31, ఆగస్టు 2021, మంగళవారం

39. ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ

 

ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ 
సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ॥ 39 ॥

103. ఆజ్ఞా చక్రాంతరాళస్థా

కనుబొమల మధ్య గల భాగాన్ని భృకుటి అంటాం. అక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది. 

ఆ ఆజ్ఞాచక్రపద్మ మధ్యంలో పరమేశ్వరి, ప్రసన్నంగా ఆశీనురాలయి ఉంటుంది. 

ఈ పద్మానికి రెండే రేకలు. అవి ఇడా, పింగళా నాడులకు సంకేతం. 

ఆ రెండింటి మధ్య నుంచి సుషుమ్నానాడి, పైకి సహస్రారం వైపుకు కదులుతుంది. 

ఈ రెండు రేకలూ శివ, శక్తి స్థానాలకు కూడా సంకేతం.  

ఈ ఆజ్ఞాచక్రం వద్ద జపం చేస్తే, ఆజ్ఞాపించ గల గురువు దర్శనం అవుతుంది.

ఋషుల దర్శనం అయ్యేదీ ఇక్కడే. అక్కడే జ్ఞానం సిద్ధిస్తుంది. 

ఇక్కడి నుంచీ అయ్యే దర్శనాలేవీ భ్రమలు, భ్రాంతులు కావు.  

అప్పటికి జీవుడు, మనోనిగ్రహం పొంది, కోరికలు దగ్ధమయి, బాహ్య ప్రేరణల పట్ల 

ఎక్కువగా చలించని స్వభావాన్ని కలిగి ఉంటాడు.  

ఆ ఆజ్ఞా చక్రంలో ఉంటూ మనలను ఉద్ధరిస్తున్న, ఆ ఆజ్ఞాచక్రాంతరాళస్థ కు వందనం. 

ఓం శ్రీ ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః


104. రుద్రగ్రంథి విభేదినీ 

మూలాధార, స్వాధిష్టాన చక్రముల వద్ద గల బ్రహ్మ గ్రంధి, పంచభూతములలోని 

పృధ్వీ తత్వము, జల తత్వములకు సంబంధించినది.  

రెండవ గ్రంధి అయిన విష్ణు గ్రంధి, మణిపూర చక్రము పై భాగములో వున్నది. 

ఈ గ్రంధికి పైనా, కిందా వహ్ని, సూర్య చక్రములు ఉన్నాయి. ఇవి తేజోమయ చక్రాలు.

ఇవి పంచభూతముల లోని అగ్నితేజ తత్వాలు.  

అనాహత చక్రము హృదయస్థానములో వుంది. అనాహత పద్మమునకు పన్నెండు రేకలు. 

ఈ హృదయములో వాయువు, దహరాకాశము వున్నది. 
 
ఇక మూడవ గ్రంధి, అనాహత చక్రము దాటి వున్న రుద్రగ్రంధి. 

విశుద్ధి చక్రము కంఠమందు ఉంటుంది. ఈ చక్ర పద్మానికి పదహారు రేకలు. 

కంఠమందు ఉండేది ఆకాశము. ఆపైన భృకుటి వద్ద ఉండేది ఆజ్ఞాచక్రము. 

పంచభూతములలో వాయురాకాశాల స్థానములు  ఇవి. ఈ శరీరం పాంచభౌతికమైనది 

అని అంటూ ఉంటాం కదా, ఆ పంచభూతాలూ ఈ విధంగా మన శరీరంలో వున్నాయి. 

ఈ హృదయ పద్మము దాటి జపం జరిగినపుడు, రుద్రగ్రంధి ఉత్తేజితమయి, చిదానందాన్ని 

కలిగిస్తుంది. జీవుడిలో వున్న వాయుతత్వం, రుద్రగ్రంధి భేదన ద్వారా బయటకు వెళ్లి 

బహిరాకాశంలో కలిసిపోతుంది. అప్పుడు లోపలా, బైటా ఒకటే ఆకాశతత్వం. 
 
అక్కడకు చేరిన జీవుడికి, మూడవ కన్ను తెరుచుకుంటుంది.  

ఇక్కడ మనసు నిలిపి, జపం చేస్తే, అమ్మ కరుణించి, రుద్రగ్రంధి భేదనము చేస్తుంది. 

ఆ విధంగా రుద్రగ్రంధి విభేదనం చేయించే, ఆ రుద్రగ్రంథివిభేదిని కి వందనం. 

ఓం శ్రీ రుద్రగ్రంథివిభేదిన్యై నమః 


105. సహస్రారాంబుజా రూఢా

ఆజ్ఞ పైన సహస్రార కమలమని చెప్పుకున్నాం కదా. ఈ పద్మానికి వెయ్యి రేకలు.  

ఇదిగో, ఇక్కడ, ఆ లలితా పరమేశ్వరి సహస్రార కమలంపై కూర్చుని ఉన్నది. 

తల మధ్యలో వున్న మాడు వద్ద వున్న ప్రాంతం ఈ సహస్రార స్థానం. 

మాడు పుట్టినప్పుడు తెరచుకుని ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ మాయ కమ్మి మూసుకుపోతుంది. 

దీనికి పైన  బ్రహ్మ రంధ్రమున్నది. జపతపాలతో ఆ బ్రహ్మ రంధ్రాన్ని తెరచుకుని జీవుడు 

స్వేచ్చని పొందాలి. అప్పుడే జీవుడికి తానే దేవుడు అన్న భావన స్థిరపడుతుంది. 

ఆ స్థితిని పొందితే జీవుడు ఆ సహస్రార పద్మంలో, వెలిగిపోతున్న లలితా పరమేశ్వరిని దర్శించి, 

బ్రహ్మానంద భరితుడవుతాడు. ఒక్క విషయం శ్రద్ధాభక్తులతో గమనించండి.  

ఈ మొత్తం సాధనా క్రమంలో, ప్రతి దశలోనూ అమ్మ జీవుడితోనే వున్నది. 

తల్లి పిల్లలను ఎంత భద్రంగా, పక్కనే వుండి నడిపిస్తుందో, ఈ లలితమ్మ కూడా 

తన రక్షణ కోరి వచ్చిన అందరినీ, కాపు కాచుకుంటూ తన మార్గంలో నడిపిస్తున్నది. 

సహస్రార కమలంలో ఉంటూ మనలను ఎంతో అవ్యాజానురాగంతో, ప్రేమతో, 

కరుణిస్తున్న, ఆ సహస్రారాంబుజారూఢ కు వందనం. 

ఓం శ్రీ సహస్రారాంబుజారూఢాయై నమః 


106. సుధాసారాభి వర్షిణీ

ఆ సహస్రార కమల స్థాయికి చేరుకుంటే, సుషుమ్నానాడి ద్వారా పైకి వెళ్లిన 

జీవుడికి దొరికేది అమృతవర్షము. అమ్మ అక్కడ చంద్రవంక రూపములో సుధలను వర్షిస్తుంది. 

ఆ సుధాధారలను స్రవిస్తున్న తత్వమే కామధేను తత్వము. 

గ్రంధి భేదనములు జరిగి, ఇంద్రియ నిగ్రహంతో, అసూయ లేని అనసూయ తత్వంతో, 

సమస్త సృష్టి పట్లా ఏకత్వ భావము పొందిన, జీవుడికి ఇక్కడ కామధేనుతత్వం బోధపడుతుంది. 

ఈ జ్ఞానం పొందిన వారికి, గరికపోచ బ్రహ్మాస్త్రమెలా అవుతుందో, 

అదే విధంగా సామాన్య ధేనువు, కామధేనువు అవుతుందని అవగాహన కలుగుతుంది. 

అటువంటి కామధేనువు జ్ఞాన సుధాధారలను తన పొదుగు నుంచి వర్షిస్తుంటే, 

డెబ్బై రెండు వేల నాడులూ ఆ అమృత ధారలలో తడిసి జీవుడు ఆనందభరితుడవుతాడు.  

సరియైన మార్గంలో సాధన చేస్తే, ప్రతి గ్రంధీ ఉపాసకుల పాలిట కామధేనువు అవుతుంది. 

ఆ స్థితికి చేరుకోవాలంటే అమ్మ చరణాలను పూజించాలి. అప్పుడు ఆ చరణకమలాలే 

ఉపాసకులను సహస్రార కమలానికి చేరుస్తాయి. జీవుని శరీరమంతా పద్మమయం. 

ప్రతి పద్మమూ, దాని ప్రతి దళమూ ఉపాసకులకు దివ్యానుభూతులను అందిస్తాయి.

ఆ అమృత అనుభూతులను, సహస్రారకమలం చేరుకున్న ఉపాసకుల కొరకు, 

చంద్రమండలం నుంచి, సుధాధారల రూపంలో వర్షిస్తున్న, ఆ సుధాసారాభి వర్షిణి కి వందనం. 

ఓం శ్రీ సుధాసారాభివర్షిణ్యై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


30, ఆగస్టు 2021, సోమవారం

38. మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ మణిపూరాంతరుదితా, విష్ణుగ్రంథి విభేదినీ

 

మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ 
మణిపూరాంతరుదితా, విష్ణుగ్రంథి విభేదినీ ॥ 38 ॥

99. మూలాధారైక నిలయా

మూలాధార చక్రం వద్ద కుండలినీ శక్తి ఒక సర్పము వలె మూడున్నర చుట్లు 

చుట్టుకుని, శిరసుని కప్పుకుని, నిద్రాణ స్థితిలో ఉంటుంది. శ్రీదేవి స్థానం ఆ మూలాధారచక్రమే. 

ఆ మూలమే మొదలు కనుక అది ఆధారం. ఆధారం అది ఒక్కటే కనుక అది ఏక ఆధారం. 

అక్కడ నివాసం వున్న ఆ శ్రీదేవి, మూలాధారైకనిలయ. 

మూలాధార చక్రపద్మానికి నాలుగు రేకలు. ఆ పద్మ మధ్య బిందువుకే కులకుండమని పేరు. 

ఆ కులకుండము లోనే కుండలినీ శక్తి  ముడుచుకుని నిద్రాణ స్థితిలో ఉంటుంది. 

అదే అమ్మ నిలయము. అక్కడ వున్న కుండలినీ శక్తి సుషుమ్న ద్వారా, సహస్రారం వద్ద వున్న 

శివుడ్ని చేరటానికి ఊర్ధ్వగమనం మొదలెడుతుంది. 

అమ్మే స్వయంగా ఉపాసకులను మూలాధారం నుంచి సహస్రారం వరకు నడిపించి, అక్కడ 

శివునితో కలుపుతుంది. నిరంతరమూ ఆ సాధనలో ఉండటమే దానికి త్రోవ.   

నిద్రాణమై వున్న కుండలినిని ఉపాసనతో లేపితే, ఆ శక్తే మనల్ని ముందుకు నడిపిస్తుంది. 

మూలాధారచక్రం వద్ద కుండలినీ రూపంలో వున్న ఆ మూలాధారైకనిలయ కు వందనం. 

ఓం శ్రీ మూలాధారైకనిలయాయై నమః 


100. బ్రహ్మగ్రంథి విభేదినీ 

మన శరీరంలో ఆరు చక్రాలు, మూడు గ్రంధులువున్నాయి. గ్రంధి అంటే ముడి. 

సంసారలంపటంలో పడి, మనకు మనమే వేసుకున్న చిక్కుముడులుగా వీటిని భావించండి. 

మొదటి గ్రంధి బ్రహ్మగ్రంధి. ఆ గ్రంథిలో బ్రహ్మ ఉంటాడు కనుక అది బ్రహ్మ గ్రంధి. 

ఈ ముడి మూలాధారచక్రము, స్వాధిష్ఠానచక్రములకు వేసిన ముడి.

మూలాధారం పైన ఒకటి, స్వాధిష్టానము పైన ఒకటి, మొత్తము రెండు గ్రంధులున్నాయి. 

ఆ రెండు గ్రంధులనూ కలిపి బ్రహ్మ గ్రంధి అంటారు. స్వాధిష్టానపద్మమునకు ఆరు రేకలు. 

జీవుడు ఉపాసనతో, గురుసహాయముతో, బుద్ధితో ఈ ముడిని విప్పుకుని పైకి సాగాలి. 

ఈ గ్రంధి భేదనము జరగకపోతే, జీవుడు మరింతగా విషయలాలసలో పడిపోతాడు. 

ఆ గ్రంధి భేదన శక్తి అమ్మయే. ఆ బ్రహ్మ గ్రంధి భేదనం జరిగితే కానీ, విషయవాసనలు వీడవు. 

ఉపాసకులకు ముడి వేసేదీ అమ్మమాయే, తిరిగి ఆ ముడిని విప్పేదీ అమ్మమాయే.  

ఈ మాయా సంసార జంజాటము దాటించి, బ్రహ్మగ్రంధిని భేదించే జ్ఞానాన్నిచ్చే, 

ఆ బ్రహ్మగ్రంథివిభేదిని కి వందనం. 

ఓం శ్రీ బ్రహ్మగ్రంథివిభేదిన్యై నమః 


ఇది శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి వ్రాసిన శ్రీలలితావిజయం లోని 

శ్రీలలితారహస్యసహస్రనామ స్తోత్రము నందు కల 

మొదటి వంద నామాల వివరణ సంపూర్ణం 


101. మణిపూరాంతరుదితా

స్వాధిష్టాన చక్రానికి పైనున్నది నాభి దగ్గర వున్నమణిపూర చక్రం. ఈ పద్మానికి పది రేకలు. 

ప్రతి పద్మానికీ ఉన్న ప్రతిరేకా, సాధనా మార్గంలో జీవుడికి జ్ఞాన సముపార్జనలో 

రకరకాలైన అనుభవాలను ఇస్తుంది. బ్రహ్మ గ్రంధి భేదనము అయి, దాన్ని దాటగానే, 

అక్కడ వున్న మణిపూర చక్ర మధ్యములో అమ్మ ప్రకటితమవుతుంది.  

ఆ మణిపూర చక్ర పద్మ మధ్యంలో వున్న తల్లే మణిపూరాంతరుదిత.  

అక్కడ శ్రీదేవిని మణులతో పూజిస్తే ఆమె తృప్తి చెందుతుంది. 

ఒక పది దళాలతో వున్న పద్మాన్ని ఊహించుకోండి. ఆ పద్మం మధ్యలో, 

చక్కగా రత్నాభరణాలతో, మణిమకుటాలతో కూర్చుని వున్న శ్రీదేవిని దర్శించండి. 

ఆ అమ్మకు మీరు రత్న మాణిక్యాలతో పూజచేస్తున్నట్టు భావించండి. 

ఆ మణిపూరాంతరుదిత అప్పుడు సంతృప్తయై, 

మిమ్మల్ని సాధనా మార్గంలో ముందుకు తీసుకుని వెళ్తుంది. 

మణిపూర చక్రపద్మ మధ్యంలో ప్రకటితమైన ఆ మణిపూరాంతరుదిత కు వందనం. 

ఓం శ్రీ మణిపూరాంతరుదితాయై నమః 



102. విష్ణుగ్రంథి విభేదినీ

మణిపూర చక్రం పైన విష్ణుగ్రంధి వున్నది. ఈ ముడి వద్ద విష్ణువు ఉంటాడు. 

ప్రతి జీవిలోనూ సురాసురులిద్దరూ వుంటారు. 

ఇద్దరూ ఒక తండ్రి బిడ్డలే, అయినా ఎప్పుడూ పరస్పరం కలహించుకుంటూనే వుంటారు. 

ఈ విరోధం హద్దులు దాటినప్పుడు, స్వయంగా విష్ణువే ప్రకటితమయి 

ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉంటాడు. ఏదీ ఎక్కువగా చేయకుండా,

రాగము - ద్వేషము కానీ, మిత్రత్వము - శత్రుత్వము కానీ, ఆశ - దురాశ కానీ 

శృతి మించకుండా చూసే శక్తి విష్ణుశక్తి. 

మణిపూర చక్రమునకు పైన వున్న గ్రంధి విష్ణు గ్రంధి. 

ఆ ముడి వద్ద విష్ణువు వున్నాడు కనుక అది విష్ణు గ్రంధి. 

ఈ గ్రంధి వద్ద సాధకుడు తానే ఆ విష్ణువు అన్న భావనలో ఉండాలి. 

అన్నిటి పట్లా సమతాభావం ఉండాలి. దాన్నే సోహం అని మనం చెప్పుకుంటున్నాం. 

ఆ పైన వున్న చక్రం అనాహతం. ఆ పద్మానికి పన్నెండు రేకలు. 

ఇది హృదయ స్థానమందు వున్నది. హృదయమంతా విష్ణువే కొలువై ఉన్నట్టు భావించాలి. 

ఆ విష్ణువే నేను అన్న భావంలో స్థిరపడితే, ఈ రెండు చక్రాలకూ వున్న ముడి, 

ఆ విష్ణు గ్రంధి భేదనం జరుగుతుంది. ఆ తరువాత 

విష్ణుమాయ విడిపోయి, సాధన పైకి సాగుతుంది. 

విష్ణుగ్రంధి విభేదనం చేసి, విష్ణుమాయను తొలగించిన, ఆ విష్ణుగ్రంథివిభేదిని కి వందనం. 

ఓం శ్రీ విష్ణుగ్రంథివిభేదిన్యై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


29, ఆగస్టు 2021, ఆదివారం

37. కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా

 

కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ 
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ॥ 37 ॥

92. కుళాంగనా

ఆ శ్రీదేవిని కులాంగనా అని కీర్తిస్తున్నాము. అమ్మవారే స్వయముగా  శ్రీవిద్య.  

శ్రీ విద్య గూఢమైనది, గుప్తమైనది, అందరికీ అందదు అని చెప్పటానికి ఈ నామమును వాడారు.  

వేశ్య వస్తువుని, విషయాన్ని, వివరాన్ని అన్నీ ప్రగల్భముగా, బాహాటముగా ప్రకటిస్తుంది. 

అదే కులస్త్రీ ఆ విశేషాలేవీ బహిరంగపరచదు. గుప్తంగా, గుట్టుగా ఉంచుతుంది. 

అమ్మే శ్రీవిద్య కదా, అమ్మను కులాంగనా అని సంబోధించటంలో శ్రీవిద్య గూఢమైనది, 

దానిని అమ్మ ఆదేశము లేక బాహాటంగా ప్రకటించరాదు అని అర్ధం. 

పరశురాముడు తొలుతగా, ఇతర విద్యలు వేశ్యలు, అవి బహిరంగంగా ప్రకటించబడతాయి, 

కానీ శ్రీవిద్య కులస్త్రీ కనుక, అది గుప్తంగా ఉంటుంది, ప్రకటించబడదు, అని పోలిక చెప్పాడు. 

అంతరంగములో గుప్తముగా పూజించవలసిన వస్తువును, బహిరంగ వేదికలపై ప్రదర్శనకు 

వుంచేవారిని ఇక్కడ వేశ్యలతో పోలుస్తున్నారు. ఈనాటికీ గుప్తంగా ఉంచవలసిన విషయములను 

బహిర్గతము చేసేవారు లోకంలో నగుబాట్ల పాలవుతూనే వున్నారు. ఇది రహస్యము.

శ్రీవిద్య అను శుద్ధవిద్యా రూపములో గుప్తముగా కులస్త్రీ వలె వున్న, ఆ కుళాంగ కు వందనం. 

ఓం శ్రీ కుళాంగనాయై నమః 

93. కుళాంతఃస్థా

కులములోనే ఉండునది అని ఈ నామార్ధం. 

మూలాధారం నుండి సహస్రారము వరకూ వుండే సుషుమ్న నాడికి కూడా కులమని పేరు. 

అమ్మ కులములోనే స్థితము, అంటే వున్నది అని చెప్తున్నారు.  

అమ్మని ఎవరు ఏ మార్గంలో పూజిస్తే, ఆ కులంలోనే వారికి దర్శనం ఇస్తుంది. 

దేవిపూజ యందు ప్రీతి గలవారు ఎక్కడ పూజించిననూ, అమ్మ అక్కడ స్థిత, అంటే వున్నది.  

అమ్మ కులములోనే మెరుపుతీగ వలే, స్ఫటిక కాంతులీనుతూ ఎంతో ప్రసన్నంగా వున్నది. 

అంటే, శ్రీవిద్య తనలో తానే రమిస్తూ వున్నది. 

శ్రీమాత ఉండటం వల్లే కులానికి అంత సుసంపన్నత. 

తన కులములో, అంటే తన రక్షణలో వున్న అందరికీ దారి చూపే, ఆ కులాంతఃస్థ కు వందనం. 

ఓం శ్రీ కులాంతఃస్థాయై నమః 

  

94. కౌళినీ

కులీన, సత్కుల సంజాత అని ఈ నామానికి అర్ధం. 

ఈ కౌళిని ప్రతి చోటా, ప్రతి దేశములోనూ, ప్రతి వంశములోనూ, ప్రతి గేహములోనూ, 

ప్రతి దేహములోనూ, పూజింపతగినది. 

కులములో అంటే, సహస్రార పద్మములో వున్న అమ్మను గురించి కులపుస్తకాలలో 

చెప్పబడింది. శివ, శక్తుల సంయోగ రూపమే ఈ కౌలినీ. 

శివ, శివా ఇరువురి గురించి, వారి  ఏకత్వ స్వరూపం గురించీ తెలిపేదే ఈ నామము. 

సరియైన పద్ధతిలో శివ, శివా ఆరాధన చేస్తే, ఆ సత్కుల సంజాత, మనలను కరుణిస్తుంది. 

శివాశివ స్వరూపమైన, ఆ కౌళిని కి వందనం. 

ఓం శ్రీ కౌళిన్యై నమః 


95. కుళయోగినీ

హృదయాకాశములో శ్రీచక్రమును భావించి, ఉపాసన చేయటమే కులయోగము. 

హృదయము కంటే పవిత్రమైనది లేదు. 

మనం ఎక్కడికి వెళ్లినా, మన హృదయం మనతోనే ఉంటుంది. 

మన దేవతార్చన మనతోనే, మనలోనే ఉంటుంది. ఎప్పుడూ మనలను వీడదు. 

ఎప్పుడూ వీడనిది నీడ అంటారు. కానీ అటువంటి నీడ కూడా చీకటిలో మనలను వీడిపోతుంది. 

చీకటి అజ్ఞానమునకు సంకేతం. అమ్మ మనతో జ్ఞానములోనూ, అజ్ఞానములోనూ వెన్నంటే 

ఉంటుంది. అందుకే, వెలుగూ, చీకటీ రెండూ శ్రీ విద్యే. 

ఎల్లప్పుడూ మన కులము లోనే ఉండేది కనుకే, అమ్మను కులయోగినీ అన్నారు. 

మన హృదయాకాశము లోనే దేదీప్యమానంగా వెలిగిపోతున్న, ఆ కుళయోగిని కి వందనం. 

ఓం శ్రీ కుళయోగిన్యై నమః 


96. అకుళా 

అకులా అంటే ఏ కులమూ లేనిది. ఇప్పటిదాకా కులాంతస్థా, కౌలినీ, కులయోగినీ అని 

ఆ జగజ్జనని కులమునకు చెందినది అని చెప్పుకున్నాం. 

ఇప్పుడు ఆ దేవినే అకులా అంటున్నాం. 

సుషుమ్నా నాడికి కిందా, పైనా రెండు సహస్రారకమలాలు వున్నాయి. 

వాటినే కుల, అకుల అన్నారు. కులమూ ఆమే, అకులమూ ఆమే.  

సహస్రారకమలము వద్ద అమ్మను శ్రద్ధగా ధ్యానించేవారికి ఆ అనుభూతి తెలుస్తుంది. 

అకుల అంటే అన్ని కులాలకూ చెందుతూనే, ఏకులమునకూ చెందనిది అని భావం. 

కులము, అకులము రెండూ తానే అయిన, ఆ అకుళ కు వందనం. 

ఓం శ్రీ అకుళాయై నమః 


97. సమయాంతఃస్థా

సమయము అంటే కాలము, ఆచారము, సిద్ధాంతము, సంకేతము అని అర్ధాలున్నాయి. 

అన్తః అంటే స్వరూపము, నిశ్చయము, మనోహరము, అంతము అని అర్ధములున్నాయి. 

స్థా అంటే స్థితమైనది, వున్నది అని అర్ధం. ఆ శ్రీమాత కాలములో, ఆచారములో, సంకేతములో, 

సిద్ధాంతములలో నిశ్చయముగా, మనోహరముగా, స్వరూపముతో వున్నది అని ఈ నామ భావం. 

ఆ శ్రీమాత కాలస్వరూపిణి, ఆచారములో వున్నదీ ఆ తల్లే. 

సంకేతమూ, సిద్ధాంతమూ అన్నీ ఆ జగదాంబయే. 

సమయ స్వరూపుడయిన ఆ శివునితో సామ్యము కలిగివున్న ఆ జగజ్జనని సమయాంతస్థా. 

సమయము నందు మనోహరముగా దర్శనం ఇస్తున్న, ఆ సమయాంతస్థ కు వందనం. 

ఓం శ్రీ సమయాంతస్థాయై నమః 


98. సమయాచార తత్పరా 

సమయమూ ఆమే, ఆచారమూ ఆమే. సమయాచారమందు ఆసక్తి కల తల్లి అని భావం. 

సమయము, ఆచారము, సిద్ధాంతము పాటించేవారికి అమ్మ కల్పవల్లి. 

మూలాధారము నుంచి సహస్రారము వరకు కల అన్ని చక్రముల వద్దనూ దేవిని 

సమయాచారము, అంటే కర్తవ్యాచరణముతో పూజించాలి. 

సహస్రారము వద్ద శివా, శివ శక్తులు రెండిటినీ కలిపి సేవించి,  

ఉపాసకుడు పక్కకు తొలగి, అమ్మ కొరకై నిరీక్షించుటయే సమయాచార తత్పరత. 

దేవి ఆ సమయాచారము పట్ల  ఆసక్తి కలది. 

సమయాచారముతో సేవించే భక్తుల సేవల పట్ల ఆసక్తి కల, సమయాచారతత్పర కు వందనం. 

ఓం శ్రీ సమయాచారతత్పరాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


28, ఆగస్టు 2021, శనివారం

36. మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ

  

మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా 
కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ ॥ 36 ॥

88. మూలమంత్రాత్మికా
మూలమంత్రమే ఆత్మగా కలది అని ఈ నామ భావము. 
మంత్రశాస్త్రము సనాతనధర్మములో మాత్రమే వున్నది. మరెక్కడైనా మంత్రం వున్నప్పటికీ,  
దాని ఆధారము తిరిగి, సనాతనధర్మశాస్త్రమే. 
మననాత్ త్రాయతే ఇతి మన్త్రః. అంటే, మననము చేస్తూ ఉంటే రక్షించేది మంత్రము. 
మంత్రము అంటే గూఢశబ్దము అని కూడా అర్ధం. 
అందుకే మంత్రాలు గురు ముఖతః మాత్రమే ఉపదేశం పొందాలి. 
ఈనాడు సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందింది. మనకు మంత్రాలు ఎన్నో రకాల మాధ్యమాల 
ద్వారా, అందుబాటులోకి వచ్చేసాయి. అయినప్పటికీ అవి శబ్దములే కానీ మంత్రములు కావు. 
మంత్రమన్నది గురువు నుంచి ఉపదేశం పొందినప్పుడే ఫలిస్తుంది, సిద్ధిస్తుంది. 
ఈ నామంలో మూలమంత్రమంటే, పంచదశీ మంత్రమే. ఈ పంచదశీ మంత్రము లోని 
మూడు భాగములూ కలిస్తే ఏర్పడేదే అమ్మవారి అసలైన రూపమని ముందే చెప్పుకున్నాం. 
మూలమంత్రమే అమ్మవారి ఆత్మ, కనుక ఆ శ్రీదేవి మూలమంత్రాత్మిక. మూలమంత్రాన్ని 
శ్రద్ధతో, భక్తితో జపిస్తే, అమ్మ భక్తులను ఈ సంసారసాగరము నుంచి దాటిస్తుంది. 
లలితా పంచదశీ మంత్రమే తన ఆత్మ అయిన, ఆ మూలమంత్రాత్మిక కు వందనం. 
ఓం శ్రీ మూలమంత్రాత్మికాయై నమః 

89. మూలకూట త్రయ కళేబరా

మూలకూట త్రయముల గురించి కూడా ముందే చెప్పుకున్నాం. 

పంచదశి లోని వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తికూటములే ఈ కూట త్రయములు.  

అమ్మవారి స్థూల దేహముతో సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ దేహములను పోల్చినప్పుడు,

అమ్మవారి కళేబరము, అనగా శరీరము, ఆ మూలకూటత్రయ సమష్టి రూపమే.  

త్రిగుణాలు, త్రి అవస్థలు, త్రిమూర్తులు, త్రిమాతలు, త్రినాడులూ, త్రికూటాలూ, త్రినేత్రాలు, 

త్రిపుటి, ఈ సృష్టిలో సర్వమూ త్రయీమయమే.  

ఆవిధంగా మూలకూట త్రయమే శరీరముగా కల ఆ మూలకూటత్రయకళేబర కు వందనం. 

ఓం శ్రీ మూలకూటత్రయకళేబరాయై నమః 


90. కుళామృతైక రసికా

కులామృతమును ఆనందముగా సేవించుతున్న తల్లి అని ఈ నామానికి అర్ధం. 

కులము అంటే సజాతీయకు సంబంధించిన పదం. 

ఒకే దేవతను ఉపాసించేవారు, ఒకే మంత్రమును జపించేవారు, ఒకే యోగ మార్గములో 

వున్నవారు, ఒకే పద్ధతిలో సాధన చేసేవారూ, ఒకే స్థితిలో సాధన చేసేవారు 

మొదలైన వారంతా సజాతీయులు కనుక, వారు ఆయా కులములకు చెందినవారు. 

ఏ చక్రపద్మము వద్ద ఎవరు జపము చేస్తుంటే, వారు ఆ చక్ర కులమునకు చెందినవారు. 

ప్రతి కుల సాధనలోనూ అమ్మ వున్నది.  సిద్ధి పొందిన ప్రతి సాధకుడికీ ఆ కులధార నుంచి 

అమృతము సిద్ధిస్తుంది. ఆ అమృతము సేవించుట వలన కలిగే స్వార్ధరహిత, అమేయానందమే 

ఆ మంత్రసిద్ధి, ఆ యోగ సిద్ధి, ఆ జపసిద్ధి, బ్రహ్మానంద స్థితి. 

సాగరమధనం, దాని ఫలితముగా అమృతభాండము లభించడం కూడా దీనినే సూచిస్తుంది. 

మధించండి, అమృతం తప్పక దొరుకుతుంది. అందరికీ, అన్ని కులాలవారికీ దొరుకుతుంది. 

ఏ మార్గము(కులం)లో అమ్మని పూజించినా, ఆ కులములో మనకు కులామృతము లభిస్తుంది.  

అమ్మే సాధకులకు ఆ కులామృతమును ఇస్తుంది. బ్రహ్మానందాన్ని అందిస్తుంది. 

అడ్డంకులు వచ్చాయని మధ్యలో మానేస్తే, అమృతత్వస్థితిని అందుకోలేరు. 

కులామృతమును సేవిస్తూ తృప్తి చెందుతున్న ఆ కుళామృతైకరసిక కు వందనం. 

ఓం శ్రీ కుళామృతైకరసికాయై నమః 


లలితా రహస్య సహస్ర నామ స్తోత్రములో వున్న కుల, కుళ  పదాలు సమానార్ధకముగా 

వాడబడినాయి. కులము అన్నా, కుళము అన్నా ఒకటిగానే భావించండి. సంస్కృత వర్ణమాలలో 

ళ అనే అక్షరము లేదు. ల అనే అక్షరమే వున్నది. కనుక ల, ళ లు అబేధము.  

ప్రస్తుతము సమాజములో వున్న కులవ్యవస్థకూ, వర్ణవ్యవస్థకూ, లలితా రహస్య సహస్ర 

నామ స్తోత్రములో వున్న కులవ్యవస్థకూ, వర్ణవ్యవస్థకూ అసలు సామ్యమే లేదు. 

భరతఖండము బైట నుంచి వచ్చి పాలించిన వారు, బహుశా మన సనాతన ధర్మాన్ని సరిగ్గా 

అవగాహన చేసుకోలేక  పోవటం వల్లనో, అపార్థము చేసుకున్నందు వల్లనో, లేక మరి ఏ ఇతర 

స్వప్రయోజనాల కోసమో, ప్రస్తుతమున్న కులవ్యవస్థను ఈ విధముగా స్థిరీకరించి వుండవచ్చు. 


91. కుళసంకేత పాలినీ

కులము యొక్క రహస్యములను కాపాడు తల్లి అని ఈ నామార్ధం. 

ప్రతి కులమునకూ కొన్ని రహస్య మార్గాలుంటాయి. రహస్య మంత్రాలుంటాయి. 

అందుకే గురూపదేశము తప్పనిసరి అని శాస్త్రము చెప్పింది. మార్గభ్రష్టము కాకుండా గురువు 

కాపాడతాడు. కులము లోపల గూఢముగా వున్న సంకేతములను పాలించే తల్లి లలితాంబిక.

మంత్రము, యంత్రము, తంత్రము, ఉపాసన, సాధన, అనుభవము, వంటి విషయములు 

పరమ గోప్యములు, రహస్యములు, గూఢముగా వుంచవలసినవి. 

వీటన్నింటినీ కలిపి శాస్త్రములో కులపుస్తకమని అన్నారు. 

కులపుస్తకపు సంకేతాలను గుప్తంగానే ఉంచాలి. 

ఏవిధంగా అయితే, కుల స్త్రీ అన్ని విషయములను గుప్తంగా ఉంచుతుందో, ఆ విధంగా గుప్తంగా

ఉంచవలసిన విషయములు అవి. ఈ కుల సంకేతాలను అమ్మే స్వయముగా పరిపాలిస్తూ,

ఎప్పుడు, ఎవరికి ఎంత అందాలో, అంత అందిస్తూ ఉంటుంది. 

ఆ అమ్మ ఆదేశము లేనిది, ఏదీ ఎవరికీ తెలియబడదు. 

కులసంకేతాలను గుప్తంగా ఉంచి పాలిస్తున్న, ఆ కుళసంకేతపాలిని కి వందనం. 

ఓం శ్రీ కుళసంకేతపాలిన్యై నమః 



-----------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


27, ఆగస్టు 2021, శుక్రవారం

35. కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ

 

కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ 
శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ ॥ 35 ॥

86. కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ 

రెండవ కూటమైన కామరాజ కూట స్వరూపమును చెప్పే నామమిది.  వాగ్భవకూటము కంఠము 

వరకు ఉంటే, కామరాజ కూటము, కంఠము నుండి కటి వరకు గల స్థూల దేహ భాగముగా

వర్ణించబడింది. ఇదే అమ్మ యొక్క సూక్ష్మతర దేహము. ఈ కామరాజ కూటములో  మూడు 

చక్రాలుంటాయి. అవే విశుద్ధి, అనాహత, మణిపూర చక్ర పద్మాలు. పంచదశీ మంత్రములోని

మధ్యభాగములో వున్న ఆరు బీజాక్షరములను అమ్మవారి స్థూలదేహములో గల మధ్యభాగంగా 

భావించండి. ఆ ఆరు బీజాక్షరములే మధ్యకూటము, హ స క హ ల హ్రీమ్.   

కంఠము నుంచి మొల వరకు వున్న అమ్మవారి సూక్ష్మతర దేహాన్నే మధ్యకూటము అంటాం. 

ఈ భాగానికి కామదేవుడే అధిపతి. ఈ కూటము ప్రధానముగా కామమును నెరవేరుస్తుంది. 

అది ధర్మ కామమైతే దేవతా శక్తి, అధర్మ కామమైతే అసురీ శక్తి. 

అయిదు బీజాక్షరములతో ముఖము, ఆరు బీజాక్షరములతో కంఠము నుంచి కటి వరకు కల  

మధ్యభాగము, అమ్మ సూక్ష్మ, సూక్ష్మతర రూపాలు. 

కంఠము నుంచి కింది భాగమైన కటి పర్యంతమూ మధ్యకూట స్వరూపిణిగా 

దర్శనం ఇస్తున్న ఆ కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి కి వందనం. 

ఓం శ్రీ కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణ్యై నమః 


87. శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ

ఇప్పుడు అమ్మవారి సూక్ష్మతమ దేహమైన, శక్తికూటము గురించి చెప్పుకుందాం. 

కటి అధోభాగమంతా శక్తి కూటమే. కుండలినీ స్వరూపం. ఇక్కడే కుండలినీ శక్తి 

మూలాధారము వద్ద సర్పము వలె చుట్టలు చుట్టుకుని సుప్తస్థితిలో ఉంటుంది. 

ఈ మూడవ కూటములో రెండు చక్రాలున్నాయి. స్వాధిష్ఠాన, మూలాధార చక్రాలు. 

ఆ చక్ర పద్మాలలో అమ్మను దర్శించాలి. పంచదశీ మంత్రములోని మూడవ భాగమైన 

నాలుగు బీజాక్షరములు ఈ శక్తికూటమే. స క ల హ్రీమ్. 

కటి కింద భాగమంతా, సృజనాత్మక శక్తి వున్న, అమ్మవారి సూక్ష్మతమ దేహమైన శక్తి కూటము. 

ఈ నాలుగు బీజాక్షరములను అమ్మ స్థూలశరీరములో వున్న కటి కింది భాగంగా దర్శించండి. 

సామాన్య మానవులకు అర్ధం కావడం కోసం అమ్మకు స్థూల శరీరం కల్పించారు. 

లోపల వున్న అసలైన సూక్ష్మ దేహ స్వరూపం మొత్తం మూడు కూటములుగా, 

అయిదు, ఆరు, నాలుగు బీజాక్షరముల సమూహంగా గుర్తించండి. 

అదే లలితా పంచదశి. వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తి కూటము అను మూడు 

భాగములుగా అమ్మను గుర్తించి స్తుతించండి. 

కటి కింద భాగములో శక్తి కూటము కల ఆ శక్తి కూటైక తాపన్న కట్యధోభాగ ధారిణి కి వందనం. 

ఓం శ్రీ శక్తికూటైక తాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650