మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ ॥ 31 ॥
78. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా
కామేశ్వరి కామేశ్వరుణ్ణి చిరునవ్వుతో చూచినప్పుడు ఉద్భవించిన వాడు మహా గణేశుడు.
అమ్మను చూస్తూనే తాను ఎందుకు సృష్టింపబడ్డాడో గణేశుడికి అర్ధం అయింది.
వెంటనే ఆ యుద్ధప్రాంగణం అంతా ఒక్కసారి పరికించాడు. ఎన్నో యోజనాల వైశాల్యమున్న,
ఆ సువిశాల యుద్ధ భూమిలో, సేనావాహిని మధ్యలో విఘ్నేశ్వరునికి జయవిఘ్నయంత్రమును
రచించిన ఆ పెను బండ కనిపించింది. తన దంతాలతో ఆ బండను పెకలించి, దాన్ని ఖండ
ఖండాలుగా భిన్నం చేసాడు. గణేశ్వరుడి ధాటికి భండాసురుడు విసిరిన ఆ యంత్రం
తునాతునకలై పోయింది. అంతే, ఒక్కసారిగా స్త్రీ సైన్యంలో మళ్ళీ యుద్ధోత్సాహం వచ్చింది.
తిరిగి యుద్ధం ప్రారంభం అయ్యింది. అమ్మ సంతోషించింది. తన పుత్రుడు చూపిన బుద్ధికీ,
బలానికీ మురిసిపోయింది. హర్షం ప్రకటించింది.
ఈ నామంతో అమ్మను పూజిస్తే, ఎటువంటి విఘ్నాలున్నా తొలగిపోతాయి.
ఆవిధంగా గణేశుడి చేత భిన్నమైన విఘ్నయంత్రమును, ఆ కార్యమును నెరవేర్చిన గణేశుణ్ణీ
చూచి ప్రహర్షిత అయిన ఆ మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షిత కు వందనం.
ఓం శ్రీ మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితాయై నమః
79. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ
ఇక రాక్షసరాజు భండాసురుడే స్వయంగా యుద్ధంలోకి దిగాడు.
లలితాదేవిపై అస్త్ర, శస్త్రాలు ప్రయోగించటం ప్రారంభించాడు.
అమ్మ అవలీలగా, సునాయాసంగా ఒక ఆటవలె ఆ శస్త్రాలకు ప్రత్యస్త్రాలను సంధించింది.
ఈ యుద్ధం ఆమెకు ఆట, భండుడనే జీవుడి వేట.
స్వార్ధపరుడైన భండుని సేనని, సేనానులను వధించి అతణ్ణి బలహీనుడిని చేసింది.
అతని నుంచి పుత్రులను దూరం చేసి బంధాలను తెంచేసింది.
తరువాత దుర్మార్గుడైన ఆ జీవుడి భుజాలుగా పేరుపడ్డ విషంగ, విశుక్రులను చంపేసింది.
ఇప్పుడు జీవుడు వంతు వచ్చింది. జీవుడికి ఇది చావుబతుకుల పోరాటం.
ఈ యుద్ధంలో ఓడిపోతే, తాను కూడా జీవుడుగా అస్తిత్వం కోల్పోయి,
దేవుడు అయిపోతానేమో అనే ఆందోళన. అమ్మకు లొంగాలా వద్దా అనే సంకటస్థితి, సందిగ్ధత.
చివరి ప్రయత్నంగా అమ్మవారి మీద బాణ, అస్త్ర వర్షం కురిపిస్తున్నాడు భండాసురుడు.
తల్లి మాత్రం చెడిపోయిన పిల్లవాడిని వదులుతుందా, దండించి అయినా మంచి మార్గంలో
పెడుతుంది. అమ్మ అనాయాసంగా భండాసురుని అస్త్రాలన్నింటినీ తిప్పికొట్టి తానూ అస్త్రాలని
వర్షింపచేస్తున్నది. ఆ విధంగా భండాసురుడు ప్రయోగించిన అస్త్ర, శస్త్రాలకు
ప్రత్యస్త్రాలను వర్షిస్తున్న ఆ భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కి వందనం.
ఓం శ్రీ భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణ్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి