చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా
గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా ॥ 26 ॥
గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా ॥ 26 ॥
68. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా
లలితాదేవి చక్రరాజమనే రథమును అధిరోహించి వున్నది.
ఆ రధము ఎన్నో యోజనముల విశాలమైనది, ఉన్నతమైనది.
ఆ రథములో అన్ని ఆయుధములు అమర్చబడి, ప్రయోగించడానికి
వీలుగా, సౌకర్యముగా అమ్మవారికి అందుబాటులో వున్నాయి.
ఆ రథమునకు ఆనందమనే ధ్వజము వున్నది. దానికి తొమ్మిది కోణములు.
అవే నవావరణములు. అన్ని రథములలో కెల్లా ఉన్నతమైన రథము చక్రరాజము.
చక్రము తాను తిరుగుతూ రథముపై అధిరోహించిన వారిని కూడా తనతో పాటు తిప్పుతుంది.
అమ్మ తాను అన్ని కోణాలలో తిరుగుతూ, అందరినీ తన చుట్టూ తిప్పుకుంటూ, ఈ ముల్లోకాలనీ
పాలిస్తూ ఉంటుంది. అమ్మవారిని చక్రరాజ రథముపై ఊహించుకుని ఉపాసించండి.
అర్హులకు చక్రశుద్ధి, చక్రసిద్ధి కలుగుతాయి. అదే శుద్ధవిద్య.
ఆ శుద్ధవిద్యను పొందిన యోగి సాక్షాత్తూ సదాశివుడంత వాడు అవుతాడు. అదే జ్ఞానము.
జ్ఞానము కలిగిన తరువాత జీవుడు కర్మల నుండి విముక్తి చెందుతాడు.
అటువంటి జ్ఞానమును అందించు ఉపకరణములే ఆయుధములుగా వున్న చక్రరాజరథమును
అధిరోహించి వున్న, ఆ చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృత కు వందనం.
ఓం శ్రీ చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతాయై నమః
69. గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా
లలితాదేవి బుద్ధినుంచి ప్రభవించిన శక్తియే శ్యామలాదేవి.
ఈమె గేయచక్రమను రథమును అధిరోహించి వున్నది.
గేయచక్రమనునది లలితాసహస్రనామస్తోత్రంలో చెప్పే రెండవ రథము.
శ్యామలాదేవిని అమ్మ మంత్రిణిగా నియోగించింది.
మంత్రిణి అంటే, మంత్రస్వరూపమైన శక్తి, మంత్రాధిదేవత, మంత్రాంగము చేయునది.
మంత్రమును ఉపాసించువారికి మంత్రసిద్ధిని ఇచ్చే దేవత.
సూక్ష్మంగా దర్శిస్తే, లలితయే శ్యామల. ఎందుకంటే, అమ్మ బుద్ధి నుంచి ప్రకటితమైనది.
లలితాదేవి కార్యం కోసమై, లలితాదేవి ఆలోచనతో రూపు దాల్చిన శక్తి శ్యామల.
గేయము అంటే స్తుతించటానికి సిద్ధముగా వున్న స్తోత్రము.
అటువంటి స్తోత్రముతో సిద్ధముగా వున్న ఈ గేయచక్ర రథము కూడా
ఏడు కోణములు, ఆవరణలు కలిగి ఉంటుంది. విశాలమైనది, ఉన్నతమైనది.
ధియో యోనః ప్రచోదయాత్. జీవుని ధీశక్తిని ప్రచోదనం చేసేది, సవితృమండలం.
ఈ శ్యామలాదేవి ఉపాసన మన బుద్ధిని ప్రచోదనం చేసి, ఊర్ధ్వలోకమైన సూర్యమండలం
వరకూ తీసుకుపోయే శక్తి గలది. ఈశ్యామలకే కొంత భేదంతో, మాతంగి, లఘుశ్యామల,
రాజశ్యామల వంటి నామాంతరములు వున్నాయి.
తన బుద్ధి నుంచి ప్రకటితమైన శ్యామలాదేవి మంత్రిణిగా, గేయచక్రరథారూఢయై
చేస్తున్న స్తోత్రాన్ని స్వీకరించే తల్లి, ఆ గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవిత కు వందనం.
ఓం శ్రీ గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి