4, ఆగస్టు 2021, బుధవారం

12. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా


అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా ॥ 12 ॥

29. అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా

ఈ నామంలో అమ్మవారి చుబుకం, అంటే గడ్డం గురించి చెప్పుకుందాము. 

అమ్మవారి చుబుకం గుండ్రంగా ఎంతో ముద్దుగా అందంగా సుందరంగా విరాజిల్లుతూ వుంది. 

ఆ చుబుకానికి సాటి వచ్చే మరొక చుబుకమే లేదు. 

మరి ఏ ఇతర ద్రవ్యముతో కానీ, ఆకారముతో కానీ అమ్మవారి చుబుకానికి 

సాదృశ్యము, పోలికే కల్పించబడలేదు.
  
ఇప్పటివరకు శ్రీదేవి లలాటమును అష్టమీ చంద్రుని తోనూ, 

అమ్మ ధరించిన కస్తూరీతిలకాన్ని చంద్రునిలోని మచ్చతోనూ,

ఆమె కనుబొమలు మదన గృహతోరణాల వలెనూ, 

మాత నయనములు మీనముల వలెనూ,  అని పోలిక కల్పించబడింది. 

కురులు --- చంపకాశోకపున్నాగముల వంటి పుష్పముల కన్నా పరిమళభరితముగా,

అమ్మవారి ముక్కు --- నవ చంపకపుష్పము కన్నా, 

ముక్కెర --- తారలు, గ్రహముల కాంతి కన్నా

చెక్కిళ్ళు --- సాన పెట్టబడిన పద్మరాగమణులకన్నా, 

పెదవులు --- కొత్త పగడాలు, నిండు దొండపండ్ల కన్నా 

అమ్మవారి కంఠ మాధుర్యము సరస్వతి కచ్చపీ వాదనము కన్నా 

ఎన్నో రెట్లు గొప్పవిగా కీర్తించాం. 

అటువంటిది చుబుకమునకు సాదృశ్యమే చెప్పబడలేదు. 

ఇక్కడ ఉపాసకులు వారి వారి దర్శనానుభూతిని బట్టి 

ఆ చుబుకం ఎలా వున్నదో ఊహ చేయాలి. 

అమ్మ చుబుకము యొక్క సొగసు ఉపాసకుల దృష్టికి మాత్రమే గోచరిస్తుంది. 

దానికి సరిపోయే మరియొక పోలికే కల్పింపబడని చుబుకము కల, 

ఆ అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజిత కు వందనం. 

ఓం శ్రీ అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితాయై నమః 


30. కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంధరా

కామేశ్వరుడు కామేశ్వరి మెడలో మాంగల్యం కట్టాడు. 

ఇద్దరి నయనాలూ మంగళసూత్రధారణ సమయంలో కలుసుకున్నాయి. 

వారు ఆది దంపతులైనారు.  కామోద్దీపితులైనారు. అది ధర్మ కామము. 

దీనివలననే సృష్టి నడుస్తుంది. జగత్పిత అయిన మహాదేవుడు, కాముడికే ఈశ్వరుడు. 

కాముడిని భస్మం చేసింది మహా శివుడైతే, పునర్జన్మ నిచ్చింది అంబ. 

"మ్రింగెడివాడు విభుండని,  మ్రింగెడిదియు గరళమనియు, మేలని ప్రజకున్ 

మ్రింగుమనె సర్వమంగళ,  మంగళసూత్రము నెంత మది నమ్మినదో!" అనుకున్నది రుక్మిణీదేవి. 

సాగరమథన సమయంలో వెలువడిన హాలాహలాన్ని, దేవతల ప్రార్ధనతో తాగి, 

దాన్ని తన కంఠమందే నిలిపి గరళకంఠుడైనాడు పరమశివుడు. 

విషం తాగబోతున్న భర్త కు, ప్రజలకు మేలు కనుక, తాగమని అనుమతి నిచ్చింది ఆ సర్వమంగళ. 

కామేశ్వరుడు కట్టిన ఆ మంగళసూత్రం మీద సర్వమంగళకు అంత నమ్మకం. 

ఆ సూత్రం తన కంఠసీమలో ఉన్నంతవరకూ భర్తకి అదే రక్ష అని నమ్మింది జగదంబ. 

అదీ మంగళసూత్ర శక్తి. అందుకే వారు జగత్పితరులైనారు. 

కామేశుడు కట్టిన మంగళ సూత్రము కామేశ్వరి కంఠానికి ఎంతో శోభను చేకూర్చింది. 

దాంతో అమ్మవారి కంఠం అపూర్వమైన అందాన్ని సంతరించుకుంది. 

కామేశ్వరుడు కట్టిన మాంగళ్యము వలన ఎంతో శోభాయమానంగా 

వెలుగొందుతున్న కంఠము కల, ఆ కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంధర కు వందనం. 

ఓం శ్రీ కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంధరాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి