శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా ॥ 21 ॥
49. సర్వారుణా
ఆ పరాశక్తి అరుణారుణ అని చెప్పుకున్నాం.
అమ్మ అంతా అరుణమే, ఆమె శరీర చాయ ఎరుపు.
ధరించే ఆభరణాలు ఎర్రవి. కురువింద మణులు పొదగబడిన కిరీటము ఎరుపు.
పద్మరాగమణీ దర్పణాన్ని మించిన తరళమైన చెక్కిళ్ళు,
ఎర్రని రత్నహారాలు ధరించి మనలను ఆశీర్వదిస్తుంది.
మాణిక్యమకుటాల వంటి మోకాళ్ళు అందంగా అమిరాయి.
జపాకుసుమాలు, కౌసుంభము వంటి ఎర్రని పుష్పాలు ఇష్టంగా ధరించి ఆనందపడుతుంది.
ఎర్రని కాంతి వలయంతో ఆ నిజారుణ ప్రభాపూర మెరిసిపోతూ ఉంటుంది.
ఎర్రని రంగుతో భాసించే వస్త్రాలు ధరించి మనలను తరిపింపచేస్తుంది.
ఆరుద్ర పురుగుల ఎరుపులో వున్న తూణీరము వంటి పిక్కలు కలిగినది.
లలితమ్మ అంతా ఎర్రెర్రని ఎరుపే, ఆ సర్వారుణ కు వందనం.
ఓం శ్రీ సర్వారుణాయై నమః
50. అనవద్యాంగీ
ఈ నామమును అనవద్యాంగీ అని పలకాలి. నింద లేని అంగములు కలది అని అర్ధం.
ఆ శ్రీదేవి అంగములు అన్నీ చక్కనివి, నిండైనవి. ఆ అవయవ సౌష్టవము లోపమెన్నలేనిది.
ఏ అవయవము ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో అదే విధంగా ఉన్నది.
కను ముక్కు తీరు అంటామే అదీ. అమ్మకి ఏ చిన్న అవయవము లోనూ లోపము లేదు.
ఆ దేవి మహా లావణ్య శేవధి కదా, ఏ అంగము లోనూ లోపము వుండనే ఉండదు.
ఏ అవయవ అమరికకూ నింద లేదు, అంటే, వంక లేదు.
ఆపాదమస్తకమూ ఏ విధము గానూ వంక పెట్టలేని, లోపం చూపలేని, నింద చేయలేని
అంగములు కల, ఆ అనవద్యాంగి కి వందనం.
ఓం శ్రీ అనవద్యాంగ్యై నమః
51. సర్వాభరణ భూషితా
ఆ శ్రీ మహారాజ్ఞి సర్వాభరణ భూషిత. అంటే, ఏ అవయవమునకు ఏ ఆభరణం పెట్టుకోవాలో,
ఆ విధంగా అన్ని ఆభరణములనూ అతిశయంగా ధరించిన శ్రీదేవి.
తలపై చూడామణి నుంచి కాలి వేళ్ళకు గల మెట్టెల దాకా సౌభాగ్య చిహ్నాలైన
అన్ని ఆభరణములనూ ఆమె అలంకరించుకుని వుంటుంది.
సౌభాగ్యవతి ఏ ఆభరణములను పెట్టుకోవాలో, ఆ యా ఆభరణాలన్నీ అలంకారప్రాయంగా
వేసుకున్నది. ప్రతి ఆభరణము ఒక్కొక్క అంగానికి అమరి, తాము ప్రకాశాన్నీ,
శోభనూ పొందుతూ ఆ తల్లిని సేవించుకుంటున్నాయి.
ఆ అమ్మ పెట్టుకున్న ఎన్నో నగలు ఇప్పుడు ఎంతో మందికి తెలియవు.
ఉదాహరణకు, ఇడా, పింగళా నాడులను సూచిస్తూ తలపై ఎడమ వైపున చంద్రవంకనూ,
కుడివైపున సూర్యబింబాన్నీ పెట్టుకుంది.
మధ్యలో సుషుమ్నను సూచిస్తూ నాగరాన్ని పెట్టుకుంది.
ముత్తైదువులకు తప్పనిసరిగా ఉండవలసిన పంచ మాంగల్యాలనూ ధరించింది.
కాలికి పసుపు, మధురంగా మోగే మువ్వల మంజీరాలు, మెట్టెలు,
రెండు చేతుల నిండా ఘల్లు ఘల్లుమనే గాజులు,
పాపిట నిండుగా ఎర్రని సిందూరము, తలలో సువాసన భరితమైన పువ్వులు,
చెవులకు దుద్దులు, కంటికి కాటుక, ముక్కుకు ముక్కెర, ఇతర నాసాభరణాలు,
నల్లపూసలు, వివాహసమయంలో భర్త కట్టిన మంగళసూత్రము, వీటిని పంచ మాంగళ్యాలంటారు.
కామేశ్వరి ఆపాదమస్తకమూ అన్ని ఆభరణములనూ ధరించి నిండుగా వున్న సువాసినీమూర్తి.
అన్ని ఆభరణములనూ అందముగా అలంకరించుకున్న ఆ సనాతని, ఆ పెద్దఇల్లాలు,
ఆ అపరాజిత, ఆ సర్వమంగళ, ఆ సర్వాభరణ భూషిత కు వందనం.
ఓం శ్రీ సర్వాభరణభూషితాయై నమః
52. శివకామేశ్వరాంకస్థా
ఇప్పటివరకు ఆ శ్రీదేవి ఆకారము, రూప లావణ్యము, ఆహార్యము, ఆయుధము,
అలంకరణము, అభిరుచి, మొదలైన స్థూల స్వరూప విశేషాలను గురించి చెప్పుకున్నాము.
ఇప్పుడు ఆ శివకామిని ఎక్కడ ఉంటుందో చెప్పకుందాం.
శివకామేశ్వరాంకస్థా అంటే శివాని, శివుని అంకముపై కూర్చుని ఉంది అని అర్ధం.
అంకము అంటే, తొడ. కామేశ్వరుని ఎడమతొడపై కూర్చుని పతిని అలరిస్తూ ఉంటుంది.
ఎడమవైపు హృదయం ఉంటుంది. తన హృదయభాగమున్న సగము దేహాన్ని
కామేశ్వరుడు తన హృదయేశ్వరికి ఇచ్చేసాడు. శివుని దేహములో సగమైంది ఆ శివాని.
కామేశ్వరుని హృదయమే కామేశ్వరి. వారిద్దరూ వేర్వేరు కాదు. ఒక్కరే.
ఈ శివా, ఆ కామేశ్వరుని తొడపై కూర్చుని వుండి, ఆ కామేశ్వరునికి కోరికలు తీరుస్తోంది.
సృష్టి చేయవలసిన ధర్మమున్నపుడు, ఈ శివా శివులిద్దరూ కలసి సృష్టి చేస్తారు.
ఆ సమయములో శివుడే కాముడు. శ్రీలలిత శివకామిని.
ధర్మబద్ధంగా కళ్యాణమైన ఈ ఇద్దరూ జరిపేది ధర్మ కామము. అదే ఈ సమస్త సృష్టికి ఆధారం.
కామ ప్రేరితయై, శివకామినిగా, శివగామినిగా, కామేశ్వరుని ఎడమ తొడపై
ఆసీనురాలై వున్న, ఆ శివకామేశ్వరాంకస్థ కు వందనం.
ఓం శ్రీ శివకామేశ్వరాంకస్థాయై నమః
53. శివా
శివా అన్న నామం ఈ దేవికి సరిగ్గా సరిపోయే నామం.
భ్రమర కీట న్యాయంలో, కీటకం భ్రమరం అయిపోయినట్టు,
శివుని కోసం తపించీ, జపించీ, ధ్యానించీ, సేవించీ, ఎన్నో కాలాలుగా ఎదురు చూస్తూ చూస్తూ,
అపర్ణ, తానే స్వయంగా శివుడయిపోయింది.
ఆమె శివా, శివానీ అయ్యింది. ఈ శివా శివులు ఇద్దరికీ అభేదము. వారు వేరు వేరు కాదు.
ఈ భావనను బలపరచటానికి యోగులు అర్ధనారీశ్వరతత్వాన్ని ఉపాసన చేసి మనకు
అందించారు. శివము అంటే, శుభము. శుభ లక్షణాలను కలిగి వున్నది కనుక ఈమె శివా.
మంగళప్రద కనుక ఈమె శివా. ఈమెయే శివుని ప్రతిబింబము కనుక, ఈమె శివా.
శివుని హృదయమే ఈమె కనుక, ఈమె శివా. శమము, శాంతిని ఇస్తుంది కనుక ఈమె శివా.
పతి పైనున్న అపారమైన ప్రేమతో, అనుకంపతో, తానే శివుని హృదయముగా మారిన
ఆ అపర్ణ, ఆ కాత్యాయని, ఆ శివా కు వందనం.
ఓం శ్రీ శివాయై నమః
ఇంతవరకూ ఆ పరమేశ్వరి, పరమేశ్వరునిపై ఎంతటి ప్రేమాదరాలు, గౌరవ మర్యాదలు
కలిగివుందో చెప్పుకున్నాం. శివుని ఎలా సేవిస్తుందో, ఎలా సహకరిస్తోందో కూడా చూసాం.
ఈ నామంలో సాక్షాత్తూ ఆ శివుడిని స్వాధీనము చేసుకున్న ఆ శివానిని గురించి తెలుసుకుందాం.
వల్లభుడు అంటే భర్త, వల్లభుడిని స్వాధీనం చేసుకున్న స్త్రీ స్వాధీన వల్లభ.
పరాశక్తికి శివుడు స్వాధీనము కాక తప్పదు కదా. శక్తి లేనిదే శివుడు లయ కార్యము
ఎలా నిర్వహిస్తాడు. శక్తిహీనుడైన శివుడు ఏమి చేయగలడు.
కనుక శక్తికి శివుడు అధీనమై ఉండాలి. భర్తను తన వశము చేసుకున్న స్త్రీ స్వాధీన వల్లభ.
స్త్రీలు ఈ స్వాధీన వల్లభని ధ్యానిస్తే, పూజిస్తే, వారు కూడా స్వాధీన వల్లభలు అవుతారు.
చెడుదారిన పోతున్న భర్తలు, మాట వినక సహకరించని భర్తలు, వున్న స్త్రీలు
అమ్మవారిని నమ్మి, ఆమెను స్వాధీన వల్లభ రూపంలో, స్వాధీన వల్లభా నామంతో పూజిస్తే,
అమ్మ ఆ భక్తులను కూడా తప్పకుండా, తన వలె స్వాధీన వల్లభలను చేస్తుంది.
పతిని తన స్వాధీనమందు ఉంచుకుని, నమ్మి, వేడిన వారికి, వారి వారి ధర్మ పతులను
స్వాధీనము చేసే, ఆ స్వాధీనవల్లభ కు వందనం.
ఓం శ్రీ స్వాధీనవల్లభాయై నమః------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి