15, డిసెంబర్ 2021, బుధవారం

145. మహేశ్వరీ, మహాకాళీ, మహాగ్రాసా, మహాశనా అపర్ణా, చండికా, చండముండాసుర నిషూదినీ

 

మహేశ్వరీ, మహాకాళీ, మహాగ్రాసా, మహాశనా 
అపర్ణా, చండికా, చండముండాసుర నిషూదినీ ॥ 145 ॥


750. మహేశ్వరీ

ఈశ్వరి ఎంతో మహత్తైనది, చాలా గొప్పదైనది, కనుక ఈ నామంలో అమ్మను మహేశ్వరీ 

అంటున్నాం. 208 వ నామంలో అమ్మను "మాహేశ్వరీ" అన్నాం. ఇక్కడ 750 వ నామంలో 

మహేశ్వరీ అంటున్నాం. మహత్తత్త్వమును అంతటా వ్యాపింపచేసినది కనుక మహేశ్వరీ అన్నారు. 

ఇంద్రియాతీత తత్త్వమైన, ఈ మహత్తత్త్వమును చూడటానికి, అర్ధం చేసుకోవటానికి, 

ఇంద్రియములు ఏవీ సహాయపడలేవు. ఈశ్వరీ అంటే యజమాని అని భావం. కానీ యజమాని 

కన్నా ఈశ్వరుడు గొప్పవాడు. యజమాని తన ఆస్తులను చూచుకోగలడు. కానీ ఈశ్వరి తన 

జీవులను తానే సృష్టించి, ఆ జీవులన్నిటిలో తాను కూడా ఉంటూ, తన నుంచి వచ్చిన 

ప్రతి జీవినీ తిరిగి తనలో లయింప చేసుకోగలదు కనుక ఈ దేవిని మహేశ్వరీ అన్నారు. 

మహత్తైన అన్నిటిలో కెల్లా మహత్తైన, ఆ మహేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ  మహేశ్వర్యై నమః  


751. మహాకాళీ

మహాకాళీ ఉజ్జయినిలో కొలువైన మహాకాలుని ఇల్లాలు. కాలమునకు లొంగదు. 

కాలునికే కాళీస్వరూపము. కాలుడు అయిన యమునికి కూడా కాలుడి వంటిది. 

సకల ప్రాణుల ప్రాణములూ, తన పాశానికి బద్ధులను చేసే యముడు కూడా అమ్మ ఆజ్ఞకై 

ఎదురుచూస్తాడు. కాలమును తన చెప్పుచేతలలో ఉంచుకొనునది. నల్లని వర్ణంతో భాసించేది. 

కాళిదాసుని కరుణించిన మహాకాళి ఈ తల్లి. 

భద్రకాళి భక్తులను ప్రసన్న దృష్టితో భద్రంగా చూస్తుంది. 

ఉగ్రకాళి, తృప్తి చెందకపోతే తన ఉపాసకులను కూడా శిక్షిస్తుంది. 

దక్షిణేశ్వరకాళి దక్షిణ కాళి.  శ్రీరామకృష్ణపరమహంసకు కన్నతల్లి వంటిది. 

వరంగల్లు భద్రకాళి, భక్తుల పట్ల ప్రసన్న వీక్షణంతో వుండి, కాపాడుతూ ఉంటుంది. 

కాకతీయులకు ఉపాస్యదేవత. రాజ్య రక్షణ దేవత ఈ భద్రకాళి.  

మహాకాళుని ఇల్లాలు అయిన, ఆ మహాకాళి కి వందనం.  

ఓం శ్రీ మహాకాళ్యై నమః  


752.  మహాగ్రాసా

అమ్మ అన్నపాన స్వరూపురాలు అని ముందు నామాల్లో చెప్పుకున్నాం. 

అన్నము అంటే అమ్మే. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. 

అన్నమంటే భుజించతగిన అన్ని పదార్ధాలూ. అపరిమితమైన తిండి కలది మహాగ్రాసా. 

ఎవరు తినే గ్రాసము అయినా ఆ అమ్మకు గ్రాసమే. ప్రతిజీవిలో ఉంటూ, వారి గ్రాసాన్ని 

స్వీకరించేది కనుక అమ్మను మహా గ్రాసా అంటున్నాం. 

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర మొదలైన ఏ వర్ణము వారి గ్రాసమైనా అమ్మవారికి భోజనమే, 

అని వేదములో చెప్పబడింది. 

అందరి రూపములో, తానే ఆ గ్రాసమును తినుచున్నది కనుక, ఆ పరమేశ్వరి గొప్ప కబళము కలది 

అని ఈ నామార్ధం. 

అపరిమితమైన, అమితమైన ఆహారాన్ని తింటున్న, ఆ  మహాగ్రాసా కు వందనం. 

ఓం శ్రీ  మహాగ్రాసాయై నమః  


753. మహాశనా

అశనము అంటే అన్నము, భోజనము అని అర్ధం. 

మహా కబళాన్ని తింటోంది కనుక, అమ్మను ఈ నామంలో మహాశనా అంటున్నాం. 

చరాచర జగత్తునంతటినీ ఆహారముగా కలది కనుక మహాశనా. 

జగత్తులే తన భోజనంగా గలది కనుక మహాశనా. 

ప్రళయకాలంలో, జగత్తుల నన్నింటినీ తన కడుపు లోనికి లయం చేసుకుంటోంది కనుక, 

అమ్మను మహాశనా అంటున్నాం. తన సృష్టి అంతా తానే లయించునది అని అర్ధం. 

జగత్తులనన్నిటినీ ఆహారముగా తీసుకుంటున్న, ఆ మహాశన కు వందనం. 

ఓం శ్రీ మహాశనాయై నమః 

  

754. అపర్ణా

పార్వతీదేవి హిమాలయాలలో, మేనా హిమవంతుల కూతురుగా పుట్టి, ఆ మహాదేవుని భర్తగా 

పొందటానికి పట్టుదలతో చిరకాలం తీవ్రమైన తపస్సు చేసింది. 

ఎండాకాలంలో పంచాగ్నుల మధ్య నిలబడి, చలికాలంలో పీకల్లోతు నీళ్ళల్లో నిలబడి 

పార్వతీదేవి శివునికై కఠోరతపస్సు చేసింది. 

నేటికీ హిమాలయాల్లో మానససరోవరం వద్ద, పార్వతీదేవి  తపస్సు చేసిన ప్రాంతంలో, 

గౌరీ కుండ్ అనే సరస్సు కనిపిస్తుంది. 

హైమావతి కొంతకాలం కేవలం నామ మాత్రపు ఆహారం తీసుకుని తపస్సు చేసింది. 

తల్లి ఉ-మా అని వారిస్తున్నా వినలేదు. అందుకే అమ్మకు ఉమా అనే నామం వచ్చింది. 

తరువాత గిరిజ ఆ ఆహారం కూడా మానేసి ఫలాలు, కందమూలాలూ తిని తపించింది. 

మరి కొన్నాళ్ళ తరువాత, అది కూడా మానేసి నీరు తాగి తపస్సు కొనసాగించింది.  

ఇంకొన్నాళ్ళు ఎండిన ఆకులు తిని తపస్సు చేసింది. 

చివరకు ఆ పర్ణాలని కూడా తినడం మానేసి అపర్ణయై తపస్సు చేసింది. 

అప్పుడు సదాశివుడు కరుణించాడు. అందుకే అమ్మకు అపర్ణా అనే నామం వచ్చింది. 

అపర్ణ అంటే ఋణము లేనిది, ఋణశేషము లేనిది అనే అర్ధం కూడా వున్నది. 

మహాదేవునికై ఆకులు కూడా తినకుండా తపస్సు చేసిన, ఆ అపర్ణ కు వందనం. 

ఓం శ్రీ అపర్ణాయై నమః 


755. చండికా

భక్తి లేనివారి పట్ల కోపము కలది అని భావం. చడి అంటే కోపము కలది  అని అర్ధం. 

అమ్మకు భక్తి లేని వారి పట్ల కోపం వుంది అని ఈ నామం చెప్తోంది. 

దుర్మార్గుల పట్ల కోపముగా ఉండునది చండిక. రాక్షసుల గుండెల్లో భయాన్ని కలగచేసేది చండిక. 

దేవీ భాగవతంలో ఏడు సంవత్సరాల బాలికను చండికా అన్నారు. 

భక్తి లేని వారి పట్ల కోపమును కలిగి వున్న, ఆ చండిక కు వందనం. 

ఓం శ్రీ చండికాయై నమః 


756. చండముండాసుర నిషూదినీ

చండ ముండులనే రాక్షసులని వధించింది కనుక, అమ్మకు ఈ నామం వచ్చింది. 

నిషూదనము అంటే చంపటం. 

మార్కండేయ పురాణంలో, 'చండముండాసురులను తలలు కోసి చంపావు కనుక, 

నువ్వు చాముండా అనే నామం పొందావు', అని వుంది. 

వరాహ పురాణంలో, 'రురుడు అనే రాక్షసుణ్ణి త్రిశూలంతో వధిస్తే, అతడి శిరస్సు నుంచి చర్మము, 

ముండము(తల) వేరైపోయాయి. ఆ చర్మము, ముండమును గ్రహించి అమ్మ వెళ్ళిపోయింది, 

కనుక చాముండా అనే నామం కలిగింది' అని వుంది. 

భయంకరులైన రాక్షసుల ముండములు త్రెంచినది, కనుక చాముండా నామం వచ్చిందని కూడా 

వున్నది. ఆ ముండమాలను ధరించి కాళికా రూపం దాల్చినదని కూడా చెపుతారు.  

హిమాచల్ ప్రదేశ్ లోని చాముండా గ్రామంలో ఆది పరాశక్తి యైన చాముండా ఆలయం వుంది. 

అక్కడ వున్న విగ్రహం చాలా పురాతనమైనది. ఆదిమ కాలం నాటి శిలాజం. 

"ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే" అనేది చాముండా మంత్రం. 

ఈ మంత్రాన్ని జపిస్తే దుష్టుల నుంచి అమ్మ రక్షిస్తుందని విశ్వాసం. 

చండుడు ముండుడు అనే రాక్షసుల తలలు ద్రుంచిన, 

ఆ చండముండాసురనిషూదిని కి వందనం. 

ఓం శ్రీ చండముండాసురనిషూదిన్యై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

      

14, డిసెంబర్ 2021, మంగళవారం

144. భాగ్యాబ్ధిచంద్రికా, భక్తచిత్తకేకి ఘనాఘనా రోగపర్వత దంభోళిః, మృత్యుదారు కుఠారికా

 

భాగ్యాబ్ధిచంద్రికా, భక్తచిత్తకేకి ఘనాఘనా 
రోగపర్వత దంభోళిః, 
మృత్యుదారు కుఠారికా ॥ 144 ॥


746. భాగ్యాబ్ధిచంద్రికా

భాగ్య, అబ్ధి, చంద్రికా అంటే భాగ్యమనే సముద్రమునకు వెన్నెల వంటిది అని అర్ధం. 

సముద్రం ఆటుపోట్లు చంద్రుణ్ణి అనుసరిస్తూ ఉంటాయి. 

వెన్నెలను బట్టీ సముద్రం ఉప్పొంగుతూ ఉంటుంది. 

భక్తుల భాగ్యమనే సముద్రం కూడా అదే విధంగా, అమ్మ కరుణను బట్టీ పొంగిపొర్లుతూ ఉంటాయి. 

భాగ్యవంతుల పట్ల అమ్మ అనుగ్రహం వున్నది, అని ఈ నామం స్పష్టం చేస్తోంది. 

భాగ్యవంతులవటం అంటే, అది ఖచ్చితంగా వారు చేసుకున్న పుణ్యవిశేషము యొక్క ఫలమే.  

ఆ భాగ్యవంతులే అహంకరించి, ఇది అంతా నా వల్లే అనుకుంటే, 

అమ్మ కృప, అనుగ్రహము తగ్గి, ఆ సిరిసంపదలను పోగొట్టుకుంటారు. 

శ్రీదేవి కరుణ, కటాక్షం ఉంటే, భోగభాగ్యాలు వెల్లివిరుస్తాయి. 

ఆ కటాక్షమే లేకపోతే, ఎంతటి భాగ్యవంతుడైనా, అనామకుడైపోతాడు. 

పున్నమినాటి చంద్రుణ్ణి చూసి, సముద్రం ఉప్పొంగినట్లుగా, తన కరుణాకటాక్షాల వలన, 

తన భక్తుల సిరి సంపదలు వృద్ధి చేసే, ఆ భాగ్యాబ్ధిచంద్రిక కు వందనం. 

ఓం శ్రీ  భాగ్యాబ్ధిచంద్రికాయై నమః  


747. భక్తచిత్తకేకిఘనాఘనా

ఘనాఘనము అంటే వాన కారు మేఘము. ఆ కారు మేఘాలను చూసి కేకి అంటే నెమళ్ళు 

పరవశించి, పురివిప్పి ఆడతాయి. పరమేశ్వరి భక్తుల చిత్తాలను నెమళ్ల వలె పరవశింపచేసే,

వర్షించబోయే కారుమేఘము వంటిది. 

అమ్మను తలచినంత మాత్రాన, భక్తుల చిత్తాలు కూడా, ఆ నెమళ్ళ వలె పరవశించి ఆడతాయి 

అని ఈ నామంలో చెప్తున్నారు.  

అమ్మను భజించే, భక్తులు మైమరచి మయూరాల వలె ఆనందడోలికల్లో ఊగిపోతారు. 

అమ్మ పట్ల భక్తి, ప్రేమ ఉప్పొంగిన నెమళ్ళ వంటి భక్తులకు, అమ్మ దట్టమైన వర్షించటానికి 

సిద్ధంగా వున్న మేఘము.    

మేఘం వర్షించటానికి ఎలా సిద్ధంగా ఉంటుందో, అలా అమ్మ తన కారుణ్య, కృపా వర్షాన్ని 

సుధాధారల వలె తన భక్తులపై వర్షిస్తుంది. 

అమ్మను చూచిన భక్తులు మైమరచి అమ్మను ఆనందపరచటానికి 

తమ చిత్తాలలో నెమళ్ళ వలే నృత్యం చేస్తూ వుంటారు. 

నెమళ్ళ పాలిట కారుమేఘము వలే, భక్తుల చిత్తాలను పరవశంలో ముంచెత్తుతున్న, 

ఆ భక్త చిత్త కేకి ఘనా ఘన కు వందనం.  

ఓం శ్రీ భక్తచిత్తకేకిఘనాఘనాయై నమః  


748.  రోగపర్వతదంభోళిః

దంభోళి అంటే వజ్రాయుధం. అమ్మవారు పర్వతమంత రోగాలనయినా, వజ్రాయుధము వలే, 

తుత్తునియలు చేస్తుంది అని ఈ నామ భావం. 

తన మహిమ వలన పెద్ద పెద్ద వ్యాధులను సైతం, నయం చేసే ఆ పరమేశ్వరి, మహా ధన్వంతరి. 

వేదములో, వైద్యులందరిలోనూ గొప్ప వైద్యురాలుగా, అమ్మను కీర్తించారు. 

పూర్వము పర్వతాలకు కూడా, పక్షులకున్నట్టు రెక్కలు ఉండేవి. పర్వతాలు ఎగురుతూ ఉంటే, 

ఎంతో జన నష్టం, ఆస్తి నష్టం జరిగేది. 

అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ పర్వతాల రెక్కలు కోసేశాడు. 

ఆ తరువాత పర్వతాలు ఎగరలేకపోయాయి. మైనాకుడనే పర్వతం మాత్రం వాయుదేవుని 

సహాయంతో, సముద్రంలోకి విసిరివేయబడి, తన రెక్కలు కాపాడుకున్నాడు. 

ఈ కథ మనకు శ్రీమద్రామాయణంలో వినిపిస్తుంది. 

వజ్రాయుధం పర్వతాలను కూడా కోయగలిగే పదునైన శక్తి కలది.  

ఈ నామంలో అమ్మను తన భక్తుల ఆధివ్యాధులను దునుమాడే వజ్రాయుధం అని అంటున్నాం. 

అమ్మ కృప ఉంటే, వజ్రాయుధం పర్వతాల రెక్కలు కత్తిరించినట్లు, 

శారీరక బాధలను ఔషధఖడ్గంతో, మానసిక వ్యాధులను జ్ఞానఖడ్గంతో, తుంచి పారేస్తుంది. 

రోగాల పాలిట వజ్రాయుధమైన, ఆ  రోగపర్వతదంభోళి కి వందనం. 

ఓం శ్రీ  రోగపర్వతదంభోళ్యై నమః  


749. మృత్యుదారుకుఠారికా

మృత్యువు అనే కట్టెలకు గొడ్డలి వంటిది అమ్మ అని ఈ నామార్ధం. 

మృత్యువుకు గొడ్డలిపెట్టు ఆ లలితా పరమేశ్వరి. 

అమ్మను సర్వమృత్యునివారిణీ అని ముందటి నామాల్లో చెప్పుకున్నాం. 

లలితా పరమేశ్వరి తన భక్తులకు అకాలమృత్యువు రానివ్వదు. 

మృత్యువు వచ్చినా అమ్మ ఒక్క గొడ్డలిపెట్టుతో దాన్ని తెగ్గొట్టేస్తుంది. 

అపమృత్యువు ఇరవై ఎనిమిది విధములుగా వస్తుంది. 

కానీ అమ్మ అటువంటి ఏ అపమృత్యువునూ తన భక్తుల దరి చేరనివ్వదు.  

మరొక అర్ధంలో అమ్మ తన భక్తులకు శుద్ధ జ్ఞానాన్నిస్తుంది. 

ఆ జ్ఞానం పొందిన వారికి పునర్జన్మ కలుగదు. వారిని మరణం వేధించదు. 

జన్మే లేకపోతే మరణం ఎక్కడిదీ, కనుక, వారికి మృత్యువు లేదు, రాదు అని భావం. 

జ్ఞానఖడ్గంతో జననమరణాలనే శృంఖలాలను భేదిస్తున్న, ఆ మృత్యుదారుకుఠారిక కు వందనం. 

ఓం శ్రీ మృత్యుదారుకుఠారికాయై నమః 


  

------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

      

13, డిసెంబర్ 2021, సోమవారం

143. భవదావ సుధావృష్టిః, పాపారణ్య దవానలా దౌర్భాగ్యతూల వాతూలా, జరాధ్వాంత రవిప్రభా

  

భవ దావ సుధా వృష్టిః, పాపారణ్య దవానలా 
దౌర్భాగ్యతూల వాతూలా, జరాధ్వాంత రవిప్రభా ॥ 143 ॥

742. భవదావసుధావృష్టిః

భవ దావ సుధా వృష్టిః, అంటే భవమనే సంసారంలో చెలరేగే, దావ అనే దావాగ్నిని (అరణ్యంలో 

పుట్టే అగ్నిని దావాగ్ని అంటారు), సుధా అనే అమృతపు, వృష్టిః అంటే వాన కురిపించేది అని 

ఈ నామానికి అర్ధం. ఆ లలితాపరమేశ్వరి ఈ సంసారమనే అరణ్యంలో పుట్టిన దావాగ్నిలో 

బాధింపబడుతున్నవారి పట్ల కృపతో అమృతపు వర్షాన్ని కురిపించి సంరక్షిస్తుంది. 

అమ్మవారు తన భక్తులను, సంసారపు ఈతిబాధల నుంచి రక్షిస్తుంది. 

వారికి భోగమూ, మోక్షమూ కలుగచేస్తుంది. 

లేదా సంసారమును రక్షించుటకు, అరణ్యముపై వానజల్లు వలె అమృతమును 

పుంఖానుపుంఖాలుగా వర్షించి, వంశ పరంపరను నిలిపి రక్షించునది అని కూడా అర్ధం. 

భవదా, వసు, ధా, వృష్టిః, అని పదవిభజన చేస్తే, రత్న్యైశ్వ ర్యాలను, భోగభాగ్యాలను 

కురిపిస్తుంది అని భావం. 

భవదా, వసుధా, వృష్టిః, అని పదవిభజన చేస్తే, పరమశివుణ్ణి ఇచ్చునది అని భావం. 

రుద్రయామళ గ్రంధంలో, మంగళరాజ స్తవంలో, "ఎక్కడ భోగము ఉంటుందో, అక్కడ మోక్షము 

ఉండదు. ఎక్కడ మోక్షము ఉంటుందో, అక్కడ భోగము ఉండదు. కానీ ఆ లలితాత్రిపురసుందరీ 

ఉపాసకులకు భోగమోక్షములు రెండూ లభిస్తాయి" అని చెప్పారు. 

భక్తులకు భోగ మోక్షములను సుధావర్షముగా అనుగ్రహించు, ఆ భవదావసుధావృష్టి కి వందనం. 

ఓం శ్రీ  భవదావసుధావృష్ట్యై నమః  


743. పాపారణ్యదవానలా

పాప, అరణ్య, దవ, అనలా, అంటే పాపములనే అరణ్యానికి దావాగ్ని వంటిది శ్రీలలిత అని అర్ధం. 

బృహన్నారదీయంలో, "దేవీ నామ పారాయణము పాపపు అరణ్యములను దావాగ్ని వలె భస్మం 

చేస్తుంది.  గంగాదేవి పరమపావని, గంగా సేవ చేసిన వారిని పాపముల నుండి ఉద్ధరిస్తుంది. 

గంగా నామము, గంగా పానము, గంగా స్నానము పాపహరణం. కష్టపడి యైనా గంగను సేవించాలి" 

అని చెప్పబడింది. 

బ్రహ్మాండపురాణంలో, "తెలిసి కానీ, తెలియక కానీ చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము ఆ దేవీ 

పాద సేవ, పాద స్మరణ" అని చెప్పారు. అదే పురాణంలో, "భక్తి శ్రద్ధలతో, స్నానానంతరం నీళ్ళల్లో 

నిలబడి, పంచదశీ మంత్రాన్ని, అష్టోత్తర సహస్రం అంటే, వెయ్యి ఎనిమిది సార్లు, జపించి 

ఆ పరాశక్తిని ఆరాధిస్తే, సకలపాపాలూ నశిస్తాయి" అని చెప్పారు. 

సకలపాపహారిణి అయిన, ఆ పాపారణ్యదవానల కు వందనం.  

ఓం శ్రీ పాపారణ్యదవానలాయై నమః  


744.  దౌర్భాగ్యతూలవాతూలా

తన ఉపాసకుల యొక్క దౌర్భాగ్యములను, సుడిగాలితో దూదిపింజ వలె పారద్రోలునది అని 

అర్ధం. తూలము అంటే దూది. వాతూలము అంటే సుడిగాలి. 

అష్ట ఐశ్వర్యాలు వలెనే, దౌర్భాగ్యాలు కూడా ఎనిమిది. అవి ఋణము, యాచన,ముసలితనము,

జారత్వము, చోరత్వము, దరిద్రము, రోగము, భుక్తశేష భోజనము. 

ఈ దౌర్భాగ్యాలను దూదిపింజ వలె ఎగరగొట్టి దూరము చేసేది ఆ పరమేశ్వరి. 

ఎంత భయంకరమైన దౌర్భాగ్యస్థితి యైనా, అమ్మకు అది దూదిపింజతో సమానం. 

తన భక్తుల దౌర్భాగ్యాలనే దూదిపింజల పాలిట సుడిగాలి వంటిది అమ్మ. 

భక్తుల దౌర్భాగ్యాలను సుడిగాలి వలె ఎగరకొట్టేసే, ఆ  దౌర్భాగ్యతూలవాతూల కు వందనం. 

ఓం శ్రీ  దౌర్భాగ్యతూలవాతూలాయై నమః  


745. జరాధ్వాంతరవిప్రభా 

జర, ధ్వాంత, రవి, ప్రభా అంటే ముసలితనము అనే చీకటిని చీల్చి, రవి కాంతులతో 

ప్రకాశింపచేసేది అని అర్ధం. ధ్వాంతము అంటే చీకటి. 

పరమేశ్వరి కృప ఉంటే, ముసలితనము బాధించదు. 

ఆ ముసలితనంలో కూడా చక్కని వెలుగులతో, సూర్యుడు ప్రకాశించినట్లు ప్రకాశించగలరు. 

సౌందర్యలహరిలో కూడా శంకరాచార్యుడు,"అమ్మా, నీ కృప ఉంటే ముసలివాడైనా, కురూపి 

అయినా, చక్కగా రాణించగలుగుతాడు" అంటాడు. 

ఉపాసకులకు అమ్మ కృప వలన, ముసలితనపు ఇక్కట్లు వేధించవు. 

సూర్యుడు చీకటిని ఎలా చెండాడుతాడో, అలా అమ్మ తన భక్తులకు జరాబాధలు నిర్మూలిస్తుంది. 

తన భక్తులను ముసలితనపు వేదనల నుంచి కాపాడే, ఆ జరాధ్వాంతరవిప్రభ కు వందనం. 

ఓం శ్రీ జరాధ్వాంతరవిప్రభాయై నమః 

  



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

     

12, డిసెంబర్ 2021, ఆదివారం

142. మిథ్యా జగదధిష్ఠానా, ముక్తిదా, ముక్తిరూపిణీ లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా

  

మిథ్యా జగదధిష్ఠానా, ముక్తిదా, ముక్తిరూపిణీ 
లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా ॥ 142 ॥

735. మిథ్యాజగదధిష్ఠానా

మిథ్య అంటే లేనిదాన్ని ఉన్నట్టుగా భావించటం. మిథ్య అంటే, అసత్యం, భ్రాంతి. 

జగత్తు మిథ్య. కానీ అందరూ ఈ మిథ్యా జగత్తును నిజమని భావించి ఈ మాయా మోహములో 

మునిగి వుంటారు. అసత్తు అయిన ఈ జగత్తును, సత్యముగా భ్రమింపచేస్తున్నది కనుక, 

అమ్మను ఈ నామంలో మిథ్యాజగదధిష్ఠానా అంటున్నాం. 

అద్వైతం "పరమాత్మ కంటే వేరైన జగత్తు ఏదీ లేదు. ఈ జగత్తంతా పరమాత్మ స్వరూపమే" అని

చెప్తుంది. అయినా, ఈ జగత్తు అనేది ఒకటి ఉందని నమ్మేదే మిథ్యావాదం.  

అద్వైతం "బ్రహ్మ సత్యం, జగన్మిథ్య" అని చెప్తుంది. 

తాడుని చూసి పాము అనుకోవడం కూడా ఇటువంటి భ్రాంతే. ఈ భ్రాంతులన్నీ కల్పించింది 

ఆ పరమేశ్వరి కనుక, ఈ మిథ్యాజగత్తుకి అధిష్టాన దేవత ఆ పరమేశ్వరియే. 

వేదములో,  "ద్వైతమంతయూ మాయే, యదార్ధము అద్వైతమే" అని చెప్పారు. 

దేవీభాగవతంలో, " కనిపించే జగత్తంతా ఆత్మే, ఆ ఆత్మే అన్నిటికన్నా సనాతనమైనది" అన్నారు. 

శ్రీమద్భాగవతంలో, "పరమాత్మ యొక్క త్రిగుణాత్మకమైన సృష్టి అంతా మిథ్యే" అని వుంది. 

వేదంలో, 'ఏకామేవాద్వితీయం బ్రహ్మ' అని వుంది. అంటే బ్రహ్మము అద్వితీయము, 

రెండవది అంటూ ఏదీ లేదు. ఉన్నదొక్కటే, అదే బ్రహ్మం అని అర్ధం. 

కనుక అంతా బ్రహ్మమే, పరమాత్మయే, ఇక ఇతరమంతా మిథ్యామాత్రము అని అర్ధం. 

ఈ మిథ్యాజగత్తుకి అధిష్టాన దేవత అయిన, ఆ మిథ్యాజగదధిష్ఠాన కు వందనం. 

ఓం శ్రీ  మిథ్యాజగదధిష్ఠానాయై నమః  


736. ముక్తిదా

ముక్తిని ఇచ్చేది ముక్తిదా. మోక్షమును  ఇచ్చేది మోక్షదాయిని అయిన ఆ లలితా పరమేశ్వరి. 

శ్రీకూర్మపురాణంలో, 'ముక్తిని కోరేవారు పార్వతీదేవిని ప్రార్ధించాలి. ఆ తల్లి అన్ని ప్రాణులలో 

అంతర్యామిగా ఉంటుంది. మంగళస్వరూపురాలు', అని వుంది. 

శివపురాణంలో, 'తన నామాలను అర్ధం తెలియకుండా పారాయణ చేసినా ముక్తి నిచ్చువాడు 

శివుడు. ముక్తి కన్నా పెద్ద కోరిక లేదు', అని చెప్పారు. 

నామాలకు అర్ధం తెలియకుండా పారాయణ చేస్తేనే ముక్తినిచ్చే దేవత, అర్ధం తెలిసి పారాయణ 

చేస్తే, ఇంకెంత తృప్తి చెందుతుందో కదా. 

బ్రహ్మాండపురాణంలో, 'విధివిధానంగా కానీ, మరొక విధంగా గానీ, ఆ పరాశక్తిని పూజించినవారు 

నిస్సంశయముగా మోక్షాన్ని పొందుతారు', అని చెప్పారు. 

దేవీ పూజాఫలితంగా మోక్షాన్నిచ్చే, ఆ ముక్తిద కు వందనం.  

ఓం శ్రీ ముక్తిదాయై నమః  


737.  ముక్తిరూపిణీ 

ఈ నామంలో 'మోక్షమే నా స్వరూపము' అని ఆ పరమేశ్వరి తెలియచేస్తోంది. 

కేవలము అవిద్యా నాశనమే మోక్షము అనుకోరాదు, ఎందుకంటే, మోక్షమంటే, ఆత్మానందం. 

ఏ బంధనములూ లేని స్థితి మోక్షము, ముక్తి. 

సౌరసంహితలో,"జ్ఞానమొక్కటే మోక్షకారణము కాదు. జ్ఞానము వలన స్వాత్మానందం 

కలుగుతుంది. దేనివలన ఆత్మానుభూతి కలుగుతుందో, అది ముక్తికి కారణమవుతోంది. 

సచ్చిదానంద స్వరూపుడైన ఆ పరమాత్మ, ఆత్మ స్వరూపుడు కనుక, ఆ ఆత్మానందమే మోక్షము" 

అని చెప్పబడింది. ఆనందస్వరూపమే మోక్షము. 

మోక్షమే స్వరూపముగా కల, ఆ  ముక్తిరూపిణి కి వందనం. 

ఓం శ్రీ  ముక్తిరూపిణ్యై నమః  


738. లాస్యప్రియా

లాస్యమంటే నృత్యవిశేషము. లాస్యాన్ని ఇష్టపడునది కనుక, 

అమ్మను ఈ నామంలో లాస్యప్రియా అంటున్నాం. 

నటరాజుతో కలిసి అమ్మ నటేశ్వరీ రూపంలో నృత్యం చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. 

అమ్మకు నర్తనం అంటే ఇష్టం. అందునా శివునితో చేరి నృత్యం చేయటం మరింత ఇష్టం. 

కళలో లీనమయి నృత్యం చేస్తుంటే, కలిగే ఆత్మానందానుభూతే మోక్షానికి మార్గము. 

ఆ విధంగా నర్తనమంటే, ప్రేమగా, ఇష్టంగా, భక్తిగా, ఆ నాట్యంలో లీనమయి నృత్యం చేసేవారిని 

ప్రీతిగా చూస్తుంది, ఆ లాస్యప్రియా అయిన అమ్మ. 

లాస్యమంటే మక్కువ కల, ఆ లాస్యప్రియ కు వందనం. 

ఓం శ్రీ లాస్యప్రియాయై నమః   


739. లయకరీ

లయింపచేయునది లయకరీ. చిత్తాన్ని పూర్తిగా తమ కళ మీద ఉంచి, దానిలో 

లయమైపోయి,  కళాప్రదర్శన చేసేవారంటే అమ్మకు ఇష్టం. 

ఏ పని చేసినా, ఆ పని మీద, ఆ వృత్తి మీద సంపూర్ణమైన శ్రద్ధా భక్తులతో ఉండేవారంటే 

అమ్మ ఇష్టపడుతుంది. 

ఆ ప్రదర్శనా సమయంలో ఆ కళలో లీనమై, దానిలో లయించిపోయేవారంటే, ఆ తల్లికి ప్రీతి. 

కొంతమంది కళాకారులు ప్రదర్శనా సమయం లోనే, ఆ పరమాత్మలో లీనమయిపోవటం చూస్తూ 

ఉంటాం. పది ధ్యానములతో సమానమయినది లయము. అంత ఏకాగ్రతతో కళను సేవించుకునే

వారిని అమ్మ తన లోనికి లయం చేసుకుంటుంది. సంపూర్ణంగా తమ కళలో లీనమై పోయి, 

గాయకులు గానం చేస్తున్నా, నర్తకులు నృత్యం చేస్తున్నా, శిల్పకారులు శిల్పాలను చెక్కుతున్నా, 

గురువులు శిష్యులకు బోధను చేస్తున్నా, రచయితలు  రచనలు చేస్తున్నా, అంతా ఆ అమ్మ 

పూజతో సమానం. ఇవి అన్నీ కూడా ఆత్మానందాన్ని కలుగచేస్తాయి కనుక, ఇవి కూడా శ్రీవిద్యయే. 

"ఏ ఫలమూ ఆశించకుండా, ఏ పని అయితే, కేవలము ఆత్మానందం కోసమే  చేస్తామో, అదే

శ్రీవిద్య" అని జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి అనేవారు. 

ఆనందం పొందుతూ, చేసే పనిలో లయమై పోయి ఉండేవారిని ఇష్టపడే, ఆ లయకరి కి వందనం. 

ఓం శ్రీ లయకర్యై నమః 


740. లజ్జా

లజ్జాస్వరూపురాలు ఆ లలితాపరమేశ్వరి. హ్రీమ్ బీజ స్వరూపురాలు. 

మార్కండేయ పురాణంలో, దేవీ స్తుతిలో, 'యా దేవీ సర్వభూతేషు, లజ్జా రూపేణా సంస్థితా, 

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై, నమోనమః' అని వుంది. 

ప్రాణులన్నిటిలో ఆ పరమేశ్వరీదేవి లజ్జా రూపంలో ఉంటుంది. 

రేణుక, ఏకవీరికా, ఎల్లమ్మ, మాతంగి, జోగులాంబ అనే పేర్లతో పిలువబడే దేవతే లజ్జాగౌరి. 

ఈ లజ్జాగౌరీ దేవత ప్రసవిస్తున్న మాతృమూర్తి భంగిమలో, నగ్నంగా ఉంటుంది. శిరస్సు ఉండదు. 

ఆ శిరస్సు స్థానంలో ఒక పూర్తిగా వికసించిన కమలం ఉంటుంది. 

అలా పూర్తిగా వికసించిన కమలం సహస్రారానికి సంకేతం. 

ఈ లజ్జాగౌరి భారతదేశంలోనే కాక, మరెన్నో ఇతరదేశాలలో కూడా పూజింపబడింది అనటానికి

గుర్తుగా ఎన్నో దేశాల్లో ఈ లజ్జాగౌరీ విగ్రహాలు దొరికాయి. 

తెలంగాణాలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో వున్న, జోగులాంబ ఆలయంలో, నేటికీ 

లజ్జాగౌరి విగ్రహం పూజలందుకుంటోంది. ఆ లలితా పరమేశ్వరిని జగత్ప్రసూత్యై అన్నాం కదా. 

పూర్తిగా చైతన్యస్వరూపంలో వికసిత కమలమే శిరస్సుగా, నగ్నంగా వుండి, 

ప్రసవిస్తున్న భంగిమలో ఉన్న మాతృమూర్తి యొక్క యోని రూపమే లజ్జాగౌరీ.  

ఈ రూపంలో వున్న లజ్జాగౌరీదేవిని 'లజ్జాయై  నమః', అనే నామంతో పూజిస్తే సంతానం లేనివారికి 

సంతానం కలుగుతుందని ఒక విశ్వాసం. 

ప్రాణులన్నిటిలో లజ్జ రూపంలో ప్రకటితమవుతున్న, ఆ లజ్జ కు వందనం. 

ఓం శ్రీ లజ్జాయై  నమః 


741. రంభాదివందితా

రంభ మున్నగు అప్సర స్త్రీలచే పూజింపబడునది అని ఈ నామానికి అర్ధం. 

సముద్ర మథన సమయంలో అప్సరలు కూడా ఉద్భవించారు. 

సాగర మథనం జరుగుతున్నప్పుడు, కామధేనువు, కల్పవృక్షము, ధన్వంతరి, చంద్రుడు, 

శ్రీమహాలక్ష్మి, ఉచ్చైశ్రవం, ఐరావతం, కౌస్తుభం, పారిజాతవృక్షం, వారుణి(కల్లు), గరళం, 

అమృతం మొదలైన వాటితో పాటు ఈ రంభాది అప్సర లందరూ కూడా ఉద్భవించారు.  

ఈ అప్సరలు తపస్సు చేసుకునే తాపసుల ఇంద్రియ నిగ్రహాన్ని, ఇంద్రుని 

పర్యవేక్షణలో పరీక్షిస్తూ వుంటారు. వీరంతా ఇంద్రియ పరీక్షాధికారులు. 

ఈ అప్సరల చేత పూజింపబడుతోంది కనుక, అమ్మను రంభాదివందితా అంటున్నాం. 

రంభ మొదలైన అౘ్చరల చేత పూజింపబడు, ఆ రంభాదివందిత కు వందనం. 

ఓం శ్రీ రంభాదివందితాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

     

11, డిసెంబర్ 2021, శనివారం

141. చిత్కళా, ఆనందకలికా, ప్రేమరూపా, ప్రియంకరీ నామపారాయణ ప్రీతా, నందివిద్యా, నటేశ్వరీ

  

చిత్కళా,ఆనందకలికా, ప్రేమరూపా, ప్రియంకరీ 
నామపారాయణ ప్రీతా, నందివిద్యా, నటేశ్వరీ ॥ 141 ॥


728. చిత్కళా

అఖండచైతన్యము లోని కొంతభాగమును చిత్కల లేదా చిత్కళ అంటారు. 

దీనికే జీవుడని పేరు. జీవులందరిలో గల పరమాత్మ యొక్క చైతన్యాంశను చిత్కళ అంటారు. 

స్మృతులలో, 'నా అంశమే జీవులలో జీవుడుగా వుంది' అని వున్నది. 

పద్మపురాణంలో, దేవీమూర్తుల గణన ప్రకరణంలో, 'సర్వ శరీరుల చిత్తములో, చిత్కళా అనే 

పేరుతో వున్నది.' అని వున్నది. 

ఐతరేయోపనిషత్తులో, 'విరాట్స్వరూపుని పోలిన మానవుడిని ఆ పరమేశ్వరుడు సృష్టించాడు. 

తరువాత ఆ మానవుని లోనికి, ఆతని బ్రహ్మరంధ్రము ద్వారా ప్రవేశించాడు. 

ఆ విధంగా మానవుని లోనికి ప్రవేశించిన పరమేశ్వర స్వరూపమే చిత్కళ' అని చెప్పబడింది.   

శ్రీమద్భగవద్గీతలో, 'మమైవాంశో జీవలోకే జీవభూతస్సనాతనః' అని పురుషోత్తమప్రాప్తి యోగంలో 

చెప్పారు. అంటే, 'జీవుడు నా అంశ, నేనే జీవుడు', అని భగవానుడే స్వయంగా చెప్పాడు. 

చిత్కళా అంటే జీవునిలో వున్న దేవుని అంశ. జీవులలో వున్న చైతన్యము. 

దైవాంశగా ప్రతి జీవుడి లోనూ ప్రకాశిస్తున్న, ఆ చిత్కళ కు వందనం. 

ఓం శ్రీ  చిత్కళాయై నమః  


729. ఆనందకలికా

అఖండచైతన్యము లో కొంతభాగమును చిత్కళ అన్నట్లే, బ్రహ్మానందములో కొంతభాగాన్ని 

ఆనందకళ అంటారు. ఆనందకళ అంటే, జీవులలో ఆనందస్వరూపురాలు. 

పరమాత్మ యొక్క అఖండ ఆనందంలో ఒక అంశను పొంది జీవుడు ఆనందపడుతున్నాడు, 

అని వేదములో వున్నది. కళిక అంటే మొగ్గ. ఆనందమనే మొగ్గను జీవుడు పొందియున్నాడు. 

మొగ్గనే 'కోరక' అని కూడా అంటారు. ఆనందకళికా అంటే, ఆనందమనే కోరక రూపములో 

జీవులందరిలో గల, ఆ ఆనందాంశ స్వరూపమే అమ్మ.    

ఆ బ్రహ్మానందంలో నుంచి వచ్చి, ప్రతి జీవిలో చేరిన మొగ్గ వంటి కళే, ఆనందకళికా రూపంలో 

వున్న అమ్మవారి ఆనందాంశము.  

బ్రహ్మానందంలో భాగమయిన ఆనందపు మొగ్గల వంటి, ఆ ఆనందకళిక కు వందనం.  

ఓం శ్రీ ఆనందకలికాయై నమః  


730.  ప్రేమరూపా 

ప్రేమయే తన స్వరూపముగా కలది ప్రేమరూపా. ప్రేమ అంటే స్నేహము, భక్తి. 

అమ్మ పట్ల భక్తుడు చూపుతున్న భక్తే, చూపుతున్న స్నేహమే, అమ్మ స్వరూపంగా కనిపిస్తుంది. 

అందుకే ఏ రూపంతో అమ్మను చూడాలనుకుంటామో, ఆ రూపంలోనే అమ్మను చూస్తూ ఉంటాం. 

కొందరికి బాల వలె, కొందరికి రాధ వలె, కొందరికి లక్ష్మి వలె, మరి కొందరికి సరస్వతి వలె,

కొందరికి కాళి వలె కనపడుతూ ఉంటుంది అమ్మ. 

అది వారు తమ భక్తితో, తమ ప్రేమతో మనసులో అమ్మను గురించి ఊహించుకున్న రూపం. 

అందుకే "ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన, అంతమాత్రమే నీవూ" అంటాడు అన్నమయ్య. 

ప్రేమ, భక్తి, స్నేహం అంటే ఆనందమే. కనుక అమ్మ ప్రేమ అనే ఆనందస్వరూపిణి. 

ఆనందము నిండిన ప్రేమ అనే అనుభూతికి అందుతున్న, ఆ  ప్రేమరూప కు వందనం. 

ఓం శ్రీ  ప్రేమరూపాయై నమః  


731. ప్రియంకరీ 

ప్రియమును కలగచేయునది ప్రియంకరీ. ప్రియము అంటే ఇష్టము, స్నేహము. 

భక్తులకు  ఇష్టమును, ప్రేమను అనుగ్రహించు పరమేశ్వరియే ప్రియంకరీ. 

ఆ పరమేశ్వరి కోరిన కోరికలు తీర్చే భక్తిమత్ కల్పలతికా. ఇహమునకు సంబంధించిన కోరిక 

యైనా, పరమునకు సంబంధించిన కోరిక యైనా ఆ పరమేశ్వరి తీరుస్తుంది. 

భోగభాగ్యాలు, రాజ్యాలు, పదవులు ఇస్తుంది. వారికి ప్రియాన్ని చేకూర్చేవన్నీ తన భక్తులకు

ఇస్తుంది. అందుకే ఈ నామంలో అమ్మను ప్రియంకరీ అంటున్నాం. 

భక్తులకు ప్రియమును కలిగించే, ఆ ప్రియంకరి కి వందనం. 

ఓం శ్రీ ప్రియంకర్యై నమః   


732. నామపారాయణప్రీతా

తన నామాన్నిపారాయణం చేసేవారి పట్ల ప్రీతిని చూపేది అని ఈ నామ భావం. 

తన భక్తులను ఉద్ధరించడానికి, ఈ లలితా సహస్ర నామ స్తోత్రాన్ని, వాగ్దేవతలైన వశిని 

మొదలైన ఎనిమిది మంది శ్రీచక్ర సప్తమావరణ దేవతల చేత, అమ్మ ఇష్టపడి, ముచ్చటగా 

రచింపచేసింది. శ్రద్ధా భక్తులతో, ఈ స్తోత్రాన్ని పారాయణ చేసిన వారికి, కోరిన కోరికలు 

తీరుస్తుంది అమ్మ. నామ పారాయణమంటే ఆ శ్రీలలితకు మహా ప్రీతి అని ఈ నామం 

చెప్తోంది. ఈ సహస్ర నామాలే కాదు, పరమాత్మకు సంబంధించిన ఏ నామాలు పారాయణ చేసినా 

అమ్మ తృప్తి చెందుతుంది. కేవలము మాతృకావర్ణాలలో కల అక్షరములను పారాయణ చేసినా 

చాలు. ఎందుకంటే, ప్రతి అక్షరమూ ఒక బీజాక్షరమే, ఒక మంత్రమే. 

ఒక్క అక్షరం జపించినా అది అమ్మ నామమే. 

లలితాత్రిశతి కూడా 'క కార రూపా కల్యాణీ' అనే నామంతో మొదలవుతుంది.  

ఖడ్గమాలా స్తోత్రంలో కూడా శ్రీచక్ర నవావరణ దేవతల గురించి చెప్పబడింది. 

ఖడ్గమాల పారాయణం చేసినా, బాల, పంచదశి, చాముండా వంటి దేవతల మంత్రములు 

పారాయణ చేసినా, షోడశీ వంటి దశమహావిద్యల మంత్రములు పారాయణ చేసినా, 

అమ్మకు ప్రీతికరం.  

దేవీ భాగవతంలో, "అకారము నుంచి క్షకారము వరకు అన్ని అక్షరములనూ రకరకాలుగా 

కూర్చితే, అసంఖ్యాకములైన నామములు ఏర్పడతాయి" అని చెప్పారు. 

ఈ నామాల పారాయణము కానీ, సహస్రనామాల పారాయణము కానీ, ఏది చేసినా అమ్మ ప్రీతి 

చెందుతుంది కనుక, అమ్మను ఈ నామంలో నామ పారాయణప్రీతా అని చెప్పుకుంటున్నాం. 

నామాన్ని పారాయణ చేస్తే, ప్రీతి చెందే, ఆ నామపారాయణప్రీత కు వందనం. 

ఓం శ్రీ నామపారాయణప్రీతాయై నమః 


733. నందివిద్యా

నందికేశ్వరుడు ఉపాసించిన విద్య శ్రీవిద్య. అమ్మవారు శ్రీవిద్యాస్వరూపము. 

నంది ఉపాసించిన విద్య కనుక, అమ్మను ఈ నామంలో నందివిద్యా అంటున్నాం. 

నందీశ్వరుడు ప్రమథగణములలో ప్రధముడు. శివుడెక్కడ ఉంటే, అక్కడ నంది ఉంటుంది. 

శివుని యొక్క ఆనందస్వరూపమే నంది. శివానందమూర్తియే నంది. 

ఆ నంది ఉపాసించిన విద్య నందివిద్య. నంది ఉపాసించిన పంచదశీమంత్ర స్వరూపమే శ్రీమాత. 

కనుక ఈ నామంలో అమ్మను నందివిద్యా అంటున్నాం. 

ఆనందరూపంలో శివుడిని, శక్తిని ధ్యానించాలంటే నంది సహాయపడతాడు. 

నందీశ్వరుని ఉపాస్యదేవత, ఆ నందివిద్య కు వందనం. 

ఓం శ్రీ నందివిద్యాయై నమః 


734. నటేశ్వరీ

చిదంబరంలో కొలువై వున్న శివుడికి నటరాజు అని పేరు. ఆ నటరాజుకి  ఈశ్వరి, కనుక ఈ 

నామంలో అమ్మను నటేశ్వరీ అంటున్నాం. ఆ నటరాజు నృత్యం చేసేటప్పుడు, 

అతనితో పాటు నృత్యము చేయునది అని అర్ధం. 

శివపార్వతులిద్దరూ జంటగా నృత్యం చేసేటప్పుడు అమ్మ తన ఒక పాదాన్ని మోకాలి 

వరకూ ఎత్తిందట. అప్పుడు ఆ పాదాన్ని పద్మంగానూ, పిక్క వరకూ వున్న కాలిని తామరతూడు

తోనూ, కాలిగోళ్ళ వెలుగును నాగకేసర పుష్పాల పుప్పొడితోనూ, మెరుస్తున్న పారాణిని

చిగురాకులతోనూ, కాలిఅందెలను తుమ్మెదలు గానూ పోల్చారు భాస్కరరాయలు. 

నటరాజు లోని నాట్యశక్తే నటేశ్వరి. నటరాజుతో కలిసి నృత్యం చేసేదీ, 

నటరాజులో శక్తిరూపంలో వుండి నృత్యం చేయించేదీ నటేశ్వరి.

నటరాజు నృత్యాన్ని అనుకరిస్తూ, నటరాజుతో కలిసి నాట్యం చేస్తున్న, ఆ నటేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ నటేశ్వర్యై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

     

10, డిసెంబర్ 2021, శుక్రవారం

140. స్వతంత్రా, సర్వతంత్రేశీ, దక్షిణామూర్తిరూపిణీ సనకాదిసమారాధ్యా, శివజ్ఞానప్రదాయినీ

  

స్వతంత్రా, సర్వతంత్రేశీ, దక్షిణామూర్తి రూపిణీ 
సనకాదిసమారాధ్యా, శివజ్ఞానప్రదాయినీ ॥ 140 ॥

723. స్వతంత్రా

స్వతంత్రా అంటే పరాధీనత లేనిది. స్వ, తంత్రా అంటే తనంతట తానే సమస్త కార్యములూ 

నిర్వహించునది.  నిత్యా తంత్రములో స్వతంత్రమనే తంత్ర స్వరూపురాలు. 

శ్రీవిద్యాతంత్రములో స్వతంత్ర తంత్రమనే తంత్ర స్వరూపురాలు. 

చతుర్విధ పురుషార్ధములను ఇచ్చే శ్రీవిద్యాతంత్రమే స్వతంత్రతంత్రం. 

స్వ అంటే తనదైన, పరమశివుణ్ణి తన అధీనములో ఉంచుకొనునది. 

పరమశివునితో అభేదము కనుక, తాను పరమశివుని అధీనములో ఉండునది 

అనే అర్ధాన్ని కూడా ఈ నామానికి చెప్పుకోవచ్చును. 

కాళికాపురాణంలో,  కామరూప క్షేత్ర మాహాత్మ్యాన్ని గురించి చెప్పేటప్పుడు, "పరమశివుడు 

పార్వతికి అధీనుడై, నర్మ సంభాషణలతో, పార్వతీ గృహమధ్యం లోనే ఎల్లప్పుడూ ఉంటున్నాడు." 

అని వుంది. అదే పురాణంలో, "ఈశాన్యదిక్కున వున్న హాటకశైలము, అంటే కైలాసములో 

పరమశివుడు ఎల్లప్పుడూ తన ఆశ్రమములో ఉంటాడు. అక్కడ పార్వతీదేవి పరమశివుని 

అధీనంలో ఉంటుంది" అని కూడా వుంది.    

దీనిని బట్టీ పార్వతీ పరమేశ్వరులు ఒకరికొకరు పరస్పరాధీనులని తెలుస్తోంది. 

లోకాలను తన స్వతంత్ర తంత్రముతో పాలిస్తున్న, ఆ స్వతంత్ర కు వందనం. 

ఓం శ్రీ  స్వతంత్రాయై నమః  


724. సర్వతంత్రేశీ

మన సంప్రదాయంలో  అరవైనాలుగు తంత్రాలు వున్నాయి. ఆ తంత్రాలన్నింటినీ సృష్టించిన 

ఈశ్వరి కనుక, ఈ నామంలో అమ్మను సర్వతంత్రేశీ అంటున్నాం. 

ఆ తంత్రాలన్నింటితో ఆరాధింపబడుతున్నది కనుక సర్వ తంత్రేశీ నామం వచ్చింది.  

మంత్రం, తంత్రం, యంత్రం అంటే ఏమిటో ముందు నామాల్లో చెప్పుకున్నాం. 

తంత్రములో మంత్రముతో పాటు క్రియ కూడా ఉంటుంది. కౌలాచారం, వామాచారంలో 

తంత్రాలు వాడతారు. లౌకిక సుఖములు, కామ్యముల కోసం ఉపాసనలో తంత్రాలు 

వాడటం సంప్రదాయంలో వున్నది.   

అన్ని తంత్రాలకూ సృష్టికర్త అయిన, ఆ సర్వతంత్రేశి కి వందనం.  

ఓం శ్రీ సర్వతంత్రేశ్యై నమః  


725. దక్షిణామూర్తిరూపిణీ 

దక్షిణామూర్తి స్వరూపురాలు అని ఈ నామానికి అర్ధం. 

సనక సనందనాది ఋషులు బ్రహ్మము గూర్చి తెలుసుకోవాలని శివునికై తపస్సు చేశారు. 

వారి సంశయములు తీర్చడానికి శివుడు దక్షిణాభిముఖుడై వచ్చాడు. 

ఆ దక్షిణామూర్తి  దర్శన మాత్రం చేత,  శిష్యులందరికీ సంశయములు ఛిన్నమై పోయి, 

జ్ఞానం కలిగింది. ఆ విధంగా దక్షిణాభిముఖుడై, శిష్యులకు మౌనంగానే సంశయాలను తీర్చి, 

జ్ఞానోపదేశం చేయడం వలన, శివుడికి దక్షిణామూర్తి అనే పేరు వచ్చింది.  

దక్షిణామూర్తిగా శివుడు మౌనవ్యాఖ్యల తోనే శిష్యుల సంశయాలను దూరం చేశాడు. 

ఆ మౌనమే దక్షిణామూర్తి తత్త్వము. ఆ తత్త్వమే దేవీ తత్త్వము కూడా. 

అందుకే అమ్మకు కూడా  అదే నామం వచ్చింది. సతీపతుల పేర్లు ఇద్దరివీ దక్షిణామూర్తి 

కనుక, నామ సామ్యం కూడా కుదిరింది.  

చిత్తూరు జిల్లాలోని సురుటుపల్లిలో కల పళ్లికొండేశ్వరస్వామి ఆలయంలో దక్షిణామూర్తి రూపంలో 

వున్న శివుని ఎడమ తొడపై కూర్చుని, దక్షిణామూర్తి రూపంలో వున్న పార్వతి దర్శనం ఇస్తుంది. 

మరెక్కడా కనబడని అపురూపమైన విగ్రహం. మంత్రతంత్రాలలో దక్షిణామూర్తి మంత్రం ప్రసిద్ధి. 

జ్ఞానదాయిని అయిన దక్షిణామూర్తి పత్ని, దక్షిణామూర్తి నామ రూపిణి అయిన,  

ఆ దక్షిణామూర్తిరూపిణి కి వందనం. 

ఓం శ్రీ దక్షిణామూర్తిరూపిణ్యై నమః  


726. సనకాదిసమారాధ్యా 

సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు నలుగురూ మహా సిద్ధులు, 

శ్రీవిద్యా ఉపాసకులు. వీరు నిరంతరమూ సహస్రారకమలము వద్ద అమ్మను సేవిస్తూ వుంటారు. 

బ్రహ్మ మానస పుత్రులు. ఎప్పుడూ బాలుర వలె వుంటారు. పుట్టుకతోనే జ్ఞానస్వరూపులు. 

శ్రీవిద్యా పరంపరలో సిద్దౌఘమునకు చెందినవారు. 

ఈ సనకాది ఋషుల చేత ఆరాధింపబడునది కనుక అమ్మకు ఈ నామం వచ్చింది. 

బ్రహ్మాండపురాణంలో, "ఓదేవీ, నీకు ఆది లేదు. కార్య కారణములు రెండూ నీవే. 

సనకాది యోగులందరూ నిన్నే ఎప్పుడూ ధ్యానిస్తూ వుంటారు." అని చెప్పారు. 

సనకాది సిద్ధులచే సమ్యక్ ఆరాధన పొందుతున్న, ఆ సనకాది సమారాధ్య కు వందనం. 

ఓం శ్రీ సనకాదిసమారాధ్యాయై నమః   


727. శివజ్ఞానప్రదాయినీ

 శివునకు జ్ఞానమును కలిగించునది, లేదా శివజ్ఞానమును ఇచ్చునది అని ఈ నామానికి అర్ధం. 

వాశిష్ఠ రామాయణములో "శివ విషయిక జ్ఞానమును అధికముగా ఇచ్చునది. ఏవిధముగా 

కదలిక వలన వాయువు ఉన్నట్టు, వేడి వలన అగ్ని ఉన్నట్టు తెలుస్తోందో, అదే విధంగా 

నిర్మల శాంత చైతన్యమూర్తి అయిన శివుడు, జ్ఞానం రూపంలో వున్న శక్తి వలన మాత్రమే 

తెలియబడుచున్నాడు. ఇతరముగా శివుడు తెలియబడడు" అని చెప్పబడింది. 

అంటే, శివుడనే జ్ఞానాన్ని కలిగించేది శక్తి. అమ్మ చేత అయ్య తెలియబడుచున్నాడు. 

లేదా శివుడికి శక్తి జ్ఞానము వుంది. అది ప్రకటితం చేస్తున్నాడు అని మరొక భావన. 

వరాహపురాణంలో, "ఎవరు రుద్రుని యదార్ధ స్వరూపాన్ని తెలుసుకుంటారో వారికి త్రిశక్తులైన 

పార్వతీ, లక్ష్మీ, సరస్వతీ కూడా అధీనులవుతారు" అని వున్నది. 

అంటే, శివుని పొందితే, త్రిశక్తులు కూడా వశమవుతాయి అని అర్ధం. 

తన భక్తులకు శివజ్ఞానాన్ని ప్రదానము చేసే, ఆ శివజ్ఞానప్రదాయిని కి వందనం. 

ఓం శ్రీ శివజ్ఞానప్రదాయిన్యై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650