19, ఆగస్టు 2021, గురువారం

27. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా

 

కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా 
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా ॥ 27 ॥


70. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా 

లలిత తన అహంకారము నుంచి వారాహీదేవిని సృష్టించింది. ఈ వారాహిని తన సైన్యానికి 

దండనాథగా నియమించింది. దండనాథ కిరిచక్రమనే రథమును అధిష్టించి వున్నది. 

లలితాసహస్రనామస్తోత్రంలో మూడవ రథం కిరిచక్రరథం. విశాలమైనది, ఉన్నతమైనది. 

కిరి అంటే వరాహము. వరాహములచే లాగబడుతున్న రథమును ఎక్కి వారాహీ దేవి 

దండనాథయై అమ్మను సేవించుచున్నది అని ఈ నామానికి అర్ధం. 

ఈమె లలితాసైన్యానికి దండమును ధరించి ఆదేశములను ఇస్తూ ఉంటుంది. 

కిరి అంటే కిరణము అనే అర్ధం కూడా వున్నది. 

ఈ కిరి చక్రము నుంచి ప్రసరించే కిరణములే, ఈ భూమండలమంతా ఆవరించి వున్నవి. 

వరాహశక్తి అనగా, భూమండలమును ఉద్ధరించు శక్తి. జీవుడు మార్గము తప్పినప్పుడు,

ఈ వరాహశక్తి తన కిరణములలో జీవుని బంధించి పతనమవకుండా ఉద్ధరిస్తుంది. 

దండించటానికీ, ఉద్ధరించటానికీ ఈ వరాహశక్తియే అధిదేవత.  

ఈ వారాహీ దేవతను ధ్యానిస్తే, జీవుడు పతనమవకుండా కాపాడబడతాడు. 

ఆత్మజ్ఞానమును పొంది సదాశివ తత్వంలో రమిస్తాడు.  

కిరిచక్రమనే రథమును ఎక్కి, దండనాథ అయిన వారాహీదేవిచే పూజింపబడుతున్న 

ఆ కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృత కు వందనం. 

ఓం శ్రీ కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతాయై నమః 


71. జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా 

జ్వాలామాలిని అనునది చతుర్దశీ తిథి దేవత. అమ్మవారి షోడశ కళలలో పధ్నాలుగవ దేవత

జ్వాలామాలిని లలితాదేవి ఆదేశంపై ఒక ఎత్తైన జ్వాలావలయం, వహ్నిప్రాకారం సృష్టించింది. 

ఆ క్షిప్త జ్వాలావలయంతో లలితాదేవి సేన అంతా పరివేష్టింపబడి వున్నది. 

అజ్ఞానాన్ని దహించి, జ్ఞానాగ్నిని రగిలించే జ్వాలలు అవి. ఆ జ్వాలలలో జ్ఞాని దహింపబడడు.  
 
శ్రీచక్రములోని ఐదు శక్తి త్రికోణములు ఈ జ్వాలామాలినీ శక్తి రూపములే.  

ఆ శక్తి త్రికోణముల మధ్య బిందు రూపములో, అమ్మ స్థిరంగా ఉంటుంది.

చుట్టూ ఎత్తైన అగ్ని జ్వాలలు, మధ్యలో సేన, ఆ మధ్యలో లలితాదేవి, ఇదే ఈ నామ దర్శనం. 

ఆ విధంగా జ్వాలామాలినిచే సృష్టించబడిన అగ్ని ప్రాకారం మధ్యలో వున్న,

ఆ జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగ కు వందనం. 

ఓం శ్రీ జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి