
కాళరాత్ర్యాది శక్త్యౌఘవృతా, స్నిగ్ధౌదనప్రియా
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥
491. కాళరాత్ర్యాది శక్త్యౌఘవృతా
అనాహత చక్ర పద్మమునకు పన్నెండు దళములు కదా.
ఆ పన్నెండు దళములలో కాళరాత్రి మొదలుగా కల పన్నెండు శక్తులు ఉంటాయి.
ఆ శక్తులు మాతృకావర్ణమాలలో కల, క అక్షరము నుంచి, ఠ అక్షరము వరకూ వున్న హల్లులు.
ఆ పన్నెండు శక్తులే కాళరాత్రి, ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి, జ్ఞామిని, చంద్ర, ఛాయా,
జయా, ఝంకారి, జ్ఞనరూపా, టంకహస్తా, ఠంకారిణి.
ఈ పన్నెండు దేవతా శక్తులూ పన్నెండు దళములలో ఉంటూ, మధ్యలో పద్మకర్ణికలో
కూర్చుని వున్నఅనాహతాబ్జనిలయ చుట్టూ పరివృతమై ఉంటాయి.
కాళరాత్రి మొదలగు శక్తులతో ఆవృతమై వున్న, ఆ కాలరాత్ర్యాదిశక్త్యౌఘవృత కు వందనం.
ఓం శ్రీ కాలరాత్ర్యాది శక్త్యౌఘవృతాయై నమః
492. స్నిగ్ధౌదనప్రియా
స్నిగ్ధౌదనం అంటే, నెయ్యి అన్నం. ఘృతముతో కలిపిన అన్నమునే స్నిగ్ధౌదనం అంటారు.
ఘృతము అంటే ఆవునెయ్యి మాత్రమే. ఇతర పశువుల పాల నుండి సేకరించిన నెయ్యి కాదు.
ఆవునెయ్యితో కలిపిన అన్నమంటే ఈ అనాహతాబ్జనిలయకు ఎంతో ప్రీతి.
అందుకే అమ్మను ఈ నామంలో స్నిగ్ధౌదనప్రియా అంటున్నాం.
ఎన్నో వ్యాధులకు నేతి అన్నం ఔషధం. భోజనంలో మొదటి ముద్దగా నెయ్యితో కలిపిన
అన్నం తింటే, కంఠంలో ఒక పొర ఏర్పడి తరువాత ఏమి తిన్నా, తేలికగా గొంతు దిగుతుంది.
ఏమైనా తింటుంటే, గొంతు పట్టుకునే లక్షణం వున్నవాళ్ళు ఈ నామాన్ని జపిస్తే మంచిది.
ఆవునెయ్యితో కలిపిన అన్నమంటే మక్కువ కల, ఆ స్నిగ్ధౌదనప్రియ కు వందనం.
ఓం శ్రీ స్నిగ్ధౌదనప్రియాయై నమః
493. మహావీరేంద్ర వరదా
వీరేంద్రులంటే గొప్ప పండితులు. వాదనలో దీటు లేనివారు. ఏ పక్షమునైనా వాదించగల దిట్టలు.
మహావీరము అనే యాగం చేసి, మహావీర అనే పాత్రలో సోమరసం తాగినవారు అని కూడా అర్ధం.
సోమరసపానము బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. మహా వీరేంద్రులు సదా ఆనందంలో ఉంటారు.
శివ సూత్రములలో, 'జాగ్రత్, స్వప్న, సుషుప్తు లందు కూడా తురీయావస్థను పొందువారు
వీరేంద్రులు' అని వున్నది. ఇంద్రియములను నిగ్రహించు శక్తి కలవారు వీరేంద్రులు.
దేవీ భాగవతంలో 'ఇంద్రుడు, ప్రహ్లాదుడు చాలాకాలం యుద్ధం చేసి, ఆ యుద్ధం ఎంతకూ తెగక,
అమ్మను ప్రార్థిస్తే, ఆ తల్లి ఈ ఇద్దరు వీరులకూ, (ఇంద్ర, వరద అంటే ప్రహ్లాదుడు) వరములు
ఇచ్చింది' అని వున్నది. అందువలన, మహా వీర ఇంద్ర వరదా, మహావీరేంద్రవరదా, అనే నామం
వచ్చింది. వరముల నిచ్చునది కనుక వరదా.
మహావీరేంద్రులకు వరములు ఇచ్చునది మహావీరేంద్రవరదా.
అందుకే ఈ అనాహతాబ్జనిలయను ఈ నామంలో మహావీరేంద్రవరదా అంటున్నాం.
మహావీరులైన పండితులకు వరముల నిచ్చే, ఆ మహావీరేంద్ర వరద కు వందనం.
ఓం శ్రీ మహావీరేంద్రవరదాయై నమః
494. రాకిణ్యంబా స్వరూపిణీ
రాకిణ్యంబా స్వరూపిణీ అంటే రాకినీ అను పేరు కల అంబ అని అర్ధం.
అనాహతాబ్జనిలయకే రాకినీ అని పేరు. పై నామములలో ఈ రాకిణ్యంబా స్వరూపిణి
విశేషణములను గురించి చెప్పుకున్నాం. ఈ రాకిణ్యంబ అనాహతపద్మంలో ఉంటుంది.
శ్యామల వర్ణంలో ఉంటుంది. రెండు తలలు కలిగి, వరాహ సమాన కోరలు కలిగి ఉంటుంది.
చేతిలో అక్షమాలను ధరించి, రక్తధాతువులో ఉంటూ రక్తముపై ఆసక్తి కలిగి ఉంటుంది.
కాళరాత్రి మొదలు ఠంకారిణి వరకూ కల పన్నెండు హల్లు శబ్ద దేవతల సమూహంచే
సంవృతమై ఉంటుంది. ఆవునెయ్యితో కలిపిన అన్నమంటే ప్రీతి.
మహావీరేంద్రులకు కూడా వరములు ఇచ్చే దేవత ఈ రాకిణ్యంబా స్వరూపిణి.
విశుద్ధి చక్రాధిష్ఠాన దేవత డాకినీ అయితే, అనాహత చక్రాధిష్ఠాన దేవత రాకినీ.
ఈ తొమ్మిది విశేషణముల విశేష్య స్వరూపురాలు, ఆ రాకిణ్యంబా స్వరూపిణి కి వందనం.
ఓం శ్రీ రాకిణ్యంబాస్వరూపిణ్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650