7, ఆగస్టు 2021, శనివారం

15. లక్ష్యరోమలతా ధారతా సమున్నేయ మధ్యమా స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా


లక్ష్యరోమలతా ధారతా సమున్నేయ మధ్యమా 
స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా ॥ 15 ॥

35. లక్ష్యరోమలతా ధారతా సమున్నేయ మధ్యమా 

ఈ నామములో ఆ శ్రీదేవి నడుమును గురించి చెప్పబడింది. 

శరీరము నడుము పైభాగాన సగము, కింది భాగాన సగము ఉంటుంది. 

మధ్య భాగంలో ఉంటుంది కనుకే దాన్ని నడుము, మధ్యమ అంటున్నాం. 

అమ్మ ఆకృతి నడుముకు అటూ ఇటూ సమానంగా, నిండుగా ఉండటం వలన 

మధ్యలో ఆ నడుము ఉన్నదా లేదా అన్నట్టుగా వుంది. 

అప్పుడు నిర్ధారించుకోవడానికి అమ్మను సూక్షంగా పరిశీలిస్తే, 

బొడ్డు నుంచి పైకి లేచిన రోమలతను చూసిన తరువాత తెలిసింది.

ఆ రెండు సమున్నత భాగాల మధ్యా నాభి వున్నదీ అని. 

అలా రోమలతే లక్ష్యంగా, ఆ నాభి కింద నడుమూ వున్నది అని నిర్ధారణ అయ్యింది. 

ఆ విధంగా ఉన్నదా లేదా అనే సందేహం కలిగేటంత సన్నగా సూక్షంగా వుండే నడుము అమ్మది. 

అమ్మ నడుమే మనకందరికీ ఆధారం. ఆ కనిపించీ కనిపించని మధ్యమ భాగమే అమ్మ మాయ. 

ఆ మాయ వలననే అన్నీ తెలిసినట్టూ ఉంటుంది, తెలియనట్టూ ఉంటుంది. 

కనిపించినట్టూ అనిపిస్తుంది. కనిపించనట్టూ అనిపిస్తుంది. 

అమ్మ నాభి నుంచి సమస్త లోకాలకీ పోషణ అందుతూనే ఉంటుంది. 

మరి ఆమె కడుపు లోనే కదా సకల లోకాలూ వున్నాయి. 

అమ్మ ఎవరికి ఏమి కావాలో, ఎవరికి ఎంత తెలియబడాలో అంత, 

అన్ని జీవులకీ వారి వారి యోగ్యతలను బట్టీ వారికి అందిస్తూనే ఉంటుంది. 

రెండు సమున్నత భాగాల మధ్య ఉన్నదా లేదా అన్నట్టు వుండే మధ్యమ 

కలిగి వున్న, ఆ లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమ కు వందనం. 

ఓం శ్రీ లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమాయై నమః 


36. స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా 

ఇక్కడా అమ్మ నడుమును గురించే చెప్పబడింది.

నడుమును గురించిన మరో విశేషం ఏమంటే,  వుందా లేదా అన్నట్టున్న 

ఆ సన్ననైన నడుము పూర్ణకుంభాలైన ఆ స్తన భారానికి తట్టుకోలేక పోతోందా 

అన్నట్టుగా వంగి కడుపు దగ్గర మూడు ముడుతలు పడ్డాయి. 

వళిత్రయం ఏర్పడింది. వళి అంటే పొట్ట మీద ముడుత. 

ఆ శ్రీమాత స్తన భారాన్ని మోయలేకా అన్నట్టు పొట్టమీద మూడు ముడుతలు ఏర్పడ్డాయి.

అమ్మ నడుముకు ఊతంగా మూడు బంగరు పట్టీలు కట్టినట్టు ఆ వళిత్రయం అనిపిస్తోంది. 

నడుము విరిగిపోతుందనేమో, ఆలంబనగా వడ్డాణములు పెట్టారు అన్నట్టుంది. 

ఆ జగజ్జనని ముల్లోకాలనూ తన వళిత్రయం లోపల నిక్షేపంగా దాచేసింది.  

స్తన భారం వలన ఏర్పడిన తన నడుముకి వున్న మూడు ముడుతలలో ముజ్జగాలనూ దాచి, 

తన రక్షణ, పోషణతో కాచి కాపాడుతున్న, ఆ  స్తనభారదళన్మధ్యపట్టబంధవళిత్రయ కు వందనం. 

ఓం శ్రీ స్తనభారదళన్మధ్యపట్టబంధవళిత్రయాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి