుడు అవుతున్నాడు" అని పిప్పలాదుడు సుకేతుడికి చెప్పాడు.  

ఈ కళలన్నింటికీ పరమేశ్వరియే అధినేత్రి. అందుకే ఆ తల్లి కళానాథా అని పిలువబడుతోంది. 

కళలన్నింటికీ స్వామిని అయిన, ఆ కళానాథ కు వందనం.  

ఓం శ్రీ కళానాథాయై నమః  


613. కావ్యాలాప వినోదినీ 

కావ్యములు ఆలపిస్తుంటే వినోదించే రసజ్ఞురాలు కనుక అమ్మను ఈ నామంలో కావ్యాలాపవినోదినీ 

అన్నారు. వాల్మీకి, వ్యాసుడు మొదలైన ద్రష్టలు వ్రాసే కావ్యములలో అష్టాదశ వర్ణనలుంటాయి. 

ఆ వర్ణనలన్నీ వింటూ అమ్మ వినోదిస్తుంది. ఆనందం పొందుతుంది. కావ్యాలలో కొన్ని భాగాలు

పారాయణ చేస్తే, అమ్మ ఆనందించి, అవి ఆలపించినవారికి, ఆ పారాయణ ఫలితాలను ఇస్తుంది.

నేటికీ సుందరకాండ పారాయణము, భగవద్గీతా పారాయణము, శ్రీ లలితా దివ్య రహస్య సహస్ర 

స్తోత్ర పారాయణలు  వంటివి చాలామంది శ్రద్ధాభక్తులతో, చేస్తూనే వుంటారు. 

గానాలాపనలు, రాగాలాపనలు అమ్మకు ఇష్టం. అందుకే కొందరు ఏకాహాలు, సప్తాహాలు, 

నవాహాలు, దశాహాలు పెట్టుకుని మరీ కావ్యాలను చెప్పిస్తూ ఉంటారు. 

హరికథాగానాలు మొదలైనవన్నీ ఆ పరమేశ్వరి ప్రీత్యర్ధం చేస్తూ, చేయిస్తూ వుంటారు.  

కావ్యములను భక్తి శ్రద్ధలతో ఆలపిస్తుంటే ఆనందించే, ఆ కావ్యాలాప వినోదిని కి వందనం. 

ఓం శ్రీ కావ్యాలాపవినోదిన్యై నమః  


614. సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా

లలితాపరమేశ్వరికి ఇరువైపులా రమా, వాణీ ఇద్దరూ చామరములు వీస్తూ, అమ్మను సేవిస్తూ 

ఉంటారని ఈ నామార్ధం. లక్ష్మీదేవి, సరస్వతీదేవి చేతులలో వింజామరలు ధరించి శ్రీమాతకు 

అటునిటు నిలుచుని, శ్రద్ధతో, ప్రీతితో, భక్తితో, వింజామరలతో గాలి వీస్తూ, సేవిస్తూ ఉంటారని 

ఈ నామం చెప్తోంది. రమ అంటే లక్ష్మి సవ్యదిశలో అంటే ఎడమవైపు నుంచుని వీవన వీస్తుంటే, 

వాణి ఆ శ్రీమాతకు దక్షిణంగా అంటే కుడివైపున నుంచుని వీవన వీస్తూ ఉంటుంది. 

ఆ సేవలను సంతోషముతో స్వీకరిస్తున్న జగన్మాత మధ్యలో మందస్మితంతో ఉంటుంది. 

వాస్తవానికి ఈ ముగ్గురూ ఒక్క శక్తియే. వారే తమను తాము త్రిశక్తులుగా విభజించుకుని 

ఈ సమస్త విశ్వాన్నీ నిర్వహిస్తున్నారు. సర్వైశ్వర్యప్రదాయినిగా, సర్వజ్ఞానమయిగా

ప్రకటితమవుతున్నది ఆ శ్రీచక్రనగర సామ్రాజ్ఞి అయిన రాజరాజేశ్వరియే. 

లక్ష్మీ, సరస్వతులచే చామర సేవలను అందుకుంటున్న, 

ఆ సచామర రమా వాణీ సవ్య దక్షిణ సేవిత కు వందనం. 

ఓం శ్రీ సచామరరమావాణీసవ్యదక్షిణసేవితాయై నమః 

  



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

    

22, నవంబర్ 2021, సోమవారం

122. దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా

  

దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ 
ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా ॥ 122 ॥

607. దేవేశీ

దేవతలకు ఈశ్వరి కనుక ఈ నామంలో ఆ పరమేశ్వరిని దేవేశీ అన్నారు. 

దివిలో ఉండేవారు దేవతలు. ఆ దేవతలందరూ కూడా శ్రీమాతనే నిత్యమూ పూజిస్తూ వుంటారు. 

బ్రహ్మ, విష్ణు, దేవేంద్రాదులకు కూడా ఈ జగన్మాతే ఈశ్వరి. ఈశ్వరుడు కూడా ఈ ఈశ్వరినే

ధ్యానిస్తూ ఉంటాడు. తారకాసురుడు, మహిషాసురుడు, భండాసురుడు, చండముండులు, 

శుంభనిశుంభులు మొదలైన దానవులు దేవతలను బాధిస్తూ ఉంటే, ప్రతిసారీ దేవతలను 

రక్షించినది ఈ దేవేశి పరమేశ్వరియే. అందుకే అమ్మను ఈ నామంలో దేవేశీ అంటున్నాం. 

దేవతల పాలిట, రక్షాకవచమై భాసిల్లుతున్న, ఆ దేవేశీ కి వందనం. 

ఓం శ్రీ దేవేశ్యై నమః  


608. దండనీతిస్థా

దండనీతి అర్ధశాస్త్రములో ఒక విభాగము. దండనీతి శాస్త్రములో చెప్పబడినది కనుక,

అమ్మను ఈ నామంలో దండనీతిస్థా అన్నారు. విష్ణుపురాణంలో తర్కవిద్య, వేదవిద్య, రాజనీతి, 

దండనీతి, శిల్పశాస్త్రం, ఆయుర్వేదం వంటి విద్యలన్నీ శ్రీదేవియే అని చెప్పారని చెప్పుకున్నాం. 

ఆ పరమేశ్వరి స్వయంగా నీతిశాస్త్ర స్వరూపం. నీతి మార్గములో లేనివారిని, దారి తప్పిన వారిని, 

అమ్మ తొలుత సామ, దాన, భేద, ఉపాయములతో, తిరిగి నీతిమార్గములో పెట్టటానికి చూస్తుంది. 

వారికి సన్మార్గమును బోధించీ, సహాయ సహకారములను అందించీ, దైవారాధనకూ, ఉపాసనకూ 

తోడ్పడే మార్గములను సూచించీ, ఎన్నో ఉపాయములను ప్రయోగిస్తుంది. 

అప్పటికీ సరియైన దారిలోకి రాని వారిని, దండనీతితో దండిస్తుంది. 

దైత్యుల పట్ల చూపినది దండనీతియే. ఆ దైత్యులకు కూడా, వధించే ముందు, తమ తప్పును 

సరిదిద్దుకునే అన్ని అవకాశాలనూ ఇస్తుంది. చివరగా దండనీతిని ఉపయోగించి, వారిని తప్పు 

దారి నుంచి ఉద్ధరిస్తుంది. దేవీపురాణంలో అన్యాయమార్గంలో చరించేవారిని శిక్షించుట చేత 

ఆ శ్రీదేవికి దండనీతిస్థా అనే నామం వచ్చిందని ఉన్నది. 

దుష్టశిక్షణకై, శిష్టరక్షణకై దండనీతిని ఉపయోగించే, ఆ దండనీతిస్థ కు వందనం.  

ఓం శ్రీ దండనీతిస్థాయై నమః  


609. దహరాకాశ రూపిణీ

దహరము అంటే హృదయము, దహరములో వుండే సూక్ష్మ ఆకాశమే దహరాకాశము. 

ఆ దహరాకాశరూపంలో ప్రాణుల హృదయంలో వుండే పరమేశ్వరియే దహరాకాశరూపిణి. 

ప్రతి ప్రాణి హృదయపద్మంలో ఒక అత్యంత సూక్ష్మ గుహ వుంది. అదే దహరము. 

దానిలో వుండే ఆకాశమే అమ్మ. ప్రతి ప్రాణి హృదయాకాశములో ఉంటూ, వారికి హృదయ 

స్పందన యైనది శ్రీమాత. హృదయానికీ, కంఠానికీ మధ్యలో గలదే హృదయపద్మం. 

ఆ పద్మం మధ్యలోనే నారాయణుడి సంకల్పం మేరకు బ్రహ్మ ఆవిర్భవించాడు. 

కనుక ఈ శరీరమే బ్రహ్మపురం. ఆ బ్రహ్మపురంలో ఉన్న దహరాకాశంలో వున్నదే పరబ్రహ్మ. 

ఆ పరబ్రహ్మ స్వరూపమే దహరాకాశ స్వరూపమైన జగన్మాత. 

ప్రాణులందరి లోనూ గల హృత్పద్మములో దహరాకాశరూపములో ఉన్న,

ఆ దహరాకాశ రూపిణి కి వందనం. 

ఓం శ్రీ దహరాకాశరూపిణ్యై నమః  


610. ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా

పాడ్యమి మొదలు పూర్ణిమ వరకూ వుండే అన్ని తిథుల యందూ పూజింపబడునది అని ఈ నామ 

భావం. తిథులు పాడ్యమి నుంచి, అమావాస్య, పూర్ణిమలతో కలుపుకుని మొత్తం పదహారు. 

ప్రతి తిథికీ ఒక తిథినిత్యాదేవత వుంది. వీరు త్రికోణము వలె ఏర్పడి, రేఖాత్రయ స్వరూపములో 

అమ్మను చుట్టూ ఆవరించుకుని వుంటారు. ఈ తిథినిత్యా దేవతలైన కామేశ్వరి మొదలు చిత్ర, 

మహానిత్యల వరకూ వున్న శ్రీచక్ర ప్రథమావరణ దేవతలను గురించి ముందే చెప్పుకున్నాం. 

ఈ తిథి నిత్యాదేవతల చేత పూజింపబడునది అని ఒక అర్ధం. వీరు కాక, ప్రతి తిథికీ 

దేవతలున్నారు. వరాహపురాణంలో ఈ విషయం చాలా వివరంగా చెప్పబడింది. 

మొట్టమొదటి తిథి అయిన పాడ్యమి లేదా ప్రతిపత్ తిథి అగ్నిదేవుడికి ప్రీతి. 

విదియ అశ్వినీదేవతలకు, తదియ గౌరీదేవికి, చతుర్థి గణపతికి, పంచమి నాగదేవతలకు,  

షష్టి స్కందుడికి, సప్తమి సూర్యుడికి, అష్టమి అష్టమాతృకలకు, నవమి దుర్గకు, 

దశమి దశ దిశాపాలకులకు, ఏకాదశి కుబేరుడికి, ద్వాదశి విష్ణువుకు, త్రయోదశి ధర్మపురుషుడికి, 

చతుర్దశి రుద్రుడికి, అమావాస్య పితృదేవతలకు, పౌర్ణమి రాకాచంద్రుడికి ప్రీతికరమైన తిథులు. 

గమనించి చూస్తే ఆయా తిథుల నాడే ఆయా దేవతల ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. 

ఉదాహరణకు, గణేశచతుర్థి, నాగపంచమి, స్కందషష్టి, రథసప్తమి వంటివి.  

తిథి మండలమైన ప్రతిపద అంటే పాడ్యమి నుంచీ, రాకాంతము అంటే పౌర్ణమితో ముగిసి 

తిరిగి పాడ్యమి వచ్చేవరకూ, అన్ని తిథులలోనూ, ప్రతి తిథిలోనూ చేసే ప్రత్యేక పూజలున్నాయి. 

అటువంటి ప్రత్యేక పూజలు అన్ని తిథులలోనూ అందుకుంటున్న ఆ మాహేశ్వరిని 

ఈ నామంలో ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజితా అని చెప్పుకుంటున్నాం. 

పాడ్యమి నుంచి వచ్చే పదహారు తిథులలో,  ప్రతి తిథిలోనూ ప్రత్యేక పూజలందుకునే, 

ఆ ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత కు వందనం. 

ఓం శ్రీ ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితాయై నమః 

  

 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

    

21, నవంబర్ 2021, ఆదివారం

121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ గురుమూర్తిః, గుణనిధిః, గోమాతా, గుహజన్మభూః

  

దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ 

గురుమూర్తిః, గుణనిధిః, గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥

601. దరాందోళిత దీర్ఘాక్షీ

కొద్దిపాటి ఆందోళనతో కూడిన, విప్పారిన కన్నులు కలది అని ఈ నామార్ధం. 

ఆందోళనకు కొద్దిగా చలించి, కన్నులను ఆకర్ణాంతమూ విప్పార్చి చూస్తున్నది ఈ దీర్ఘాక్షి. 

ఆందోళన ఎందుకూ అంటే, తన పిల్లలందరూ క్షేమమే కదా అని ఒక తల్లి పడే ఉలికిపాటు అది. 

అందరినీ అన్నివేళలా, అన్ని వైపులా విప్పార్చి చూస్తోంది ఆ జగజ్జనని. 

ఆ తల్లి కృపా కటాక్షము కనుక మన మీద పడిందా, ఇక ఆందోళనలు లేనట్లే. 

ఆందోళనలను పరిహరించే చూపు అది. కటాక్షించే కరుణ అది. 

ఆ చూపే, ఆ దర ఆందోళిత దీర్ఘాక్షి ప్రసన్న వీక్షణం. 

ఆ చూపు పడితే చాలు భయాలు నశిస్తాయి, ఆనందము, ధైర్యము, స్థిమితము కలుగుతాయి. 

విప్పార్చిన తన కంటి చూపులతో భక్తుల ఆందోళనలు తొలగించి, స్వస్థపరచే,  

ఆ దరాందోళిత దీర్ఘాక్షి కి వందనం. 

ఓం శ్రీ దరాందోళితదీర్ఘాక్ష్యై నమః  


602. దరహాసోజ్జ్వలన్ముఖీ

దరహాసంతో ఉజ్వలంగా ప్రకాశిస్తున్న ముఖము కల పరమేశ్వరి అని ఈ నామానికి అర్ధం. 

దరహాసమంటే చిరునగవు. చక్కని ఆహ్లాదకరమైన చిరునవ్వుతో, దేదీప్యమానంగా వెలిగే ముఖం 

కల ఆ తల్లి, తన చిరు మందహాసం తోనే భక్తుల ఇక్కట్లు సగం తీరిపోయేలా చేస్తోంది. 

ఆ నగుమోము చూస్తుంటే కలిగే హాయిని ఏ తుల లోనూ తూచలేము. 

ఎవరు ఎంతగా, ఏమని భావిస్తే, ఆ విధంగా దర్శనము, సాంత్వన ఇచ్చే తల్లి ఈ పరమేశ్వరి. 

శ్రీలలిత నగుమోము చూస్తే కలిగే ఆనందము వర్ణనాతీతము. 

తన చక్కని చిరు మందహాసముతో భక్తులను భయముల నుండి ఉద్ధరించే,

ఆ దరహాసోజ్జ్వలన్ముఖి కి వందనం.  

ఓం శ్రీ దరహాసోజ్జ్వలన్ముఖ్యై నమః  


603. గురుమూర్తిః 

గురుమూర్తి అంటే గురుత్వమే తన మూర్తిత్వముగా గల మూర్తి అని అర్ధం. 

గురువు అంటే అన్నిటికన్నా పెద్దది, గొప్పది, ఉత్కృష్టమైనది అని అర్ధం. 

గ్రహాలన్నింటిలోకీ పెద్దది కనుకే బృహస్పతికి గురువు అని పేరు. 

విద్యార్థులందరికీ మార్గదర్శనం చేసే గొప్పదైన జ్ఞానస్వరూపము కనుక ఉపాధ్యాయునికి ఆ పేరు. 

గురుత్వము అంటే గొప్పదనము, పెద్దరికము, మార్గదర్శకత్వము వహించగల శక్తిసామర్ధ్యము. 

"అజ్ఞానతిమిరాంధస్య, జ్ఞానాంజన శలాకయా" అని చెప్పుకుకున్నాం కదా. 

అజ్ఞానమనే చీకటిలో నుంచి వెలికితీసి, జ్ఞానమనే వెలుగు చూపించేవాడు గురువు. 

ఎలా అయితే, ఘటము, కలశము, కుంభము అనే పదాలన్నింటి అర్ధమూ ఒక్కటేనో,  

అదే విధంగా, గురువు, దేవత, మంత్రము అనే పదాల భావము కూడా ఒక్కటే. 

గురువే దేవత, గురువే మంత్రము. ఈ విషయము సుందరీతాపినీయోపనిషత్తు నందు వున్నది. 

శక్తి రహస్యంలో, గు అంటే చీకటి, రు అంటే దానిని నివారించేది అని, మరియొక చోట, 

గు అంటే బ్రహ్మ, రు అంటే జ్ఞానము, వెరసి ఆ బ్రహ్మజ్ఞానస్వరూపమే గురువు అని చెప్పారు. 

నిత్యాహృదయము నందు మాత్రం, దేవి యొక్క ఇచ్ఛావిగ్రహమే గురువు అని వున్నది. 

అంటే, అమ్మవారు తనను తాను, తన ఇచ్ఛ మేరకు గురు రూపములో ప్రకటించుకొనుచున్నది 

అని అర్ధం. జ్ఞానార్థులైన భక్తులకు గురువిగ్రహరూపంలో జ్ఞానోపదేశమును చేయునది అని భావం. 

ఉపాసకులకు స్వయంగా తానే గురువై, జ్ఞానాన్ని అందిస్తున్న, ఆ గురుమూర్తి కి వందనం. 

ఓం శ్రీ గురుమూర్త్యై నమః  


604. గుణనిధిః 

గుణములకు నిధి వంటిది అమ్మ అని ఈ నామానికి అర్ధం. గుణాలకు పుట్టినిల్లు. 

మరి త్రిగుణములను సృజించినది ఈ జగన్మాతే కదా. చెప్పుకోవటానికి గుణములు మూడే 

అయినా, వాటిలోని హెచ్చుతగ్గులను బట్టీ గుణముల సంఖ్య అనంతము. 

షాడ్గుణ్యపరిపూరితా నామంలో కూడా ఆరుగుణముల గురించి చెప్పుకున్నాం. 

ఆ గుణములన్నింటికీ నిధి ఈ తల్లి. వేరొక అర్ధంలో గుణములు అంటే నవవ్యూహాలు. 

అందువలన, గుణనిధి అంటే నవ వ్యూహ స్వరూపము అని అర్ధం. 

ఆ నవ వ్యూహాలే, కాలవ్యూహము, కులవ్యూహము, నామవ్యూహము,  జ్ఞానవ్యూహము,

చిత్తవ్యూహము, నాదవ్యూహము, బిందువ్యూహము, కల్పవ్యూహము(కళావ్యూహము), జీవవ్యూహము. 

ఈ నవవ్యూహాత్మకులే ఆనందభైరవుడైన పరమేశ్వరుడు, ఆనందభైరవి అయిన పరమేశ్వరి. 

వీరిద్దరి సామరస్య రూపమే గుణనిధి. గుణములకు పెన్నిధి ఆ పరమేశ్వరి. 

గుణము అంటే రజ్జువు, తాడు అని కూడా ఒక అర్ధం వుంది.  

కృత యుగాంతము జరిగే ముందు, శ్రీహరి మత్స్య రూపములో మనువుకు దర్శనమిస్తాడు. 

ఇంతలింతలుగా పెరిగి, మొదట దోసిట్లో  దొరికి, తరువాత కమండలములో ఈదులాడిన చిన్నారి 

చేప, అఖండమైన సముద్రమంతగా పెరిగి, తానే శ్రీమన్నారాయణుడనని 

ప్రకటించుకుంటుంది. "ప్రళయకాలంలో, ఈ తీరానికి ఒక పెద్ద ఓడ వస్తుంది. 

దానిలో పునఃసృష్టికి అవసరమైన సకల జీవులనూ, బీజములనూ, ఋషులనూ, వస్తువులనూ 

చేర్చు. నీవు కూడా పత్నీ సమేతంగా ఎక్కు. నవయోజనాల పొడవుతో, మూడు మాయల 

వెడల్పుతో చర్మంతో ఒక తాడు సిద్ధం చేయి. ఆ ఓడను ఆ రజ్జువుతో నా కొమ్ముకు కట్టు. 

ఆ తాడే వటీరిక. జగద్ధాత్రి, మహామాయా, లోకమాతా, జగన్మయీ, యోగనిద్రా అయిన శ్రీమాత 

ఆ వటీరికను దృఢంగా ఆవహించి ఉంటుంది. ఆ ఓడలో వున్న వారందరినీ, ఆ వటీరిక అయిన 

జగన్మాతా, ఈ మహామత్స్యమైన నేనూ, ఆ మహా ప్రళయం నుంచి ఉద్ధరిస్తాము" అని మనువుకు 

చెప్తాడు మత్స్యరూప నారాయణుడు. ఆ రజ్జురూప నారాయణినే గుణనిధి అంటాము. 

ఈ విశేషం మత్స్యపురాణంలోనూ, కాళీ పురాణంలోనూ కూడా వుంది. 

వటీరిక రూపంలో మనలను దృఢంగా పట్టుకునే గుణాన్ని ప్రదర్శించిన, ఆ గుణనిధి కి వందనం. 

ఓం శ్రీ గుణనిధయే నమః 

  

605. గోమాతా

గోమాతా అంటే, గోవులకు మాత అని అర్ధం. గోవులకు మాత కామధేనువు సురభి. 

దేవలోక ధేనువు సురభి. గోవులన్నింటికీ తల్లి వంటిది. ఈ నామంలో ఆ జగన్మాతను గోమాతా 

అంటున్నాం. గోమాతను పూజించటం మన భారతదేశపు సంప్రదాయం. గోవులకు ఇంటిలో 

ప్రధాన స్థానం ఇచ్చి పూజించే సంప్రదాయాన్ని నేటికీ కొన్ని ప్రాంతాల్లో పాటిస్తున్నారు. 

గోవుకు, పశుసంపదకు ఇంటి ముందు భాగంలోని వసారాల్లో స్థానం ఇచ్చి, 

తాము వాటి తరువాత గదుల్లో ఉంటూ, వస్తూ పోతున్న ప్రతిసారీ ఆ ఆవులను చూసుకుంటూ 

వుంటారు. పశుసంపదే అసలైన సంపదగా భావిస్తారు వారు. దానికే ప్రధమ  స్ధానం. 

గోవులు అంటే పశువులు. పశుపతి పత్నిగా, ఆ పశువులకు మాత అయింది శ్రీమాత. 

గోవులకు మాతయై, కామధేనువు వలె కామితాలను తీరుస్తున్న, ఆ గోమాత కు వందనం. 

ఓం శ్రీ గోమాత్రే నమః 


606. గుహజన్మభూః

గుహుడు అంటే కుమారస్వామి. శివుడికి స్కందుడు పుట్టటానికి కారణం అయిన 

ఆ జగన్మాతను, ఈ నామంలో గుహజన్మభూ అంటున్నాం. 

శివుని వీర్యమును తాను ధరించకపోయినా, ఆ వీర్యస్ఖలనానికి కారణమైనది పార్వతి. 

అందుకే  ఈ నామంలో ఆ తల్లిని గుహజన్మభూ అంటున్నాం. 

ఈ ఆది దంపతులు, జగత్పితరులు. లోక కళ్యాణార్ధం, శివ స్పర్శ లేకుండా గణేశుడు, 

పార్వతీ గర్భంలో పెరగకుండా స్కందుడు జన్మించారు. 

గుహులు అంటే అజ్ఞానముచే ఆవరింపబడినవారని కూడా ఒక అర్ధమున్నది. అంటే జీవులు అని 

అర్ధం. ఆ గుహులకు తల్లియై జ్ఞానమనే వెలుగును వారికి అందిస్తున్నది శ్రీమాత అని ఒక అర్ధం. 

వేదములోనూ, యాజ్ఞ్యవల్క్యస్మృతిలోనూ, అగ్ని నుంచి విస్ఫులింగములు బయటికి వచ్చినట్టు, 

పరమేశ్వరి నుంచి జీవులు బయటకు వస్తున్నారని  చెప్పారు.  

జ్ఞానాన్నిచ్చే స్కందమాత, ఆ గుహజన్మభూ కు వందనం. 

ఓం శ్రీ గుహజన్మభువే నమః 





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650