
ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా
గూఢగుల్ఫా, కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా ॥ 18 ॥
41. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా
ఇంద్రగోపమంటే ఆరుద్ర పురుగు. ఈ పురుగులు వర్షాకాలంలో భూమిలోంచి పుట్టుకొస్తాయి.
ఎర్రగా, ముద్దుగా, పట్టుకుంటే మృదువుగా ఉంటాయి. పట్టుకుచ్చు వలే ఉంటాయి.
ఆరుద్ర కార్తెలో ఈ ఆరుద్ర పురుగులు భూమిలో నుంచి గుంపులు గుంపులుగా వచ్చి
గునగునా తిరుగాడుతుంటే చూడ ముచ్చటగా ఉంటుంది.
అంతటి అందమైన ఎరుపు చాయను మరెక్కడా చూడము.
ఈ నామం ఆ భువనేశ్వరి జంఘముల గురించి చెప్తుంది. జంఘములంటే కాలిపిక్కలు.
మన్మధుని అంబులపొది వలె వున్నవి అమ్మవారి కాలిపిక్కలు.
పైగా అవి అంబులపొది చుట్టూ ఆరుద్ర పురుగులను పరిక్షిప్త, అంటే చుట్టుకున్నట్టు వున్నాయి.
ఆ లలితాదేవి అరుణారుణ కదా, అందుకే ఆమె కాలిపిక్కలు కూడా ఎర్రగా
ఆరుద్ర పురుగుల వర్ణంలో వున్నాయి అని అర్ధం.
స్మరుని, అంటే, మన్మధుని అంబులపొదిని ఎర్రని ముద్దుగొలిపే ఆరుద్ర పురుగులు
మొత్తంగా కప్పివేస్తే ఎలా ఉంటుందో, ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి.
అసలే, మన్మధుని బాణాలను తనలో నింపి ఉంచుకునే తూణము, తూణీరము,
పైగా దాని చుట్టూ అందమైన, సొగసైన, కంటికి, మనసుకు హాయినిచ్చే ఆరుద్రలు,
ఇదీ ఆ మాత కాలిపిక్కల అందం, ప్రకాశం.
అందమైన ఆరుద్ర పురుగులు కమ్మివేసిన, స్మరుని అమ్ములపొది వంటి
సొగసైన జంఘములు కల, ఆ ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘిక కు వందనం.
ఓం శ్రీ ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికాయై నమః
42. గూఢగుల్ఫా
గుల్ఫం అంటే చీలమండలని అర్ధం. గూఢం అంటే రహస్యం.
ఈ నామంలో అమ్మవారి కాలి చీలమండలను గురించి చెప్పుకుందాం.
అమ్మవారు గూఢ గుల్ఫా, అంటే, గూఢంగా, రహస్యంగా వున్న గుల్ఫము కలది.
అమ్మవారి చీలమండలు రహస్యంగా, పాద మంజీరాల మధ్య గుట్టుగా దాగి వున్నాయి.
గుల్ఫా అంటే రక్షించునది అని కూడా మరో అర్ధం.
గూఢగుల్ఫా అంటే రహస్యంగా రక్షించునది అని అర్ధం. అమ్మ తనను ఉపాసించే భక్తులను,
తనను శరణు చొచ్చినవారిని రక్షిస్తుంది. అది కూడా గూఢంగా, రహస్యంగా, మర్మంగా.
కుండలినీ ప్రచోదనానికి గుదభాగంపై కాలి చీలమండలను ఒకదానిపై ఒకటి వేసుకుని
స్థిరాసనంలో కూర్చుని ధ్యానం చేయాలని యోగశాస్త్రం చెప్తుంది.
అలా అమ్మని ధ్యానిస్తే, ఊర్ధ్వగతికి ఆమే చేరుస్తుంది.
ఆ జగదాంబ చీలమండలని ధ్యానం చేస్తే, మనకే తెలిసీ, తెలియకుండా ఉన్న
మన కష్టాలని దూరం చేస్తుంది.
నమ్మితే చాలు, మన వెనుకే ఉంటూ తల్లి వలె మనలను ఆపదల నుండి రక్షించే,
ఆ ఆపద్బాంధవి, జగజ్జనని, ఆ గూఢగూల్ఫ కు వందనం.
ఓం శ్రీ గూఢగుల్ఫాయై నమః
43. కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా
కూర్మ పృష్ఠం అంటే తాబేలు వీపు. జయిష్ణు అంటే విజేత అని భావం.
ప్రపద అంటే చీలమండల నుండి కాలిగోళ్ళ వరకు కల పాదాల పై భాగం.
అమ్మవారి పాదాల పైభాగం తాబేలు పై వుండే డిప్ప వలే ఉండి దృఢంగా వున్నది.
పాదాలపై భాగం ఉబ్బుగా ఉండటం శుభస్కరం. అటువంటి సుందరమైన, దృఢమైన
పాదాలపై ఆధారపడే సమస్త లోకాలూ వున్నాయి.
దేవతా దర్శనం చేసేటప్పుడు ఆపాదమస్తకం దర్శనం చేయటం పధ్ధతి.
ముందుగా పాదాలను మొక్కి, నెమ్మదిగా పైపైకి దేవతా ముఖ దర్శనం చేస్తూ ఉంటాం.
పాదదర్శనం, పాదపూజ ఇవి దేవతార్చనలో ప్రముఖమైనవి.
గుడిలో విగ్రహానికి పూజ చేసేటప్పుడు కూడా పుష్పాలను, అక్షతలను పాదాలకే సమర్పిస్తాం.
అమ్మ పాదాల వద్ద అందరూ పరాజితులే. ఆ పాదాలు ఎప్పుడూ విజేతలే.
ఆ పాదాలు పట్టుకున్న వాళ్లకూ ఎప్పుడూ విజయమే.
తాబేలు పృష్ఠభాగము వంటి ఎల్లవేళలా విజయాన్ని పొందే ప్రపదలు గల,
ఆ కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్విత కు వందనం.
ఓం శ్రీ కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి