84. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః
మహాశివుడు సతీ దేహ పరిత్యాగం తరువాత, విరక్తుడై, హిమాలయాలను చేరి, తపస్సులో
మునిగిపోయాడు. సతీదేవి హిమవంతుడికి కూతురుగా పుట్టి, పార్వతి అనే నామంతో పెరిగి,
శివుణ్ణి పతిగా పొందటానికి తపస్సు చేస్తోంది. ఈ ఆది దంపతులను తిరిగి కలిపితేనే కానీ సృష్టి
తిరిగి ఆరంభం కాదని, తారకాసురుని నిర్జించే కుమారుడు పుట్టడని, బ్రహ్మ మొదలైన
దేవతలందరూ శివుడ్ని ప్రార్ధించారు. ఏమీ లాభం లేకపోయింది.
శివుడు సంపూర్ణ వైరాగ్యంతో తపోదీక్షలో ఉండిపోయాడు. పార్వతీ దేవి సేవలకు కూడా
చలించటం లేదు. అప్పుడు దేవతలంతా రతీ మన్మధుల సహాయం కోరారు.
లోకరక్షణార్ధమై మన్మధుడు దానికి అంగీకరించాడు.
పార్వతి పక్కన వున్నప్పుడు, వసంతుడు శివుడిపై తన ఆయుధాలైన పుష్పబాణాలు వదిలాడు.
శివుడు చలించాడు. కానీ అంతలోనే విషయం గ్రహించి, క్రోధుడై కాముడిని మూడవకన్ను,
అగ్నినేత్రం తెరచి చూచాడు. కాముడు ఒక్కసారిగా ఉన్న చోటనే భస్మం అయిపోయాడు.
ఆ బూడిద కుప్పను చూసి, రతీ దేవి, దేవతలు అందరూ దుఃఖించారు.
భండాసుర వధానంతరం లలితాదేవిని సంస్తుతిస్తున్న బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవతలు
ఆ మన్మధుడిని తిరిగి బ్రతికించమని ఆ లలితాదేవిని ప్రార్ధించారు.
అన్నీ తెలిసిన అమ్మ, మన్మధుని పాలిట సంజీవనీమూలిక వలె, అతణ్ణి పునర్జీవితుడిని చేసింది.
మన్మధుడు బ్రతికాడు, కానీ దేహము లేదు, భస్మమై పోయింది. ఆత్మ మాత్రం తిరిగి బ్రతికింది.
మదనుడు అనంగుడైనాడు. దేహము లేకపోయినా, ఆత్మస్వరూపముతో మన్మధుడు మరల
తన స్వధర్మమైన కామోద్దీపన కార్యక్రమం ప్రారంభించాడు.
యధావిధిగా సృష్టి కార్యం మరల మొదలైంది.
అయ్యవారి వహ్నినేత్రం దహించి భస్మం చేసినా, అమ్మవారి కరుణతో మృతుని పాలిట
సంజీవనీ ఔషధి వలె దీవించడంతో, కాముడు సజీవుడయ్యాడు.
ఈ నామంతో అమ్మను జపిస్తే, అపమృత్యు దోషాలుంటే పోతాయి.
అలా మన్మధుణ్ణి పునర్జీవితుడిని చేసిన, ఆ హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధి కి వందనం.
ఓం శ్రీ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః
85. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా
లలితాదేవి ముఖకమలము శ్రీమత్ వాగ్భవకూటము వలే వున్నది అని ఈ నామానికి అర్ధం.
ఇంతవరకూ అమ్మవారి స్థూల దేహము, వర్ణన, భండాసుర వధ గురించి చెప్పుకున్నాం.
ఇప్పుడు అమ్మ యొక్క సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ దేహం గురించి చెప్పుకోబోతున్నాం.
ఆ స్థూలము, ఈ సూక్ష్మములు కూడా ఒక్కటే అని తెలియపరచటం కొరకు,
అమ్మ ముఖపద్మమే ఎంతో మహత్తు గల వాగ్భవకూటమని ఇక్కడ పోలిక చెబుతున్నారు.
ముఖంలోని అవయవములు కళ్ళు, ముక్కు, చెవులు, పెదవులు, దంతములు, కంఠము
మొదలైన అంగములన్నీ వాక్కుకు దోహదపడుతున్నాయి. కనుక ఈ ముఖభాగమును
వాగ్భవకూటము అన్నారు. అందునా అది శ్రీమత్ అంటే మహత్తైన, వాగ్భవకూటము.
అమ్మవారి సూక్ష్మరూపము బీజాక్షర రూపము. లలితా పంచదశీ మంత్రములో మొత్తం
పదిహేను బీజాక్షరాలుంటాయి. వాటిలోని మొదటికూటమే వాగ్భవకూటము.
ఈ కూటములో అయిదు బీజాక్షరాలున్నాయి. క ఏ ఈ ల హ్రీమ్.
ఈ అయిదు బీజాక్షరముల రూపమే లలితాదేవి ముఖము.
ముఖములో కనుబొమల మధ్యలో ఆజ్ఞాచక్రము వున్నది. అంటే, ఆ వాగ్భవకూటములో
ఈ ఆజ్ఞాచక్ర పద్మమున్నది. అక్కడే అమ్మవారి ముఖ దర్శనం చేయాలి.
ఆ అయిదు బీజాక్షరములనే అమ్మ ముఖముగా ఉపాసించాలి. అప్పుడు వాక్కు పొల్లు పోదు.
ఈ సాధనలో శాంతంగా మాట్లాడటం, సత్యమే మాట్లాడటం ముఖ్యం.
ఎంతో గొప్పదైన వాగ్భవకూటమునే తన ముఖముగా చేసుకున్న ఆ వాగీశ్వరి,
ఆ శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజ కు వందనం.
ఓం శ్రీ శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి