నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా ॥ 19 ॥
ఇప్పుడు ఆ పరాశక్తి కాలివేళ్ళ గోళ్ళ గురించి తలచుకుందాం.
ఒక మహా జ్ఞాన ప్రకాశము, గొప్ప విద్యుత్కాంతి ఆ గోళ్లను కప్పి వుంది.
ఒక చక్కని రశ్మి, ఆభ, వెలుగు, ద్యుతి ఆ నఖములను ఆచ్ఛాదించి వున్నది.
ఆ కాలి గోటి కాంతి ప్రవాహములో సమస్త జగత్తూ ఓలలాడుతోంది.
ఆ పాదాలకు నమస్కరించిన వారి అజ్ఞానమనే తమస్సు, ఈ నఖ కాంతుల వలన
నశించి పోతున్నది. అజ్ఞానము నశింపబడిన తరువాత,
వారు కూడా ఆ మహా ప్రకాశంలో లీనమయి, ధన్యులవుతున్నారు.
వారి అజ్ఞానపు పొర తొలగించబడి, జ్ఞానము బహిర్గతమవుతోంది.
ఆ హైమావతీ పాద పద్మములు ఎవరి హృదయములో కైనా చేరగలవు.
తమ నఖ కాంతులతో వారి లోపల ఉన్న తమోగుణాన్ని తొలగించి ఉద్ధరించగలవు.
తనకు పాద నమస్కారం చేసిన వారి తమోగుణాన్ని, తన కాలి గోటి ప్రభలతో తొలగిస్తున్న
ఆ పరమేశ్వరి, ఆ నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణ కు వందనం.
ఓం శ్రీ నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణాయై నమః
45. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా
ఇక మొత్తంగా ఆ రాజరాజేశ్వరి పాదపద్మాల గురించి చెప్పుకుందాం.
ఆ పాదద్వయ తేజస్సుకు, ప్రభావానికి ముందు మరేవీ సాటి రాలేవు.
సాధారణంగా పాద పద్మాలు అంటాం.
ఇక్కడ అమ్మవారి పాదాలు ఆ పద్మాలనే పరాకృతం చేస్తూ తేజరిల్లుతున్నాయి.
సరోరుహములైన పద్మములు ఎంతో స్వచ్ఛంగా, అతి మృదువుగా, చక్కని ప్రకాశంతో,
తాకితే మాసిపోతాయా, నలిగిపోతాయా అన్నట్లుంటాయి.
ఆ పద్మాల కన్నా మృదువైనవి, స్వచ్ఛమైనవి, రాజరాజేశ్వరి పాదాలు.
ఆ పాదాలు భక్తులకు తరుణోపాయాలు. ఉపాసకులకు స్మరణోపాయాలు.
సిద్ధులకు శరణోపాయాలు. యోగులకు ధన్యోపాయాలు.
తన పాద ప్రభాజాలంతో, నిజమైన పద్మాలను కూడా ధిక్కరించగల
ఆ త్రిపురసుందరి, ఆ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ కు వందనం.
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి