24, ఆగస్టు 2021, మంగళవారం

32. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికా

 

కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః 
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికా ॥ 32 ॥

80. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః

లలితాదేవి తన చేతివేళ్ల పది నఖముల నుంచి నారాయణుని పది అవతారములను లీలగా 

సృష్టించింది. భండాసురుడు యుద్ధంలో అమ్మ మీదకు సర్వాసురాస్త్రం వేసాడు. ఆ అస్త్రం 

నుండి సర్వ అసురులూ, సోమకాసురుడు, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, బలి, రావణుడు,  

కుంభకర్ణుడు మొదలైన  అసురులు పుట్టి, విజృంభించి పోరాటం చేయసాగారు.  

దానికి ప్రతిగా లలిత తన నఖాల నుండి పది నారాయణ ఆకృతులను సృష్టించి వదిలింది. 

అమ్మ చేతి వేళ్ళ గోళ్ళ నుంచి ఉత్పన్నమయిన ఈ మత్స్య, కూర్మ, వరాహ, 

నారసింహ, వామన, భార్గవరామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి రూపాలు, 

ఆ అసురులందరినీ తమ విష్ణుచక్రం ప్రయోగించి చంపివేశాయి. 

శక్తిచక్రము తరువాత ఈ జగత్తులో శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేసేది విష్ణుచక్రమే

ఎప్పుడు జగత్తులో అహంకారము పెచ్చు పెరిగి, దుర్మార్గము, హింస, పీడన, 

స్వార్ధము, ఎక్కువవుతుందో, అప్పుడు ఈ నారాయణులు ఒక్కొక్కసారి 

ఒక్కొక్క అవతారమును ఎత్తి, ఆయా రాక్షసులను పరిమారుస్తూ వుంటారు. 

ఈ సృష్టి చక్రంలో అసురులు పుడుతూనే వుంటారు. 

ధర్మ సంస్థాపన కోసం వారిని అమ్మ ఆదేశంతో, నారాయణులు సంహరిస్తూనే వుంటారు. 

జీవుడు పుడుతూనే ఉంటాడు, అహంకరిస్తూ దుర్మార్గాలు చేస్తూనే ఉంటాడు. నారాయణి, 

నారాయణుల చేతిలో చస్తూనే ఉంటాడు. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. 

ఆ విధంగా ధర్మ గ్లాని కలిగినపుడు, ధర్మ పునః సంస్థాపన కోసం, 

తన చేతి పది వేళ్ళ గోళ్ల నుంచీ నారాయణ దశాకృతులను సృజించిన

ఆ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతికి వందనం.  

ఓం శ్రీ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః 


81. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికా 

భండాసుర సేన వస్తూనే వున్నది. లలితాసేన చేతిలో చస్తూనే వున్నది.

రుద్రుడి నుంచి పిశాచములు వరకూ గల జీవులను పశువులు అంటారు. 

ఈ పశువులకు పతి అయిన ఈశ్వరుణ్ణి పశుపతి అంటాం. ఈ పశుపతి యొక్క అస్త్రమే 

పాశుపతాస్త్రం. ఈ పాశుపతానికన్నా మహత్తైనది, మహా పాశుపతం. 

దానికి అధిదేవత సదాశివుడు. సదాశివుని అస్త్రం మహా పాశుపతం. 

మొదటి శ్లోకంలోనే శివుని యొక్క వివిధ రూపాల గురించి చెప్పుకున్నాం. 

రుద్రుడు వేరు, సదాశివుడు వేరు. వాళ్ళ శక్తులు వేరు. 

లలితాదేవి భండాసుర సేనపై మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించింది. 

ఆ అస్త్ర శక్తికి ఆ సైన్యమంతా దగ్ధమై పోయారు. ఇక భండాసురుడు ఒంటరిగా మిగిలాడు. 

జీవుడు తన చుట్టూ వున్న ఆడంబరాలు, ఆర్భాటాలు నశించాక ఒంటరి అయిపోతాడు. 

భండాసురుడికి జరిగింది అదే. ఏ జీవుడైతే తన చుట్టూ వున్న ఈ మాయా ద్వైతంలో 

చిక్కుకోకుండా, తానే ఈశ్వరుడని, జీవేశ్వరుడనని, గ్రహిస్తాడో, ఆ జీవుడు అగ్నిలో 

దహింపబడడు. జనన మరణ చక్రము అతడిని బాధించదు. చుట్టూ ఆవరించి వున్న పటాటోపాల

మాయలో పడకుండా ఉండాలంటే, అజ్ఞానం నశించాలంటే, ఈ నామం జపించండి. 

మహా పాశుపతాస్త్రంతో ఆ భండాసుర సైన్యాన్నంతా సమూలంగా దగ్ధం చేసిన 

ఆ మహాపాశుపతాస్త్రాగ్నినిర్ధగ్ధాసురసైనిక కు వందనం. 

ఓం శ్రీ మహాపాశుపతాస్త్రాగ్నినిర్ధగ్ధాసురసైనికాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి