14, ఆగస్టు 2021, శనివారం

22. సుమేరు మధ్యశృంగస్థా, శ్రీమన్నగర నాయికా చింతామణి గృహాంతస్థా, పంచబ్రహ్మాసనస్థితా


సుమేరు మధ్యశృంగస్థా, శ్రీమన్నగర నాయికా 
చింతామణి గృహాంతస్థా, పంచబ్రహ్మాసనస్థితా ॥ 22 ॥ 

55. సుమేరు మధ్యశృంగస్థా

శ్రీలలిత వుండే స్థానాల గురించి చెప్పుకుంటున్నాం. అమ్మను సుమేరు మధ్య శృంగస్థా అన్నారు. 

మేరు, సుమేరు అని పిలువబడే పర్వతాలు హిమాలయాలకు ఆవల ఉన్నాయని పేరు. 

ఈ రెండూ ఒకటే అనీ, కాదు కాదు రెండు అనీ వాదాలు వున్నాయి. 

ఆ సుమేరు పర్వతం ప్రస్తుతకాలంలో కనిపించదు. 

ఇరాక్ నాగరికతని సుమేరియన్ నాగరికత అంటారు. 

ఈ సుమేరు పర్వతం సుమారుగా నేటి ఇరాక్ చుట్టుపక్కల వుండి వుండవచ్చును. 

ఒకప్పుడు ఈ ప్రాంతమంతా భరతఖండం లోనే ఉండేది. 

ఈనాటికీ మనము పూజ చేసేటప్పుడు, సంకల్పంలో, మేరోర్దక్షిణ దిగ్భాగే అని చెప్పుకుంటాం. 

ఆ మేరు పర్వతమే, ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న సుమేరు శృంగము. 

మూడు శృంగములు, వాటి మధ్య ఒక ఎత్తైన శృంగము, అదే లలితాదేవి స్థానం. 

ఆ మూడు శృంగములపై బ్రహ్మ లోకం, వైకుంఠం, కైలాసం వుంటాయి.  

ఈ శిఖరాలు ఏ కొద్దిమంది ఉపాసకులకో, పుణ్యాత్ములకో దివ్యదృష్టికి గోచరించవచ్చు. 

కానీ, సరిగ్గా దర్శిస్తే, ఆ సుమేరు మనలోనే వుంది. ఆజ్ఞాచక్రం వద్ద ఇడా, పింగళా, సుషుమ్నా 

నాడులు మూడూ కలుస్తాయి. అక్కడనుంచి సూటిగా పైకి ప్రయాణిస్తే, సహస్రారం. 

అదే మన దేహం లోని సుమేరు శృంగం. ఈసారి ఈ అనుభూతితో మనసులో దర్శించండి.  

ఈ మూడు శిఖరాల మధ్యలో ఉన్న, ఈ మూడింటికన్నా ఎత్తైన, 

సుమేరు శిఖరంపై ఆ శ్రీ లలిత నివాసం. 

ఆ సుమేరు మధ్యలో వున్న శృంగముపై కొలువై ఉన్న, ఆ సుమేరుమధ్యశృంగస్థ కు వందనం. 

ఓం శ్రీ సుమేరుమధ్యశృంగస్థాయై నమః 


 56. శ్రీమన్నగర నాయికా 

ఆనాటి కాలములో నగరాలంటే విద్యా పీఠాలే. నాగరికత నేర్పిన విద్యాపీఠాలే నగరాలు. 

అటువంటి విద్యాపీఠాలు మన ప్రాచీన భారతదేశంలో వారణాసి, పాటలీపుత్రము, కంచి, 

ఉజ్జయిని, కాశ్మీర్ వంటి నగరాలు. లలితాదేవిని శ్రీమన్నగరనాయికా అన్నారు. 

అమ్మ వున్న స్థానం విద్యానగరం. ఆ నగరానికి ఆమె నాయిక, అధినేత్రి. 

ఆమె విద్యకు ఆధారస్థానం. ఆమే శ్రీవిద్య. అంతటి మహత్తరమైన

శ్రీ విద్యకు అధిదేవత అయిన ఆ లలితాదేవి ఆ శ్రీమన్నగరానికి మహారాజ్ఞి. 

నేటికీ మన కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యపట్టణం, శ్రీనగర్ లో, దాల్ సరస్సు ఒడ్డున 

హరి పర్వతంపై అమ్మవారి పీఠాన్ని చూడవచ్చు. అద్భుతమైన పీఠం. 

ఆ పర్వతంపై  అమ్మే స్వయంగా కశ్యపునికి ఇచ్చిన శ్రీచక్రం ప్రధమ చిత్రం నమూనా 

ఒక రాతి శిఖరంలో చెక్కబడి ఉండటమూ చూడవచ్చు. 

అదే మొట్టమొదటి శ్రీ చక్రం. అమ్మ నివాస స్థలాలు అవి. 

సుమేరు మధ్య శృంగముపై వున్న ఆ శ్రీమన్నగరమనే నగరాన్ని, 

అమ్మ కొరకై దేవశిల్పులు ప్రత్యేకంగా నిర్మించారు. 

ఆ విద్యాపీఠంపై కొలువుండి, ఆ శ్రీమన్నగర నాయికగా 

అతిశయంగా మనలను పరిపాలిస్తున్న, ఆ శ్రీమన్నగరనాయిక కు వందనం. 

ఓం శ్రీ శ్రీమన్నగరనాయికాయై నమః 



57. చింతామణి గృహాంతస్థా

చింతామణి కోరిన కోరికలు తీర్చే మణి. ఎవరి ధర్మబద్ధమైన కోరిక అయినా, కోరిన వెంటనే 

ఈ చింతామణి నెరవేరుస్తుంది. అటువంటి చింతామణులతో దేవశిల్పులు అమ్మకు 

ఒక చింతామణీ గృహాన్ని ఆ శ్రీమన్నగరములో నిర్మించారు. 

లలితాదేవి సుమేరు మధ్య శృంగముపై, శ్రీమన్నగరములో, చింతామణులతో నిర్మించిన 

సౌధములో వున్నది. ఒక్క చింతామణే మన కోరికలు తీర్చే కల్పవల్లి అయితే, 

మొత్తం ఆ సౌధమే అటువంటి మణులతో నిర్మిస్తే, ఆ సౌధం ప్రత్యేకత ఏమని కొనియాడగలం.

అమ్మ దగ్గరకు వెళ్లి, శరణు వేడిన వారికి ఇంక చింత ఏమీ ఉండదు. 

మన శిరసుపై వున్న సహస్రారము నందు వెలిగేదీ ఈ చింతామణియే. 

ధ్యానముతో సహస్రారమును చేరి అక్కడ గల చింతామణిని పొందాలి. 

లలితాదేవి ఆ సౌధం లోపల నివసిస్తోంది. చింతామణీ మంత్రాలతో నిండిన 

ఆ గృహాంతర్భాగమందు శ్రీ లలిత దివ్యమైన తేజస్సుతో విరాజిల్లుతోంది. 

అటువంటి చింతామణులతో నిర్మించిన గృహములో కొలువై వున్న, 

ఆ చింతామణిగృహాంతస్థ కు వందనం. 

ఓం శ్రీ చింతామణిగృహాంతస్థాయై నమః 


58. పంచబ్రహ్మాసనస్థితా 

శ్రీ లలితాదేవి సింహాసనాన్ని గురించి ముందు చెప్పుకున్నాం. 

ఆ సింహాసనానికి నాలుగు కోళ్లుగా, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు వున్నారని, 

ఆ సింహాసన ఫలకంపై పరుపుగా సదాశివుడు వున్నాడని చెప్పుకున్నాం. 

ఈ అయిదుగురూ శ్రీ చక్రంలో పంచ కోణాలు. ఈ అయిదుగురినీ పంచ బ్రహ్మలంటాం. 

అమ్మ వీరికి సృష్టించే శక్తిని ఇచ్చింది. అందుకే ఈ అయిదుగురూ బ్రహ్మలు. 

వీరే పంచ భూతాలకు, పంచ తన్మాత్రలకు, పంచ జ్ఞానేంద్రియాలకూ, 

పంచ కర్మేంద్రియాలకూ అధిదేవతలు. 

ఈ పంచ బ్రహ్మలు శ్రీ మాత శయనించే, ఆ శివాకార మంచమును అమ్మ కృపతో, 

అమ్మ కొరకై సృష్టించి ఆమెను సేవిస్తున్నారు. 

ఈ శివాకారములో వున్న మంచముపై చిత్కళ, ఆ శ్రీలలిత ఆసీనురాలయి ఉంటుంది.

మహేశుడు వింజామర వీస్తుంటే, ఆ శివాకార మంచముపై ఆ లలితాదేవి శయనించి వున్నది.

అయిదుగురు బ్రహ్మలు ఆసనంగా అమిరిన మంచముపై అధిష్ఠించిన, 

ఆ పంచబ్రహ్మాసనస్థిత కు వందనం. 


ఓం శ్రీ పంచబ్రహ్మాసనస్థితాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి