
శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా
మరాళీ మందగమనా, మహాలావణ్య శేవధిః ॥ 20 ॥
46. శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా
శింజానము అంటే వీనులకింపైన చక్కటి అందెల రవళి.
ఆ అమ్మలగన్నయమ్మ, దుర్గమ్మ పాదాలు పద్మముల వలె ఎంతో శోభాయమానంగా ఉన్నాయి.
ఆ పాదకమలాలకి మరెంతో ప్రకాశంగా వున్న మణి మంజీరాలు వున్నాయి.
ఆ మణి మంజీరాలు చేసే ధ్వని, వింటితాడు చేసే నాదము వలె వున్నది.
ఆ శింజానము లోకాలోకాలన్నింటినీ తన నాదాంబుధి తో నింపేసింది.
ఆ భ్రామరీ నాదంలో ఉపాసకులందరూ ఆనందంతో, ధ్యానంలో అమ్మ దర్శనం చేస్తున్నారు.
ఆ నాదం, ఆ శింజానం, ఆ అందెల మృదు మధుర రవళి వినిపించడమే ఉపాసనకు పరాకాష్ట.
మునుముందుగా నాదము, ఆ వెనుక తేజో దర్శనము, ఆ పై అమ్మ దర్శనము,
అనుభూతి పొందుట, ఎంతో మంది భక్తులకు ఒక అపురూపమైన అనుభవము.
ఆ శ్రీదేవిని మణి మంజీరాలు పెట్టుకున్నట్టు, ఆ మంజీరాలు ఎంతో ఆర్తిగా ఆ దేవి కాలిని
పట్టుకున్నట్టు, ఆ పై ఆ మువ్వలు మనోహరంగా శింజాన నాదం చేస్తున్నట్టు,
ఆ దివ్య నాదంలో, అద్భుతంగా అమ్మ దర్శనమిస్తున్నట్టు భావించి ధ్యానం చేయండి.
ఆ రూపం లోనే ఆ దివ్యశక్తి తనను భక్తితో, ఆర్తితో సేవించే వారికి దర్శనమిస్తుంది.
ఆ భ్రామరీ నాదమే రాక్షస ప్రవృత్తిని చీల్చి చెండాడుతుంది.
శ్రీశైల, సింహాచల క్షేత్రాలు రెండూ రాక్షసశక్తిని దునుమాడిన భ్రామరీశక్తికి ప్రత్యక్ష ఉదాహరణలు.
ఎంతో దివ్యమైన శింజానము చేసే మణి మంజీరాలను ధరించి, మహా ప్రకాశంతో భాసించే
చరణ కమలాలతో, అందరి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి, నాదంతో విరాజిల్లుతూ వున్న,
ఆ శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ కు వందనం.
ఓం శ్రీ శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజాయై నమః
47. మరాళీ మందగమనా
మరాళి అంటే ఆడు హంస. హంసలు మందగమనలు. అందునా ఆడు హంసలు ఎంతో
నింపాదిగా, నిశ్చింతగా, వయ్యారంగా, నాట్యము చేస్తున్నట్టు కదులుతాయి.
ఆ మాహేశ్వరి నడకను మరాళి నడకతో సామ్యం చెప్తున్నాం.
హంసలు, పరమహంసలు మహా సిద్ధులు. ఎంతో జపం చేస్తేనే గానీ హంసత్వం సిద్ధించదు.
శ్వాస ఎంత సహజంగా అప్రయత్నంగా తీసుకుంటామో, జపం అంత అప్రయత్నంగా సాగాలి.
దీన్నే అజపాజపం అని కూడా అంటారు. ఇదే సోహం లేదా హంస జపం.
సో అని శ్వాస లోపలికి తీసుకుని, దాన్ని ఎంతసేపు లోపల నిలపగలమో అంతసేపు
ఊపిరి లోపలనే నిలిపి, తిరిగి హమ్ అని ఊపిరిని బయటకు వదిలివేయటమే ఈ జపం.
ఈ ప్రక్రియనే పూరకం, కుంభకం, రేచకం అంటాం. ఈ మూడూ సరియైన పద్ధతిలో, అంటే,
ఎంత సమయం 'సో' అంటూ శ్వాస లోనికి తీసుకుంటామో, అంతే సమయము దానిని లోపల
కుంభకం చేయాలి. తిరిగి అంతే సమయం తీసుకుని, ఆ శ్వాసను 'హం' అంటూ బయటకు
విడిచిపెట్టాలి. ఈ ప్రక్రియ అంతా నిదానంగా హంసనడక వలె సాగాలి.
అందుకు విరుద్ధంగా చేస్తే, ప్రాణాయామము కాస్తా, ప్రాణాపాయముగా మారుతుంది.
సరియైన పద్ధతిలో చేస్తే, లోపల హంస వయ్యారంగా తిరుగుతుంది.
హడావుడిగా చేస్తే ఉక్కిరిబిక్కిరి అయి హంస లేచిపోతుంది.
ఈ సమయంలో ఇష్ట దేవతా నామం స్మరిస్తే మరింత మంచిది.
నిత్యమూ లేస్తూనే, అమ్మని తలచుకుని, ప్రార్ధనగా
"తల్లీ, ఈ నాడు నేను చేసే శ్వాసలన్నీ నీ జపమే, కరుణించు" అని అనుకోండి.
ఆ తరువాత ఆ శ్వాస జపం అంతా హంస జపమే అవుతుంది.
మనలో ఆ హంస చల్లగా, మెల్లగా, మందంగా, మంద్రంగా తిరుగాడుతుంది.
ఏ ఆధి వ్యాధులూ బాధించవు. ఆధి అంటే మనోవ్యధ. వ్యాధి అంటే తెలిసిందే.
మన శ్వాసలో హంస వలె చలిస్తూ, ఆధి వ్యాధులను దూరం చేస్తూ,
మనలని హంస మార్గంలో నడిపిస్తున్న ఆ మరాళీ మందగమన కు వందనం.
ఓం శ్రీ మరాళీ మందగమనాయై నమః
48. మహాలావణ్య శేవధిః
ఆ త్రిపురసుందరి అందాన్ని ఏమని వర్ణించగలం. మన అమ్మగదా, పిల్లలకు అమ్మను
మించిన లావణ్యరాశి లోకాలన్నీ వెతికినా దొరకదు. ఆ త్రిపురసుందరి మహా లావణ్య శేవధి.
లావణ్యము అంటే సౌకుమార్యమైన, సొగసైన, మృదువైన, మనసుని హత్తుకునే అందం.
ఇంక మహా లావణ్యమంటే, లావణ్యానికే లావణ్యం. అంతటి మహత్తరమైన సొగసు ఆ శ్రీమాతది.
లావణ్యమంటే చంద్రకాంతి వలే చల్లగా, తెల్లగా, హాయిగా ఉండేది.
తెల్లగా అంటే కన్నులు చెదరే తెలుపు కాదు, మంచి ముత్యపు చాయ.
ఇప్పటిదాకా అరుణారుణ అన్నారు, లావణ్యం అంటే ముత్తెపు రంగు కదా అని భావిస్తున్నారేమో.
గాయత్రీ మాత, 'ముక్తా విద్రుమ హేమ నీల ధవళ' వర్ణ కాదా. అన్ని రంగులూ అమ్మవే.
ముత్యపు కాంతి సేద దీరుస్తుంది. చంద్రకాంతి ఆహ్లాదపరుస్తుంది.
అటువంటి అపురూప లావణ్యం ఆ త్రిపుర సుందరిది.
శేవధి అంటే నిధి అని అర్ధం. అమ్మ ఒక మహా లావణ్య నిధి అని ఈ నామానికి అర్ధం.
నిధులు తొమ్మిది. ఆ నవ నిధులకు కుబేరుడు అధిపతి.
ముఖ్యంగా పద్మనిధి, శంఖనిధుల గురించి చెప్పుకుంటూ ఉంటాం.
తిరుమలలో ఆలయ ముఖద్వారం వద్ద, అటూ ఇటూ ఈ రెండు నిధి దేవతలూ వుంటాయి.
పద్మనిధి రెండు చేతులలో పద్మాలు పట్టుకుని ఉంటే, శంఖనిధి శంఖాలు పట్టుకుని ఉంటుంది.
నిధి అంటే భాండాగారం. పెన్నిధి అని కూడా పెద్ద నిధి అనే అర్ధంలో వాడతాం.
నిధులన్నిటిలో గొప్పవి నవనిధులు. వాటిలో గొప్పవి పద్మ, శంఖ నిధులు.
ఆ త్రిపురసుందరి మహాలావణ్యశేవధి అంటే లావణ్యానికే ఒక గొప్ప నిధి.
అంతటి లావణ్యం చూడటానికి అమ్మ ఇచ్చిన కన్నే కావాలి. చర్మ చక్షువులతో చూడలేము.
లలితమైన లావణ్యము కలిగినది కనుక ఆమె లలిత.
లావణ్యములలో కెల్లా నిధి వంటి మహా లావణ్యముతో ప్రకాశిస్తున్న,
ఆ మహాలావణ్య శేవధి కి వందనం.
ఓం శ్రీ మహాలావణ్యశేవధయే నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి