64. దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవా
దేవతలు, ఋషులు అందరూ ఐక్యంగా కలసి అమ్మవారి ఆత్మ వైభవమును కీర్తిస్తున్నారు.
దేవర్షి సంఘం అంతా, ఆ శ్రీ లలితాదేవి పరమాద్భుత వైభవాన్ని, కన్నారా చూసి
సమ్మోహితులై వున్నారు. నిజానికి దేవతా గణాలైనా, ఋషి గణాలైనా, ఈ బ్రహ్మాండాలన్నీ కూడా,
ఆ అమ్మ ఇచ్ఛాశక్తి చేత ప్రకటితమైనవే. అయినా వారంతా అమ్మ మాయలో మోహితులై,
తాము వేరు, ఆ శ్రీమాత వేరు అన్న భావనలో, అమ్మను ఆహ్లాదంగా కీర్తిస్తున్నారు.
అమ్మ ఎంతో ప్రసన్నంగా తన స్తుతిని తానే వింటున్నది.
భక్తిగా, ఇష్టంగా స్తుతి చేస్తున్నదీ, ఆ స్తుతిని అతిశయంగా ఆమోదిస్తున్నదీ, అంతా ఆ ఇచ్ఛాశక్తి
స్వరూపిణియైన లలితాదేవియే. సంఘాతము అనే నరకము ఒకటి వున్నది.
ఆ నరకాన్ని తరించటానికై ఈ దేవతలు, ఆ ఋషులు, అమ్మ కరుణ కోరి ఆమెను
ప్రస్తుతిస్తున్నారు. వారంతా అమ్మ కృప పొంది నిశ్చింతులై వున్నారు.
ఆ దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవ కు వందనం.
లలితాదేవి ఆవిర్భవించినదే భండాసుర వధ కోసం.
కామేశ్వరుడు మన్మధుని భస్మం చేసిన తరువాత ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు.
ఆ భస్మరాశిని చూసిన చిత్రకర్ముడనే మంత్రవేత్త, దానితో ఒక ఆకారం చేసి, ప్రాణం పోశాడు.
అది చూసి స్వయంగా బ్రహ్మయే అబ్బురపడి భండ, భండ అని మెచ్చుకున్నాడు.
దానితో వాడిపేరు భండాసురుడు అని స్థిరపడింది. ఈ భండాసురుడు రుద్రుడుకై ప్రార్ధించాడు.
ఆతని ప్రార్ధనకి వశమై రుద్రుడు భండాసురుడికి అడిగిన వరాలిచ్చాడు.
ఈ బ్రహ్మాండంలో ఎవడి చేతా మరణం రాకుండా వరం పొందాడు.
అరవై వేల సంవత్సరాలు ఈ ముల్లోకాలనూ అతడే ఏలగలడనే వరం కూడా పొందాడు.
దానితో భండాసురుడికి ఎదురు లేకుండా పోయింది.
మిగిలిన బూడిదతో, విశుక్రుడు, విషంగుడు అనే ఇద్దరు సహచరులని రూపొందించుకున్నాడు.
దక్షిణాపధంలో శూన్యకమనే నగరాన్ని సృష్టించి పాలన మొదలుపెట్టాడు.
రాక్షసులకు తప్ప మరెవ్వరికీ సంతానం కలుగకుండా కామప్రళయాన్ని సృష్టించాడు.
త్రిమూర్తులు, దేవేంద్రుడు మొదలైన దేవతలంతా వాడికి దాసులయ్యారు.
రుద్రుడి వరంపై గౌరవంతో, అరవై వేల సంవత్సరాలు వీరంతా ఎన్నో కష్టాలు పడ్డారు.
ఆ వరం ముగియబోతున్న చివరి సంవత్సరాలలో, ఈ దేవతలంతా లలితాదేవి కరుణకై
జపాలు, తపాలు,హోమాలు చేసి ఆ లలితను ప్రసన్నం చేసుకున్నారు.
ఆ లలితాదేవి ఈ బ్రహ్మాండం నుంచి వచ్చిన పురుషుడు కాదు కనుక,
భండాసురుడిని వధించినా, రుద్రుడిచ్చిన వరం పొల్లు పోదు.
ఆ విధంగా ప్రత్యేకం భండాసుర వధ కోసం ఆవిర్భవించిన శక్తి లలితాదేవి.
భండుడు వేరెవరో కాదు, మనలో వున్న జీవుడే. స్వార్ధం తప్ప సిగ్గు లేని జీవుడు.
మరి ఈ జీవుడిని ఉద్ధరించాలంటే, ఆ లోపల దాగున్న భండాసురుడిని వధించాలి కదా.
రుద్రుని వరం ప్రకారం పురుషులు భండాసురుణ్ణి సంహరించలేరు కనుక, ఆ జగదాంబ తన
నుంచి తానే ఒక గొప్ప శక్తి సేనను సృష్టించింది. సృష్టిలో మొట్టమొదటి స్త్రీ సేన అది.
తన స్త్రీ సేనావాహినితో దేవతల రక్షణార్థం, భండాసుర వధకు ఉద్యుక్తురాలైన,
ఆ భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్విత కు వందనం.
ఓం శ్రీ భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి