మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా ॥ 17 ॥
కామేశ్వరి ఊరువులు మార్దవంగా వున్నాయి.
అవి ఎంత మృదువుగా వుంటాయో కేవలం ఆ కామేశ్వరునికే తెలుసు.
ఎలా అంటే, ఆ ఊరువులు తాకే సౌభాగ్యం ఒక్క కామేశ్వరుడికి మాత్రమే వుంది మరి.
కామేశ్వరి మహా పతివ్రత. తన ఊరువులపై అన్యుల చేయి పడనీయదు సరికదా,
ఇతరుల ధ్యాస కూడా వాటిపై పడనీయదు. కనుక ఆ తొడలు ఎంత మృదువుగా ఉన్నాయో
తెలుసుకునే సౌభాగ్యం కేవలం ఆ కామేశ్వరుడికి ఒక్కడికే దక్కింది.
ఇది ఈనాటికీ పాతివ్రత్యాన్ని పాటించే అందరు స్త్రీ మూర్తులూ తెలుసుకుని
ఆచరించ తగ్గ విషయం. పతివ్రతలకు తమ శరీర భాగాలపై భర్తది తప్ప
వేరెవరి చూపూ, చేయీ, ధ్యాసా పడకుండా చూసుకోమని
ఆ లలితాంబే ప్రత్యక్షంగా తాను ఆచరించి అందరికీ ఆచరించాలని సూచిస్తోంది.
ఆదిపరాశక్తులుగా ఇంటింటా వెలసిన స్త్రీ మూర్తులందరికీ జగన్మాతగా
ఆ జ్ఞాన ప్రసూనాంబయే పాతివ్రత్యాన్ని ఎలా పాటించాలో స్వయంగా జ్ఞానబోధ చేస్తోంది.
కామేశ్వరుడికి మాత్రమే అనుభవం లోనికి వచ్చిన మృదువైన ఊరుద్వయమును
కలిగిన, ఆ కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత కు వందనం.
ఓం శ్రీ కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితాయై నమః
40. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా
ఆ మాహేశ్వరి జానువులు ఎంత అందంగా, రాజసంగా ఉన్నాయో తెలుసుకుందాం.
మణి మకుటాలని సాధారణంగా, మహారాజుల, చక్రవర్తుల శిరస్సులపై చూస్తాం.
అటువంటి మాణిక్య మకుటాలు మాహేశ్వరి జానువులకు అలంకరించారా అన్నట్టుగా
అమ్మవారి మోకాళ్ళు విరాజిల్లుతున్నాయి. మోకాళ్ళకి కిరీటాలేమిటీ అనుకుంటున్నారా,
చక్రవర్తుల శిరస్సుల కన్నా దృఢంగా, యోగ్యంగా వున్నాయి ఆ మోకాళ్ళు.
ఆ మోకాళ్ళే మణి మకుటాల్లాగా ఉన్నాయని అతిశయంగా చెప్పబడింది.
ఊరువులు మృదువుగా వున్నాయి కదా అని ఆశ పడితే,
కఠినంగా వున్న జానువులు జాగ్రత్త అంటాయి.
పైగా అవి సాధారణమైన కిరీటాలు కావు, మాణిక్య మకుటాలు.
ఆ మాణిక్య మకుటాలే కదా తమను ఉద్ధరిస్తాయని ఉపాసకులందరూ ఆరాధించేది.
గొప్ప జాను ద్వయమును కలిగిన ఆ జగదీశ్వరి, ఆ జగజ్జనని,
ఆ మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత కు వందనం.
ఓం శ్రీ మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి